Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత దేశం భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న భాషల ప్రజల సమ్మేళనం. ఈ ప్రజల మధ్య ఏ విధమైన వైషమ్యాలు లేకుండా శాంతియుత జీవనం కోసం లౌకిక వాదం దోహద పడుతున్నది. ఆ లౌకిక వాదం గురించి ఒక తాత్విక దృక్పథంతో చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లౌకికవాదం అనేది ఒక సూత్రం. లౌకికవాదంలో ప్రాథమికంగా రెండు అంశాలు ఉంటాయి. రాజ్యం నిక్కచ్చితంగా మత సంస్థలకు దూరంగా ఉండాలి. చివరకు, ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో, ఏ విధమైన కార్యక్రమాల్లో కూడా మతానికి సంబంధించిన అంశాలు ఉండరాదు. చట్టం ముందు సకల మతాలకు చెందిన ప్రజలందరూ సమానమే. లౌకికవాదం అనేది ప్రజాస్వామ్య సమాజాన్ని ఏర్పరుచుటకు ఒక చట్రాన్ని రూపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ స్వేచ్ఛగా తమ భావాలను ప్రకటిస్తారు. అందుకే కారల్ మార్క్స్ అంటాడు.. ''ప్రజాస్వామ్యమనేది సోషలిజానికి రోడ్డు లాంటిదని. లౌకికవాదం అనేది నాస్తికత్వం కాదు. అయితే నాస్తికులు లౌకికవాదాన్ని సమర్థించటంలో ముందుంటారు. కమ్యూనిస్టులంతా నాస్తికులుగా ఉండాలి. కానీ నాస్తికులంతా కమ్యూనిస్టులు కానవసరం లేదు. నాస్తికులు తమ భావాలను స్వేచ్ఛగా మతతత్వానికి వ్యతిరేకంగా ప్రకటించవచ్చు, ప్రశ్నించవచ్చు. లౌకికవాదంలో గొప్ప అవకాశం ఏమిటంటే మతాలను నమ్మేవాళ్ళు అసలే నమ్మని వాళ్ళతో ఒక సమాజంలో క్షేమంగా శాంతియుతంగా బతుకవచ్చు. కానీ వివిధ మతాల పట్ల వైషమ్యాలు రెచ్చగొట్టినప్పుడు ఇది సాధ్యం కాదు. ఉన్నతమైన, ఉత్కృష్టమైన ఆలోచనలతో శాస్త్రీయ దృక్పథం కలిగిన వాళ్ళు, శాస్త్రవేత్తలు, సైన్స్ ఆవిష్కరణలను మాత్రమే విశ్వసించే వాల్లు, అభ్యదయకాముకులు, ప్రగతిశీల వాదులు, నాస్తికులు, హేతువాదులు దేవుని ఉనికిని, మతాన్ని ప్రశ్నిస్తారు. వీళ్ళు సమాజం ప్రగతి పథంవైపు పయనించుటకు దేవుడు, మతం ఎప్పటికీ ఆటంకమేనంటారు. సదా వీటిని త్యజించాలంటారు. ఆధునిక భౌతికశాస్త్ర పితామహుడైన ఐన్ స్టీన్ ''దేవుడనే పదం మానవుని బలహీనతల్లోంచి పుట్టుకొచ్చిందంటారు''. స్టీఫెన్ హాకింగ్ 'స్వర్గ నరకాలు బూటకమని, మనిషి మరణం తర్వాత ఏమీ ఉండదని' అంటారు. అందువల్ల దేవున్ని నమ్మని వాళ్ళ వల్ల సమాజానికి లాభమే కానీ నష్టం ఏమీలేదు.
వచ్చిన సమస్యల్లా మతోన్మాదంతోనే. నిజానికి మతం వేరు, మతోన్మాదం వేరు. నా మతం, ఇతర మతాల కంటే చాలా గొప్పది. మేము అధిక సంఖ్యాక మతస్థులం. ఇతర మతాల వాళ్ళు మాకు అణిగిమణిగి ఉండాలి. మా చెప్పు చేతుల్లో ఉండాలి అనే అభిప్రాయమే మతోన్మాదం. ఇంకా మతాన్ని రాజ్యం కోసం, రాజ్యాధికారం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కూడా మతోన్మాదామే. అనేకులు వీరు చెప్పే వాటిని నమ్మి, భావోద్రేకానికిలోనై, చాలా అమాయకంగా పాకిస్థాన్ ఇస్లాం రాజ్యాంగంగా ఉన్నప్పుడు, భారతదేశం హిందూ రాజ్యంగా ఉంటే నష్టమేంటని భావిస్తారు. ఒక్కసారి ఇది ఆలోచిద్దాం. ప్రపంచంలో మత రాజ్యాలుగా ఉన్న ఏ దేశమైనా ప్రగతి పథంలో ఉందా! ఒక్కసారి ఆలోచించండి. అది పాకిస్థాన్ అయినా, ఆఫ్ఘనిస్థాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. సెక్యులర్ దేశంగా ఉన్న ఆఫ్ఘనిస్థాన్, ఇస్లామిక్ రాజ్యంగా మారిన తర్వాత ఆ దేశ ప్రజల స్థితిగతులు అట్టడుగుకు నెట్టివేయబడ్డాయి. బతుకు దినదినం గండమవుతున్నది. మతోన్మాదం ప్రశ్నించే వాళ్ళను ఈసడించుకుంటుంది. ప్రజలంతా మూఢత్వంలో మునిగిపోయేటట్లు చేస్తుంది. మత విద్వేషాలను పెంచి పోషిస్తుంది.
మతోన్మాదానికి అభివద్ధి నిరోధక లక్షణాలే మెండుగా ఉంటాయి. నేడు లౌకిక తత్వాన్ని విస్మరించి పాలకులు మతంమత్తులో మునిగినందునే దేశ ఆర్థిక స్వాలంబనకు మూల స్తంభాలైన ఎల్ఐసీ, రైల్వేలు, బొగ్గు గనులు, పవర్ ప్లాంట్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలను స్వదేశీ, విదేశీ బడాబాబులకు అమ్ముతున్నా ప్రశ్నించలేకపోతున్నాం. చివరకు, ప్రపంచంలోనే ప్రభుత్వానికంటూ ఒక విమానయాన సంస్థ లేని దేశంగా భారతదేశం మిగిలిపోయింది. మరోవైపు సైన్స్ ను నమ్మకున్న సెక్యులర్ దేశాలు ఆకాశ హార్మ్యాలలో విహరిస్తూ ఉంటే మతోన్మాద దేశాలు గాఢ అంధకారంలో మునిగిపోయాయి. అయోమయంలో మానవ జాతి విలవిలలాడుతుంది.
నిజానికి, ఏ మతం కూడా ప్రశ్నకు తావివ్వలేదు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించకుండా ఉంచేందుకు, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని చంపేందుకు పాలకులు మతోన్మాద ప్రక్రియను ఎన్నుకుంటారు. అందువల్ల మతతత్వంలో మునిగిన ప్రజలు అసలు దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునే సోయిని కోల్పోతారు. అంతా దేశం కోసం, ధర్మం కోసమే జరుగుతున్నదనే భ్రమలో పడుతారు. చాలా శోచనీయమైన విషయమేమిటంటే, హ్యూమనిస్ట్స్ ఇంటర్నేషనల్ అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోని ఏడు దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మాల్దీవులు, మౌరిటానియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, సూడాన్‌లో నాస్తికునిగా ఉన్నా లేదా మతం మారినా మరణశిక్షే. మతోన్మాదం పరాకాష్టకు చేరినప్పుడు జరిగే దుర్మార్గమైన ఫలితం ఇదే. దీన్ని భారతీయులమంతా ఆహ్వానిద్దామా! ఖండిద్దామా!
ప్రపంచంలో సెక్యులర్ మాత్రమే విద్యారంగంలోగాని, ఆర్థిక అభివృద్ధిలోగాని, జీవన ప్రమాణాల్లో గాని ముందున్నాయి. అందుకే లౌకిక, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు అధికారంలోకి రావాలి. భారత్‌కు తక్షణం కావాల్సింది ఇదే.
- డాక్టర్ మార్క శంకర్ నారాయణ
సెల్: 9908416664.