Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత నెల 17-19 తేదీల్లో హరిద్వార్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ధర్మసంసద్ సమావేశం జరిగి రెండు వారాలు ముగిసినా ఇప్పటివరకు ఒక్క అరెస్టు కూడా జరగలేదు. ముస్లింలను మూకుమ్మడి హత్యలతో నిర్మూలించాలంటూ ఆ సమావేశాల్లో వక్తలు పిలుపిచ్చారు. మొదటగా నమోదైన ఎఫ్ఐఆర్లో ఒకే ఒక్క పేరును పేర్కొన్నారు. అది కూడా హిందూ మతంలోకి మారిన ముస్లిం పేరును నమోదు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇంకో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ధర్మ సంసద్ నిర్వాహకులు యతి నరిసింగానంద్తో సహా అందులో నలుగురి పేర్లు పేర్కొన్నారు.
ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు జనవరి 1న ఉత్తరాఖండ్ పోలీసులు ప్రకటించారు. అరెస్టులేమైనా జరిగాయా అని ప్రశ్నించగా దర్యాప్తులో నిర్దిష్టంగా సాక్ష్యాధారాలు లభ్యమైతే ఆ వెంటనే అరెస్టులు జరుగుతాయని ఇన్చార్జిగా ఉన్న పోలీసు అధికారి తెలిపారు. ఇందుకు అవసరమైన సాక్ష్యాధారాలు పబ్లిక్ డొమైన్‌లోనే ఉన్నాయి. పైగా ధర్మ సంసద్ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ ప్రసంగాలకు సంబంధించి వీడియోలు వైరల్ అయ్యాయి. ఒకరు తర్వాత మరొకరు మాట్లాడుతూ, ఆయుధాలు చేతబట్టాలని, ముస్లింలను ఊచకోత కోయాలని, గ్రామాల నుండి వారిని తరిమికొట్టాలని పిలుపు ఇస్తుండడం ఆ వీడియోల్లో కనిపిస్తూనే ఉంది. అందులో ఒక వక్త మాట్లాడుతూ, తనకు అవకాశం వస్తే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కూడా రివాల్వర్‌తో కాల్చివేస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రసంగాలను కేవలం విద్వేష ప్రసంగాలుగా పేర్కొనలేం. హింసాకాండకు, జాతి ప్రక్షాళనకు బహిరంగం గానే రెచ్చగొట్టడంగా చూడాల్సి ఉంది. ఇంత జరిగినాకానీ ఉత్తరాఖండ్ పోలీసులు ఇంకా నిర్దిష్ట సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్నారట! ఐపిసి 153ఎ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడమంటే భిన్న గ్రూపుల మధ్య విద్వేష భావాలను లేదా శతృత్వాన్ని రెచ్చగొట్టడం, సామరస్యతను దెబ్బ తీయడానికి ప్రేరేపించిన నేరంగా పరిగణించారని స్పష్టమవుతోంది. కానీ జరిగిన నేరం అంతకంటే చాలా విస్తృతమైనది. ధర్మ సంసద్ నిర్వాహకులు, అందులో పాల్గొన్న వారు ఈ కేసులో ఎఫ్ఐఆర్ పట్ల ఏమాత్రం ఆందోళన చెందుతున్నట్లు కనిపించడం లేదు. వారం రోజుల తర్వాత, డిసెంబరు 28న వివిధ అఖడాలకు చెందిన స్వాములు సమావేశమై 21 మంది సభ్యులతో కోర్ కమిటీగా ఏర్పడ్డారు. వీరిలో నరసింగానంద్, మరో ఐదుగురు ఉన్నారు. వీరందరూ సంసద్‌లో పాల్గొన్నవారే. ఇస్లామ్‌కు వ్యతిరేకంగా పోరు కొనసాగించడానికి వీరు తీర్మానించారు. ఖురాన్‌కు వ్యతిరేకంగా, నగరం లోని పలువురు మౌలానాలు, ఇమామ్‌లపై హరిద్వార్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే దిశగా ధర్మ సంసద్ నిర్వహణ ఒక అడుగు అని వారు పేర్కొన్నారు. ఇస్లామ్‌పై పోరు సల్పాలని పిలుపివ్వడంతో పాటు హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు గానూ ఆయుధ శిక్షణకు, సాయుధ గ్రూపులకు అఖడాలు కేంద్రాలుగా వుంటాయని పునరుద్ఘాటించారు. ఏదేమైనప్పటికీ, ప్రస్తుత చట్టం కింద, ఇది దేశద్రోహం కేసు. హింసకు ప్రేరేపించేలా పిలుపిచ్చినపుడు మాత్రమే దేశద్రోహం నిబంధన వర్తిస్తుందని సుప్రీం కోర్టు ఇచ్చిన భాష్యం ప్రకారం కూడా ఇది దేశద్రోహం కేసుగానే పరిగణించాల్సి ఉంది.
హరిద్వార్ అధ్యాయంలో కొన్ని విషయాలు స్పష్టమయ్యాయి. కాషాయ దుస్తులు ధరించి, ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు చేస్తూ, వారిని నిర్మూలించడానికి హింసను రెచ్చగొట్టేలా పిలుపిచ్చిన స్త్రీ, పురుషులు ఏవో పైపైన మాట్లాడే శక్తులు కారు. వారు ప్రధాన స్రవంతిలోని హిందూత్వ శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ హిందూత్వ శక్తుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఉన్నాయి. సంసద్‌లో రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినవారిలో ఒకరైన స్వామి ప్రబోధానంద కాళ్ళకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి మొక్కుతున్న ఫొటో బయటకు వచ్చింది. వీరికి ప్రభుత్వ ఆశ్రయం, రక్షణ ఉంటుందనడానికి ఈ ఫొటోనే స్పష్టమైన సాక్ష్యాధారం. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తరచుగా ముస్లింలకు ఎర వేసేలా ప్రసంగాలు చేయడం దగ్గర నుండి ఇస్లామ్, క్రైస్తవంలోకి మారిన వారిని హిందూ మతంలోకి తిరిగి మార్చేందుకు మఠాలను, ఆలయాలను ఉపయోగించాలంటూ బీజేపీ ఎంపి తేజస్వి సూర్య ఇటీవల పిలుపివ్వడం వరకు ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న ప్రసంగాలు, వాక్చాతుర్యాల్లో భాగమే ఈ హరిద్వార్ సంసద్ నిర్వహణ. ఇవి కేవలం విద్వేష ప్రసంగాలు మాత్రమే కాదు. రోజువారీ జీవనంలో ముస్లింలు, క్రైస్తవులపై హింసకు పాల్పడే, వారిని బెదిరించే, అడ్డగించే చర్యలుగా రూపం తీసుకుంటాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బహిరంగ ప్రదేశాల్లో సామాన్య ముస్లింలు హింసాత్మక దాడులకు గురవు తుంటారు. వారిలో... వీధుల్లో అమ్ముకునేవారు, ఆటో రిక్షా డ్రైవర్లు వంటివారు ఉంటారు. కర్నాటకలో క్రైస్తవులపై, వారి ఆరాధనా స్థలాలపై దాడులనేవి సర్వసాధారణమై పోయాయి.
బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ఇతర సంస్థలు, ధర్మ సంసద్ సాధువులు, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికైన బీజేపీ ప్రతినిధులు...వీరందరూ హిందూత్వ సైన్యంలో భాగమే. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా రాజ్యాంగాన్ని, ప్రభుత్వ సంస్థలను నాశనం చేయడానికే వీరు చర్యలు తీసుకుంటారు. ఫాసిస్ట్ హిందూత్వ శక్తుల వల్ల ఎదురవుతున్న ముప్పు తీవ్రతను గ్రహించడంలో కొన్ని లౌకిక ప్రతిపక్ష పార్టీలు విఫలమవడం ఆందోళన చెందాల్సిన అంశం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లో ఎన్నికలు సమీపిస్తున్నందున వీటిని కొంతమంది విబేధిస్తూ లేదా ఖండిస్తూ ప్రకటనలు జారీ చేస్తున్నారు. మరికొంతమంది ఈ విషయాన్ని పక్కన పెట్టాలనుకుంటున్నారు. కానీ కేవలం మాటల్లో ఖండిస్తే సరిపోదు. నిర్దిష్ట ఐక్య కార్యాచరణ అవశ్యం. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇటువంటి శక్తులను స్వైర విహారం చేయడానికి అనుమతిస్తుంటే, ఆ శక్తులను తిప్పి కొట్టాల్సిన, ప్రతిఘటించాల్సిన బాధ్యత, కర్తవ్యం లౌకిక, ప్రజాతంత్ర శక్తులదే.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)