Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు ఇటీవల హైదరాబాదులో ముగిశాయి. ఈ సందర్భంగా బీజేపీని ఓడించేందుకుగాను ఆయా రాష్ట్రాల రాజకీయ పొందికను బట్టి సరైన వ్యూహాన్ని నిర్ణయించుకోనున్నట్టు ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న నేపథ్యం గమనంలో ఉంచుకొని అడుగులు వేస్తామన్నారు. ఈ సమావేశాలకు ముందునుంచి షరామామూలుగా కాంగ్రెస్‌తో పొత్తుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారా లేదా అని ఊహాగానాలు చేసిన మీడియా ఆయనను అదే విధమైన ప్రశ్నలు వేసింది. రాష్ట్రాలలో పరిస్థితి అన్నప్పుడు కాంగ్రెస్ ప్రధాన పాత్రలో ఉన్నచోట్ల లేదా తమిళనాడులో డీఎంకె కూటమిలో అది ఉన్నచోట తగు విధంగా చర్చించి నిర్ణయిస్తామని ఏచూరి స్పష్టం చేశారు. నిరంకుశ మతతత్వ విధానాలు, విశృంఖల కార్పొరేటీకరణ, ప్రజావ్యతిరేక పోకడలు, రాష్ట్రాలపై దాడులకు ప్రతిరూపంగా మారిన బీజేపీని ఓడిస్తేనే దేశానికి రక్ష అని సీపీఐ(ఎం) భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. యూపీలో సమాజ్‌వాదిపార్టీ బీజేపీని ఓడించే ప్రధాన శక్తిగావుందని, దాన్ని తాము బలపర్చడం ఒకటైతే పొత్తులు సర్దుబాట్లు ఏ మేరకు సాధ్యమో చూడాల్సివుందని సీపీఐ(ఎం) నేత వివరించారు. రైతాంగ ఉద్యమానికి అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్‌లో ఇప్పటికే సీపీఐ, సీపీఐ(ఎం) చర్చలు జరిపాయని, ఇతరపక్షాల విషయం పరిశీలిస్తామని తెలిపారు.
సీపీఐ(ఎం) విధానం, బీజేపీ దుష్ప్రచారం
ఏప్రిల్‌లో కేరళలోజరిగే సీపీఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభలకు రాజకీయ ముసాయిదా విడుదల చేసినప్పుడు మరింత నిర్దిష్టంగా ఈ విషయం చర్చకు వస్తుంది. మహాసభ ఇచ్చే తుదిరూపం రానున్న మూడేండ్లకు మార్గదర్శకమవుతుందనేది తెలిసిందే. ఈ లోగానే కేంద్రకమిటీ సమావేశాలు జరుగుతున్నప్పుడే యూపీ, పంజాబ్‌లతో సహా అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో ఈ సమావేశం నిర్ణయాలు మరింత ప్రాధాన్యత పొందాయి. బీజేపీని ఓడించేందుకు తృతీయ కూటమి ఏర్పాటు మాట వచ్చినప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాతనే ఏ సంఘటనైనా సాధ్యమని ఏచూరి సోదాహరణంగా చెప్పారు. 1977లో జనతాపార్టీ కూడా ఎన్నికల తర్వాతనే ఏర్పడిందనీ, 1989, 1996, 1998, 2004 ఎన్నికల తర్వాతనే కూటముల నామకరణం రూపకల్పన జరిగాయని గుర్తు చేశారు. దీన్నిబట్టి సీపీఐ(ఎం) ప్రత్యామ్నాయం ఏర్పడుతుందనే విశ్వాసం కోల్పోయిందని బీజేపీ నేతలు కొందరు వ్యాఖ్యలకు పాల్పడటం హాస్యాస్పదం. బీజేపీని నికరంగా ఖచ్చితంగా వ్యతిరేకించే సీపీఐ(ఎం) వామపక్షాల విధానం తెలిసినా అదేదో కాంగ్రెస్ అనుకూలతగా చిత్రించే వారి ప్రచారాలకు అవకాశం లేకుండా పోయింది. దాంతో అసలు కమ్యూనిస్టులకు ఉనికి లేకుండా పోయిందని ఉక్రోష పూరితమైన వ్యాఖ్యలకు దిగారు. మొన్నటి రైతాంగ ఉద్యమంతో కేంద్రం మెడలు వంచడంలో ముందు నిలిచిందీ, రేపు ఫిబ్రవరిలో దేశ వ్యాపిత సమ్మెతో మరో సమరభేరి మోగించనున్నదీ కమ్యూనిస్టులనే వాస్తవం వారు దాచేస్తే దాగదు. నోరుతెరిస్తే కమ్యూనిస్టులు తమ సైద్ధాంతిక శత్రువులని ప్రకటించే బీజేపీ సీపీఐ(ఎం) రాజకీయ విధానం సహించలేక పోవడంలో ఆశ్చర్యం ఏమీలేదు.
కేసీఆర్‌తో భేటీ, చర్చలు
ఈ సమావేశం సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, సీతారాం ఏచూరి తదితరులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చర్చలు జరపడంపై బీజేపీ మరిన్ని ప్రచారాలకు దిగుతున్నది. పినరాయి గతంలోనూ కేసీఆర్‌ను కలుసుకున్న సందర్బాలున్నాయి. రాష్ట్రాల మధ్య సంబంధాలు, ఫెడరల్ వ్యవస్థపై బీజేపీ దాడులను ఎదుర్కొవలసిన అవసరం రీత్యా ఇలాంటి పరస్పర భేటీలు చాలా అవసరం ఉపయోగం కూడా. బీజేపీ ముఖ్యమంత్రులు వరుసకట్టి దిగిపోయి కేసీఆర్‌ను అరెస్టు చేసి ఈడ్చుకుపోతామని నోరుపారేసుకుంటున్న సమయంలో పినరాయి విజయన్ సందర్శన ప్రత్యేకత సంతరించుకుంటుంది. వాస్తవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా తనపై గతం నుంచి వస్తున్న సీబీఐ కేసుల కారణంగానే కేంద్రం ముందు మౌనంగా ఉంటున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వినియోగించడం అందరూ చూస్తున్నదే. (కేరళ ప్రభుత్వం ఈ అంశంపై కోర్టులో సవాలు చేసింది కూడా.) కేరళ ప్రభుత్వ అధికారుల సంప్రదించిన తర్వాత విజయన్ కేంద్ర కమిటీ సమావేశాలకు వస్తున్నారని తెలుసుకున్న కేసీఆర్ సీపీఐ(ఎం) జాతీయ నాయకత్వాన్ని కూడా ఆహ్వానించారు. దేశ రాజకీయ పరిస్థితుల్లో బీజేపీని ఓడించవలసిన అవసరం ఉందని ఉభయులూ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో హైదరాబాదు పర్యటనలో ఉన్న సీపీఐ కార్యదర్శి రాజా కూడా సీపీఐ తెలంగాణ నాయకులతో కేసీఆర్‌ను కలిశారు. సీపీఐ(ఎం)కు సంబంధించి తెలుగు రాష్ట్రాల నేతలు కలిసినవారిలో లేరు. తాము మౌలికంగా బీజేపీని ఓడించేందుకు కృషి జరగాలనే విషయం మాట్లాడామని, తెలంగాణలో నిర్దిష్టంగా ఏం చేయాలో రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకుంటుందని మీడియాకు వారు చెప్పారు. దేశంలోనైనా రాష్ట్రాలలోనైనా ఎన్నికలు వచ్చినపుడు పొత్తులు ఎత్తుగడలు నిర్ణయమవుతాయి తప్ప ముందస్తుగా వాటిగురించి నిర్ణయాలు ఉండబోవని వివరించారు. ఏదో కేసీఆర్ దావత్ కోసమే కలిసినట్టు ఆరోపణలు చేసేవారికి ఈ సమాధానం రుచించకపోయినా చేయగలిగింది ఉండదు.
కాంగ్రెస్ పరిస్థితి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వంటివారు బీజేపీ టీఆర్ఎస్ ఒకటేననీ తమను రాకుండా చేయడానికే ఈ వ్యతిరేక ప్రహసనం నడిపిస్తున్నారనీ చేసే ఆరోపణలు ఆ పార్టీ కోణాన్ని చెబుతాయి. కేసీఆర్ అంతకు ముందు తమిళనాడు వెళ్లి ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి వచ్చారు. వామపక్ష నాయకులతో చర్చల తర్వాత రెండు రోజులకు బీహార్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వచ్చారు. దీని తుదిరూపం తెలియకపోయినా గతంలో ఫెడరల్ ఫ్రంట్ అన్నప్పటికి భిన్నంగా ఈసారి కేసీఆర్ వ్యవరిస్తున్నారనేది పరిశీలకుల భావన. బీజేపీ వ్యూహాత్మకంగా ఆయనను ఆ స్థితిలోకి నెట్టివుండవచ్చు. ఏమైనా కాంగ్రెస్ లేకుండా బీజేపీని వ్యతిరేకించే హక్కు ఆయనకు గాని మరొకరికి గాని వుండకుండా పోదు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలకు కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉంటుంది. కేరళలో సీపీఐ(ఎం)కు కూడా కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటున్నది. దాని అంతర్గత పరిస్థితి ఇప్పటికీ అస్తవ్యస్తంగా అయోమయంగానే ఉన్నది. బీజేపీని వ్యతిరేకించడం కంటే స్థానికంగా తన ప్రయోజనాలే ప్రధానంగా చూసుకుంటూ అంతర్గత వివాదాల్లో మునిగితేలుతున్నది. ఇప్పుడు ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాలలోనూ పంజాబ్ సహా మూడు నాలుగు చోట్ల కాంగ్రెస్ బీజేపీని వ్యతిరేకించే ఒకశక్తిగా ఉంటుందనేది వాస్తవమే. కనుకనే రాష్ట్రాలలో పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోవాలని సీపీఐ(ఎం) చెబుతున్నది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలోనూ రాష్ట్రాలలోనూ కూడా ముఖ్యమంత్రులను కీలకనేతలను కలుసుకోవడంలో వింతేమీ లేకపోగా రాజకీయ చొరవలో భాగంగా చూడవలసి ఉంటుంది.
తెలుగురాష్ట్రాలపై కేంద్రం వివక్ష
ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి ఎంత దారుణంగావుందో ముగ్గురు మంత్రులు, పదిహేనుమంది ఎంఎల్ఎల నిష్క్రమణతోనే తెలుస్తుంది. వారు చాలా వరకూ సమాజ్వాదిపార్టీతో చేరుతున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విజయంపైనే ప్రధాని మోడీ పునరాగమనం ఆధారపడి ఉందని హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యను గుర్తు చేసుకుంటే దీని ప్రభావం అర్థమవుతుంది. పంజాబ్‌లో కాంగ్రెస్ ఆప్‌ల అవకాశాల గురించి తప్ప బీజేపీ చర్చలోలేదు. కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసిన తాజా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌తో పొత్తుపైనే అది దింపుడుకల్లం ఆశలు పెట్టుకుంది. మిగిలిన మూడు రాష్ట్రాలలో కూడా పోటీ గట్టిగానే ఉంటుంది. ఈ పూర్వరంగంలో ఉత్తరాదిన తగిలే దెబ్బను కాస్తయినా భర్తీ చేసుకోవడానికి దక్షిణాదిన హడావుడి పెంచుతున్నట్టు అర్థమవుతుంది. అయితే దక్షిణ భారతంలో కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణలలో ఎక్కడా బీజేపీకి బలం లేదు. కర్నాటకలో కూడా కాంగ్రెస్ జేడీఎస్‌ల పోటీ ఉంటుంది. ఏపీ తెలంగాణలలోని వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు పార్లమెంటులో చాలాసార్లు మోడీ విధానాలకు మద్దతునిచ్చినా ఇటీవల కేసీఆర్ కొంత విమర్శ పెంచారు. ఏపీ సిఎం జగన్ వైపున అలాంటి సూచనలేమీ లేవు. ఇటీవలే ముగిసిన సీపీఐ(ఎం) ఏపీ మహాసభలు రాష్ట్రం పట్ల మోడీ ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం పోరాడవలసిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. ఆతర్వాత కాలంలో బీజేపీనేతలు మతతత్వ రాజకీయాలు మరింత పెంచారు. గుంటూరులో జిన్నా టవర్ వివాదం, తెలంగాణలో హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా మార్చాలనే పిలుపు ఇందులో భాగాలే. ఏపీ క్రైస్తవ రాష్ట్రంగా తెలంగాణ ముస్లిం రాష్ట్రంగా మారిపోయాయని ఆ పార్టీ నేతలు అంటుంటారు. అయినా జనసేన వారితో పొత్తుకట్టగా టీడీపీ కూడా అందుకు పాకులాడుతున్నట్టు వ్యవహరిస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని, బీజేపీ విషయంలో కేసీఆర్ మరింత దృఢంగా పోరాడాలని తాము భావిస్తున్నామని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు.
ఏపీ తెలంగాణలకు బీజేపీ కేంద్రం చేసిందిలేకపోగా వివక్షకు గురి చేసిందనే అభిప్రాయం అసంతృప్తి ప్రజలలో బలంగా ఉన్నాయి. కనుకనే ఇక్కడ పాలకపార్టీలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడేట్టు చూడాలన్నది సీపీఐ(ఎం) నిశ్చితాభిప్రాయం. జాతీయ స్థాయిలో ఎప్పటికి ఏం జరుగుతుందనేది వేచి చూడవలసిన అంశం. ఎందుకంటే బీజేపీ వ్యతిరేక కూటమికి తానే నాయకురాలినన్నటు, కాంగ్రెస్ స్థానం తనదే అయినట్ట్టు పశ్చిమ బెంగాల్ తృణమూల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హడావుడి చేస్తున్నా ఆమె విశ్వసనీయతకూ విస్తరణకూ పరిమితు లున్నాయి. పంజాబ్ గోవాలలో ఆప్ కూడా అదే ధోరణిలో ఉంది. ఫిబ్రవరి, మార్చి ఎన్నికల ఫలితాల తర్వాత వీరిలో ఎవరి అంచనాలు ఆశలు ఏమేరకు నిజమయ్యేది తేలిపోతుంది. దాంతోపాటే భవిష్యత్ పరిణామాల సంకేతాలూ వస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో బీజేపీపై ఎవరు ఏమేరకు వ్యతిరేకించినా లౌకిక ప్రజాస్వామ్యానికి ఫెడరలిజానికి మేలు కలుగుతుంది. అలాంటి అన్ని ప్రయత్నాలను బలపర్చడంతో పాటు ఆ పోరాటాన్ని మరింత బలోపేతం చేయడం కీలకకర్తవ్యమవుతుంది. దీనిపై ఎలాంటి కుటిల వ్యాఖ్యానాలకూ కృత్రిమ నిర్ధారణలకు చోటుండదు.
- తెలకపల్లి రవి