Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచం అసమానతల మార్గంలో చాలా వేగంగా దూసుకుపోతున్నదని వరల్డ్ ఇనీక్వాలిటీ తాజా నివేదిక నిర్ధారించింది. ''గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ మల్టీ మిలియనీర్లు, ప్రపంచ సంపద వృద్ధిలో అసమతూకమైన వాటాను స్వాధీనం చేసుకుంటున్నారు. ఎగువనున్న ఒక శాతం ఉన్నత శ్రేణికి చెందిన వారు, 1990 నుండి పోగుపడిన అదనపు సంపదలో 38శాతం పొందుతుంటే, దిగువనున్న 50శాతం ప్రజలు ఆ పోగుపడిన సంపదలో కేవలం 2శాతం మాత్రమే పొందుతున్నారు.'' ''భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో బాగా అసమానతలున్న దేశాల్లో ఒకటిగా ఉందని'' నోబెల్ బహుమతులు పొందిన ఆర్థిక శాస్త్రవేత్తలు అభిజిత్ బెనర్జీ, ఇస్థర్ డఫ్లోలు రాసిన ఒక ముందుమాటలో పేర్కొన్నారు. అంటే ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాల్లో భారతదేశంలో ఎగువనున్న ఒకశాతం, దిగువనున్న 50శాతం వారి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. భారత్లోని ఈ వ్యత్యాసం అమెరికా, యూకే, చైనా, రష్యా, ఫ్రాన్స్ దేశాల్లో ఉండే వ్యత్యాసం కన్నా ఎక్కువగా ఉంది.
పేదరికం కొనసాగింపు
''సామ్యవాద ప్రేరణతో ఏర్పడిన పంచవర్ష ప్రణాళికలు'' వలస పాలనలో 50శాతం ఆదాయం గల ఎగువనున్న 10శాతం వారి వాటాను, స్వాతంత్య్రం వచ్చిన తరువాత 35-40శాతానికి తగ్గడానికి సహాయపడ్డాయని కొంత కాలంగా కొనసాగుతున్న అసమానతలు తెలియజేస్తున్నాయి. కానీ, 1980వ దశకం మధ్య నుండి అదుపులేని సరళీకరణ విధానాలు, ప్రపంచంలో అత్యంత ఎక్కువగా పెరిగిన ఆదాయ, సంపదల అసమానతలకు దారి తీసాయి. ఎగువనున్న ఒక శాతం ఉన్నత శ్రేణికి చెందిన వారు ప్రధానంగా ఆర్థిక సంస్కరణల నుండి లబ్ది పొందారు, తక్కువ ఆదాయం, మామూలు ఆదాయ సమూహాల వృద్ధి పోల్చి చూస్తే తక్కువగా ఉంది, పేదరికం ఆ విధంగా కొనసాగుతోంది. ఇటీవల సంవత్సరాల్లో, 2014 తరువాత ఆర్థిక వ్యవస్థకు పరిష్కారంగా భారతదేశం పెద్ద వ్యాపారం, ప్రయివేటీకరణలపైన విశ్వాసం కలిగి ఉండే దశలోకి వెళ్ళినట్లు కనిపిస్తుంది. ఫలితంగా మరింత అస మానతలను సృష్టించింది. దిగువనున్న 50శాతం వాటా 13శాతానికి పడిపోయిందని వరల్డ్ ఇనీక్వాలిటీ తాజా నివేదిక నిర్ధారించింది. భారతదేశం విశిష్టమైన సంపదతో ఒక పేద, అసమమైన దేశంగా ఉంది.
స్థిరమైన వృద్ధి రేటు
అన్నింటినీ మించి, 1951 నుండి దిగువనున్న 50శాతం ప్రజల ఆదాయం విషయంలో ఏం జరుగుతుందో ట్రైబ్యునల్లో ఆనింద్యో చక్రవర్తి పరిశీలనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1951-1981 మధ్య కాలంలో సంవత్సరానికి 2.2శాతం పెరిగింది. కానీ ఇది, ''గత నలభై సంవత్సరాలుగా వృద్ధి రేటు అదే విధంగా స్థిరంగా ఉండిపోయిందనే విషయాన్ని తెలియజేస్తుంది. ఆర్థిక వ్యవస్థకు, ఏ రాజకీయాలతో నిమిత్తం లేకుండానే, భారతదేశంలో దిగువనున్న సగం మంది ప్రజల స్థితి, ఘోరమైన ఆదాయ వృద్ధి రేటుతో పూర్తిగా మారిపోయిందని ఇది స్పష్టం చేస్తుంది. భారతదేశంలో సామాజిక నిర్బంధాలు, పరిస్థితులే దీనికి ప్రధాన కారణం.
భారతదేశానికి వెన్నుదన్నుగా నిలిచిన సామాజిక నిర్మాణం, అసమానతలను ప్రోత్సహించి, అసమాన ధోరణులను పెంచింది. భారతదేశ రాజ్యాంగం ఏర్పడిన తరువాత పరిస్థితులు మారాయి. నెహ్రూ పాలనలో, ఆ తరువాత కూడా భారతదేశంలో సామాజిక ప్రజాస్వామ్యం సాధన కోసం తీవ్రమైన ఒక ప్రయత్నం జరిగింది కానీ, ఇది రాష్ట్రాలకు, ప్రాంతాలకే పరిమితమైంది. ఆ విధంగా, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో కొద్దిపాటి చలనం కలిగింది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా, దిగువనున్న ప్రజల జీవితాలను నిరంతరం పేదరికంలోకి నెట్టివేసిన సామాజిక నిర్మాణాలను బద్దలు కొట్టిన ప్రయత్నాలు కొన్ని నమోదయ్యాయి. ఆ ప్రయత్నాలు మెరుగైన ఆర్థిక అవకాశాలు పొందవచ్చని స్పష్టం చేశాయి. ఈ అసమానతలను పెంచి పోషించిన ఆర్థిక విధానాల కంటే కూడా, పాత సామాజిక నిర్మాణాలను వదిలించుకోకుండా, వాటికి వెన్ను దన్నుగా ఉంటూ, వాటిని రోజురోజుకూ బలోపేతం చేసి, ప్రజలు ఇబ్బందులకు గురి అవడానికి కారణం అధికార పార్టీ. మన సామాజిక నిర్మాణాలకు, ఆదాయ అసమానత లకు మరియు పేదరికానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఖచ్చితంగా అంగీకరించాల్సిన అవసరం ఉంది.
సర్వే మరియు డాటా
ప్రపంచ వ్యాప్తంగా, సామాజికంగా తిరోగమన సాంప్రదాయాలను సవాల్ చేయకుండా, ప్రజల ఆర్థిక పరిస్థితుల రూపాంతరం, ముఖ్యంగా అసమానతల తగ్గింపు సంభవించలేదు. యూకేలోని బ్రిస్టల్, అమెరికాలోని టెన్నిస్సీ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు 20వ శతాబ్దంలో (1900-2000)మతం యొక్క ప్రాధాన్యతను లెక్కించడానికి వరల్డ్ వాల్యూస్ సర్వే డాటాను ఉపయోగించి, ఆర్థిక అభివృద్ధికి ముందుగా లౌకికీకరణ జరగాలని వారు కనుగొన్నప్పుడు, 2018లో 106 దేశాల్లో రికార్డ్ బద్దలు కొట్టిన పరిశోధన బహిరంగ రహస్యాన్ని బట్టబయలు చేసింది.
దానితోపాటుగా లౌకికీకరణ (తోడుగా వ్యక్తిగత హక్కుల పట్ల సహనం, గౌరవం ఉన్నప్పుడు మాత్రమే) మాత్రమే భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి గురించి ముందుగా తెలియజేస్తుందని ఆ నిర్థారణలు స్పష్టం చేశాయి. అప్పుడే ఒక సమాజం విభిన్న కులాలకు, జాతులకు, విశ్వాసాలకు, వర్ణాలకు చెందిన వారిని సమానంగా చూడగలదు. లౌకికీకరణ యొక్క ప్రధానమైన దృష్టికోణం, ప్రజాజీవితం నుండి మతాన్ని వేరు చేయడం. ఇది వారి వారి విశ్వాసాలతో నిమిత్తం లేకుండా ప్రతీ పౌరుడిని, శాస్త్ర విజ్ఞానాన్ని, హేతుబద్ధతను గౌరవించడానికి దారి తీస్తుంది. ఇది గత కొన్ని శతాబ్దాలుగా ఐరోపా దేశాలు, ఆసియా దేశాలైన చైనా, వియత్నాం, దక్షిణ కొరియాల అనుభవాల నుండి స్పష్టమైంది.
లోపభూయిష్టమైన 'ఒకే దేశం' విధానం
ఒకే భాషకు, ఒకే ప్రాంతానికి చెందిన సభ్యులకే ప్రాధాన్యత ఇవ్వాలనే యూనియన్ ప్రభుత్వ ప్రస్తుత విధానాలతో తిరోగమన మార్గంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్న భారతదేశం తీవ్రమైన ఆర్థిక పరిణామాలకు దారి తీసిన ఫలితంగా ఆదాయ అసమానతలు మరింతగా పెరుగుతున్నాయి. దేశంలోని అనేక వైవిధ్యాల మధ్య 'ఒకే దేశం' విధానం పొసగదు. అన్ని వర్గాల ప్రజలకు తమ జీవనానికి అందుబాటులో ఉన్న అవసరమైన మార్గాలు, (కేంద్ర ప్రభుత్వ నూతన ప్రాధాన్యతలు, విధానాలు భారతదేశ సామాజిక నిర్మాణాలకు తూట్లు పొడిచిన ఫలితంగా) నిషేధానికి గురయ్యాయి.
వైవిధ్యం, సమ్మిళితం, సార్వజనీనమైన భావనలను విశ్వసనీయమైనవి కానివిగా పరిగణిస్తూ, భారతీయ ఒడంబడికకు ఆధారమైన మతస్వేచ్చను, దేన్నైనా ఎంపిక చేసుకునే స్వేచ్ఛలను నేరపూరిత చర్యలుగా పరిగణించడం వల్ల తీవ్రమైన సామాజిక, ఆర్థిక పరిణామాలు ఏర్పడతాయి. ఖచ్చితంగా ఈ విషయమై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈ విధంగా హెచ్చరించాడు. ''రాజకీయాల్లో మనం ఒక మనిషి ఒక ఓటు, ఒక ఓటు ఒక విలువ నిబంధనను చూస్తాం. మన సామాజిక, ఆర్థిక జీవితంలో మన సామాజిక ఆర్థిక నిర్మాణంలోని హేతువు ద్వారా ఒక మనిషి ఒక విలువ నిబంధనను తిరస్కరించడం కొనసాగిస్తాం. ఇలాంటి వైరుధ్యాలతో కూడిన జీవితాన్ని ఎంత కాలం కొనసాగించాలి? మనం ఇంకెంత కాలం మన సామాజిక ఆర్థిక జీవనంలో సమానత్వం నిజం కాదనే విషయాన్ని చెప్పాలి?''
మనం సుదీర్ఘకాలం పాటు సామాజిక ఆర్థిక అసమానతలను తిరస్కరించడం కొనిసాగిస్తేనే, మన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణం ప్రాధాన్యతను పెంచగలమని 1949లోనే బీఆర్ అంబేద్కర్ తీవ్రంగా హెచ్చరించాడు. మనం అనేక ఆపదలను, నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. దేశాల భవితవ్యం ఎలా ఉండబోతోందనే విషయం ఎవరకీ ముందుగా తెలియదు. ఇష్టాలను మనమే ఏర్పరచుకుంటాం, భవితవ్యాలు సృష్టించబడతాయి. ఆధునికీకరణను తిరోగమన మార్గం పట్టించడం, ప్రజాజీవితానికి మతాన్ని అనుసంధానం చేయడం, ఆధునికతను నిర్మూలించే ప్రయత్నాలను ఇప్పటికే భారతదేశం ఆదర్శంగా తీసుకుంది. ప్రపంచంలోని కొన్ని దేశాలు, మన పొరుగు దేశాలు అలాంటి మార్గాలను అవలంభించి ప్రమాదకరమైన సంకుచిత మార్గంలో ఉన్న దారిలోనే, మనం కూడా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి.
(''ద హిందూ'' సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్
సీమా ఛిస్తీ
సెల్:9848412451