Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గడీ గోడలపై నిల్చొని దొరతనాన్ని తొడగొట్టి సవాల్ చేసిన ఆ ఎర్ర పావురం ఎటెళ్ళిందో..
ఏ శిఖరాల వైపు ఎగిరిపోయిందో..
రైతాంగ పోరుకు సైరన్ ఊదిన ఆ పావురం గుర్తులు సజీవంగా మిగిలిపోయాయి.
అదిగో.! గడీల పాలనపై నిప్పుల వానై రజాకార్ల కేంద్రాల్ని మసి చేసిన మంటల వెలుగుల్లో... విప్లవ సింహం గాండ్రింపులా ఎర్రపావురం..
ఆ పావురమే ఇటికాల బక్కయ్య. శాతాపురం బక్కయ్యగా అతడు ప్రజల్లో సజీవుడు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని శాతాపురం గ్రామానికి చెందిన ఇటికాల అమ్మక్క - సోమయ్య దంపతులకు ఇటికాల బక్కయ్య 1922లో జన్మించాడు. 21ఏండ్ల వయస్సులో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. విస్నూరు కేంద్రంగా చేసుకుని ప్రజల్ని పీడిస్తూ, గ్రామాల్లో అరాచకాలు సాగిస్తున్న దొరలు, ప్రయివేటు సైన్యాల (రజాకార్లు)పై తిరుగుబాటు చేశాడు. గుండె ధైర్యంతో ఒక్కడే ఎలాంటి ఘటననైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడే నైజం అతని సొంతం. అందుకే అతడు విస్నూరు దొరలకు సింహస్వప్నం. బక్కయ్య సాహస గాథలు, ఆయన వీర మరణం జననాలుకలపై నేటికీ వినిపిస్తూనే ఉంటాయి. ప్రజల హృదయాల్లో బక్కయ్యలాంటి వీరులకి పదిలమైన స్థానం ఎప్పటికీ ఉంటుంది. పాలకులూ ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా.. ప్రజలు మౌఖికంగా ఒక తరం నుండి మరో తరానికి వారి చరిత్ర అందిస్తూనే ఉంటారు.
దొరకు ప్రయివేటు సైన్యం అండ..
నాటి నైజాం పాలనలో ''విస్నూరు రామచంద్రారెడ్డి పేరు చెబితే.. పిట్ట నీళ్లు తాగదు'' అనే నానుడి బాగా స్థిరపడి పోయింది. అలాంటి దొర కుటుంబానికి అనుచరవర్గంగా ఉండేది విస్నూరు దళితగూడెం. గ్రామానికి అర కిలోమీటరు పరిధిలో ఉన్న దళితగూడెం దొర చెప్పినట్టు వినాల్సిందే. లేదంటే బతుకుదెరువు కష్టమే. అలాంటి పరిస్థితుల్లో దొరల పాశవిక చర్యలకు వీరు పావులయ్యారు. తమ కంటిలో తామే పొడుచుకున్నట్లుగా అణగారిన వర్గాలపై వీరిచేతే దాడులు చేయించేవాడు. బాబు దొర నిత్యం చేసే అరాచకాలకు ఈ దళితుల్నే ఉపయోగించుకునేది. కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణచివేసేందుకు వీరితోనే గ్రామాలపై దాడులు చేయించేవాడు. వీరిలో ఎప్పుడూ 60 నుంచి 80 మంది బాబుదొరకు రక్షణ కవచంగా ఉండేవాళ్ళు. బాబు దొరను చంపాలనుకున్న కమ్యూనిస్టులకు విస్నూరుకు చెందిన ఈ దళితులే ప్రధాన అడ్డంకిగా ఉండేవారు. ఈ సమయంలో బాబుదొరను దెబ్బ కొట్టాలంటే వీరిని దొరకు దూరం చేయాలని కమ్యూనిస్టు నాయకులు భావించారు.
80ఇండ్లు దహనం చేసిన బక్కయ్య..
తప్పనిసరి పరిస్థితుల్లో దొర ప్రయివేటు సైన్యమైన ఈ దళితగూడాన్ని దహనం చేసే కార్యక్రమాన్ని పార్టీ ఏరియా కమిటీ బక్కయ్యకు అప్పగించింది. కానీ, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కార్యక్రమం అమలు జరుపాలి. దానికి సరైన వ్యక్తి బక్కయ్య అని నమ్మి మరొకరిని తోడుగా ఒకరోజు పంపించారు. రాత్రి 10గంటలకు విస్నూరు గ్రామానికి చేరుకున్నారు. బక్కయ్య ఒక చేతిలో దివిటీ వెలిగించుకొని, భుజానికి 303 రైఫిల్ వేసుకుని గూడెంపై దాడికి బయలుదేరాడు. ప్రారంభంలో తుపాకీతో విస్నూరు గడీ వైపు గురి పెట్టి తూటా పేల్చాడు. దీంతో పోలీసులు, రజాకార్లు దళితగూడెం మీదకు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో దళితులు ఇళ్లనొదిలి పారిపోయారు. బక్కయ్య మాత్రం ఒక్కో ఇంటిని దీవిటితో కాలుస్తూ మంటల్ని వ్యాపింపజేశాడు. మరొక కామ్రేడ్ గ్యాస్ నూనె అందించసాగాడు. మంటలు చూసి వందలాదిగా కమ్యూనిస్టు దళాలు గూడెంపై దాడి చేశాయని అంతా భావించారు. కానీ, బక్కయ్య మరో కామ్రేడ్ ఇద్దరే తమ వ్యూహాన్ని చాకచక్యంగా అమలు చేశారు. దీంతో 80ఇండ్లు బూడిదయ్యాయి. ఈ ఘటనతో శతృ శిబిరం బలహీన పడి, ఆత్మరక్షణలో పడింది. దళితులు పునరాలోచనలో పడ్డారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని గ్రహించారు. బాబు దొరను దూరం పెట్టి దాడులకి వెళ్లడం మానేశారు. ఈ ఘటన తర్వాత కొద్దిరోజులకే బాబు దొర జనగామ రైల్వే స్టేషనులో ప్రజల చేతిలో హత్యకు గురయ్యాడు. దీంతో బాబు దొరచే పీడింపబడిన ప్రజానీకంతో పాటు ఆ దళితగూడెమూ సంబరాలు జరుపుకుంది.
ఉద్యమ నిర్మాణంలో కీలకపాత్ర
బక్కయ్య ఈ ప్రాంత ఏరియా కమిటీలో ముఖ్య నాయకుడు. ఆయుధ శిక్షణ పొందాడు. డ్రిల్లు చేయడం, తుపాకీ పేల్చె విధానం, ఇతర మెలుకువలు తెలిసినవాడు. దొరల అనుచరులను శిక్షించడంలో వీరి దళం కీలకపాత్ర పోషించింది. బీంరెడ్డి నర్సింహారెడ్డి, నల్ల నర్సింహులు, యర్రంరెడ్డి మోహన్ రెడ్డి, జాటోతు ఠాను నాయక్, కాసం కృష్ణమూర్తి, చకిలం యాదగిరి రావు, ఎస్వికె ప్రసాద్, గబ్బెట తిర్మల్ రెడ్డి, కొత్త ముకుంద రెడ్డి, చింతల రామకృష్ణా రెడ్డి, ఏసీరెడ్డి, జాటోతు దర్గ్యా, తొండ రంగయ్య, బొక్క సోమయ్య, కాసాని నారాయణ, రాజారాం, మామిండ్ల కొమరయ్య, జీడి సోమనర్సయ్య, పందిబోయిన కొండయ్య లాంటి ఉద్యమ సహచరులతో కలిసి ఉద్యమాన్ని నిర్మించాడు. పలుమార్లు పోలీసుల కాల్పుల నుంచి తప్పించుకొని అజ్ఞాత జీవితం గడిపాడు.
దొరతనాన్ని సవాల్ చేసిన బక్కయ్య..
బక్కయ్య మొండివాడు. అనుకున్నది చేసేదాకా వదిలిపెట్టడు. దొరతనాన్ని అసలే సహించడు. విస్నూరు గడీని కూల్చాలని పార్టీ నిర్ణయించింది. అందుకు జనసమీకరణ చేసింది. సెప్టెంబర్ 16, 1948న వేలాది మంది ప్రజలతో విస్నూరు గడి చుట్టుముట్టారు. ప్రజలు ఆవేశంతో రగిలిపో తున్నారు. గడీని కూల్చాలని, దొరను చంపాలని కసితో ఉన్నారు. కానీ అంతలోనే భారీ వర్షం కురుస్తుండడంతో గడీని కూల్చకుండా ఆగిపోయారు. బక్కయ్య మాత్రం జనం మధ్యలో నుంచి గడీ ప్రహరీ గోడను చేరుకున్నాడు. చాకచక్యంగా గోడపైకి ఎగబాకి గోడపై నిలుచున్నాడు. ఆరు అడుగుల ఎత్తులో ఉన్న బక్కయ్య గోడపై అజనుబాహుడిగా కన్పిస్తున్నాడు. జనం దృష్టి బక్కయ్యపై పడింది. నడుముకు చెక్కిన బక్కయ్య ఆయుధం గొడ్డలి మొన మెరుస్తుండగా ఒంటికాలి (ఎడమ)పై నిలబడి కుడికాలు లేపి తొడగొట్టాడు. ''ఒరేరు దొరోడా.. నీ పాలన అంతమవుతుంది''.. అంటూ మేలి మీసాన్ని తిప్పుతూ గర్జించాడు బక్కయ్య. తొడ కొట్టిన శబ్దం అక్కడ బాంబు పేల్చిన శబ్దంలా ప్రతిధ్వనిపించింది. బక్కయ్య సవాల్‌తో కూడిన హెచ్చరిక విన్న పెద్ద దొర రామచంద్రారెడ్డి కంగారు పడ్డాడు. 'ఇతను ఎవరని..?' తన అనుచరులను అడిగాడు. 'దళిత గూడెంపై దాడి చేసింది ఇతనేనని.. మంటల వెలుగుల్లో శాతాపురం బక్కయ్యగా తాము గుర్తించినట్లు' చెప్పారు. (గూడెంకు చెందిన రజాకార్ బుర్క మల్లయ్యతో విస్నూర్ శివారులో బక్కయ్యకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు కలియబడ్డారు. చివరకు బక్కయ్య చేతిలో మల్లయ్య ప్రాణలోదిలాడు.)
బక్కయ్య బలిదానం..
గడీ గోడలెక్కి తొడ కొట్టి సవాల్ విసిరిన ఘటన దేశ్‌ముఖ్ గుండెలో మంటలా రగిలింది. బక్కయ్య ఇంటిదగ్గర ఉన్నట్టు దొరకు అనుచరులచే సమాచారం అందింది. పోలీసు అధికారులను గడీకి పిలిపించి బక్కయ్యను ప్రాణాలతో తీసుకురావాలని ఆదేశించాడు. దొర మాటే వేదంగా, శాసనంగా భావించిన పోలీసులు, సిక్కు సైనికులు, రజాకార్లతో కలిసి శాతాపురం గ్రామానికి మూకుమ్మడిగా చేరుకున్నారు. బక్కయ్యని అరెస్టు చేసిన పోలీసులు విస్నూరు పోలీస్ స్టేషనులో నిర్బంధించి చిత్రహింస లకు గురిచేశారు. పార్టీ నాయకుల ఆచూకీ కోసం, దొర మెప్పు కోసం ఫాసిస్టు చర్యలకు పాల్పడ్డారు. చేతిగోళ్ళలో సూదులు గుచ్చారు. లాఠీలతో శరీరాన్ని కుళ్ళబొడిచి జీవచ్ఛవంలా మార్చారు. గడీ గోడలపై పడుకోబెట్టి ఒక్కో చేతికి, కాలుకు 20కిలోల బరువు గల బండ రాళ్లను కట్టి వేలాడదీశారు.
ఐదు రోజుల పాటు అలాగే ఉంచారు. రక్త మోడిన శరీరం పుండుగా మారి పురుగులు పడ్డాయి. బక్కయ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడు తుండగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంటికి చేరిన బక్కయ్యకు సరైన వైద్యం అందనివ్వలేదు. కొన ఊపిరితో ఉన్న బక్కయ్య రెండు రోజులకు తుది శ్వాస విడిచాడు. ఆ సమయంలో బక్కయ్యకు భార్య, ఏడాది, మూడేండ్ల వయస్సు గల ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. బక్కయ్య మరణ నేపథ్యం ప్రజలను తీవ్రంగా కలచివేసింది. కానీ చంపినా చావని అతని ధైర్యం అలాగే ఉండిపోయింది. బక్కయ్యకు మరణం లేదు. రైతాంగ సాయుధ పోరాటంలో బక్కయ్య వీరోచిత పాత్ర జనం గుండెల్లో నేటికి మెదులుతూనే ఉంది. ఆ మహావీరుడికి నూరేళ్ళ నివాళి.
- మామిండ్ల రమేష్ రాజా
సెల్:7893230218