Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్టుబడిదారీ వ్యవస్థలో ద్రవ్య మార్కెట్ల నడక అంతా తప్పుల తడకగా సాగుతుందని ప్రఖ్యాత ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ వాదించాడు. ఒక ''సంస్థ'' రూపంలో ఉండే ఆస్తికి, ఒక చట్టా వ్యాపారంలో ''స్టాక్'' లేదా ''షేర్'' రూపంలో ఉండే ఆస్తికి మధ్య ఉండే మౌలికమైన తేడాను పెట్టుబడిదారీ వ్యవస్థ చూడదు అని కీన్స్ అన్నాడు. ఒక సంస్థ నుండి అది సాగించే కార్యకలాపాల ద్వారా దాని యజమానికి నిరంతరం ప్రతిఫలం వస్తూవుంటుంది. అదే ఒక స్టాక్ గాని, షేర్ గాని అది తర్వాత కాలంలో మరింత ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చునన్న అంచనా తోటే చేతులు మారుతుంది. అంతే తప్ప అలా అమ్మకుండా దగ్గర అట్టేపెట్టుకుంటే దానిమీద ఎటువంటి ప్రతిఫలమూ దాని యజమానికి ముట్టదు. చట్టా వ్యాపారం (స్పెక్యులేషన్)లో ఒకానొక షేర్ లేదా మరో రూపంలో (డిబెంచర్, డెరివేటివ్, ఫ్యూచర్స్ వగైరా) ఉండే ఆస్తి దాని అసలు విలువను ప్రతిబింబించదు. అసలు విలువ అంటే ఏమిటి? ఆ షేర్ మీద రాబోయే కాలంలో ఎంత డివిడెండు వస్తుందో దాని ప్రస్తుత విలువ అన్నమాట. (ఉదా: ఆర్థిక సంవత్సరం ముగిశాక ఒక కంపెనీకి ఎంత లాభం వచ్చిందో లెక్కించి, దానిలో షేర్హోల్డర్లకు ఎంతెంత వాటాలు ప్రకటించాలో నిర్ణయిస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగిశాక ఆ షేర్ మీద వచ్చే డివిడెండు విలువను ఇంకా ముందుగానే అంచనా వేసుకుని దానిని కొనుగోలు చేస్తారు. ఇదే స్పెక్యులేషన్)
ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన సంపదలో వినియోగానికి పోగా అదనంగా ఉన్న సంపదను మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి మళ్ళిస్తారు. అలా మళ్ళించిన సంపద స్పెక్యులేటివ్ మార్కెట్లో ప్రవేశిస్తుంది. ఇక్కడ కొత్తగా సరుకు ఉత్పత్తి కాదు. కాని పెట్టిన పెట్టుబడికంటే అదనంగా స్పెక్యులేషన్ ద్వారా సంపాదించుకోవాలనే ఆశతో పెట్టుబడులు పెడతారు. ఇక్కడే వాళ్ళ అంచనాలు దెబ్బ తింటూంటాయి. ప్రజలు వినియోగించే సరుకుల ఉత్పత్తి కోసం పెట్టుబడి పెట్టినప్పుడు ఉపాధి కల్పన జరుగుతుంది. సరుకుల ఉత్పత్తి పెరగడంతోబాటు వాటిని వినియోగించగల సామర్థ్యమూ సమాజానికి పెరుగుతుంది. దానికి బదులు సరుకుల ఉత్పత్తితో సంబంధంలేని స్పెక్యులేటివ్ మార్కెట్లో పెట్టుబడులు పెరిగితే సరుకుల వాస్తవ వినిమయమూ పెరగదు, ఉపాధి కల్పనా జరగదు. దాని వలన నిరుద్యోగం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో సంభవించే హెచ్చుతగ్గులు ఆర్థిక వ్యవస్థమీద ప్రభావం చూపుతాయి. నిరుద్యోగం పెరుగుతున్నకొద్దీ మార్కెట్లో సరుకులు వినియోగం కాకుండా మిగిలిపోతాయి. అది ''అధికోత్పత్తి'' సంక్షోభానికి దారి తీస్తుంది.
ఈ పరిస్థితిని నివారించాలంటే మిగులు సంపదను పెట్టుబడి పెట్టడం కాని, మిగులును పంపిణీ చేయడం కాని ద్రవ్య మార్కెట్లకు విడిచిపెట్టెయ్యకూడదు అని కీన్స్ వాదించాడు. ఒకవేళ విడిచిపెడితే నిరుద్యోగం పెరిగి పెరిగి సమాజం భరించలేనంత స్థాయికి చేరుతుంది. అప్పుడు ఆ వ్యవస్థ కొనసాగడం అసాధ్యం అవుతుంది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను నిలబెట్టాలన్నది కీన్స్ ఆకాంక్ష. కనుక, దానిని కాపాడడానికి కీన్స్ చెప్పిన పరిష్కారం ''పెట్టుబడులను ప్రభుత్వమే నియంత్రించడం''. ఆ విధంగా ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడు సమాజంలో అత్యధిక స్థాయిలో ఉపాధికల్పన జరిగేలా, దాదాపు అందరికీ ఉపాధి లభించేలా చూడవచ్చు. అప్పుడు అధికోత్పత్తి సమస్యను నివారించవచ్చునని కీన్స్ భావించాడు. దీనర్థం నిరుద్యోగం ప్రబలినప్పుడు మాత్రమే ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవాలని కాదు. స్పెక్యులేషన్ జోరుగా సాగుతున్న సందర్భాలలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోవలసివుంటుంది. నిజానికి ఉపాధి కల్పన గరిష్టస్థాయిలో ఉన్నప్పుడే మార్కెట్లు వేగం పుంజుకుంటాయి. దానితోబాటు స్పెక్కులేషన్ కూడా జోరందుకుంటుంది. అటువంటప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా, కేవలం స్టాక్‌మార్కెట్ పడిపోయి, నిరుద్యోగం బాగా పెరిగిపోయాక తదనంతరం మాత్రమే జోక్యం చేసుకోడం వలన ప్రయోజనం ఉండదు. అందుచేత మార్కెట్లో ప్రభుత్వం జోక్యం నిరంతరం ఉండాలి. స్టాక్మార్కెట్లో సంభవించే ఊపు, తాపులను అదుపు చేస్తూ, గరిష్ట స్థాయిలో ఉపాధికల్పన ఎప్పుడూ ఉండేలా ప్రభుత్వం మార్కెట్లను నియంత్రించాలి. అందులో భాగంగానే ద్రవ్య మార్కెట్లనూ ప్రభుత్వం నియంత్రించాలి. ద్రవ్య మార్కెట్‌ను నియంత్రించడంలో ఆర్థిక సంస్థలను నియంత్రించడం అన్నింటిలోకీ ముందు జరగవలసిన పని. ఆ ఆర్థిక సంస్థలు (బ్యాంకులు, ఇన్సూరెన్స్ వగైరా) అసలు షేర్ మార్కెట్ వ్యాపారంలో స్పెక్యులేట్ చేయవచ్చా, లేదా అన్నది, ఆ షేర్ మార్కెట్లో మదుపులు పెట్టేవారికి నిధులను సమకూర్చవచ్చా లేదా అన్నది ప్రభుత్వమే నిర్థారించాలి. అమెరికాలో ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో 'న్యూ డీల్' అమలులోకి వచ్చింది. అప్పుడు గ్లాస్-స్టీగాల్ చట్టం ఆమోదించబడింది. ఆ చట్టం వాణిజ్య బ్యాంకింగ్‌ను, పెట్టుబడుల బ్యాంకింగ్‌ను స్పష్టంగా విభజించింది. ప్రజలనుండి డిపాజిట్లు స్వీకరించే వాణిజ్య బ్యాంకులు స్పెక్యులేషన్ వ్యవహారాల్లో తల దూర్చకూడదని నిషేధించింది. ఆ చట్టం చాలా కాలం తర్వాత మళ్ళీ క్లింటన్ హయాంలో రద్దు చేయబడింది. ఆ తర్వాత ఆస్తుల విలువలు స్పెక్యులేషన్ వ్యాపారం ఫలితంగా అమాంతం పెరిగిపోయి రియల్ ఎస్టేట్ బబుల్‌కు దారి తీసింది. ఆ బబుల్ పెరుగుతూన్నంత కాలం అమెరికాలో, తక్కిన ప్రపంచంలో కూడా ఆర్థిక వ్యవస్థ ఆ బబుల్ తోబాటు పెరిగింది. ఒక్కసారిగా ఆ హౌసింగ్ బబుల్ బద్దలవడంతో అమెరికన్ ఆర్థిక వ్యవస్థతోబాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిపోయింది. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితి కరోనా మహమ్మారి విజృంభించకమునుపే ఏర్పడింది. ఈ విధంగా స్పెక్యులేషన్ మీద ఆధారపడి ఆర్థిక వ్యవస్థ పెరగడం, తర్వాత కుప్పకూలడం అనేది కేవలం ఉత్పత్తితో ముడిపడిన వాస్తవ ఆర్థిక వ్యవస్థని దెబ్బ తీయడమే కాదు, ద్రవ్య వ్యవస్థనుకూడా దెబ్బ తీస్తుంది. అమెరికాలో హౌసింగ్ బబుల్ బద్దలయ్యాక ద్రవ్య మార్కెట్ కూడా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఒబామా ప్రభుత్వం ఏకంగా 13లక్షల కోట్ల డాలర్ల సంపదను తోడ్పాటుగా అందించ వలసి వచ్చింది. ద్రవ్యమార్కెట్లో జరిగే స్పెక్యులేషన్ ఫలితంగా నిరుద్యోగం పెరిగిపోవడమే కాదు, ఆర్థిక సంస్థలు నిలదొక్కుకోగలవా లేవా అన్న అసందిగ్ధ పరిస్థితి కూడా వస్తుంది. అందుచేత ఆర్థిక సంస్థలు ఈ స్పెక్యులేషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం కాని, స్పెక్యులేటర్లకు నిధులను అందించడం కాని చేయకుండా ప్రభుత్వం నిరోధించడం అవసరం. ఆ విధంగా ఆర్థిక సంస్థలను నిరోధించాలంటే ఆ సంస్థలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలుగా నడపడమే ఉత్తమ పరిష్కారం. అమెరికాలో హౌసింగ్ బబుల్ బద్దలయ్యాక, ఆ సంపన్న దేశాల్లోని ఆర్థిక సంస్థలు ఆ స్పెక్యులేషన్ వ్యాపారంలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను విపరీతంగా పాల్గొన్న కారణంగా చావుదెబ్బ తిన్నాయి. వాటిని కూలిపోకుండా నిలబెట్టేందుకు భారీగా ప్రజా ధనాన్ని వెచ్చించాల్సివచ్చింది. ఆ సందర్భంగానే ఆ ఆర్థిక సంస్థలను తిరిగి పాత మేనేజిమెంట్లకు- అంటే ప్రభుత్వాలకు- అప్పజెప్పాలన్న డిమాండ్ బలంగా వచ్చింది. నిజానికి ఆ సమయంలో అమెరికాలో ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం నుండి పెద్ద మొత్తాలను సదరు ఆర్థిక సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు తమ భారీ జీతాల చెల్లింపుకు, బోనస్‌లకు మళ్ళించారు. అవే సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో గనుక నడిస్తే ఆ సంస్థల నిధులు పక్కదోవ పట్టకుండా, స్పెక్యులేటివ్ కార్యకలాపాల్లోకి మళ్ళకుండా సక్రమంగా వినియోగపడేలా చూడడం సాధ్యపడుతుంది. ఆ హౌసింగ్ బబుల్ బద్దలైనప్పుడు ఇండియాలోని ప్రభుత్వరంగ బ్యాంకుల పెట్టుబడులలో స్పెక్యులేటివ్ కార్యకలాపాలకోసం కేటాయించినవి దాదాపు ఏమీ లేవు. అటువంటి స్పెక్యులేటివ్ పెట్టుబడులు ఐసిఐసిఐ బ్యాంక్ వంటి ప్రయివేటు బ్యాంకులే ఏ మేరకైనా పెట్టాయి. ప్రభుత్వ ఆధీనంలో ఆర్థిక సంస్థలు నడవడం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థకొనసాగేందుకు తోడ్పడుతుంది. ఐనప్పటికీ, పెట్టుబడిదారులు మాత్రం ఆ బ్యాంకులు ప్రభుత్వ ఆధీనంలో కొనసాగడానికి ఎంతమాత్రమూ సుముఖంగా ఉండరు. పెట్టుబడిదారీ విధానమే ఎటువంటి ప్రణాళికాలేని ఒక అరాచక వ్యవస్థ. అందులో ఆ పెట్టుబడిదారులు ఎంతసేపూ తమకు అత్యధిక లాభాలు రావాలనే ఆలోచన తోటే వ్యవహరిస్తారు తప్ప మొత్తం వ్యవస్థ కొనసాగడమెలా అన్నది వారికి పట్టదు. అందుచేత అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ పెట్టుబడిదారులపట్ల ఎంత సానుకూలంగా వ్యవహరిస్తున్నా, ఆ ప్రభుత్వ ఆధీనంలో ఆర్థిక సంస్థలు కొనసాగడానికి ఆ పెట్టుబడిదారుల నుండి తీవ్ర వ్యతిరేకత అనివార్యంగా ఎదురవుతుంది.
పెట్టుబడిదారులకు వారి లాభాలు తప్ప ఇంకేమీ పట్టకపోవచ్చు. కాని ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి కదా? బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వమే ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకింగ్ వ్యవస్థను మొత్తంగా తీసుకెళ్ళి ఆ ప్రయివేటు పెట్టుబడిదారులకు సమర్పించడానికి సిద్ధపడితే దాన్నేమనాలి? అది ఎంత మతిమాలిన పని? అటువంటి చర్య దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోడానికే దారితీస్తుంది కదా! కాని ఏం చేస్తాం? ప్రస్తుతం మనకున్న ప్రభుత్వం అటువంటిదే. దేశ ఆర్థిక వ్యవస్థ ఏమేరకైనా నిలదొక్కుకోగలుగుతున్నదంటే దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధాన భాగం ప్రభుత్వ ఆధీనంలో ఉండడమే కారణం. ఆ బ్యాంకులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి గనుక తమ డిపాజిట్లకు ఎటువంటి ఢోకా లేదని డిపాజిటర్లు ధీమాగా ఉంటారు. అందుచేత తమ డిపాజిట్లను వెనక్కి తీసేసుకోవాలనే భయం గాని, ఆత్రుత గాని వారికి ఉండదు. స్వాతంత్య్రానికి పూర్వ కాలంలో గాని, బ్యాంకుల జాతీయీకరణకు మునుపు ప్రయివేటు బ్యాంకులే ఎక్కువగా నడుస్తున్నప్పుడు కాని ప్రజలకు బ్యాంకులమీద అటువంటి భరోసా ఏదీ ఉండేది కాదు. వారివద్దనున్న డబ్బును కరెన్సీనోట్ల కట్టలుగా పరుపుల కింద దాచుకునేవారు. లేదా బంగారు ఆభరణాల రూపంలో దాచుకునేవారు. లేదా భూములు కొని ఆ రూపంలో భద్రపరుచుకునేవారు. బ్యాంకుల జాతీయాకరణ తర్వాతనే ప్రజల వైఖరిలో మార్పు వచ్చింది. వారివద్దనుండే ధనం బ్యాంకులలోకి వచ్చింది. అక్కడినుండి అది పెట్టుబడుల రూపంలో వచ్చి ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేసింది. ఇప్పుడు మన ప్రభుత్వం కాలాన్ని మళ్ళీ వెనక్కి నడిపించాలని చూస్తోంది. ఇప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ ఆ నాటి వలసపాలన రోజుల్లో ఉన్నట్టే తయారవుతోంది. ఈ నిజాన్ని దాచిపెట్టడం వలన ప్రయోజనం లేదు. ఆర్థిక సంస్థలమీద ఎటువంటి ఆంక్షలూ లేవు. అవి స్పెక్యులేటివ్ పెట్టుబడులవైపు తమ వనరులను మళ్ళించకుండా నిరోధించే విధానాలేవీ ఇప్పుడు అమలులో లేవు. ఉన్న కొద్దిపాటి చట్టాలూ ఆ విధమైన మళ్ళింపును నిరోధించగల శక్తి కలిగి లేవు. బ్యాంకులను జాతీయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు దాని ప్రధాన ఉద్దేశ్యం వేరు. ఆనాటి తక్షణ అవసరాలు ఆ నిర్ణయం వెనుక ప్రధాన భూమిక పోషించాయి. అంతవరకూ నిర్లక్ష్యం చేయబడిన రంగాల అభివృద్ధికి కావలసిన సంస్థాగత రుణాలను అందుబాటులోకి తేవడమే ఆ తక్షణ అవసరం. అప్పుడు ఆ రంగాల అభివృద్ధి దేశ ఆర్ధిక వ్యవస్థ పురోగతికి అత్యంత అవసరం. అటువంటి రంగాల్లో చిన్నరైతుల వ్యవసాయం ఒకటి. తక్కువ వడ్డీకి ఆ రైతులకు ప్రాధాన్యతాక్రమంలో రుణాలు అందుబాటులోకి తెచ్చి తప్పనిసరిగా వ్యవసాయ రంగంలోకి పెట్టుబడులు వచ్చేలా చేశారు. ఆ విధంగా వచ్చిన రుణం భూస్వాములకు, పెద్ద రైతులకు ప్రధానంగా దక్కిందన్నది వేరేసంగతి. అలా ఎగుడుదిగుడుగా వ్యవసాయ రంగంలో రుణాలు పంపిణీ అయినా, మొత్తం మీద హరిత విప్లవం అన్నది విజయవంతం కావడానికి ఆ బ్యాంకు రుణాలు కీలకంగా తోడ్పడ్డాయన్నది మనం గమనించాలి. హరిత విప్లవం వలన పర్యావరణం దెబ్బ తినిపోయిందని బాధపడేవారు బాధపడొచ్చు గాక. కాని బ్యాంకుల జాతీయాకరణ, అనంతరం సాధించిన హరిత విప్లవం మన దేశాన్ని సంపన్న పశ్చిమ దేశాల ఆధిపత్యం నుండి, ''ఆహార సామ్రాజ్యవాదం'' బారినుండి విముక్తి చేశాయన్నది తిరుగులేని వాస్తవం. బ్యాంకులను తిరిగి ప్రయివేటీకరించమని నయా ఉదారవాదం మన ప్రభుత్వం మీద చాలా కాలం నుండీ వత్తిడి తెస్తోంది. ఇంతవరకూ ఉన్న ప్రభుత్వాలు ఆ వత్తిడిని ఎదుర్కున్నాయి. కాని ఇప్పుడున్న ప్రభుత్వం వేరు. దేశ ఆర్థిక వ్యవహారాలమీద ఈ ప్రభుత్వానికి అవగాహన ఏమాత్రమూ లేదు. అందుకే చాలా సులువుగా అది నయా ఉదారవాద ఆదేశాలకు తలొగ్గుతోంది. బ్యాంకులు ప్రభుత్వ ఆధీనంలో నడవడం అనేది కేవలం సంస్థాగత రుణాలను ఎక్కువ మందికి అందుబాటులోకి తేవడం కోసం మాత్రమే కాదు, ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోడానికి కూడా అది ఎంతో అవసరం.
- ప్రభాత్ పట్నాయక్
సేవచ్ఛానుసరణ