Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గురువులను సాక్షాత్తు దైవంగా పూజించే సంస్కృతి మనదేశంలో వందల సంవత్సరాలుగా విలసిల్లుతున్నది. ఉపాధ్యాయులకు సముచిత గౌరవం ఇవ్వటం మన సంస్కృతిలో అంతర్భాగంగా వస్తున్నది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పరిస్థితి మాత్రం భిన్నంగా మారింది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు, నిరుద్యోగులు ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్య ఉపాధ్యాయుల బదిలీలలో చేసిన తప్పుల కారణంగా ఇప్పటికే 15 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
జీఓ317తో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాల పెంపు కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల శాశ్వత బదిలీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం జోనల్, మల్టీ జోనల్, జిల్లాస్థాయి పోస్టులు ఏవి అనేది నిర్ణయం చేయకుండానే ఆదరా బాదరాగా చేపట్టిన ఈ బదిలీల ప్రక్రియ అంతా లోప భూయిష్టంగా జరిగింది. ఉపాధ్యాయుల బదిలీలలో అసలు స్థానికత అనే విషయాన్ని పట్టించుకోలేదని, కేవలం సీనియారిటీని పరిగణలోకి తీసుకొని బదిలీలు చేయటం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. కేవలం స్థానికతే కాదు, డీఎస్సీ మార్కులను, గతంలో వారు చేసిన సర్వీసును సైతం పరిగణనలోకి తీసుకోలేదని, కొన్ని సందర్భాల్లో తమ తర్వాత ఉద్యోగాలలో చేరిన వారికి అధిక సర్వీస్ వచ్చిందని, ఆయా సీనియారిటీ జాబితా అంతా తప్పుల తడకగా ఉందని దాదాపు 20 రోజులుగా తరగతి గదులను, తమ పాఠశాలలను విడిచిపెట్టి కలెక్టరేట్లు, డీఈవో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. వారిని పోలీసులు లాక్కు వెల్లి అరెస్ట్ చేయడం నిజంగా భాధకరం. స్పౌస్, వీడో అనే విషయాలను సైతం పరిగణలోకి తీసుకోలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే అసలు బదిలీలకు కావాల్సిన సీనియార్టీ లిస్టును సైతం విడుదల చేయకుండా ఆప్షన్ల ప్రక్రియను ముగించేశారు.
ఈ బదిలీల కారణంగా ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థులు సైతం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. చాలా పాఠశాలల్లో ఉన్న 5, 6 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం బదిలీ చేసింది, కొన్ని పాఠశాలల్లో కనీసం విద్యార్థులకు దిశానిర్దేశం చేయడానికి పాఠశాలకు కనీసం ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేడు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల్లో చదువుకునే స్తోమత ఉండదు కాబట్టి మొత్తానికే చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ ఏడేండ్ల తర్వాత చేసిన బదిలీలు ఎంతో పరిపక్వతతో, ప్రణాళికాబద్ధంగా ఉండాల్సింది పోయి లోపభూయిష్టంగా మారడం విచారకరం. ఈ బదిలీలను చూస్తుంటే ప్రభుత్వానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యారంగం మీద ఉన్న శ్రద్ధ ఏపాటిదో కనిపిస్తోంది.
సరే పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులను బదిలీ చేశారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఏర్పడిన చోట మన ప్రభుత్వ పెద్దలు రిక్రూట్మెంట్ చేసి భర్తీ చేస్తారా అంటే అదీ తీరని ఆశగానే కనిపిస్తున్నది. ఉపాధ్యాయులను బదిలీ చేయటం వలన విద్యార్థులు అధిక సంఖ్యలో పాఠశాలలో చేరరు. కాబట్టి తక్కువ సంఖ్యతో నడుస్తున్న ఈ పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో మూసివేసే కుట్ర ఇందులో ఉందేమో అనేది తెలంగాణ సమాజంలో ఉన్న అతి పెద్ద సందేహం. ఇప్పటికే వందల కొద్ది పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో మూసివేయడం జరుగుతున్నది. కేజీ టు పీజీ, ఉచిత విద్య నా మానస పుత్రిక అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి రెండు ఎన్నికల్లో నెగ్గినాక సైతం ఈరోజుకి కేజీ టు పీజీ ఉచిత విద్య దేవుడెరుగు గాని, కేజీ టు పీజీ ఫీజుల మోత మోగుతోంది. వేలాది మంది విద్యార్థులు అప్పులు తీసుకొచ్చి చదువుతున్నారు, కొంత మంది చదువుకు దూరమవుతున్నారు.
వాస్తవానికి ఈ ఉపాధ్యాయులే మనందరికీ తెలంగాణ ఉద్యమ పాఠాలు నేర్పింది. అటువంటి ఉపాధ్యాయుల ఆత్మహత్యలు చూడాల్సిన రోజు రావడం బాధాకరం. తెలంగాణ ప్రభుత్వం జీఓ 317 రద్దుచేసి లక్షా 60వేల మంది ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. కావలసినంత సమయం తీసుకొని పక్కా ప్రణాళికను సిద్దం చేసుకొని, స్థానికత ఆధారంగా సీనియారిటీ జాబితాను ముందే సిద్ధం చేసి జిల్లాస్థాయి, జోనల్ స్థాయి, మల్టీ జోనల్ స్థాయి పోస్టులు ఏవి అనేవి ఖరారు చేసుకుని ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి అందులో కొంత మంది ఉద్యోగులను, ఉపాధ్యాయులను సభ్యులుగా తీసుకొని, వారి ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చి విధివిధానాల రూపకల్పన చేయాలి. స్పౌజ్, వీడో ఆప్షన్లకు సైతం బదిలీల ప్రక్రియలో ప్రాధాన్యమిచ్చి నిష్పక్షపాతంగా ఉపాధ్యాయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలి. అంతేగాని ప్రభుత్వం చేసిన తప్పులకు ఉపాధ్యాయులను బలి చేయడం. సమంజసం కాదు. ఆత్మహత్య అనేది ఏనాటికీ పరిష్కారం కాదనేది ఉపాధ్యాయ సమాజం సైతం ఆలోచించాలి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉద్యమం చేసి అయినా సక్రమంగా ఉపాధ్యాయ, ఉద్యోగ బదిలీలను సాధించాలి. ప్రభుత్వం జీఓ 317 విషయంలో పునరాలోచించి రద్దు చేసి ఉపాధ్యాయ బదిలీలను సక్రమంగా నిర్వహించేలా మరొక జీఓను విడుదల చేయాలి. ఉపాధ్యాయ బదిలీల విషయంలో కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలు తమ అగ్ర నాయకత్వం మెప్పు పొందే క్రమంలో ఉపాధ్యాయు లను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం భావ్యం కాదు.
-జవ్వాది దిలీప్
సెల్:7801009838