Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''దేశమంటే మట్టి కాదోరు.. దేశమంటే మనుషులోరు!''.. మహాకవి గురజాడ ప్రవచించిన ఈ సత్యాన్ని మళ్లీ మళ్లీ స్మరించుకోవాల్సిన సందర్భం నేడు నెలకొన్నది. కార్పొరేట్ల సేవలో తరించడానికే మేమున్నా మంటూ తెగేసి చెబుతున్న నేటి పాలకుల కళ్ళు తెరిపించే సత్యమిది. 130 కోట్ల దేశ ప్రజల ప్రయోజనాలను నిలబెట్టడం దేశభక్తి అవుతుందా.. భారత మాతాకీ జై అంటూ నినాదాలిస్తూ, భారతమాత చిత్రపటానికి పూజలు చేస్తూ, ప్రజలకు మేలు చేసే జాతీయ సంస్థలను ప్రయివేటు ఆసాములూ విదేశీ కంపనీల చేతుల్లో పెట్టడం దేశభక్తి అవుతుందా..? - ఈ కీలక ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన అవసరం నేడు మన ముందున్నది.
గత 65 సంవత్సరాలుగా దేశ ప్రజల వ్యక్తిగత ఆర్థికాభివృద్ధికీ, జాతి సమిష్టి ప్రయోజనాలకూ సహకరిస్తూ.. దేశ ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎల్ఐసీని ముక్కలు చేసి, షేర్లుగా మార్చి ప్రయివేటు ఆసాములకు పందేరం వేయడానికి కేంద్ర ప్రభుత్వం చురుకుగా పావులు కదుపుతోంది. దేశంలోని ప్రయివేటు దొరలకే కాకుండా.. విదేశీ కంపెనీలకు సైతం వాటాలు అందజేయడం కోసం తాజాగా చట్ట సవరణకు సైతం మోడీ ప్రభుత్వం పూనుకున్నది. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ చేయడం ఎందుకు..? బ్యాంకుల ప్రయివేటీకరణ ఎందుకు..? బీమా సంస్థల ప్రయివేటీకరణ ఎవరికి లాభం? అని ప్రజలు ప్రశ్నిస్తుంటే.. ''ప్రయివేటీకరణ మా విధానం.. అమలు చేసి తీరుతామని'' ప్రభుత్వ పెద్దలు తెగేసి చెబుతున్నారు. ''విశాఖ ప్రాంత ప్రజలు అక్కడి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. మీరు ప్రయివేటీకరణ పూర్తి చేసి ఎవరైనా ప్రయివేటు ఆసామి చేతుల్లో ప్లాంటును పెట్టినా.. స్థానిక ప్రజలు ఆ ప్రయివేటు ఆసాములను అడ్డుకుంటారు... ప్రజల అభీష్టాన్ని గౌరవించండి'' అంటూ ఒక పార్లమెంటు సభ్యుడు ఈ మధ్య లోక్సభలో ప్రస్తావించాడు. ''ప్రయివేటీకరణ మా విధానం, ప్రజలు ఒప్పుకుని తీరాల్సిందే.. ప్రయివేటీకరణ జరగకపోతే.. ప్రజలు అడ్డుకుంటే.. ప్లాంటునే శాశ్వతంగా మూసేస్తాం!'' ఇదీ సదరు శాఖా మంత్రి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన సమాధానం! మేము ప్రజలకు జవాబుదారీ కాదు.. కార్పొరేట్లకే జవాబుదారీలమంటూ స్పష్టంగా తేల్చేశాడు సదరు దేశభక్త మంత్రివర్యుడు! ఈ ప్రయివేటీకరణ విధానాలను ప్రశ్నించే వీలు లేదా? విశాల దేశ ప్రజల ప్రయోజనాలకు హాని కలిగించే చర్యలకు పార్లమెంటు వేదిక ఎలా కాగలుగుతుంది..? నేడు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన కీలక ప్రశ్నలివి.
బీమారంగంలో 1956 కంటే ముందు సుమారు రెండు శతాబ్దాలుగా ప్రయివేటు కంపెనీలే రాజ్యం చేసేవి. స్వాతంత్య్రం కంటే ముందు.. స్వాతంత్య్రం తర్వాత సైతం.. ప్రయివేటు కంపెనీల దోపిడీ బాగోతాలన్నీ నిర్లజ్జగా, నిరాటంకంగా కొనసాగేవి. సాధారణ, జీవిత బీమాలో మొత్తం 340 ప్రయివేటు బీమా కంపెనీలు వ్యాపారం నడిపేవి. టాటాలు, సింఘానియాలు, బిర్లాలు, గోయెంకాలు, చెట్టియార్లు లాంటి బడా పెట్టుబడిదారుల సంస్థలే ఇవన్నీ. ప్రజల నుండి సేకరించిన సొమ్ముకు ఎలాంటి భద్రత లేకుండా.. క్లెయిముల చెల్లింపులో ఎలాంటి జవాబుదారీ లేని అరాచక వ్యవస్థ కొనసాగేది. రామపకృష్ణ దాల్మియాకు చెందిన కంపెనీ ప్రజల నుండి సేకరించిన రూ.రెండు కోట్లను ఎగవేసినా.. యజమానిపై ఎలాంటి చర్యా తీసుకోలేని పరిస్థితి నాడు నెలకొన్నది. ప్రయివేటు బీమా కంపెనీల కుంభకోణాల వ్యవహారాలన్నీ పత్రికల్లో పెద్ద ఎత్తున రావడంతో.. ప్రజల్లో నెలకొన్న ఆందోళనను గమనించిన నాటి నెహ్రూ ప్రభుత్వం బీమారంగ జాతీయీకరణ కు నిర్ణయం తీసుకున్నది. 1956 జనవరి 19 రాత్రి ఆలిండియా రేడియోలో జాతినుద్దేశించి ప్రసంగించిన ఆర్థికమంత్రి సి.డి. దేశ్ ముఖ్.. జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయీకరిస్తున్నామని, ప్రయివేటు బీమా కంపెనీలను రద్దుచేసి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నామని ప్రకటించారు. తదనుగుణంగా.. ''జీవిత బీమా జాతీయీకరణ ఆర్డినెన్స్''ను సైతం హుటాహుటిన జారీ చేశారు. అదేరోజు అర్థరాత్రికల్లా ప్రభుత్వం నియమించిన కస్టోడియన్లు.. దేశంలోని అన్ని ప్రయివేటు కంపెనీల భవనాలను, ఆస్తులను స్వాధీనపర్చుకున్నారు. జూన్ 18, 1956న బీమా రంగ జాతీయీకరణ బిల్లును నెహ్రూ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నది. 1956 సెప్టెంబరు 1న ప్రభుత్వం తరఫున బీమా వ్యాపారం నిర్వహించడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది.
ప్రయివేటు కంపెనీల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలంటూ.. పెట్టుబడి దారుల విశ్వాసం నిలబెట్టుకోవాలంటూ.. నేటి కాలంలోని ప్రభుత్వాలు అడుగడుగునా తారకమంత్రంలా వల్లెవేయడం మనం చూస్తున్నాం. దానికి భిన్నంగా.. నాటి నెహ్రూ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే ముఖ్యమని భావించింది కాబట్టే ప్రయివేటు కంపెనీలకు వ్యతిరేకంగా తీవ్ర చర్య తీసుకుని.. వారి చేతుల్లోని వ్యాపారాన్ని ప్రభుత్వ పరం చేయగలిగింది. ప్రజల ఆకాంక్షల మేరకు ఉనికిలోకి వచ్చిన ఎల్ఐసీ సంస్థ సైతం.. తనపై ప్రజలు, ప్రభుత్వము ఉంచిన విశ్వాసాన్ని ప్రతి సంవత్సరం సమర్థవంతమైన సేవలు అందిం చడం ద్వారా నెరవేరుస్తూ వస్తున్నది. దానికితోడు ప్రజల నుండి సేకరించిన సొమ్మును ప్రభుత్వాలు చేయతలపెట్టిన సంక్షేమ పథకాలకు అందించి.. జాతి నిర్మాణంలో భాగస్వామిగా నిలిచింది.
నాటి ప్రభుత్వం అవలం బించిన జాతీయీకరణ విధానాల కారణంగా ప్రయివేటు ఆసాముల చేతుల్లోనుండి బీమా రంగం ప్రభుత్వ ఆధీనంలోకి మారి.. ఎల్ఐసీ రూపంలో నేడు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నది. ప్రతి ఏడాదీ ప్రభుత్వపెద్దలు పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలు అమలుపరచడానికి కావలసిన నిధులను అందిస్తున్న ప్రధాన వనరుగా ఎల్ఐసీ నిలిచి ఉన్నది. అలాంటి కీలక సంస్థను నేడు ఐపీఓ పేరుతో, షేర్ల అమ్మకం ద్వారా ప్రయివేటు వాళ్ళ చేతుల్లో పెట్టడానికి గల కారణాలు ఏమిటో నేటి ప్రభుత్వ పెద్దలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. బంగారు గుడ్లు అందించే బాతు లాంటి ప్రభుత్వరంగ సంస్థలను నేడు ప్రయివేటు వాళ్ళకి అప్పజెబితే.. రేపు ప్రజా సంక్షేమ పథకాలకు నిధులు ఎవరు అందిస్తారు? ప్రయివేట్ ఆసాముల ఎస్టేటుల ముందు చిప్ప పట్టుకుని దేశ ప్రజలు, ప్రభుత్వ పెద్దలు నిలవాలా? వారి దయా దాక్షిణ్యాల మీద ప్రజా సంక్షేమ పథకాలు మనగలిగే పరిస్థితి నెలకొంటే దేశ ప్రజల ప్రయోజనాలకు అది భంగకరం కాదా? ప్రభుత్వ పెద్దలు అనునిత్యం వల్లె వేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ అంటే అర్థం ఇదేనా? స్వదేశీ నినాదం ఇస్తూ.. ''మై దేశ్ బిక్నే నహీ దూంగా..'' అనే మాటలతో ఎన్నికల ముందు ప్రజలను ఆకర్షించి.. నేడు విదేశీ ప్రయి వేటు కంపెనీల చేతుల్లో దేశీయ ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టడం ఏ తరహా దేశభక్తి అవుతుంది?
2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముంచెత్తినప్పుడు.. ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలు పేకమేడల్లా కుప్పకూలి, ఆయాదేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే సదరు ఆర్థిక సంక్షోభం భారతీయ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపలేదు. అలా జరగకపోవడానికి ప్రధాన కారణం దేశంలోని ఆర్థిక వ్యవస్థలో పబ్లిక్ రంగ సంస్థలు కీలక స్థానాల్లో ఉండడమేనని నాడు ఆర్థిక వేత్తలందరూ నిర్ధారించారు. మరి అలాంటి ఆసరాను ఈ పేద దేశపు ప్రజలకు దక్కకుండా చేయడం.. ప్రజల చేతుల్లోని సంపదను బలవంతంగా లాక్కుని ప్రయివేటు ఆసాముల పరం చేయడంలో.. నేటి పాలకుల ఉద్దేశం ఏమిటి? ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. తమ ప్రయోజనాల రక్షణ కోసం ప్రజలు చైతన్యవంతులై పాలకులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది.
(జనవరి 19, బీమా జాతీయీకరణ దినోత్సవం సందర్భంగా..)
- ఆర్. రాజేశమ్