Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాటిన్ అమెరికాలో అతి పెద్ద దేశం బ్రెజిల్. ప్రస్తుతం వెలువడుతున్న సర్వేలన్నీ ఈ ఏడాది అక్టోబరు రెండవ తేదీన జరిగే ఎన్నికల్లో వామపక్ష నేత, మాజీ అధ్యక్షుడు లూలా డిసిల్వా విజయం సాధించనున్నారనే చెబుతున్నాయి. మరోవైపున ఫాసిస్టు శక్తిగా ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు బోల్సనారో ప్రజాభిప్రాయాన్ని వమ్ము చేసేందుకు ఈ నేపథ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగవని, ఫలితాలను తాను అంగీకరించనని, ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ తాజాగా ధ్వజమెత్తాడు. ఎన్నికల ఫలితాల తరువాత ఓటమి పాలైన డోనాల్డ్ ట్రంప్ తన మద్దతుదార్లను అమెరికా పార్లమెంట్‌పై దాడికి ఉసిగొల్పిన దురాగతం గురించి తెలిసినదే. బ్రెజిల్లో కూడా అలాంటిదే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అవినీతి అక్రమాలను, నేరాలను అరికడతానన్న వాగ్దానాలతో అధికారానికి వచ్చిన తరువాత నిరంకుశంగా వ్యవహరిస్తూ అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. బోల్సనారో కుట్రకు మిలిటరీ సహక రిస్తుందా? వమ్ము చేస్తుందా అన్నది ఉత్కంఠరేపుతున్న అంశం.
లూలా మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని ఇద్దరు న్యాయమూర్తులు కోరుకుంటున్నారని బోల్సనారో అన్నాడు. నాకు ఓట్లు వేయద్దనుకుంటున్నారు పోనీయండి, ఎనిమిదేండ్ల పాటు దేశాన్ని దోచుకున్న వ్యక్తి రావాలని కోరుకోవటం ఏమిటంటూ లూలాను ఉద్దేశించి అన్నాడు. 2003 నుంచి 2010వరకు అధికారంలో ఉన్న లూలాపై తప్పుడు అవినీతి ఆరోపణలతో కేసులు పెట్టిన అంశం తెలిసిందే. కొంత కాలం పాటు జైల్లో ఉంచిన తరువాత కేసును కొట్టివేశారు. తొలి దఫా ఎన్నికల్లోనే లూలాకు 54, బోల్సనారోకు 30శాతం ఓట్లు వస్తాయని ఒక సర్వే, 45-23శాతం వస్తాయని మరో తాజా సర్వే పేర్కొన్నది. ఏ సర్వేను చూసినా ఇద్దరి మధ్య ఇరవైశాతానికి మించి తేడా ఉంటోంది. అక్కడి నిబంధనల ప్రకారం పోలైన ఓట్లలో 50శాతం పైగా వస్తేనే ఎన్నికవుతారు. లేనట్లయితే అక్టోబర్ 30న తొలి ఇద్దరి మధ్య తుది పోటీ జరుగుతుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో రిగ్గింగు జరిపి తనను ఓడించేందుకు చూస్తున్నారని, ఫలితాలను తాను అంగీకరించేది లేదని బోల్సనారో ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకంటూ అనుసరించిన వాక్సిన్లు, లాక్డౌన్ విధానాల వలన కరోనా కేసులు, మరణాలు కూడా ఎక్కువగా సంభవించాయి. స్ధానిక తెగలు, ఆఫ్రో-బ్రెజిలియన్ సామాజిక తరగతుల్లో వైరస్ బాధితులు ఎక్కువ మంది ఉన్నారు.
దేశంలో ద్రవ్యోల్బణం పదిశాతం దాటింది, ధరల పెరుగుదలను అదుపు చేయటంలో బోల్సనారో విఫలమైనట్లు ఒక సర్వేలో 73శాతం మంది చెప్పారు. అమెజాన్ అడవులను వాణిజ్య అవసరాలకు అప్పగించేందుకు సుముఖత చూపటాన్ని కూడా ఇంటా బయటా వ్యతిరేకించారు. 2019 జనవరిలో అధికారానికి వచ్చిన బోల్సనారో దేశ మిలిటరీ నియంతలను పొగడటంతో పాటు, మహిళలు, ఎల్‌బిజిటిక్యు జనాలమీద నోరుపారవేసుకున్నాడు. ఎన్నికల ఫలితాలను అంగీకరించేది లేదంటూ బోల్సనారో చేసిన బెదిరింపుల తరువాత వచ్చిన వార్తల మీద పరిపరి విధాల ఆలోచనలు సాగుతున్నాయి. మిలిటరీ అప్రమత్తమై 2021జనవరి ఆరవ తేదీన అమెరికా పార్లమెంటుపై మాదిరి దాడి జరిగితే నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని కొన్ని అనధికారిక వార్తలు వెలువడుతున్నాయి. వివిధ కార్యక్రమాలతో రూపొందించిన కాలెండర్ను ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని విభాగాలను కోరినట్లు, ఒక వేళ అమెరికా మాదిరి పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు మొత్తం మిలిటరీని సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడినపుడు చెబుతున్నారు. పార్లమెంటు మీద దాడికి దిగిన వారిని అదుపు చేసేందుకు మొత్తం మిలిటరీ సన్నద్ధంగా ఉండాలని చెప్పటమెందుకు అన్నది ఒక ప్రశ్న. ఒక వేల బోల్సనారో తనకు అనుకూలమైన మిలిటరీ అధికారులతో కలసి తిరుగుబాటు చేస్తే సమర్థవంతంగా తిప్పికొట్టేందుకే ఈ పిలుపు అని ఒక భాష్యం చెబుతుండగా ఆ పేరుతో బోల్సనారోకు మద్దతు ఇచ్చేందుకు కూడా కావచ్చని కొందరు అంటున్నారు. ఏదైనా జరిగేందుకు అవకాశం ఉంది. దేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి బోల్సనారో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఒక పోలీసు నివేదిక పేర్కొన్నది. ఫెడరల్ పోలీసు కమిషనరే ఈ నివేదికను రూపొందించారు. 2018 ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో అక్రమాలు చోటు చేసుకోనట్లైతే తొలి దఫాలోనే తాను గెలిచి ఉండేవాడినని బోల్సనారో చెప్పటం ఎన్నికల వ్యవస్దను కించపరచటమే అని నివేదికలో పేర్కొన్నారు.
రాజ్యాంగం ప్రకారం తేదీలు ముందే నిర్ణయం జరిగినప్పటికీ ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. అయినా ఫలితాలను తాను అంగీకరించేది లేదని బోల్సనారో చెప్పటం ఫాసిస్టు ధోరణి తప్ప మరొకటి కాదు. ఎన్నికల్లో బాలెట్ పత్రాలు లేకపోతే అమెరికా మాదిరి ఎన్నికల అక్రమాలు జరుగుతాయని బోల్సనారో అన్నాడు. అమెరికాలో బాలెట్ పత్రాలనే ఉపయోగించినప్పటికీ అక్రమాలు జరిగాయని ఆరోపించిన ట్రంప్‌కు ఇతగాడు ఏడాది క్రితం మద్దతు పలికాడు. గతేడాది మార్చినెలలో దేశ చరిత్రలో అసాధారణంగా రక్షణ మంత్రిని, సాయుధ దళాధిపతులందరినీ మార్చి వేశాడు, మిలిటరీ తనకు లోబడి ఉండాలని ప్రకటించాడు. దీన్ని చూస్తే 1964నాటి అమెరికా మద్దతు ఉన్న కుట్ర అనంతరం రెండు దశాబ్దాల పాటు సాగిన మిలిటరీ పాలన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. అంతేకాదు అవినీతిపై పార్లమెంటరీ కమిటీ విచారణ పేరుతో జరుపుతున్న తతంగం ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు మిలిటరీ కమాండర్లకూ వర్తింప చేస్తున్నట్లు ప్రకటించాడు. పౌర విచారణ కమిటీ తమపై విచారణ జరపటం ఏమిటని వారు నిరసన తెలిపారు. విచారణ సమయంలో దానికి మద్దతు పేరుతో మితవాద పార్టీలతో ప్రదర్శనలు చేయించటం, అలాంటి ఒక ప్రదర్శనలో మిలిటరీ అధికారి ఒకరు పాల్గొనటం, తన అరెస్టు అక్రమం అని చెప్పటం ప్రమాదకర సూచనలను వెల్లడించాయి. బాలెట్ పత్రాలను ముద్రించాలన్న తన ప్రతిపాదనకు పార్లమెంటు ఆమోదం తెలపనట్లయితే ఎన్నికలను అడ్డుకుంటానని బోల్సనారో బెదిరించాడు. దీనికి మిలిటరీ మద్దతు తెలిపింది, పార్లమెంటులో చర్చ సమయంలో రాజధానిలో టాంకులతో ప్రదర్శన జరపాలన్న అతగాడి కోరికను మన్నించి మిలిటరీ ఆపని చేసింది. అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లేకుండానే బాలెట్ పత్రాల ముద్రణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. తరువాత సెప్టెంబరు ఏడున తనను పదవీచ్యుతుడిని కావించేందుకు సుప్రీం కోర్టు పన్నిన కుట్రకు వ్యతిరేకంగా దేశమంతటా ప్రదర్శనలు జరపాలని బోల్సనారో పిలుపునిచ్చాడు. మిలిటరీ జోక్యం చేసుకోవాలని ఆ ప్రదర్శనల్లో బానర్లను ప్రదర్శించారు. ఇవన్నీ తిరుగుబాటు సన్నాహాలే అని కొందరు భావిస్తున్నారు. ఈ చర్యలకు మీడియా పూర్తిగా మద్దతు ఇస్తున్నది. బోల్సనారో పిచ్చిపనులు, మిలిటరీ తీరు తెన్నులపై ఇంతవరకు వామపక్ష వర్కర్స్ పార్టీ (పిటి) బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నికలకు సన్నాహాలతో పాటు కుట్రలను తిప్పికొట్టేందుకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే ఆలోచనలతో ఉంది.
ఈ ఏడాది బ్రెజిల్‌తో పాటు కొలంబియా, కోస్టారికాలో కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. చిలీలో నూతన రాజ్యాంగ ఆమోదం, అమెరికాలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఆరున కోస్టారికాలో సాధారణ ఎన్నికలు, అవసరమైతే ఏప్రిల్ 3న అధ్యక్షపదవికి తుది ఎన్నిక, మార్చి 13న కొలంబియా పార్లమెంట్, మే 29నతొలి విడత అధ్యక్ష ఎన్నికలు, అవసరమైతే తుది విడత జూన్ 19, అమెరికా పార్లమెంటు ఎన్నికలు నవంబరు 8న జరుగుతాయి. బ్రెజిల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు, 81స్థానాల ఎగువ సభలో 27స్థానాలు, దిగువ సభలోని 513డిప్యూటీలు, 26రాష్ట్రాల, ఒక ఫెడరల్ జిల్లా గవర్నర్ పదవులకు ఎన్నికలు అక్టోబరు రెండున జరుగుతాయి. ఎగువ సభ సెనెటర్లు ఎనిమిది సంవత్సరాలు, దిగువసభ డిప్యూటీలు నాలుగు సంవత్సరాలు పదవిలో ఉంటారు. అధ్యక్ష పదవికి లూలా, బోల్సనారోతో సహా పన్నెండు మందని, ఐదుగురు పోటీలో ఉంటారని వార్తలు వచ్చాయి.
కొలంబియాలో ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న ఇవాన్ డూక్‌పై డిసెంబరులో జరిగిన సర్వేలో 80శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరిగి గెలిచే అవకాశాలు లేవు. మాజీ గెరిల్లా, గత ఎన్నికల్లో రెండవ స్థానంలో వచ్చిన వామపక్షనేత గుస్తావ్ పెట్రో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అధ్యక్షపదవిని పొందేవారు 50శాతం పైగా ఓట్లు తెచ్చుకోవాలి. తొలి దఫా సాధించలేకపోతే తొలి ఇద్దరి మధ్య రెండవ సారి పోటీ జరుగుతుంది. కోస్టారికాలో తొలి రౌండ్లో ఒకరు 40శాతంపైగా ఓట్లు తెచ్చుకొన్నపుడు మరొకరెవరూ దరిదాపుల్లో లేకపోతే అధికారం చేపట్టవచ్చు. ఇద్దరు గనుక 40శాతంపైన తెచ్చుకుంటే వారి మధ్య తుది పోటీ జరుగుతుంది. మితవాద పార్టీలే ప్రధాన పోటీదార్లుగా ఉన్నాయి. అమెరికాలోని ప్రజాప్రతినిధుల సభ(కాంగ్రెస్) మొత్తం 435స్థానాలకు, సెనెట్‌లోని వందకు గాను 34, 39 రాష్ట్ర గవర్నర్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. పెరూలో అక్టోబరు నెలలో స్ధానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. లాటిన్ అమెరికాలో వామపక్ష తరంగాలను ఆపేందుకు అమెరికా, దానితో చేతులు కలుపుతున్న మితవాద, కార్పొరేట్ శక్తులు చేయని ప్రయత్నం లేదు. గతంలో మిలిటరీ నియంతలను ప్రోత్సహించిన అమెరికా లాభ నష్టాలను బేరీజు వేసుకున్నపుడు నష్టమే ఎక్కువగా జరిగినట్లు గ్రహించి పద్ధతి మార్చుకుంది. ఎన్నికైన వామపక్ష శక్తులను ఇబ్బందులకు గురించి చేసి దెబ్బతీయటం ద్వారా జనం నుంచి దూరం చేయాలని చూస్తోంది. అలాంటి చోట్ల అధికారానికి వచ్చిన మితవాద శక్తులు తదుపరి ఎన్నికల్లో జనం చేతిలో మట్టి కరుస్తున్నారు. బ్రెజిల్లో కూడా అదే పునరావృతం కానుందన్న వార్తల నేపథ్యంలో అమెరికా ఎలాంటి పాత్ర వహిస్తుందో చూడాల్సిందే!
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288