Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒమిక్రాన్ ప్రమాదం గురించి ముచ్చటించారు. తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలను హెచ్చరించారు. కరోనా మూడో వేవ్ గనుక వస్తే (ఇప్పటికే వచ్చేసింది) అన్ని విధాలా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని, అన్ని ఏర్పాట్లూ చేసేశామని చెప్పుకున్నారు. అంతా సజావుగా ఉంది అన్న భావన కలిగించే ప్రయత్నం చేశారు. కాని కరోనా వైరస్ గురించి, దానిని నియంత్రించే మార్గాల గురించి లోతుగా విషయాలు తెలిసిన శాస్త్రవేత్తలు అడుగుతున్న పలు ప్రశ్నలకు సమాధానాలు ప్రభుత్వం నుండి రావడం లేదు.
ఈ కరోనా వైరస్ గురించి, అది ఎప్పటికప్పుడు ఎత్తుతున్న కొత్త అవతారాల గురించి ప్రపంచం తెలుసుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు దానిని నియంత్రించడానికి ఉపయోగిస్తున్న వ్యాక్సిన్ల ప్రభావం గురించి గాని, కరోనా సోకితే నయం చేయడానికి వాడుతున్న ఔషధాల గురించి గాని మనకు పూర్తిగా తెలియదు. మహమ్మారి ఒక్కసారిగా విరుచుకుపడిన తర్వాత దానిని నిరోధించడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలో, ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో అన్నీ సమాజం చేస్తోంది. అంతే తప్ప ఈ కరోనా వైరస్‌ను జయించేశాం అని చెప్పుకోగలిగిన పరిస్థితికి మనం చాలా దూరంగా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సమాచారాన్ని, వివిధ పరిశోధనల, ప్రయోగాల అనుభవాలని ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉండాలి. కేవలం కొద్దిమంది శాస్త్రవేత్తల మధ్యనో, ఉన్నతాధికారుల మధ్యనో ఈ సమాచారం ఉండిపోతే ఉపయోగంలేదు. పారదర్శకంగా మొత్తం ప్రజానీకానికంతటికీ తెలియాలి. అయితే మోడీ ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత గోప్యంగా వ్యవహరిస్తోంది.
అందరికీ వ్యాక్సిన్లు
ఇప్పటి వరకూ 18 ఏండ్ల వయస్సుకు పైబడినవారిలో 62.5శాతం మందికి రెండు డోసులు ఇచ్చారు. ఇంకో 25శాతం మందికి ఒక డోసు అందింది. ఇంకా వ్యాక్సిన్ అందవలసినవారు 50కోట్ల మంది ఉన్నారు. అంటే 100కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం. ప్రస్తుతం రోజుకు 85లక్షల డోసులు అత్యధికంగాను, 40లక్షల డోసులు కనిష్టంగాను ఇస్తున్నారు. ఈ లెక్కన అందరికీ వ్యాక్సిన్లు రెండు డోసుల చొప్పున అందడానికి ఇంకా అయిదారు మాసాలు పడుతుంది.
ఇది కాక బూస్టర్ డోసులు అందరికీ ఇవ్వాల్సి ఉంది. దేశ జనాభా మొత్తానికి బూస్టర్ డోసులు తలా ఒకటి చొప్పున ఇవ్వాలన్నా 140కోట్ల డోసులు కావాలి. దానికి ఇంకెంత కాలం పడుతుంది? ప్రభుత్వం దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. వారి కార్యాచరణ ప్రణాళిక ఏమిటన్నది తెలియడం లేదు. ఇప్పుడు దేశంలో ప్రజలకు అందుతున్న వ్యాక్సిన్లలో 90శాతం కోవి షీల్డ్, 10శాతం కోవ్యాక్సిన్ ఉన్నాయి. కోవి షీల్డ్‌ను సీరం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, కోవ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంకా రెండువందల కోట్ల డోసులకు పైగా వ్యాక్సిన్ల అవసరం ఉన్నా, కోవి షీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ తన ఉత్పత్తిని 50శాతానికి డిసెంబరు 2021 తర్వాత తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం నుండి తగినన్ని ఆర్డర్లు లేనందువల్లనే ఈ విధంగా తగ్గిస్తున్నట్టు తెలిపింది. వ్యాక్సిన్ అవసరం ఇంత స్పష్టంగా, ఇంత ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు ప్రభుత్వం ఆర్డర్లు ఎందుకు పెట్టడం లేదు?
మన దేశంలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యం గల సంస్థలు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో సుమారు 50 దాకా ఉన్నాయి. ఇంతవరకూ సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్‌లకు తప్ప తక్కినవాటికి వ్యాక్సిన్ ఉత్పత్తికి కావలసిన టెక్నాలజీని కాని, ఆర్డర్లు కాని మోడీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు?
''ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని'' అని పేరున్న మన దేశంలో ఒక పూర్తి సంవత్సరం గడిచిపోయినా, ఇంకా వందల కోట్ల డోసుల వ్యాక్సిన్ కొరత కొనసాగడానికి కారణం ఏమిటి? వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ప్రభుత్వం తరుచూ చేసే ప్రకటనలు వొట్టి బూటకమేనా? ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలకు ఇంతవరకూ ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వకపోడానికి కారణమేమిటి? తమ ఆశ్రిత ప్రయివేటు కంపెనీల లాభాల కోసమేనా?
ఒకవైపు 18ఏండ్లు దాటిన వారిలో ఇంకా వ్యాక్సిన్లు 37.5శాతం మందికి అందనప్పుడు 15-17 సంవత్పరాల వయస్కులకు కూడా వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించారు. దీని ఔచిత్యమేమిటి? 18ఏండ్లు పైబడిన వారికందరికీ వ్యాక్సిన్లు వేయడం పూర్తైందన్న తప్పుడు అభిప్రాయాన్ని జనాలకి కలిగించడానికేనా?
బూస్టర్ డోసులు
రెండోడోసు వ్యాక్సిన్ తీసుకున్నాక ఎంత వ్యవధి అనంతరం మూడవ డోసు, లేదా బూస్టర్ డోసు తీసుకోవాలి ?
బ్రిటన్‌లో మూడు మాసాల గడువు తర్వాత బూస్టర్ డోసు ఇస్తున్నారు. అమెరికాలో ఆరు మాసాల తర్వాత ఇస్తున్నారు. మన ప్రభుత్వం మాత్రం 39 వారాలు, లేదా 9 మాసాల గడువు ఉండాలని నిర్ణయించింది. అది కూడా కేవలం 60ఏండ్లు పైబడినవారికే ఇస్తున్నారు. ఇంత ఎక్కువ వ్యవధి మన దేశంలో ఎందుకు విధించారు? దీర్ఘకాలం తర్వాత తీసుకునే మూడో డోసు వలన ప్రయోజనం ఉంటుందా?
ఉత్పత్తి అయిన ఆరు మాసాలలోపే కోవ్యాక్సిన్‌ను ఉపయోగించాలని ముందు ప్రకటించారు. కాని ఇప్పుడు దాని ఎక్స్పైరీ డేటును ఏడాదికి పొడిగించారు. దీనికి కారణమేమిటి? గతంలో పూర్తి స్థాయిలో ప్రయోగాలు జరగకమునుపే కోవ్యాక్సిన్‌కు అనుమతులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇలా దాని జీవిత కాలాన్ని ఆరు నెలలనుండి ఏడాదికి పొడిగించారు.
భారత్ బయోటెక్ పట్ల ఈ అసాధారణ సానుకూలత వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి ? వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు కరోనాను నిరోధించడంలో ఎంతవరకూ తోడ్పడతాయి ?
ఇప్పటివరకూ ఉన్న అనుభవాలను బట్టి వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు కరోనా సోకకుండా ఆపలేవు అని తేలింది. అయితే కరోనా సోకినా, ప్రమాదకర స్థాయికి రోగి చేరకుండా, ఆస్పత్రుల పాలవకుండా వ్యాక్సిన్ ఉపయోగపడుతోంది. మరణాల రేటును తగ్గించడానికి ఉపయోగపడుతోంది.
ఒకపక్క కరోనా వైరస్ త్వరితంగా తన లక్షణాలను మార్చుకుంటూ కొత్త అవతారాలతో దాడి చేస్తున్నప్పుడు ఏడాదిన్నర క్రితం కనుగొన్న వ్యాక్సిన్లు కొంతవరకూ మన రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయే తప్ప కరోనాను అడ్డుకోలేవు. అమెరికా, బ్రిటన్ ఇతర యూరోపియన్ దేశాలు తమ ప్రజలకు వ్యాక్సిన్లను అందించడమే గాక మూడవ, నాలుగవ బూస్టర్ డోసులను కూడా అందించాయి. అయినప్పటికీ, బ్రిటన్‌లో రోజూ 1,50,000 కేసులు, ఫ్రాన్స్‌లో 3,50,000 కేసులు, అమెరికాలో 8,50,000 కేసులు వస్తూనే ఉన్నాయి. బూస్టర్ డోసులను అందించడంలో తక్కిన దేశాలన్నింటికన్నా ముందుంది ఇజ్రాయిల్. ఆ చిన్న దేశంలో రోజూ 50,000 పైబడి కేసులు వస్తున్నాయి. ఇంకోపక్క ఆఫ్రికా ఖండంలో 85 శాతం జనాభాకి ఇంతవరకూ ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా అందలేదు.
ఈ వివరాలను బట్టి కరోనా మహమ్మారి రెండు, మూడు వారాలకో కొత్త అవతారం ఎత్తుతూ (మ్యుటేషన్ ద్వారా), కొత్త కొత్త లక్షణాలతో దాడి చేస్తూంటే మనం ఇంకా దానిని అంతం చేయడమెలాగో బోధపడని స్థితిలో ఉన్నాం.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశం అన్ని విధాలా కరోనా ముప్పును ఎదుర్కోడానికి సర్వ సన్నద్ధంగా ఉంది అన్న భరోసా ప్రధాని ఇవ్వడం బాధ్యతా రాహిత్యం కాదా?
కరోనా సోకిన తర్వాత వాడే ఔషధాల గురించి ...
ఈ మధ్య 'మెర్క్' అనే అమెరికన్ బహుళజాతి ఔషధ కంపెనీ మార్కెట్లోకి 'మాల్న్యుపిరవర్' అనే ఔషధాన్ని విడుదల చేసింది. కరోనా సోకినవారికి ఈ ఔషధం నయం చేస్తుందని ప్రకటించింది. ఈ ఔషధం పట్ల అనేక అనుమానాలు, సందేహాలు అమెరికన్ శాస్త్రవేత్తలలో సైతం ఉన్నాయి. ఈ ఔషధం శరీరంలోని ఆరోగ్యకరమైన జీవకణాలను ప్రభావితం చేసి క్యాన్సర్ కణాలు పెరగడానికి దోహదం చేస్తుందన్నది ప్రధానమైన అనుమానం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి (ఐసిఎంఆర్) ఈ ఔషధ వినియోగానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. కాని ఇంతవరకూ ప్రభుత్వం ఈ ఔషధం విషయంలో మౌనం వహిస్తోంది. ఇంకోపక్క కేంద్ర డ్రగ్ కంట్రోలర్ సంస్థ (సిడిఎస్వో) ఈ 'మాల్న్యుపిరవర్' ఔషధాన్ని మన దేశంలో అమ్మడానికి అనుమతులిచ్చేసింది! అమెరికన్ బహుళజాతి సంస్థ ప్రచారాలకు, ప్రలోభాలకు లొంగి మన కార్పొరేట్ ఆస్పత్రులు ఈ ఔషధం వాడకాన్ని చేపడితే చివరికి బలి అయిపోయేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఈ ఔషధం విషయంలో ఎందుకు చేతులు ముడుచుకుని కూచుంది?
మొదటి వేవ్ వచ్చినప్పుడు చప్పట్లతో, అరుపులతో, దీపాలతో, శంఖాలూదడంతో కరోనాను వెళ్ళగొట్టమన్నారు.
రెండో వేవ్ వచ్చినప్పుడు ఆవు ఉచ్చ తాగమని, ఆవు పేడ వంటికి రాసుకోమని, గంగా పుష్కరాల్లో పాల్గొనమని చెప్పారు.
ఈ రెండు విడతల్లో మరణించి నవారి లెక్కలు సైతం ఇప్పటిదాకా తేల్చలేకపోయారు. గంగానది తీరంలో కప్పెట్టిన శవాలే మోడీ ప్రభుత్వ వైఫల్యానికి, బాధ్యతా రాహిత్యానికి సాక్ష్యం.
ఇప్పుడు మూడో వేవ్ ముంచుకొస్తూంటే నిమ్మకు నీరెత్తినట్టు, అంతా బాగానే ఉందన్నట్టు, వ్యాక్సినేషన్ ప్రక్రియ బ్రహ్మాండంగా సాగుతున్నట్టు ప్రకటనలిస్తున్నారు. ఈ బాధ్యతా రాహిత్యం సహించరానిది. వాస్తవ పరిస్థితి ఏమిటో పూర్తి వివరాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. ఆ వివరాలను వెల్లడి చేయాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వానికి ఉంది. ఆ పని ప్రభుత్వం చేయకపోతే, సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి.
- ఎం.వి.ఎస్. శర్మ