Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటలీ కమ్యూనిస్టు పార్టీ నాయకుడైన గ్రాంసీ గొప్ప మార్క్సిస్టు మేధావి, రచయిత, జర్నలిస్టు. ఫాసిస్టు ముస్సోలినీ జైలులో చివరి 11ఏండ్లు దుర్భరమైన జీవితం గడిపిన గ్రాంసీ 1937లో 46ఏండ్ల ప్రాయంలో జైలులోనే మరణించాడు. జైలులో ఉండగా ఆయన దాదాపు 3,000 పేజీల రచనలు, 32 నోట్బుక్లు రాసి రహస్యంగా జైలు బయటికి పంపించాడు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత వాటిని ఇటలీ భాషలో ప్రచురించారు. 1970లో గానీ అవి ఇంగ్లీషులో ప్రచురించబడలేదు. ఇతర భాషల్లో ముఖ్యంగా తెలుగులో ఆయన రచనలు తక్కువగానే వచ్చాయి.
పెట్టుబడిదారీ వ్యవస్థ పాతుకుపోయిన కొత్త పరిస్థితుల్లో విప్లవపోరాటం ఎలా నడపాలో గ్రాంసీ ప్రధానంగా వివరించాడు. 20వ శతాబ్దపు పశ్చిమ ఐరోపా సమాజంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను విశ్లేషించిన మొట్టమొదటి మార్క్సిస్టు సిద్ధాంత వేత్త ఆయన. బూర్జువా విలువలకు వ్యతిరేకంగా అంటే సైద్ధాంతిక-సాంస్కృతిక రంగంలో పోరాటాల ప్రాధాన్యతను వివరించాడు. ఈ రోజు ప్రపంచ రాజకీయాలు మితవాదం వైపు పయనిస్తున్న తరుణంలో మితవాద దాడిని ఎదుర్కొని, రాజకీయాలను ప్రత్యామ్నాయ మార్గం పట్టించాల్సిన బాధ్యత కార్మికవర్గం మీద ఉన్నది. ఈ కర్తవ్య నిర్వహణలో కార్మికవర్గానికి ఆంటోనియో గ్రాంసీ రచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆయన రచనలను స్థూలంగా నాలుగు భాగాలుగా వివరించవచ్చు. మొదటిది, ఆర్థికవాదం (ఎకనామిజం), లేక నియతివాదం (డిటర్మినిజం) మీద కార్మికవర్గ పోరాటం. రెండవది, మొత్తం సమాజం మీద కార్మికవర్గం ఆధిపత్యం (హెజిమోనీ) సాధించడం. మూడవది, కార్మికవర్గం సమాజం మీద ఆధిపత్యం (హెజిమోనీ) సాధించేందుకు ఉన్న సాధనాలు. నాల్గవది, కార్మికవర్గాన్ని ఎడ్యుకేట్ చేయడం.
ఆర్థికవాదం (ఎకనామిజం)
మార్క్స్-ఏంగెల్స్ సాంస్కృతిక, సైద్ధాంతిక అంశాలను వివరించేటప్పుడు సమాజాన్ని పునాది, ఉపరితలం అనే భాగాలుగా విభజించి వర్ణించారు. ఏ సమాజ నిర్మాణంలోనైనా రెండు భాగాలుంటాయి. ఒకటి పునాది. రెండవది ఉపరితలం. ఒకానొక సమాజంలోని ఉత్పత్తి శక్తులూ, ఉత్పత్తి జరిగేటప్పుడు వాటి మధ్య ఏర్పడే సంబంధాలు అంటే ఆర్థిక సంబంధాలు సమాజపు పునాదిగా ఉంటాయి. ఈ పునాదిపై ఆధారపడిన ఉపరితలంలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలు అంటే రాజ్యాంగ యంత్రం, మతం, సంప్రదాయాలు, సంస్కృతి, కళలు వగైరాలు ఉంటాయి. పునాదికీ, ఉపరితలానికీ మధ్య గతితార్కిక సంబంధం ఉంటుందనీ, వర్గపోరాటం పునాదిలో తెచ్చే మార్పులు అంతిమంగా ఆ సమాజ గమనానికి కారణమవుతాయని మార్క్-ఏంగెల్స్ చెప్పారు.
అయితే, దీన్ని కొందరు మార్క్సిస్టులు యాంత్రికంగా తీసుకుని సమాజ పురోగమనంలో పునాదే, అంటే ఆర్థిక సంబంధాలే ప్రధానం, ఉపరితలంలోని అంశాలన్నీ దానిపై ఆధారపడి నడుస్తాయని చెప్పడం ప్రారంభించారు. అంటే పునాదిలో మార్పులు జరిగితే ఉపరితలంలోని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక విషయాలు వాటంతటవే మారుతాయని భావించారు. అంటే సామాజిక మార్పును వారు 'ఆర్థికవాదం' కిందకు కుదించేశారు.
గ్రాంసీ ఈ ఆర్థిక వాదాన్ని తీవ్రంగా విమర్శించాడు. ఈ ఆర్థికవాదాన్ని పుణికిపుచ్చుకున్నవారు సామాజిక పరివర్తన గురించి చెప్పేటప్పుడు కేవలం ఆర్థిక పునాది మీద కేంద్రీకరిస్తారు. సామాజిక మార్పుకు దోహదం చేసే ఇతర అంశాలు అంటే ఉపరితలంలో ఉండే సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలను విస్మరిస్తారు అని గ్రాంసీ పేర్కొన్నాడు. నిజానికి మార్క్స్ ఏంగెల్స్ కూడా ఉపరితలంలోని చైతన్యానికి సంబంధించిన అంశాల ప్రాధాన్యతను ఏనాడూ తక్కువ అంచనా వేయలేదు. మార్క్స్ మరణించిన తరువాత ఏంగెల్స్ 1890 సెప్టెంబర్‌లో జె. బ్లాక్‌కు రాసిన లేఖలో ఈ విషయాలను వివరించాడు.
అయితే పశ్చిమదేశాల్లో స్థిరపడిపోయిన పెట్టుబడిదారీ వ్యవస్థ తన వర్గాధిపత్యాన్ని మొత్తం సమాజం మీద చెలాయించడానికి ఈ ఉపరితలాంశాలను ఎలా ఉపయోగించుకుంటున్నదో లెనిన్ తరువాతి నాయకత్వం గ్రహించలేకపోయింది. దీని గురించి గ్రాంసీ ప్రతిభావంతంగా వివరించాడు.
ఆధిపత్యం (హెజిమోనీ)
గ్రాంసీ ప్రతిపాదించిన సూత్రీకరణల్లో 'ఆధిపత్యం' (హెజిమోనీ) అనేది అత్యంత ముఖ్యమైన, అధ్యయనం చేయాల్సిన భావన. ఆధిపత్యం అనే పదాన్ని ఆయన సాధరణ అర్థంలో వాడలేదు. ఏదైనా పాలకవర్గం తన క్రింది వర్గాలపై ఎలా పరిపాలన సాగిస్తుంది అని చెప్పడానికి గ్రాంసీ ఈ 'ఆధిపత్యం' (హెజిమోనీ) అన్న పదాన్ని ఉపయోగించాడు.
నిజానికి ఆధిపత్యం అనే భావన మార్క్సిస్టు పరిభాషలో అంతకుముందు నుండి వస్తున్నదే. కార్మికవర్గం ఇతర పీడిత వర్గాలకు నాయకత్వం వహించడాన్ని లెనిన్ కార్మికవర్గ ఆధిపత్యంగా వర్ణించాడు. ''వర్తమాన సమాజంలో ఏకైక నిరంతర విప్లవవర్గంగా కార్మిక వర్గం మొత్తం ప్రజల ప్రజాతంత్ర విప్లవానికి నాయకత్వం వహించాలి. అంటే మొత్తం శ్రామికులు, దోపిడీకి గురవుతున్న ప్రజలు తమను పీడిస్తున్న, దోపిడీ చేస్తున్న వర్గాలపై జరిపే పోరాటానికి నాయకత్వం హించాలి'' అని లెనిన్ చెప్పాడు. గ్రాంసీ ఈ లెనినిస్టు భావనను మరింత పరిపుష్టం గావించాడు.
గ్రాంసీ చెప్పిన 'ఆధిపత్యం' (హెజిమోనీ) అంటే పీడిత వర్గాలపై పాలక వర్గాల నైతిక, మేధోపరమైన నాయకత్వం అని అర్ధం. ఇటువంటి నాయకత్వం వల్ల పీడిత వర్గాలు పాలక వర్గాల నాయకత్వాన్ని అంగీకరిస్తాయి. 1870 తరువాత పశ్చిమ దేశాల్లో ఏర్పడిన బూర్జువా ప్రభుత్వాలు నిరంకుశ అధికార యంత్రాంగం ద్వారా కాకుండా ఈ విధమైన సాంస్కృతిక ఆధిపత్యం ద్వారా, ఒక రకంగా తమ పాలనను పీడిత వర్గాలు అంగీకరించేట్లు ఒప్పించడం ద్వారా పరిపాలన సాగిస్తూ వస్తున్నాయని గ్రాంసీ పేర్కొన్నాడు. పశ్చిమ దేశాల్లోనే కాకుండా బూర్జువా పాలన స్థిరపడిన దేశాలన్నింటా ఇదే పరిస్థితిని మనం చూడగలం.
ఆధిపత్య వర్గాలు సమాజాన్ని రెండు రాజకీయ రూపాల్లో నియంత్రిస్తాయని గ్రాంసీ చెప్పాడు. మొదటిది, అదుపు (డోమినేషన్). ఇందులో నేరుగా ప్రజలను పోలీసులు, సైన్యం ఇతర అధికార యంత్రాంగంతో భౌతికంగా అణచివేస్తుంది. రెండవది ఆధిపత్యం (హెజిమోనీ). ఇందులో సైద్ధాంతికంగా, మరీ ముఖ్యంగా ఒప్పించడం ద్వారా నియంత్రిస్తుంది. ఎంతటి నిరంకుశ ప్రభుత్వమైనా కేవలం రాజ్యాధికారం ద్వారా, పోలీసులు, సైన్యం ద్వారా పరిపాలించలేదు. దీర్ఘకాలంలో అది సుస్థిరంగా ఉండాలంటే ప్రజల సమ్మతిని, మద్దతునూ పొందాలి. ఈ సమ్మతిని వారిపై సైద్ధాంతిక ఆధిపత్యం (హెజిమోనీ) ద్వారా పాలకవర్గాలు పొందుతాయని గ్రాంసీ వివరించాడు.
గ్రాంసీ దృష్టిలో 'ఆధిపత్యం' అంటే కొన్ని విలువలు, ధోరణులు, నమ్మకాలు, నైతికతలను మొత్తం సమాజం మీద రుద్దడం ద్వారా అధికార సంబంధాల్లో యథాతథ స్థితిని కొనసాగించడం. అంటే ప్రజల దైనందిన జీవితంలోని అన్ని రంగాల్లోకీ ఈ విలువలను చొప్పించడం అనేది ఒక నిరంతర కార్యక్రమంగా జరుగుతుంది. ప్రజా సమూహం ఈ రకమైన చైతన్యాన్ని పుణికి పుచ్చుకోవడం వల్ల అది సాధారణ 'విజ్ఞత'గా మారి పోతుంది. ఆ విధంగా పాలకవర్గాల తత్వం, సంస్కృతి, నైతికవిలువలు అన్నీ కూడా సహజమైన సామాజిక లక్షణాలుగా మారిపోతాయి.
'ఆధిపత్యం' అనేది సమాజ ఉపరితలం ద్వారా నియంత్రించే ఒక రూపం అని గ్రాంసీ చెప్పాడు. ఉపరితలాన్ని ఆయన అణచివేత జరిపేవి, ఒప్పించేవి అనే రెండు భాగాలుగా విభజించాడని చెప్పుకున్నాం. ప్రభుత్వం, పోలీసు, సైన్యం, న్యాయవ్యవస్థ వంటి అణచివేత సంస్థలను రాజ్యం లేక 'రాజకీయ సమాజం' అని పిలిచాడు. ప్రత్యక్షంగా అణచివేతకు పాల్పడకుండా ఒప్పించడం ద్వారా పనిచేసే సంస్థలు అంటే మత సంస్థలు, పాఠశాలలు, ట్రేడ్ యూనియన్లు, రాజకీయ పార్టీలు, సాంస్కృతిక సంస్థలు, క్లబ్బులు, కుటుంబం మొదలైన వాటిని 'పౌర సమాజం' అన్నాడు. గ్రాంసీ ఈ రెంటినీ విడదీసి చెప్పినప్పటికీ ఈ రెండూ అంటే సామాజిక ఆధిపత్యం, రాజకీయ ప్రభుత్వం ఒకే 'సమగ్ర రాజ్యం'లో భాగమే. రాజ్యం అన్నది రాజకీయ సమాజం, పౌర సమాజాల కలయిక అన్న మాట.
కార్మికవర్గం ఆధిపత్యం (హెజిమోనీ) సాధించే సాధనాలు
గ్రాంసీ చెప్పినదాని ప్రకారం పాలక వర్గాలు ప్రజల సమ్మతితోనే తమ వర్గాధిపత్యాన్ని కొనసాగించ గలుగుతుంటే, కేవలం చివరి అస్త్రంగా మాత్రమే వారు ప్రత్యక్ష అణచివేత యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంటే అప్పుడు పాలక వర్గాలను అధికారం నుంచి తొలగించాలనుకుంటున్న విప్లవవర్గాలు ఏం చేయాలి? పాలకులకూ, పాలితులకూ మధ్య ఏర్పడిన సైద్ధాంతిక బంధం ద్వారా పాలక పెట్టుబడిదారీ వర్గాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించగలుగుతుంటే విప్లవ వర్గాల వ్యూహం ఎలా ఉండాలి? దానికి గ్రాంసీ ఇలా సమాధానం చెప్పాడు... పాలక వర్గాల సైద్ధాంతిక 'ఆధిపత్యం' (హెజిమోనీ)ని ఛేదించాలనుకునే వారు పాలకవర్గాలకు వ్యతిరేకంగా ''ప్రతి-ఆధిపత్యం'' (కౌంటర్ హెజిమోనీ) నిర్మించాలి. అంటే వారు సమాజ నిర్మాణంలో మార్పునూ, సైద్ధాంతిక మార్పునూ ఒకే పోరాటంలో భాగంగా చూడాలి. వర్గపోరాటంలో పెట్టుబడికీ, కార్మికవర్గానికీ ఘర్షణ కేంద్రంగా ఉంటుంది. కానీ, పీడించబడుతున్న వర్గాలు తమను పరిపాలించేందుకు తమ రాజకీయ, ఆర్థిక యజమానులకు ఉన్న హక్కును ప్రశ్నించాలంటే, అలా ప్రశ్నించే చైతన్యం వారికి కలగాలి. అటువంటి చైతన్యం వారిలో సైద్థాంతిక పోరాటం ద్వారా మాత్రమే వస్తుంది. దానికోసం పౌర సమాజంలో విజ్ఞత (కామన్ సెన్స్) రూపంలో స్థిరపడిపోయిన ప్రజా చైతన్యాన్ని సవాలు చేయాలి.
అయితే, ప్రజల్లో స్థిరపడిపోయిన చైతన్యాన్ని అదిగమించడం అంత తేలికైన పని కాదు. ఎందుకంటే పాలక వర్గాల సైద్ధాంతిక ఆధిపత్యం వల్ల సమాజంలో జరుగుతున్న దాన్ని 'విజ్ఞతగా' మెజారిటీ ప్రజలు అంగీకరిస్తారు. 'సమాజాన్ని నడపడానికి అదొక్కటే మార్గం' అనుకుంటారు. జరుగుతున్న పరిణామాల పట్ల ఫిర్యాదులు, అసంతృప్తులు ఉండవచ్చు. ప్రజలు మరింతమెరుగైన పాలన, సంస్కరణలు కావాలని కోరుకోవచ్చు. కానీ, సమాజంలోని మౌలికమైన నమ్మకాలు, విలువలు తటస్థంగా ఉన్నాయనీ, లేక వర్గ సమాజం అంతటికీ అవి సాధారణంగా వర్తిస్తాయనీ వారు భావిస్తారు. వాళ్లు రొట్టెల ఫ్యాక్టరీ నాది అనుకోరు. ఒకటో రెండో రొట్టె ముక్కలు అదనంగా లభిస్తే చాలు అనుకుంటారు. ఇలా సామాజిక విజ్ఞత (కామన్సెన్స్) రూపంలో చెలామణీ అయ్యే ఈ 'ఆధిపత్య' భావజాలాన్ని 'ప్రతి-ఆధిపత్య' భావజాలంతో సవాలు చేయాలి. 'ప్రతి-ఆధిపత్యం' అనేది నిజమైన 'ఆధిపత్యం' కాదు. కార్మికవర్గం లేక విప్లవ వర్గాలు తమ 'ఆధిపత్యాన్ని' (హెజిమోనీని) నెలకొల్పడానికి ఆర్థికంగా, రాజకీయంగా, సైద్ధాంతికంగా సిద్ధం కావడమే ''ప్రతి-ఆధిపత్యం''.
''ప్రతి-ఆధిపత్యాన్ని' నిర్మించడంలో మేధావుల పాత్రకు గ్రాంసీ అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. కార్మికవర్గ విప్లవ పోరాటానికీ, పురోగామి మేధావులకూ ఉండాల్సిన సంబంధాలను గురించి ఆయన విపులంగా చర్చించాడు. పురోగామి మేధావులను ఆయన రెండుగా విభజించాడు. మొదటి రకం, ఇతర వర్గాల నుండి వచ్చే ప్రజాతంత్ర మేధావులు. రెండు, కార్మికవర్గ పోరాటం నుండి పుట్టుకు వచ్చిన మేధావులు. ఈ రెండు రకాలూ కలిసి విప్లవ కార్మికవర్గ ఉద్యమం అవుతారు. బూర్జువా వర్గాన్ని అధికారం నుండి తొలగించే చారిత్రక కర్తవ్యాన్ని కార్మికవర్గం నెరవేర్చాలంటే వారు మూడు రంగాల్లో అంటే ఆర్థిక, రాజకీయ, సైద్ధాంతిక రంగాల్లో సమగ్ర పోరాటాం చేయాలి. ఈ మూడు రంగాల్లో సమగ్రంగా జరిగే పోరాటమే వర్గ పోరాటం. ఏదో ఒక రంగంలో మాత్రమే చేసే పోరాటం పాక్షిక పోరాటం అవుతుంది గానీ సమగ్ర పోరాటం కాదు.
మేధావులు ఒక ప్రత్యేక వర్గం కాదని గ్రాంసీ చాలా స్పష్టంగా చెప్పాడు. వాళ్లు అటు పాలకవర్గంలో గానీ, కార్మికవర్గ నాయకత్వంలోని శ్రామికవర్గంలో గానీ అంతర్భాగంగా ఉంటారు. ఈ రెండువర్గాల్లో అంటే అటు పాలకవర్గంలో ఇటు పాలిత వర్గంలో ఉండే మేధావుల మధ్య ఐక్యత-పోరాటం నిరంతరం సాగుతుంటుంది. ఈ ఐక్యతా-పోరాటమే ప్రజాస్వామ్యం, సోషలిజం కోసం జరిగే పోరాటంలో మేధావుల పాత్రను నిర్ణయిస్తుంది.
గ్రాంసీ రెండు రకాల మేధావులున్నారని చెప్పాడు. ఒకటి, సంప్రదాయ (ట్రెడిషనల్) మేధావులు, రెండు సజీవ (ఆర్గానిక్) మేధావులు. పాలకవర్గాలతో తమకు నిమిత్తంలేదని అనుకుంటూ, ప్రజలచేత కూడా అలా భావించబడేవారు సంప్రదాయ మేధావులు. వీళ్లు పాలకవర్గాల నుండి తాము స్వతంత్రంగా ఉన్నామని అనుకుంటున్నా అదంతా మిథ్య మాత్రమే. ప్రధానంగా వాళ్లు పాలక వర్గంతో ఉండి వారికి సహకరించే పాతకాలపు లేక మితవాద మేధావులు మాత్రమే.
సజీవ మేధావులు రెండో రకం. వీళ్లు ఆధిపత్య వర్గంతోబాటుగానే పుట్టిపెరుగుతారు. వాళ్ల ఆలోచనలకు ప్రతిరూపాలుగా ఉంటూ ప్రజలను సమీకరించే పని చేస్తుంటారు. ఇటువంటి మేధావులు గురించి ఆలోచిండం ముఖ్యం అని గ్రాంసీ చెప్పాడు. సమాజంలో పాలకవర్గాల వ్యవహారాలు చక్కబెట్టడానికి విద్యావిధానం ద్వారా వారు ఉత్పత్తి చేయబడతారు. ఈ మేధావుల ద్వారానే పాలక వర్గాలు మొత్తం సమాజం మీద తమ 'ఆధిపత్యం' (హెజిమోనీ)ని చెలాయిస్తాయి.
పాలకవర్గాలను అధికారం నుండి తొలగించాలనుకునే వారు 'ప్రతి-ఆధిపత్యం' నిర్మించాలి. అంటే చెలామణిలో ఉన్న ఏకాభిప్రాయాన్ని సవాలు చేయాలి, 'విజ్ఞత' పేరుతో సాగుతున్న భావజాలాన్ని ఎదుర్కోవాలి. ఎలా? దీనికి గ్రాంసీ చెప్పిందేమంటే... కార్మికవర్గం సంప్రదాయ మేధావుల్లో గణనీయమైన భాగాన్ని తనవైపు తిప్పుకోవడమే కాకుండా కార్మికవర్గ ఉద్యమం తనదైన 'సజీవ మేధావులను' తయారు చేసుకోవాలి.
గ్రాంసీ సైద్ధాంతిక పోరాటం గురించి చెప్పిన విషయాలు కేవలం చైతన్యాన్ని పెంపొందించడానికి మాత్రమే పరిమితం కాలేదు. చైతన్యాన్ని మార్చాలని, సోషలిస్టు చైతన్యాన్ని సృష్టించాలని చెప్పాడు. కార్మికవర్గ దైనందిన జీవితానుభవాల ద్వారా అటువంటి చైతన్యం పొందేందుకు తోడ్పడాలని చెప్పాడు. అందువల్ల మేధావుల కృషి ఎక్కడో నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల దైనందిన జీవితంలో భాగంగా సాగాలని చెప్పాడు. ''కొత్త మేధావులను ఎంతబాగా విషయాలు చెప్పగలుగుతున్నారన్న దాన్నిబట్టి కాకుండా దైనందిన జీవితంలో నిర్మాతలుగా, ఆర్గనైజర్స్‌గా వారి పనిని బట్టి నిర్ణయించాలి. నిరంతరం వెంటబడి పనులు జరిగేట్లు చూసేవారే గానీ కేవలం ఉపన్యాసాలు చెప్పేవారు సజీవ మేధాలు కాదు'' అని ఆయన వివరించాడు.
దైనందిన జీవితంలో చురుకుగా పాల్గొనే కార్మికవర్గ మేధావులను తయారు చేసుకోవడం ద్వారా ప్రస్తుత సామాజిక సంబంధాలను బద్దలుగొట్టే ''ప్రతి-ఆధిపత్యం'' ఏర్పాటుకు తోడ్పడాలి అని చెప్పాడు. ఆ విధంగా ఆయన సిద్ధాంతాన్ని ఆచరణకు ముడిపెట్టాడు. కార్మికవర్గం నుండి ఇతర పీడితవర్గాల నుండి మేధావులను తయారు చేయడంలో అనియత విద్య ఎంతగానో తొడ్పడుతుందని గ్రాంసీ చెప్పాడు. అందువల్లనే గ్రాంసీ జైలు రచనల్లో ఎక్కువ భాగం విద్యా విధానం ఎలా ఉండాలి అన్నదానికి కేటాయించాడు.
కార్మికవర్గాన్ని ఎడ్యుకేట్ చేయడం
ఒక దేశంలో సమాజం పాలక వర్గాల ఆధిపత్యంలో ఉన్నంత కాలం పాలక వర్గాల ప్రయోజనాలు నెరవేర్చే మేధావులను తయారు చేయడానికే విద్యారంగం ఉపయోగపడుతుంది. అయితే కార్మికవర్గం, ప్రజాతంత్ర శక్తులు కార్మివర్గ, ప్రజాతంత్ర మేధావులను తయారు చేసే విద్యావ్యవస్థను రూపొందించేందుకు కూడా ఈ వ్యవస్థలో అనేక అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రాంసీ విద్యారంగంలో అనేక సూచనలు చేశాడు. మొదటిది, విద్యా రంగం బాధ్యతను ప్రభుత్వం తీసుకునేట్లు చేయాలి. దాని వల్ల ఆ వ్యవస్థ ఉత్పత్తి చేసే మేధావులు మొత్తం సమాజానికి సేవ చేస్తారు. రెండు, విద్యార్థులకు ప్రాకృతిక, సామాజిక సైన్సును బోధించడంతో పాటు ఏదో ఒక వృత్తిని నేర్పించే పాఠ్య విధానం ఉండాలి. ఈ విషయంలో మార్క్స్ చెప్పిన సూచనలనే గ్రాంసీ మరింత విస్తృతపరిచాడు.
(జనవరి 22 గ్రాంసీ 131వ జయంతి)
- ఎస్. వెంకట్రావు