Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాల వర్షాల వలన, వడగండ్ల వర్షం వలన వేల కోట్ల విలువ గల పంటలకు నష్టం వాటిల్లింది. మార్కెట్కు వచ్చిన ధాన్యం, వాకిళ్ళల్లో అరబోసిన ధాన్యం వరదలలో కోట్టుకు పోయింది. మిరప పంటకు తామర పురుగు సోకి దెబ్బతినగా, అధిక వర్షాల వలన కోతకు వచ్చిన మిరపకు నష్టం వాటిల్లింది. ఇక గులాబి పురుగుతో పత్తి పంటకు నష్టం జరుగగా, మిగిలిన పత్తి కూడా అధిక వర్షాల వలన దెబ్బతిన్నది. పంటలు చేతికి వస్తున్న తరుణంలో రాళ్ళ వర్షాల వలన జరిగిన నష్టం భరించలేనిదిగా ఉంది.
గత సంవత్సరం 12.60 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, ఈ సంవత్సరం 8.5లక్షల ఎకరాల్లో వరదల వలన పంటలు దెబ్బతిన్నాయి. దీనికి తోడు 2022 జనవరిలో వచ్చిన అధిక వర్షాలు, రాళ్ళ వర్షాల వలన కూడా రైతుల పంటలకు నష్టం వాటిల్లింది. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వలేదు. కనీసం కేంద్ర బృందాలను పిలిచి సర్వే కూడా చేయలేదు. నష్టపోయిన ప్రతి గింజకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించిన ప్రభుత్వం నష్టాల వైపు కనీస దృష్టి కూడా పెట్టలేదు. రైతులు మాత్రం ఏటా ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోతూనేవున్నారు.
ప్రభుత్వం కనీసం ప్రాథమిక గణాంకాలు కూడా సేకరించలేదు. ప్రకృతి వైపరీత్యాల నిధులను రైతులకు ఇచ్చి సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి వరదల నష్టం వైపు దృష్టే సారించలేదు. అసలు తెలంగాణ ప్రభుత్వం 2016-17 నుండి ఏనాడూ వరదలు, కరువుల గురించి నష్టం అంచనా వేయలేదు. 2016 నుండి నేటికి 28 వేల కోట్ల పంట నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2,500 కోట్లు మాత్రమే పరిహారం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం జరిగిన నష్టాలపై కేంద్రానికి లేఖలు రాసి, కేంద్ర బృందాలను పిలిపించి పరిహారం ఇప్పించే ప్రయత్నం కూడా చేయలేదు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు కేంద్ర సహాయం ఆర్థించి, కొంత మేరకు జయప్రదం అయినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పిడినప్పటి నుండి వరదలు-కరువులు -వడగండ్ల వర్షాల వల్ల ఎన్ని వందల కోట్ల నష్టం వాటిల్లినా స్పందించడం లేదు. అన్నింటికి ఒకే మంత్రంలా రైతుబంధు, రైతుభీమా ప్రచారం చేస్తున్నారు.
ముఖ్యంగా కౌలు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. వీరు 15శాతం భూమిని సాగు చేస్తున్నారు. పంటలు పండినా, పండకపోయినా భూ యాజమానులకు కౌలు ఇవ్వక తప్పడంలేదు. అందువలన అప్పులపాలై ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు. సన్న-చిన్నకారు రైతులు కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. దీనికి తోడు కల్తీ విత్తనాల బెడద నష్టం కలిగిస్తున్నది.
2021 వానాకాలం అతివృష్టి వల్ల వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. తిరిగి విత్తనాలు సేకరించి సాగు చేసుకుంటున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఎకరాకు కనీసం రూ.20,000లు పరిహారం చేల్లించాలని రైతు సంఘాలు ఆందోళనలు కూడా చేశాయి. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. రెవెన్యూశాఖలో ఐఏఎస్ స్థాయి హౌదా అధికారి ప్రత్యేకించి ప్రకృతి వైపరీత్యాల పరిశీలనకే ఉన్నారు. అతను గ్రామాధికారుల ద్వారా వెంట వెంట సమాచారం తెప్పించుకుని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టులు పంపించాలి.
కానీ, తెలంగాణ ప్రభుత్వంలో ఆ శాఖ పని చేస్తున్నట్లు లేదు. కనీసం వ్యవసాయశాఖ కూడా స్పందించడం లేదు. నష్టాలు జరిగినప్పుడు 'ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు పరిహారం చెల్లిస్తామని' ప్రకటనలు చేయడం తంతుగా మారింది. మంత్రులు మొదలు శాసనసభ్యుల వరకు ఇలాంటి ప్రకటనలు చేసి రైతులను మోసగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలపై స్పష్టమైన వైఖరిని అనుసరించి విధానాలు రూపొందించాలి. సహజంగా రాళ్ళ వర్షాలు నూటికి తొంబైశాతం తెలంగాణలోనే కురుస్తాయి. అవి కూడా రబీ పంటల కోతలప్పుడే పడతాయి. రాళ్ళ వర్షాలు పడ్డచోట పంటలు వేసిన దాఖలాలు కూడా కనబడకుండా నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి పరిస్థితులలో రైతులను ఆదుకోవడానికి గత రెండు సంవత్సరాలుగా బీమా కూడా లేదు. ప్రభుత్వం పరిహారం ఇవ్వదు. పియం ఫసల్ భీమా అమలు జరగదు. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతులు కాలంపై భారం వేసి పంటలు పండిస్తున్నారు. పంటల దిగుబడులు బాగా వచ్చినప్పుడు ఆ కీర్తిని ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుంది. భారతదేశంలోనే ఆగ్రగామిగా పంటల ఉత్పత్తి సాగిస్తున్నామని ప్రచారం చేస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్ట పోయినప్పుడు మాత్రం ముఖం చాటేస్తుంటారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించి రైతులను రక్షించాలి.
- మూడ్ శోభన్
సెల్:9949725951