Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు దావోస్లో జరిగాయి. దానికి ముందు ప్రతి ఏడాదిలాగే ఆక్స్ఫామ్ ఇండియా రిపోర్ట్ వెలువడింది. భారతదేశంలో పెరిగి పోతున్న ఆర్థిక అసమానతల నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. పాలకులు తలెత్తుకోలేనన్ని గణాంకాలను మన ముందుంచింది. స్వతంత్ర భారత్లో పట్టుమని పాతికేళ్ళు మాత్రమే స్థిరమైన ఆర్థిక మూలాలకు పునాదులు పడ్డాయి. ఆ తరువాత అంతా రాజకీయమే. అందుకే అసమానతల తొలగింపుకన్నా అధికార బదలాయింపే ఈ దేశంలో ఎక్కువగా జరిగింది. ఇప్పుడీ అధికార స్థిరత్వం కోసం ఆశ్రిత పెట్టుబడి అనే పులి మీద ఎక్కి పీఠాధిపతులు ఘీంకరిస్తుంటే, ప్రాణాలు కాపాడుకోవటమే ప్రజలకు శరణ్యమైంది.
ఆక్స్ఫామ్ ప్రకటించిన గణాంకా లను బట్టి, దేశంలో గత ఒక్క ఏడాదిలోనే ''పరవాలేదు బాగానే బతుకుతున్నారు'' అనుకునే 16 కోట్ల మంది కొత్తగా పేదరికంలోకి నెట్టబడ్డారు. ఈ ఏడాదిలో 84శాతం ప్రజల ఆదాయాలు తగ్గు ముఖం పట్టాయి. ఈ దేశంలోని 50శాతం ప్రజల పేదరికానికి అత్యంత ధనికులైన ఒక శాతం ప్రజలే బాధ్యులు అని తేల్చారు. గత సంవత్సరం మొదట్లో భారతదేశంలోని బిలియనీర్లు 102మంది ఉండగా సంవత్సరాంతానికి ఆ సంఖ్య 142కు చేరింది. బిలియనీర్ల సంపద రూ.23.14లక్షల కోట్లు ఉండగా సంవత్సరాంతంలో 53.16 లక్షల కోట్లకు పెరిగింది. 10శాతం ధనికులు దేశంలోని 45శాతం సంపదను కలిగి ఉన్నారు. ఆర్థికంగా దిగువనున్న 50శాతం ప్రజలు కేవలం ఆరు శాతం మాత్రమే కలిగి ఉన్నారు. అత్యంత ధనికులైన 98 మంది దగ్గర 55.5లక్షల కోట్ల సంపదున్నది. ధనవంతులైన 100 మంది దగ్గర 57.3 లక్షల కోట్ల రూపాయలు ఉన్నది. అత్యంత ధనవంతులైన 10మంది దగ్గర ఉన్న సంపద 25సంవత్సరాల పాటు దేశంలో విద్యను అందించేందుకు సరిపోతుంది. కానీ, పౌష్టికాహార లోపం ఉన్న ప్రపంచ జనాభాలో నాలుగోవంతు ఇండియాలోనే ఉన్నది. వృద్ధి దశ అంటే సంపద పెరగటం. అభివృద్ది అంటే దేశీయులందరి ముందడుగు. కానీ సంపద పెరింది, ఎక్కువ మంది వెనకడుగు వేస్తున్నారు. ఇదేంటి? దేశంలో నిరుద్యోగం తొమ్మిది శాతం. అనగా తొమ్మిది కోట్ల మందికి పైగా ఉపాధి లేదు. మరి మిగతా వారికి ఉపాధి ఉన్నప్పటికీ వారి ఆదాయాలు గత సంవత్సరంతో పోలిస్తే తక్కువెందుకున్నాయి? అనగా చాలా మంది పని చేస్తున్నారు కానీ వారికివ్వాల్సింది ఇవ్వకుండా కొంత మంది ఎత్తుకెళ్తున్నట్టేగా?!!!
ధనవంతులైన 98 కుటుంబాలపై 4శాతం పన్ను విధిస్తే అది కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖకు సంబంధించిన రెండు సంవత్సరాల ఖర్చుతో పాటు, ప్రభుత్వాలు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి 17 సంవత్సరాల వరకు సరిపోతుందట. ధనవంతులైన 98 బిలియనీర్ కుటుంబాలపై ఒక శాతం పన్ను విధిస్తే ఏడు సంవత్సరాలు ఆయుష్మాన్ భారత్ ఖర్చుకు సమానం, లేదా దేశం మొత్తం మీద ప్రాథమిక విద్య సంవత్సరంపాటు అందించవచ్చు. వైద్యపరమైన సేవలు అందివ్వటంలో భారత్ వెనుకబడిన స్థితి బ్రిక్స్ దేశాలన్నింటిలోకి అధమంగా ఉన్నది. భారత్లో పట్టణ ప్రాంత ప్రజలు 1990లో 40 శాతం ప్రయివేటు వైద్యంపై ఆధారపడితే ఇప్పుడది 65శాతానికి చేరింది. దేశంలో ఉన్నత వర్గాల స్త్రీలతో పోలిస్తే దళిత స్త్రీల ఆయుఃప్రమాణం 15 సంవత్సరాలు తక్కువగా ఉన్నది. ఆదివాసీలు దళితులు పేదరికంలో ఉన్న ఇతరుల జీవన ప్రమాణాలతో పాటు ఆయుః ప్రమాణాలూ ఉన్నత వర్గాలతో పోల్చినప్పుడు తక్కువగా ఉన్నవి.
కరోనానంతరం ఆన్లైన్ విద్య అనివార్యమైన దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వారి పిల్లలు కేవలం 4శాతం మాత్రమే విద్యను అందుకుంటున్నారు. 96శాతం విద్యకు దూరమయ్యారు. బాల కార్మిక వ్యవస్థకు ఈ కరోనా మల్లీ కాన్పునిచ్చినట్లైంది. బడులు సరిగ్గ నడవకపోయే సరికి మద్యాన్న భోజనం దొరక్క పిల్లలు మరింతగా పౌష్టికాహార లోపానికి గురవుతున్నారు. ఇదే కాలంలో, 2020 జూన్ అక్టోబర్ మాసాల్లో బాల్యవివాహాలు 33శాతం పెరిగాయి. అనగా పేద తల్లిదండ్రులు తమ జీవితాలపై భరోసా లేక పిల్లలకి పెళ్ళిల్లు చేసి హమ్మయ్య.. అనుకుంటున్నారు. పాండమిక్ తర్వాత 'ఏ విన్ ఫర్ ఫ్యూ ఎ లాస్ట్ ఫర్ మోస్ట్' అనగా చాలా తక్కువ మందికి లాభం జరిగితే అత్యంత ఎక్కువ మందికి నష్టం జరిగింది అని అర్థం. కరోనానంతర లాక్డౌన్ కారణంగా ఉద్యోగాలను తొలగించిన తర్వాత తిరిగి పునః ప్రారంభించేటప్పుడు రెగ్యులర్ ఉద్యోగాలన్నింటిలోనూ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విపరీతంగా పెరిగింది.
ఈ అసమానతలు దేశాన్ని ఎలా దెబ్బతీయనున్నాయి?
ఆదాయం తగ్గినప్పుడు మొదటగా వద్దనుకునే వ్యవహారం విద్య. చదువుకోవాల్సిన పిల్లలు పని బాట పట్టడం, లేదా ఉన్నత చదువులకు వెళ్లవలసిన పిల్లలు మానేయడం, ఏదో ఒక ఉపాధి వెతుక్కోవడం వంటివి చేయడంతో నాణ్యమైన విద్యకు దూరమవడంతో వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో దేశం ఓడిపోతుంది. ఇది గత దశాబ్దంగా జరుగుతున్నప్పటికీ దీని వెనుక ఉన్న అసలు కారణం ఆర్థిక అసమానతలు అని తెలిసినప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఇక అసమానతల వల్ల రెండవ ప్రమాదం వైద్య పరమైన సేవలు. ఆదాయాలు లేనప్పుడు చిన్నాచితకా రోగాలు ఏవి వచ్చినా పోనీలే అంటూ సర్దుకుపోతారు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయరు. తనువు చాలించడం తప్ప వేరే మార్గం ఉండదు. ఆదాయాలు తగ్గిపోవడం వల్ల భారత జాతి వైద్య పరమైన ఇబ్బందులు ఎదుర్కొని అర్ధాంతరంగా తనువు ముగిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ధీర్ఘకాలిక రోగాలకు క్రమం తప్పని మందులు వాడి రక్షించుకోవాలన్న ఆలోచన కూడా చేయలేరు. ఇక మూడవ ప్రమాదం పౌష్టికాహారం. ఆదాయాలు తగ్గినప్పుడు విద్య, వైద్యానికి దూరమవ్వక తప్పదు. కానీ ఉన్న ఆదాయంతో కుటుంబాలను పోషించుకోవడం అనివార్యం. అయితే కావాల్సినన్ని క్యాలరీలు లభించక పౌష్టికాహార లోపం విపరీతమవుతుంది. ఎక్కడైతే పౌష్టికాహారలోపం జరుగుతుందో అక్కడ నాణ్యమైన మానవ వనరులు ఉండవు. వారి జీవన ప్రమాణాలు కూడా తగ్గిపోతాయి.
ఆదాయాలు తగ్గిపోయిన వాళ్లందరికీ అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే ఆదాయాన్ని బట్టే ఉన్నతమైన అవకాశాల కోసం ప్రయత్నం చేస్తారు. అలా లేనప్పుడు చాలీచాలని అవకాశాలతో సర్దుకు పోతారు. ఇలాంటి వాళ్ళ నైపుణ్యం కూడా నిరుపయోగమవుతుంది. వారికి ఉన్నటువంటి చదువు విజ్ఞానం కూడా నిరుపయోగంగా ఉంచడం వలన భవిష్యత్తుకు ఉపయోగపడదు.
మౌలిక వసతుల కల్పన జరగాలంటే ప్రభుత్వానికి సరైన పన్నుల ద్వారా నిధుల సేకరణ జరగాలి. ఎక్కువ మందికి ఉపాధి లేనప్పుడు పన్నుల రాబడి తగ్గిపోయి తద్వారా మౌలిక వసతుల కల్పనకు నిధుల కరువు వస్తుంది. ధనమంతా కొందరి చేతుల్లో నిక్షిప్తమై పోతున్నప్పుడు వారు అవసరానికి మించిన యాంత్రీకరణకు మొగ్గు చూపుతారు. అలాంటప్పుడు నిరుద్యోగం పెరిగిపోయి లేబర్ పార్టిసిపేషన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే లేబర్ పార్టీసిపేషన్ తగ్గిపోతుందో అప్పుడు సహజ వనరుల వినియోగం కూడా తగ్గిపోతుంది. సహజ వనరుల వినియోగం తగ్గినప్పుడు రెట్టించిన కొత్త ఉత్పాదకత కూడా తగ్గిపోతుంది. వెరసి ఆశించిన ప్రగతికి ప్రతిబంధకమవుతుంది.
ఆక్స్ ఫామ్ నివేదిక సమర్పించినప్పుడు దాని సీఈఓ అమితాబ్ బెహారి కొన్ని పరిష్కారాలు కూడా ప్రతిపాదించారు. ఈ దేశంలో కూడబెట్టిన నల్లధనంతో విదేశాలలో బినామీ పేర్ల పైన కంపెనీలు స్థాపించి ఉన్నవారి వివరాలు పండోరా, పనామా ద్వారా పలు సందర్భాల్లో బయటపడ్డాయి. వాటన్నిటిని స్వాధీన పర్చుకుంటే దేశానికి ఎంతో ఆదాయం లభిస్తుంది. కొంతకాలానికైనా సంపద పన్ను పునః విధించాల్సిన అవసరం ఉన్నది. దానితోపాటు బిలియనీర్స్ టాక్స్ కూడా అమలు పరచాలి. 10శాతం అత్యంత ధనవంతులపై ఒక్కశాతం సర్ఛార్జి పన్ను విధిస్తే 8.7 లక్షల కోట్ల రొక్కం ఏటా జమ అవుతుంది. వీటితో పాటు ఆర్థికవ్యవస్థ నిరంతరం పరిగెత్తాలి అంటే కిందిస్థాయి వినియోగదార్లు వర్కర్ల దగ్గర నగదు ఉండాలి. దానికి అసంఘటిత రంగ కార్మికులకు సాంఘిక భద్రత వంటిది కల్పించాలి. దీని ద్వారా నిరంతర ఆదాయ మార్గాన్ని కల్పించినట్లవుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది పరోక్ష పన్ను తగ్గించాలి, జీడీపీలో ప్రత్యక్ష పన్నుల వాటా పెరగాలి. ఈ మౌలిక అంశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016