Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో విద్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రయివేటు విద్యా సంస్థలూ కృషి చేస్తున్నాయి. కానీ ప్రయివేటు కార్పొరేట్ విద్యాసంస్థలు లాభార్జనే ధ్యేయంగా విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేశాయి. వాటి వాటి స్థాయిని బట్టి వేలల్లో లక్షల్లో ఫీజులను వసూలు చేస్తున్నాయి. ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్ ఇతర ఫీజులు అన్నీ కలిపి ట్యూషన్ ఫీజు కింద తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నాయి. అంతేకాకుండా పుస్తకాలు, బూట్లు, టై, బెల్టుల దుకాణాలను పాఠశాల పక్కన నెలకొల్పుతూ అందినకాడికి దోచుకుంటున్నాయి. తెలంగాణలో ప్రయివేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ దేశంలో ఎక్కడాలేని విధంగా సాగుతున్నది. కరోనా కల్లోల పరిస్థితుల్లో అసలే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ఫీజుల దోపిడీతో తీవ్ర వేదనకు గురవుతున్నాయి. ఆందోళనకరంగా ఉన్న ఈ ఫీజుల జులుంను నియంత్రించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవడానికి ప్రయత్నాలు ప్రారంభించడం శుభపరిణామం. కానీ చట్టాన్ని అమలు చేయడమే అతి పెద్ద సమస్య.
ప్రయివేట్, కార్పొరేట్ సంస్థల ధనదాహం...
అధికారుల అలసత్వం, ఫీజుల నియంత్రణపై నిర్లక్ష్యం వల్ల కొన్ని ప్రయివేటు పాఠశాలల ఆగడాలకు అంతులేకుండా పోయింది. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్, బడా ప్రయివేటు యాజమాన్యాలు వారి స్థాయిని బట్టి 10వేల నుంచి మొదలుకొని 3.5లక్షల వరకు వార్షిక ఫీజులను వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని బ్రాండెడ్ కాలేజీలు చేస్తున్న ప్రకటనలతో తల్లిదండ్రులు ప్రభావితం అవుతున్నారు. దాన్ని ఆసరా చేసుకుని అధిక ఫీజులు వసూలు చేస్తూ పాఠశాల, ఇంటర్ విద్యలో అందినకాడికి దోచుకుంటున్నారు. ఒకే పేరుతో వందల పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తున్నారు. ఏలాంటి అనుమతులు లేకుండా విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘిస్తూ తరగతులు నడుపుతూ లక్షల్లో ఫీజులు దోచుకుంటున్నారు. 2020 ఏప్రిల్లో కరోనా నేపథ్యంలో ఫీజులు పెంచవద్దని రాష్ట్ర ప్రభుత్వం జీవో 46 జారీ చేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని ప్రకటించారు. అయినా ప్రయివేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ ఉత్తర్వులను అస్సలు పట్టించుకోలేదు. వార్షిక ఫీజులే కాకుండా ఇతర మార్గాల్లో కూడా కార్పొరేట్ దోపిడి కొనసాగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఫీజుల నియంత్రణపై ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో 2017లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2018 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ప్రయివేటు విద్యా సంస్థలు ఏటా పదిశాతం ఫీజు పెంచుకోవచ్చని అంతకంటే ఎక్కువ పెంచుకోవాలంటే ప్రభుత్వానికి ఆదాయ వ్యయాలు సమర్పించి పెంచుకోవాలని సిఫార్సు చేసింది. ఆ కమిటీ నివేదిక ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉంది. విద్య శాఖలో జీవో నెం.1 మార్గదర్శకాలను పట్టించుకోకుండా పాఠ్య, నోట్ పుస్తకాలు, దుస్తులు, బూట్లు, టై బెల్టుల దుకాణాలను పాఠశాల పక్కన నెలకొల్పుతూ అధిక ధరలకు సామగ్రిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఇదేమిటని అడిగితే ఈ పుస్తకాలు మా దగ్గర తప్ప ఎక్కడా దొరకవు కచ్చితంగా కొనాల్సిందే అని తెగేసి చెబుతున్నాయి. ఈ విధంగా రాష్ట్రంలో విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నది.
విద్యా హక్కు చట్టం అమలు ఏది...
విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రయివేటు కార్పొరేట్ బడులు తమ పాఠశాలలో మొత్తం సీట్లలో 25శాతం సీట్లు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద పిల్లలకు ఇవ్వాలి. ఇందుకుగాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణీత ఫీజులు ఆ ప్రయివేటు విద్యా సంస్థలకు చెల్లించాలి. చట్టం వచ్చి 11ఏండ్లు గడిచినా రాష్ట్రంలో చాలా ప్రయివేటు పాఠశాలల్లో ఇంత వరకు ఈ నిబంధన అమలు కావడం లేదు. కార్పొరేట్ ప్రయివేటు విద్యా సంస్థలు విద్యా హక్కు చట్టం నిబంధనలను పట్టించుకోకుండా డొనేషన్ ఫీజు అడ్మిషన్ ఫీజులను కూడా వసూలు చేస్తున్నాయి.
సమగ్ర చట్టంతోనే ముకుతాడు...
ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ ఉత్తర్వుల జారీ, కమిటీల ఏర్పాటు వల్ల సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం ఇతర రాష్ట్రాల తరహాలోనే ఫీజుల నియంత్రణ చట్టం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికోసం తొమ్మిది మంది మంత్రుల ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఇప్పటికే దేశంలో దాదాపు 15 రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ చట్టం మన రాష్ట్రంలో పక్కాగా రూపొందించాలి. ప్రయివేటు స్కూల్ ఫీజుల విషయంలో ''విద్య కోసం ఫీజుల భారాన్ని మోపే హక్కు యాజమాన్యాలకు లేదు. విద్యా వ్యాపారం చేయడానికి వీల్లేద''ని వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు పరచాలి. ప్రయివేటు విద్యా సంస్థలకు రెగ్యులేషన్ చట్టం అమలు చేయాలి. రాష్ట్రంలోని అన్ని ప్రయివేటు కార్పొరేట్ విద్యా సంస్థలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చే విధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని తయారు చేయాలి. దీనివల్ల ప్రతి పాఠశాల ఆదాయ వ్యయ వివరాలను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. తమ పిల్లలు చదివే పాఠశాల వివరాలను ప్రతి ఒక్కరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులను సంప్రదించిన తర్వాతే ఫీజులను పెంచేలా కొత్త బిల్లు తీసుకురావాలి. రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయిల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక తల్లిదండ్రుల కమిటీలు ఉండాలి. అందరికీ ఒకే రకమైన ఫీజు నిర్ణయించి సామాన్య ప్రజలకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలి. కరోనా వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఫీజులో రాయితీ కల్పించాలి. కఠినమైన నిబంధనలతో ఫీజుల నియంత్రణ చట్టాన్ని రూపొందించి అమలుపరిస్తేనే సామాన్య ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది.
- అంకం నరేష్
సెల్:6301650324