Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఈ సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాలి. చైనా యాప్ల లాగా సోషల్ మీడియాకూడా దేశానికి నష్టం చేస్తున్నది'' అన్నాడు నమో. ఈ నమో అసలు పేరేంటో చాలా మందికి గుర్తులేదు. ఫేస్బుక్లో నమో పేరిట పేజీ నడుపుతుంటాడు. వందల వేల సంఖ్యలో పోస్టులు పెడతుంటాడు. నరేంద్రమోడీని ఎవరైనా ఒక్కమాటంటే నమో వెయ్యి మాటలంటాడు. అందుకే అందరికీ నమోగానే గుర్తుండిపోయాడు.
సోషల్ మీడియాలో తమకు నచ్చనివారిని దునుమాడే నమో స్వయంగా సోషల్ మీడియానే నిషేధించాలంటే, విన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఇది నిజమేనా అని అందరూ గిల్లుకున్నారు. అందరికీ నొప్పి రావడంతో నమ్మక తప్పలేదు.
''ఇంతకీ సోషల్ మీడియాను ఎందుకు నిషేధించాలో చెప్పనే లేదు!'' అనుమానం వ్యక్తి చేశాడు వర్మ.
''ఎందుకేమిటి? టెలిప్రాంప్టింగ్ మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేస్తున్నారు! టెలి ప్రాంప్టర్ వాడటం నేరమా? ఎందుకు వాడకూడదు? టెలిప్రాంప్టర్ వాడితే దేశప్రధానినే హేళన చేస్తారా? ప్రధాని అంటే గౌరవం లేదా?'' గరుమన్నాడు నమో!
''ఏమిటీ నరేంద్రమోడీ టెలిప్రాంప్టర్ వాడారా? ఎప్పుడు, ఎక్కడీ'' ప్రశ్నించాడు వర్మ! ఆయనకు బ్యాంకు అకౌంటు తప్ప సోషల్ మీడియా అకౌంటు లేదు!
''ఏమిటి వర్మా? ప్రపంచాన్ని కాస్త పట్టించుకోవయ్యా! మన ప్రధాని, ప్రపంచ ఆర్థిక ఫోరం మీటింగ్లో ఆన్లైన్లో ఉపన్యసిస్తుంటే ఈ సంఘటన సంభవించింది! టెలిప్రాంప్టర్ పని చేయక ప్రధాని ఉపన్యాసం ఆగిపోయింది!'' అన్నాడు నమో.
''అయ్యో టెలిప్రాంప్టర్ పని చేయలేదా? చైనా సరుకేమో!'' అన్నాడు వర్మ.
''టెలి ప్రాంప్టర్ పని చేసిందా? లేదా అన్నది సమస్య కాదు. టెలిప్రాంప్టర్ వాడితే తప్పేమిటీ అంటున్నా! అసలు మీకో విషయం తెలుసా? ఈ ప్రాంప్టింగ్ ఇప్పటిది కానేకాదు! ద్వాపరయుగం నాటిది. సాక్షాత్తూ శ్రీకృష్ణపరమాత్మే ఇందులో స్పెషలిస్టు! ఆ పరమాత్ముడు నేర్పిన కళనే మా మోడీ అమలు చేస్తున్నాడు. ఈ సంగతి తెలియక మా మోడీని తప్పు పడుతున్నారు? అన్నాడు నమో గర్వంగా.
అంతే.. వర్మ ఉలిక్కిపడ్డాడు! ప్రాంప్టింగ్ ఇప్పటిది కాదా! శ్రీకృష్ణుడే ఈ కళను స్పెషలైజు చేశాడా? అప్పుడప్పుడూ ప్రవచనాలు చెప్పే వర్మకూ ఈ డౌటనుమానం వచ్చింది!
''ఇంకా సరిగ్గా చెప్పాలంటే త్రేతాయుగంలో ప్రాంప్టింగ్ ప్రారంభ మయ్యింది. రామ, రావణ యుద్ధంలో, రావణుడి నాభిలో అమృతభాండం ఉందని, అక్కడ బాణం వేస్తే... రావణుడు దెబ్బతింటాడని విభీషణుడు ప్రాంప్టింగ్ చెప్తేనే రాముడు యుద్ధంలో గెలిచాడు అన్నాడు'' నమో గర్వంగానే!
''మరి కృష్ణుడెప్పుడు ప్రాంప్టింగ్ చేశాడు?'' అమాయకంగా అడిగాడు శర్మ!
పిచ్చివాడిని చూసినట్టు వర్మను చూశాడు నమో!
''భీముడు - జరాసంధుడు యుద్ధం చేసినప్పుడు జరాసంధుడిని రెండు ముక్కలుగా భీముడు చీల్చి వేసినా, ఆ రెండు ముక్కలూ మళ్ళీ అతుక్కునేవి. దాంతో జరాసంధుడు మళ్ళీ యుద్ధానికి దిగేవాడు. దాంతో శ్రీకృష్ణుడు ఒక చీపురుపుల్ల తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా చీల్చి, ఆ ముక్కలు ఉల్టా, పల్టాగా వేస్తూ, భీముడికి ప్రాంప్టింగ్ చేశాడు. దాంతో భీముడు గెలిచాడు! అంతేకాదు, కురుక్షేత్ర సంగ్రామంలో భీమ దుర్యోధనుల యుద్ధంలో, దుర్యోధనుడి తొడల మీద గదా ప్రయోగం చేయమని భీముడికి ప్రాంప్టింగ్ చేసిందీ కృష్ణుడే! ఆ కృష్ణుడు నేర్పిందే మోడీ అమలు చేస్తున్నాడు. ఇందులో తప్పేముంది?'' గట్టిగా ప్రశ్నించాడు నమో.
వర్మకు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆయన మోహం మీద నీళ్ళు చల్లి లేపి కూర్చోపెట్టారు.
''నీవు చెప్పింది నిజమే! టెలిప్రాంప్టింగ్ తప్పేమీ కాదు! అయితే చాలా కాలం నుండీ మోడీ ప్రాంప్టింగ్నే ఫాలో అవుతున్నారు. అయితే రెండు రకాల ప్రాంప్టింగ్నే మోడీ అమలు చేస్తున్నారు. మూడో ప్రాంప్టింగ్ను ఫాలో అవటం లేదు!'' అన్నాడు వర్మ.
అర్థం కానట్టు మోహం చిట్లించాడు నమో!
''అధికారంలోకి వచ్చినప్పటి నుండి అంబానీ, ఆదానీల ప్రాంప్టింగ్ మాత్రమే ఫాలో అవుతున్నారు. వారికేం కావాలో ప్రాంప్టింగ్ చేస్తుంటే, అవన్నీ చేసి పెడుతున్నారు! ఇది మొదటిది. ఇక రెండవది ఏమిటంటే, తనకు నచ్చిన విలేఖర్లకు, ప్రయోక్తలకు ఏమి ప్రశ్నలు, ఎలా అడగాలో ముందే వారికి ప్రాంప్టింగ్ చేసి, ఆ తర్వాత వారి చేత ఆడించుకుంటున్నారు! ఆర్నబ్ గోస్వామి, అక్షరుకుమార్ లాంటి వారు ఈ లిస్టులో ఉంటారు. గత ఎనిమిదేండ్లలో ఏనాడైనా విలేఖర్లతో, నేరుగా మన ప్రధాని సంభాషించారా? గత ప్రధానులందరూ, పత్రికా సంపాదకులతో ప్రతి సంవత్సరం ఒక రోజు సమావేశం జరిపేవారు. వాజ్పేయి కూడా ఈ సంప్రదాయాన్ని గొప్పగా అమలు చేశారు! మరి మన మోడీకేమైంది? ప్రశ్నించాడు వర్మ.
నమో చెవి వెనుక గోక్కున్నాడు.
మన ప్రధాని ఫాలో చెయ్యని మూడో ప్రాంప్టింగ్ ఏదో తెలుసా? అది ఈ దేశపు ప్రజల గొంతుక! ఒక ఉత్తమ ప్రధాని ఫాలో చేయవల్సిన మొట్టమొదటి ప్రాంప్టింగ్ ప్రజల గొంతుకే! గత ఎనిమిదేండ్లలో ఏనాడైనా ప్రజాగొంతుక ఎలా ఉంటుందో ఎప్పుడైనా విన్నారా? కనీసం వినటానికి ప్రయత్నించారా? కనీసం ప్రజల ప్రతినిధులుగా ఎంపికైన ఎంపీల గొంతునైనా విన్నారా? పార్లమెంటుకి రావటానికి తీరికే లేని ఏకైక ప్రధాని మోడీ! టెలిప్రాంప్టింగ్ ఫాలో అయ్యారా! లేదా? అన్నది చర్చ కాదు! ప్రజలు చేస్తున్న ప్రాంప్టింగ్ను ఫాలో అవుతున్నారా లేదా? అన్నదే చర్చ!'' అన్నాడు వర్మ.
నమో తన చెవిని గోకుతూనే ఉన్నాడు. చెవిలో నుండి ఒక చిన్న మైకు ఊడి బయట పడిపోయింది!
- ఉషాకిరణ్,
సెల్: 9490403545