Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రాజకీయాలలో యూపీది ఎప్పుడూ ప్రత్యేక స్థానం మాత్రమే గాక సింహభాగం కూడా. ఢిల్లీ మార్గం లక్నో ద్వారానే వెళ్తుందని రాజకీయ వర్గాల్లో నానుడి. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తీసుకున్నా బీజేపీకి వచ్చిన 302 స్థానాల్లో 62 అంటే అయిదోవంతు అక్కడే వచ్చాయి. మోడీ స్వయంగా యూపీలోని వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ హిందూత్వ వ్యూహానికి కేంద్రబిందువు అయోధ్య వారణాసి మథుర అక్కడే ఉన్నాయి. అందుకే రేపు మోడీ మరోసారి ప్రధాని కావడమనేది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విజయంపైనే ఆధారపడి ఉంటుందని హోంమంత్రి అమిత్‌షా సూటిగానే ప్రకటించారు. రకరకాల సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు చెప్పుకొచ్చినా సమాజ్వాదిపార్టీనే గెలుస్తుందని వారి ఆత్మసాక్షితో సహా అసలు సర్వేలు చెబుతున్నాయి. తాజాగా ఇండియాటుడే సీ ఓటర్ కలసి చేసిన సర్వే దేశంలో మోడీకి ఎదురు లేదని బీజేపీ మరోసారి కేంద్రంలో వచ్చేస్తుందని ప్రకటించింది. తమాషా ఏమంటే యూపీలో యోగి విజయం మోడీకి ముఖ్యమని ఒక పల్లవి, కేంద్రంలో మోడీ వస్తారు గనక యూపీలో యోగిని ఎన్నుకోవాలని మరో పల్లవి బీజేపీ ద్వంద్వ వ్యూహంగా ఉంది.
మంత్రుల నిష్క్రమణ, ఎస్పిలో చేరిక
బయిట ఎంత హంగామా చేసినా అంతర్గతంగా బీజేపీలో, యోగి ప్రభుత్వంలో ఆ విశ్వాసం లేదు. ఏకంగా ముగ్గురు మంత్రులు, దాదాపు పదిహేనుమంది ఎంఎల్ఎలు ఎన్నికల తరుణంలో బయిటకు రావడం, సమాజ్‌వాది పార్టీలో చేరడం ఇందుకు అద్దం పడుతున్నది. గతంలో వారు ఆ పార్టీకి బద్ద వ్యతిరేకులు. ఈ వెళ్లిన వారిలో బీసీ, దళిత వర్గాల సీనియర్ నాయకులు పలుసార్లు మంత్రులు ఎంఎల్ఎలైన వారు ఉన్నారు. ఈ ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు హానికరంగా వ్యవహరిస్తోందని వారు సోదాహరణంగా ప్రకటించారు. టికెట్టు వచ్చే అవకాశం లేదని తెలిసి వారువెళ్లిపోయారని బీజేపీ నాయకత్వం తీసిపారేసి మాట్లాడుతున్నా వాస్తవంలో మాత్రం చాలా కంగారు పడుతున్నది. హఠాత్తుగా ముఖ్యమంత్రి యోగి ఒక దళిత కార్యకర్త ఇంట్లో భోజనం చేసి ఫొటోలు విడుదలచేయడం ఇందుకు తాజా ఉదాహరణ. ఇదే గాక ఒకో నియోజకవర్గానికి యాభైమంది బీసీ నాయకులను పంపి వ్యతిరేకత పెరగకుండా ఆపాలని తంటాలు పడుతున్నారు. బీసీల విషయంలో బీజేపీ ఇంతగా ఆందోళన చెందడానికి చాలా కారణాలే ఉన్నాయి. మైనారిటీలకు వ్యతిరేకంగా హిందూత్వ ప్రచారంతో రెచ్చగొట్టడం బీజేపీ మౌలిక ప్రాతిపదిక అయినా గుజరాత్లో వలెనే యూపీలో కూడా ప్రత్యేక తరహా కులకూటములు కట్టింది. ఎస్పిని ప్రధానంగా బలపర్చే యాదవేతర బీసీలు, ఎంబీసీలు, బీఎస్పీని బలపర్చే జాతవేతర ఎస్సీలు, స్వతహాగా తమతో ఉండే అగ్రవర్ణాలు ఆ కూటమిలో ఉండేవి. 2014లోనూ, 2017లోనూ మళ్లీ 2019లోనూ దాని ఆధారంగానే బీజేపీ విజయం సాధించింది. ఇప్పుడు ఎంబీసీలు యాదవేతర బీసీలు ఎస్పివైపు వెళ్లడం వల్ల అఖిలేష్ బాగా బలపడే అవకాశమే దాన్ని భయపెడుతున్నది. ఎస్పి కూడా గతంలో తనపై ఉన్న యాదవ, ముస్లిం పార్టీ అన్నముద్ర పోగొట్టుకుని విస్తృత తరగతులను కలుపుకోవడం అవసరమని అఖిలేష్ గుర్తించారు. బీజేపీ బీసీనేతలలో ప్రజ్వరిల్లిన అసంతృప్తి ఇందుకు బాగా కలసివచ్చింది. ఇప్పుడు రాజీనామాలే కాదు, 2018లోనే వందమంది బీసీి ఎంఎల్ఎలు శాసనసభ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన చేశారు. వారిని దారికి తెచ్చుకునేందుకు బీజేపీ అగ్రనాయకత్వం నానాతంటాలు పడాల్సివచ్చింది.
అమానుషాలు, అశాంతి
ఎస్పి, బిఎస్పి పాలనలో నిర్లక్ష్యానికి గురైన బీసీ, ఎస్సీ కులాలను ప్రత్యేక శ్రద్ధతో చూస్తానని హామీ ఇచ్చిన యోగి ప్రభుత్వం ఆచరణలో దాన్ని ఘోరంగా ఉల్లంఘించింది. ఈ తరగతుల విద్యార్థులు సంఖ్యలో అగ్రవర్ణాలకంటే అయిదురెట్లు ఎక్కువున్నా మధ్యాహ్న భోజనానికి సమానంగానే 700కోట్లు కేటాయించింది. ప్రభుత్వం ఏర్పడిన కొద్దివారాల్లోనే దళితవర్గాలపై దాడులు పెరిగాయి. కోవిడ్‌లోనూ కింది వర్గాలకు సహాయం తక్కువగా అందింది. గోరక్షణ పేరుతో దాడులు దేశంలోనే సంచలనం కలిగించాయి. హత్రాస్‌లో దళితబాలికపై అత్యాచారంతో సహా ఎందరో దళిత మైనారిటీ యువతులపై పాలక పక్ష ప్రముఖులు, ప్రజాప్రతినిధులు చేసిన అఘాయిత్యాలు జాతీయ స్థాయిలో శీర్షికలైనాయి. ఇటీవల రైతాంగ ఉద్యమం పశ్చిమ యూపీలో పెద్ద ప్రభావం చూపింది. మామూలుగానే అది చరణ్‌సింగ్ కుటుంబ నాయకత్వాన్ని అనుసరించడం పరిపాటి. వారికి సంబంధించిన రాష్ట్రీయ లోక్‌దళ్ ఎస్పిని బలపరుస్తున్నది. లఖింపూర్ఖేర్లో స్వయంగా కేంద్రమంత్రి అజరు మిశ్రా కుమారుడు అభరు మిశ్రా ప్రజలపైకి కారునడిపి ప్రాణాలు తీయడం అమానుషత్వానికి పరాకాష్ట. ఇప్పుడు వ్యవసాయ విద్యుత్ రేట్లు తగ్గిస్తానని యోగి వాగ్దానం చేస్తున్నారు. ఆరోగ్యరక్షణ దేశంలోకెల్లా యూపీలోనే అధ్వాన్నంగా ఉందని నిటిఆయోగ్ నివేదిక వెల్లడించింది. గంగానదిలో శవాలు కొట్టుకుపోవడం గగుర్పాటు కలిగించింది. నిరుద్యోగం పెరుగుదల అన్నిటికన్నా పెద్ద సవాలుగా ఉంది. శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి స్వయంగా అనేకసార్లు ఆందోళన వెలిబుచ్చుతూనే అందుకు మరెవరో కారణమన్నట్టు, వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించినా పాలకపార్టీ నేతలే వరుసగా నేరాలలో నిందితులుగా కోర్టుకెక్కాల్సివచ్చింది. తాజాగా హరిద్వార్ ధర్మసంసద్‌లో నారాయణసింగ్ కోర్టులు ప్రభుత్వాలు పార్టీలన్నిటిపైనా విషం గక్కుతూ చేసిన విద్వేష ప్రసంగం ఎంత దాచినా దాగకుండా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.
ఇవన్నీ తన పునాదిని బాగా దెబ్బతీశాయని తెలిసినా మేకపోతు గాంభీర్యంతో యోగి గత ఏడాది పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. భారీ ఖర్చుతో ప్రచారం నిర్వహించారు. కొవిడ్ రెండవ వేవ్‌లో ఎన్నికలు జరపడం వల్ల 700మంది సిబ్బంది చనిపోయారు. వ్రతం చెడినా ఫలం దక్కలేదన్నట్టు ఇంత చేసినా బీజేపీ ఫలితాల్లో వెనకబడిపోయింది. ఎస్పికి చెందిన 900మందికిపైగా అభ్యర్థులను తనవారిగా ప్రకటించుకుని జెడ్పీల కోసం భారీగా ముడుపులు ఇవ్వాల్సివచ్చింది. మోడీ ప్రాతినిధ్యం వహించే వారణాసిలోనూ అయోధ్య, మధురలోనూ ఎస్పి ఎక్కువ స్థానాలు సాధించింది. అలాగే యోగి అదివరకు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్‌లో లోక్‌సభó ఉప ఎన్నికలలో బీజేపీ ఓటమి చవిచూసింది.ఈ పరిస్థితులలో చిన్నచితక పార్టీలతో పొత్తు పెట్టుకుని పెద్దగా ప్రచారం చేసుకుంది గాని తమనుంచే భారీ ఫిరాయింపులు జరగడంతో అంతా బెడిసికొట్టింది. అయినా ఆరెస్సెస్ స్వయంగా బాధ్యత తీసుకుని వివిధ అనుబంధ సంఘాలకు ప్రచారం పోలింగు బాధ్యతలు అప్పగిస్తున్నది. అయోధ్యలో రామమందిరం గురించి ప్రచారం పెంచడంతో పాటు వారణాసి ఆలయంలో విస్తరణ పేరిట మోడీ భారీ ప్రచారంతో పర్యటించడం ఇందుకోసమే. ఎవరేమి చేసినా హిందూత్వ తమను గట్టెక్కిస్తుందనీ, మైనార్టీ వ్యతిరేక ప్రచారం పనిచేస్తుందని, ప్రతిపక్షాల ఓట్ల చీలికతో సీట్లువస్తాయని కొన్ని బలమైన భావనలు బీజేపీ ప్రచారంలో పెట్టింది.
ముస్లిం, ఎస్సీ ఓటర్ల ప్రభావం
యోగి ప్రచారం ప్రారంభంలోనే ఇది 80శాతానికి 20శాతానికి మధ్యన పోటీ అంటూ హిందూ ముస్లిం విభజనకు ప్రయత్నించారు. కాని స్వతహాగా సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన బీజేపీ తన అసలు రూపం బయిట పెట్టుకోవడంతో మంత్రులే బయిటకు నడుస్తున్నారు. ముస్లింల విషయానికి వస్తే యూపీ జనాభలో 20శాతం(19.6) ముస్లిములున్నారు. 143 నియోజకవర్గాల్లో వీరు జయాపజయాలను ప్రభావితం చేయగలరు. 36చోట్ల వారే గెలుస్తుంటారు. మజ్లిస్ నేత ఒవైసీ యూపీలో రంగప్రవేశం చేసి ఈ ఓట్లను చీల్చడంద్వారా బీజేపీకి మేలు చేశారనే ఆరోపణలున్నాయి. గతసారి 38చోట్ల పోటీ చేసిన మజ్లిస్ ఈదఫా ఇప్పటికే 25మందిని ప్రకటించింది. పైకి తీవ్రంగా విమర్శించు కున్నా పరోక్షంగా ఇది బీజేపీకి మేలు చేస్తుందని, ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయం కూడా ఉంటుందని బలమైన అభిప్రాయం.
యూపీలో రిజర్వుడు నియోజకవర్గాల ఫలితాలు కూడా నిర్ణయాత్మక ప్రభావం చూపిస్తాయి. 21శాతం ఎస్సీ జనాభా ఉందని అంచనా. 84 ఎస్సీ, రెండు ఎస్టీ స్థానాలున్నాయి. గత రెండు దశాబ్దాల ఎన్నికలను పరిశీలిస్తే ఈ స్థానాలలో ఎవరు 60శాతం పైన తెచ్చుకుంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మాయావతి బిఎస్పితోనే ఈ సీట్లు వెళతాయను కోవడానికి అవకాశం లేదు. అందుకే ఆమె పలుసార్లు బీజేపీతో చేతులు కలపడం, సర్వజన సిద్ధాంతం తెచ్చి బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం చూస్తాం. 2002లో ఈ సీట్లలో బీజేపీ 35, బీఎస్పీ 24 తెచ్చుకున్నాయి. 2007లో బీఎస్పీనే 61స్థానాలు తెచ్చుకోవడంతో మాయావతి పూర్తి మెజార్టితో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2012, 2017లోనూ ఈ పరిస్థితి మారింది లేదు. కాకుంటే 2017లో సుప్రీం కోర్టు తీర్పు కారణంగా రెండు ఎస్టీ సీట్లు కేటాయించారు. మోడీ ప్రధాని అయ్యాక జరిగిన ఈ ఎన్నికలలో బీజేపీ 70స్థానాలు అంటే 81శాతం తెచ్చుకుంది. అప్నాదళ్, ఎస్‌బిఎస్‌పి దానితో పాటు చెరి మూడు తెచ్చుకోగా బిఎస్పి రెంటికే పరిమితమైంది. ఎస్పి ఏడు, ఒకటి ఇండిపెండెంటు పొందారు. ఈ స్థానాలలో తన బలం పెద్దగా పెరిగిందనే విశ్వాసం లేకనే మాయావతి ఎన్నికల పోరాటంలో ఒకింత నిరాసక్తయోగం ప్రదర్శిస్తున్నారు. తను గట్టిగా పోటీలో దిగితే గెలవడం ఉండదు గాని ఓట్ల చీలిక ఎస్పిని గెలిపిస్తుందనే అంచనా ఆమెను వెనక్కులాగుతున్నది.
వివిధ పార్టీల పోటీలు
ఈ క్రమంలో కాంగ్రెస్ విషయం కూడా తప్పక చెప్పుకోవాలి. 2017లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న అఖిలేష్ అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అప్పట్లో కాంగ్రెస్‌కు 105 సీట్లు కేటాయించగా 11 మాత్రమే తెచ్చుకుంది. (ఒక విధంగా ఇది బీహార్‌లో ఆర్జేడీ విషయంలోనూ పునరావృతమైంది) 2019లోరాహుల్ గాంధీ కుటుంబ నియోజకవర్గమైన అమెథీలోనే ఓడిపోయారు. ఇప్పుడు ప్రియాంకవడేరా అక్కడే మకాం వేసి కొంత మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తున్నా పెద్ద తేడా లేదు. తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని అర్థం వచ్చేట్టు మాట్లాడి మళ్లీ సవరించుకుంటున్నారు. సీపీఐ నలభై స్థానాల వరకూ పోటీ చేస్తుంటే, సీపీఐ(ఎం) పోటీకి ఆరు స్థానాలను నిర్ణయించింది. బీజేపీ వ్యతిరేక ఓట్ల చీలిక నివారించడం కోసం, తాము ఎస్పికి మద్దతునిస్తామని ప్రకటించింది. అన్ని స్థానాలలో తాము పోటీ చేస్తామన్న ఆప్ పెద్ద సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించింది. జేడీయూ, బీజేపీతో పొత్తుపెట్టుకోగా ఆర్జేడీ వంటరిగానే తలపడుతున్నది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదట టిఎంసి పోటీ చేస్తుందని చెప్పినా తర్వాత ఎస్పికి మద్దతు ప్రకటించడమే గాక ప్రచారానికి వస్తున్నారు. గతంలో ములాయం సింగ్ సోదరుడైన శివలాల్‌యాదవ్ అఖిలేష్‌తో విభేదించి వేరేపార్టీ పెట్టుకోవడం కూడా ఓట్ల చీలికపెంచింది. ఇప్పుడు కూడా ములాయం చిన్నకోడలు అపర్ణాయాదవ్ వంటివారిని బీజేపీలో చేర్చుకుని చాలా ప్రచారంచేస్తున్నా వారి రాజకీయ పునాది నామమాత్రం. ఎవరితో పొత్తులు ఉండవని 2020లో ప్రకటించిన అఖిలేష్ ఇప్పుడు చరణ్‌సింగ్ మనవడైన జయంత్‌చౌదరి నాయకత్వం లోని ఆర్ఎల్డితో అవగాహన కుదుర్చు కున్నారు. బీజేపీ అప్నాదళ్, నిషద్పార్టీలతో సర్దుబాట్లతో సామాజిక తరగతులను ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నది. యోగి నిరంకుశ పాలనపై వ్యతిరేకత కారణంగా ఈసారి బీజేపీ ఓటమి ఖాయమనే భావన బలంగా ఉన్నా అది ఓట్లలోకి మారుతుందా, ప్రతిపక్షాలమధ్య చీలిక, కుల మత పొందికల ప్రభావం ఎలా ఉంటుందో చూడవలసిందే.
- తెలకపల్లి రవి