Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామ్రాజ్యవాద దోపిడీ, ఆధిపత్యం కొనసాగాలంటే మూడో ప్రపంచ దేశాలలోని ప్రజల మనసుల్ని లోబరుచు కోవడం కీలకం అవుతుంది. వలసవాద ఆధిపత్యం వలసదేశంలోని అన్ని రంగాలలోనూ వ్యక్తం ఔతుంది. అయితే ఇక్కడ మనం విద్యావేత్తల మేధస్సులపై వలసాధిపత్యం గురించి, అందులోనూ, సామాజిక శాస్త్రాలకు సంబంధించిన విద్యావేత్తల గురించి ప్రస్తుతం చర్చిద్దాం...
మూడో ప్రపంచ దేశాల్లో సమస్యలు ప్రధానంగా సామాజికమైనవి. అందుచేత ఇక్కడ సామాజిక శాస్త్రాలు కీలకమైనవి అవుతాయి. వలస పాలనలో సామ్రాజ్యవాదం సాగించే దోపిడీకి, తాము ఎదుర్కుంటున్న సమస్యలకి ఏ సంబంధమూ లేదనే విధంగా సామ్రాజ్యవాదం ఆ మూడో ప్రపంచ దేశాల ప్రజల మనస్సులను ప్రభావితం చేస్తుంది. (నిజానికి, సామ్రాజ్యవాదుల వలన దేశానికి చాలా ప్రయోజనం కలిగింది అన్న అభిప్రాయాన్ని కూడా కలుగజేస్తుంది). ప్రస్తుత కాలంలోనైతే 'ఇక సామ్రాజ్యవాదం ఎక్కడుంది?' అన్న విధంగా భావించేలా చేస్తున్నది. ఆ క్రమంలో సమాజం ఎదుర్కుంటున్న వివిధ సామాజిక సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం ఎలా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితికి ఆ మేధావులను తీసుకువస్తుంది.
సామాజికాభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అన్న విషయం మీద ఒక కధనాన్ని ముందుకు తేవడం మనస్సుల్ని లోబరుచుకోవడంలో తొలిమెట్టు. ఇటు వలస దేశాల్లో కాని, అటు సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లోగాని జరిగే సామాజిక పరిణామాలకు, సామ్రాజ్యవాదానికి ఎటువంటి సంబంధమూ లేదన్నట్టుగా ఈ కధనం ఉంటుంది. ఆర్థిక శాస్త్రం నుండి ఒక ఉదాహరణను ఇక్కడ ఇవ్వవచ్చు.
అయితే, 19వ శతాబ్దపు తొలి అర్థభాగంలో (అంటే 1800-1850 మధ్య కాలంలో) ఆఫ్రికా నుండి రెండు కోట్లమందికి పైగా బానిసలు అమెరికా ఖండానికి ఎందుకోసం తరలించబడ్డారో రాబర్ట్ సోలోవ్ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ సిద్ధాంతం అంగీకరించేవారికి అర్థం కాదు. అలాగే 1850-1914 మధ్య కాలంలో చైనా నుండి, ఇండియా నుండి 5 కోట్ల మందికిపైగా కాంట్రాక్టు కూలీలు భారీ సంఖ్యల్లో అదే అమెరికా ఖండానికి ఎందుకు తరలించబడ్డారో ఈ సిద్ధాంతం వివరించజాలదు. ఇక రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో ఇండియా, పాకిస్థాన్, వెస్ట్ ఇండీస్‌ల నుండి బ్రిటన్‌కు, ఆల్జీరియా నుండి, ఇతర ఫ్రెంచి వలసలనుండి ఫ్రాన్స్ దేశానికి, టర్కీ నుండి జర్మనీకి ఎందుకు కార్మికులు ఎక్కువ సంఖ్యల్లో తరలించబడ్డారో కూడా అది చెప్పదు. పెట్టుబడి తనకు అవసరమైన కార్మికశక్తి కోసం ప్రపంచంలోని ఓ వైపు నుండి ఇంకో వైపుకు జనాల్ని భారీగా పలు సందర్భాల్లో తరలిస్తూనేవుంది. అంతే కాని, ఏ దేశానికి ఆ దేశంలోని పెట్టుబడిదారులు తమవద్ద కార్మికులకు కొరత ఏర్పడితే దానిని తీర్చుకోడానికి తమ దేశపు సరిహద్దులకే పరిమితమైపోయి వ్యవహరిస్తూ, తమవద్ద పోగుబడిన మిగులును దిగువకు పంపిణీ చేస్తూ కూచోలేదు. కాని ''ప్రధాన ప్రవంతి'' ఆర్థిక సిద్ధాంతాలు మనకు ఇంతవరకూ చెప్పింది ఇదే.
పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులకి ఎప్పుడూ రిజర్వు సైన్యం (నిరుద్యోగులు) అందుబాటులో ఉంటూనేవున్నారు. దానితోబాటు ఆ పెట్టుబడిదారులకు ఎప్పుడు కావాల్సివచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు అందుబాటులోనే ఉన్నారు. అంటే తగినంతమంది కార్మికులు లేకపోవడం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎప్పుడూ లేదు. ఏదైనా ఒక దేశంలో కొరత ఉన్నా ప్రపంచంలోని తక్కిన చోట్లనుంచి తెచ్చుకుంటూనేవున్నారు.
ఆ విధంగా ప్రధాన స్రవంతి ఆర్థిక సిద్ధాంతం పెట్టుబడిదారీ వ్యవస్థవృధ్ధి గురించి చాలా అడ్డగోలుగా వక్రభాష్యాలు చెప్తోంది. వాస్తవాలకి పూర్తి విరుద్ధంగా ఉండే విషయాలను చెప్తోంది. ఎందుకిలా చేస్తోంది? పెట్టుబడిదారీ వ్యవస్థను చాలా 'అందంగా' చూపించాలనే తాపత్రయమే దీనికి కారణం. ఆ చిత్రీకరణలో సామ్రాజ్యవాదం అనేది ఎక్కడా కనిపించదు. యుద్ధాలు, స్వాధీనం, హింస వంటివి మచ్చుకైనా అందులో కనపడవు. ప్రధాన స్రవంతి ఆర్థికసిద్ధాంతాలన్నీ ఇదే విధంగా పెట్టుబడిదారీ విధానాన్ని చాలా అందంగా, లోపరహితంగా చిత్రీకరించడానికి పూనుకుంటాయి. ఆ సిద్ధాంతాలు వాస్తవాలని ఎంత సరిగ్గా వివరించగలవు అనే కొలబద్ద కన్నా. అవి వినడానికి ఎంత బాగుంటాయి అన్నదానిని బట్టే ఆ సిద్ధాంతాలకి ప్రచారం లభిస్తోంది. వాస్తవాన్ని వివరించలేదు కాని, ఆ సిద్ధాంతాల వెనక చాలా మేధస్సు, చాకచక్యం దాగున్నాయని మనం మరిచిపోకూడదు. ఆ మిరుమిట్లు గొలిపే మేధాశక్తి గాని, ఆ చాకచక్యం గాని వాస్తవాలను అర్థం చేసుకోడానికి మనకి తోడ్పడవు. అంతే.
మరి ఆ సిద్ధాంతాలకి అంత ప్రాచుర్యం ఎలా వచ్చింది? ఆ సిద్ధాంతాలను ప్రతిపాదించినవారు కుట్ర పూరితంగానో, దురుద్దేశాలతోనో వాటిని రూపొందిచారని కూడా మనం చెప్పలేం. మానసిక దాస్యం అనేది కేవలం మూడో ప్రపంచ దేశాల మేధావులకే కాక, సంపన్న, పెట్టుబడిదారీ దేశాల మేధావులకి కూడా వర్తిస్తుంది. ఒకవేళ ఆ మేధావుల్లో ఎవరైనా వాస్తవాలను శోధించడానికి పూనుకుంటే, 'అనుమతించబడిన' హద్దులను అతిమ్రించడానికి సిద్ధపడితే, అప్పుడు వారికి పెద్ద పెద్ద పేరున్న సంస్థల్లో పోస్టింగులు నిరాకరించబడతాయి, లేదా ప్రమోషన్లు ఆగిపోతాయి, లేదా వారి పరిశోధనలు ప్రచురణకు ఎక్కడా స్వీకరించబడవు, లేదా రావలసిన బహుమతులు ఆగిపోతాయి. దాంతో వారు బుద్ధిగా హద్దుల్లో వ్యవహరించడం మొదలుపెడతారు. అంతేకాదు, ఆ హద్దులను చాలా గట్టిగా సమర్థించడానికి పూనుకుంటారు. తక్కినవారిని ఆవలికి నెట్టి 'అవకాశాలను తామే చేజిక్కించుకుంటారు. ఇందులో ప్రత్యేకించి ఏ దురుద్దేశ్యమూ లేదు. ఇది 'లోకరీతి'. అంతే.
మూడో ప్రపంచ దేశాల్లోని మేధావులలో చాలామందిని సంపన్న పెట్టుబడిదారీ దేశాల యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా నియమించడం ఒక కారణం. ప్రపంచ యుద్ధాలకు ముందు కాలంలో ఇది అరుదు. అటువంటి నియామకాలు జరగడం, లేదా అటువంటి అవకాశాలు ఉండడం వలన ఈ మూడవ ప్రపంచ మేధావులలో చాలామంది ముందే (పెట్టుబడిదారీ) లైన్లోకి వచ్చేస్తారు. వలసపాలననుండి విముక్తి పొందిన అనంతర కాలంలో మూడవ ప్రపంచ దేశాల్లో అనేకమంది మేధావులు తయారయ్యారు. తమ తమ రంగాల్లో పేరు, ప్రఖ్యాతులు తెర్చుకోవాలన్న ఆకాంక్షలు వీరిలో బలంగా ఉంటాయి. ఆ పేరు ప్రఖ్యాతులు సంపన్న పెట్టుబడిదారీ దేశాల మేధావులకు, అక్కడి విద్యా సంస్థలకు ప్రధానంగా అప్పటిదాకా పరిమితం అయివుంటాయి. అందుచేత ఆటోమేటిక్‌గా ఈ మూడో ప్రపంచ దేశాల మేధావులంతా ఆ ప్రభావానికి లోనవుతారు.
దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందంటే దానర్ధం ఆ యా వృత్తుల్లో ఉండే ఆధిపత్య పరిస్థితిలో కూడా మార్పు వచ్చేసిందని కాదు. ఇప్పటికీ సంపన్న, పెట్టుబడిదారీ దేశాలే ఈ రంగాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ పరిస్థితిలో తమ తమ కెరీర్లలో ముందుకు పోవడం అంటే నచ్చినా, నచ్చకపోయినా సంపన్న పెట్టుబడిదారీ దేశాల సిద్ధాంతాలను ఆమోదించడమే. దీని ఫలితంగా జాతీయోద్యమ కాలంలో ఎంతో కొంతమేరకు కలిగిన మానసికదాస్య విముక్తి కాస్తా ఇప్పుడు రివర్స్ అయిపోయింది.
ఇక నయా ఉదారవాద విధానాలు వచ్చాక సామ్రాజ్యవాదానికి మానసికంగా ఊడిగం చేస్తున్నామనే అంశమే గమనంలో లేకుండా పోయింది. సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు వర్తించే ఆర్థిక సూత్రాలు ఒక మూడో ప్రపంచదేశంలో యధాతధంగా వర్తించవు అన్న స్పృహ కూడా కరువైంది. ఆ విధంగా ఆలోచించడమంటేనే కాలం చెల్లిన భావనలను పట్టుకుని వేళ్ళాడడమన్న అభిప్రాయం బలపడింది. ఆ జాతీయోద్యమ కాలంలో దాదాభారు నౌరోజీ, లేదా రమేష్‌చంద్ర దత్ వంటి మేధావులు సామ్రాజ్యవాద దోపిడీ ఏవిధంగా సాగిందో చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ అధ్యయనాలను సంపన్న దేశాల యూనివర్సిటీలు కావాలనే పక్కన పెట్టాయి. చాలా యూనివర్సిటీలలో వాటిగురించి తెలియనే తెలియదు. ప్రపంచవ్యాప్తంగా సిలబస్ ఒకే విధంగా ఉండాలనుకున్నాక, ఇక్కడ మన దేశంలో కూడా వారి అధ్యయనాల గురించి పట్టించుకోవడం మానేస్తాం. ఆ క్రమంలో సామ్రాజ్యవాదానికి అనుకూలమైన మానసిక దాస్యంలోకి జారిపోతాం.
ఇప్పుడు జాతీయ విద్యా కమిషన్ మన దేశంలోని బోధనాంశాలకు, విదేశీ యూనివర్సిటీల బోధనాంశాలకు మధ్య సారూప్యత, సమన్వయం ఉండాలని కోరుతోంది. అంటే ఇక ఈ మానసిక దాస్యం ఇప్పుడు పూర్తిగా వ్యవస్థీకృతం కానున్నదన్నమాట.
మానసిక దాస్యం నుండి బైట పడడం అంటే హిందూత్వ జాతీయవాద దురహంకార వైఖరిని స్వీకరించడం కాదు. నిజానికి అటువంటి వైఖరి, మానసిక దాస్యం నుండి బైటకు రావడం - రెండూ రెండు వేరువేరు ప్రపంచాలు. హిందూత్వ జాతీయవాద ధోరణి మానసిక దాస్యాన్ని మరింత పెంచుతుంది. వాస్తవాలను వక్రీకరించడం, మూఢత్వాన్ని బలపరచడం సంపన్న. పెట్టుబడిదారీ దేశాల సామాజిక శాస్త్రాలకు వెన్నతో పెట్టిన విద్య. ఆ లక్షణం హిందూత్వ జాతీయ వాదానికి అభ్యంతరకరం ఎంతమాత్రమూ కాదు. ఆ సంపన్న దేశాలలో చెలామణీ అయే సామాజిక శాస్త్రాల మూలాలు ప్రాచీన భారతదేశంలోనే ఉన్నాయన్న సర్టిఫికేట్‌ను పొందితే చాలు వీళ్ళకి. కుదిరితే ఆ సర్టిఫికేట్లేవో ఆ సంపన్న దేశాల యూనివర్సిటీలే ఇస్తే మరీ బాగుంటుందనుకుంటారు కూడా. గత ప్రభుత్వాల హయాంలో స్వాతంత్య్రానంతర కాలంలో మన దేశంలో ఉన్నత విద్యారంగంలో నిర్మించుకున్న సంస్థలను, వాటిద్వారా సాధించిన కొద్దిపాటి విజయాలను కూడా నాశనం చేసివేయడంలో వీళ్ళ మూర్ఖత్వం, బుద్ధిమాంద్యం వ్యక్తం అవుతున్నాయి. హిందూత్వ వాదానికి తలొగ్గని సృజనాత్మకతను దేనినీ వీళ్ళు బతకనివ్వడం లేదు. ఈ క్రమంలోనే సంపన్న పెట్టుబడిదారీ దేశాలనుండి వారి సిద్ధాంతాలను, భావజాలాన్ని ఏ విధమైన విమర్శనాత్మక పరిశీలనా లేకుండా ఇక్కడికి దిగుమతి చేస్తున్నారు. తద్వారా ఆ భావాల, సిద్ధాంతాల ఆధిపత్యానికి తలొగ్గుతున్నారు.
ఇక్కడ మానసిక దాస్యం నుండి బైట పడడం అంటే విదేశాలలోని సామాజిక శాస్త్రాలను పూర్తిగా తిరస్కరించడం కాదు సుమా. ఆ సంపన్న దేశాల సామాజిక శాస్త్రాలను యధాతధంగా, పూర్తి విశ్వాసంతో స్వీకరించడాన్ని వ్యతిరేకించాలి. సామ్రాజ్యవాద దోపిడీని కనపడకుండా మసిపూసిన సిద్ధాంతాలే నిజమైన సామాజిక శాస్త్రాలుగా చెలామణీ కావడాన్ని వ్యతిరేకించాలి. బూర్జువా వర్గానికి మొదట్లో ఆర్థిక శాస్త్రం అవసరంగా ఉండేది. కాని ఆ తర్వాత వారికి ఆర్థిక శాస్త్రం కన్నా వారి ఆధిపత్యాన్ని సమర్థించే సిద్ధాంతమే అవసరం అయిందని కార్ల్ మార్క్స్ అన్నాడు. అందుకే నిజమైన శాస్త్రంగా ఆర్ధిక శాస్త్రాన్ని పెంపొందించే కర్తవ్యం కార్మికవర్గం భుజాలపై పడింది. దానిని కార్మికవర్గ దృక్పధం నుంచే కొనసాగించాల్సి ఉంటుంది. సంపన్న పెట్టుబడిదారీ దేశాలలోని ఇతర సామాజిక శాస్త్రాల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. నిజమైన సామాజిక శాస్త్రాల అభివృద్ధి జరగాలంటే అది వలసవాదదోపిడీకి గురైనవారి దృక్కోణం నుండి జరగాలే తప్ప ఆ వలసదోపిడీని సమర్థించే కోణం నుండి కాదు.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్‌పట్నాయక్