Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేడు మన భారత రాజ్యాంగ మౌలిక సూత్రాల పైన దాడిని వివిధ రూపాలలో తీవ్రతరం చేసింది. నిజానికి భారత రాజ్యాంగం రూపు దిద్దుకుంటున్నప్పటి నుండే దానిపై హిందూత్వ శక్తులు దాడి ప్రారంభించాయి. ఎందుకంటే వారి ప్రధాన లక్ష్యమైన హిందూ రాజ్యస్థాపనకు భారత లౌకిక రాజ్యాంగం అడ్డంగా ఉన్నది కాబట్టి. పాకిస్థాన్లో ఏ విధంగా అయితే ముస్లిం మత రాజ్యం ఏర్పడిందో, భారతదేశంలో కూడా హిందూ మతరాజ్యాన్ని నిర్మించాలనేదే వారి బలమైన కోరిక. కానీ అది నెరవేరడమనేది ఒక భ్రమగానే ఉంటుంది. దేశ స్వాతంత్య విముక్తి కోసం 200సంవత్సరాల పాటు జరిగిన పోరాటం భారతదేశం లౌకిక రాజ్యంగా ఉండాలన్న లక్ష్యంతో సాగింది. ఈ జాతీయోద్యమం నుండి లౌకికతత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయం వంటి కీలక అంశాలు ముందుకు వచ్చాయి. వీటి ఆధారంగానే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ రూపొందింది. అందుకే హిందూత్వ సిద్ధాంతానికి ప్రతిరూపమైన ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగంపై తొలినాటి నుండే విషం కక్కడం ప్రారంభించింది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆవిష్కరించబడింది. నాటి నుండి ఆర్ఎస్ఎస్ దాని కాషాయ దళాలు అవకాశం దొరికినప్పుడల్లా భారత రాజ్యాంగంపై దాడి చేస్తూనే వస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా భారత రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాసనాన్ని ప్రతిష్టించాలన్న పన్నాగాన్ని బహిరంగంగానే ముందుకు తెస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఏర్పరచిన వారి మేధావుల వేదిక ''సంస్కార భారత్'' మనుధర్మ శాస్త్రంలోని కొన్ని కఠినమైన పదాలను తొలగించి ప్రజలు ఆమోదించేందుకు వీలుగా మార్చటానికి నిధులు, వగైరా అందించమని కోరుతూ గతంలో లేఖ కూడా రాసింది. 1923లోనే వి.డి.సావర్కర్ రాసిన హిందూత్వ - ఎవరు హిందువు? అనే గ్రంథంలో చెప్పినట్టుగా హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి అని, ముస్లింలు, క్రైస్తవులు ఈ దేశంలోనే పుట్టినా ఆ రెండు మతస్థులు ఈ దేశంలో పూర్తి స్థాయిలో పౌరులు కారని, ఉండదల్చు కుంటే రెండవ జాతి పౌరులుగానే ఉండాలనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం.
ఇలా హిందుత్వ శక్తులు చాలా పకడ్బందీ వ్యూహంతో భారత రాజ్యాంగాన్ని లోలోపల నుండి తొలిచి వేసే కుట్రలు సాగిస్తున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేయడం, దాని స్థానంలో రామమందిరాన్ని నిర్మించడం, మసీదు విధ్వంసానికి పూనుకున్న వారందరూ నిర్దోషులంటూ న్యాయస్థానం తీర్పు చెప్పడం చూస్తే భారత రాజ్యాంగంపై హిందూత్వ శక్తుల దాడి ఎంత తీవ్రస్థాయికి చేరిందో అర్థమవుతుంది. హిందూ సమాజంలోని అసమానత లపై ముఖ్యంగా అణగారిన సామాజిక తరగతులను అభివృద్ధి చేయటానికి రూపొందించ బడిన దళితులు, గిరిజనులపై అత్యాచార నిరోధక చట్టాన్ని, దళితులు, వెనుకబడిన తరగతుల కోసం చేయబడ్డ అసైన్డ్ భూముల విక్రయ నిషేధ చట్టాన్ని, చివరికి రిజర్వేషన్లు కూడా రద్దు చేయటానికి హిందూత్వ శక్తులు చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ అంతిమంగా రాజ్యాంగ స్ఫూర్తిని తుద ముట్టించేవే. ఉమ్మడి జాబితాలో వున్న విద్య, విద్యుత్ వంటి రంగాలలో నిరంకుశంగా చొరబడి చేసిన చట్టాలు, రాష్ట్రాల హక్కులను ఒకదాని తరువాత ఒకటి కాలరాస్తూ భారత రాజ్యాంగ ఫెడరల్ స్వభావాన్ని అంతం చేస్తున్న ప్రయత్నాలను చూస్తే స్వాతంత్య్రోద్యమం ముందుకు తెచ్చిన ఉన్నత విలువలకు చెల్లు చీటీ ఇచ్చి రాజ్యాన్ని మను ధర్మ శాస్త్రం ఆధారంగా నడిపించే దేశంగా మార్చనున్నారని స్పష్టమవుతుంది. భారత రాజ్యాంగం గురించి బీజేపీ, దాని గురువైన ఆర్ఎస్ఎస్ 2014లో అధికారాన్ని చేపట్టిన వెంటనే రాజ్యాంగంపై బహుముఖ దాడులకు దిగాయి. అన్నింటికన్నా దుర్మార్గమైనదేమంటే రాజ్యాంగంలో ఉన్న లౌకిక లక్షణాలకు తిలోదకాలు ఇవ్వచూడటం. కార్యనిర్వాహక వర్గాన్నంతటినీ ఆరెస్సెస్ వారితో నింపివేసిన తరువాత, హిందూ రాష్ట్ర సృష్టికి అంకితమై పలువిధాలుగా మత దురభిమానాన్ని, హిందూత్వ ఛాందసాన్ని పెంచి పోషిస్తూ రాజ్యాంగ విలువలను హరించసాగారు. కేంద్రంలోనే కాకుండా రాష్ట్రాలలో సైతం ప్రజాతంత్ర వ్యవస్థలపైనా, పద్ధతులపైనా బీజేపీ తన ఉక్కు పాదాన్ని మోపుతున్నది. రాష్ట్రాలలో ప్రజాస్వామ్యాన్ని తొక్కివేయటానికి గవర్నర్లను తన పనిముట్లుగా వాడుకుంటున్నది. ప్రస్తుతం పదవుల్లో ఉన్న గవర్నర్లలో అత్యధికులు ఆర్ఎస్ఎస్తో సంబంధమున్న వారే. మోడీ ప్రభుత్వం నిరంతరం కల్పిస్తున్న ఆటంకాల కారణంగా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులు సజావుగా ప్రభుత్వాల్ని నడపలేక పోతున్నారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకై గవర్నర్లను బీజేపీ ఎలా వాడుకుంటున్నదో తెలుసు కోవటానికి గతంలో గోవా, మణిపూర్, మేఘాలయ, కర్నాటక ఘటనలే ఉదాహరణలు. వీటన్నిటి ఫలితంగానే మతవిభజన, విద్వేష ప్రసంగాలు, మైనారిటీలపై దాడులు పెరుగు తున్నాయి. కాబట్టి భారత ప్రజలంతా భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణ తంత్ర రాజ్యంగా నిలబెట్టుకోవాలంటే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140