Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంగళవారం తెల్లవారేసరికి రెండు ప్రధాన అంతర్జాతీయ వార్తలు. ఒకటి రష్యాదిశగా నాటో నావిక, వైమానిక దళాల తరలింపు. తూర్పు ఐరోపా దేశాలకు 50వేల మందివరకు సైన్యాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సర్కార్ చర్చలు. భద్రతా చర్యల్లో భాగంగా తైవాన్ ప్రాంతంపై చక్కర్లు కొట్టిన చైనా వైమానిక దళ విమానాలు. ఉక్రెయిన్ నుంచి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తమ దౌత్యసిబ్బంది, కుటుంబాలను స్వదేశాలకు రావాలని ఆదేశించాయి. ఈ పరిణామాలకు పూసల్లో దారం మాదిరి సంబంధం ఏమైనా ఉందా? అంతర్జాతీయ రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తుల్లో భాగంగా ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. కార్యాకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు. చైనా గనుక తైవాన్ ప్రాంతాన్ని బలవంతంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటే తాము సాయుధ జోక్యం చేసుకుంటామని అంతకు ముందు డోనాల్డ్ ట్రంప్, ఇప్పుడు బైడెన్ పదే పదే హెచ్చరించిన అంశం తెలిసిందే. అలాగే దక్షిణచైనా సముద్రం, తైవాన్ జలసంధిలోకి అమెరికా యుద్ధ నావలను నడిపించిన అంశం తెలిసిందే. ఒక్క చిన్న యుద్ధ రంగంలోనే గెలుపెరగని అమెరికా, దాని అనుచర దేశాలు ఒకేసారి రెండు చోట్ల యుద్ధానికి - అదీ బలమైన రష్యా, చైనాలతో తలపడతాయా?
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే రష్యాను రెచ్చగొట్టేందుకు పశ్చిమ దేశాలు కవ్వింపులకు పాల్పడుతున్నట్టుగా కనిపిస్తోంది. తొలిదశలో వెయ్యి నుంచి ఐదువేల మంది వరకు మిలిటరీని రుమేనియా, ఎస్తోనియా, లిథువేనియా, లాత్వియా దేశాలకు పంపాలని తరువాత 50వేలు, అంతకు మించి కూడా మోహరించాలని అమెరికన్లు చర్చలు జరుపుతున్నారు. బాల్టిక్, నల్లసముద్ర ప్రాంతంలోని ఈ దేశాల నుంచి కొద్ది నిమిషాల్లోనే రష్యాపై క్షిపణి దాడులు జరిపేందుకు వీలు కలుగుతుంది. పశ్చిమ దేశాల కదలికలు, ప్రకటనలను గమనించిన రష్యా సరిహద్దులకు లక్ష మంది సైనికులను తరలించినట్లు వార్తలు. ఐరోపా గడ్డమీద రెండవ ప్రపంచ పోరు తరువాత అతి పెద్ద యుద్ధం అవుతుంది కనుక తాము ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని ఇంత పెద్ద ఎత్తున ఆయుధ తరలింపును తాము చూడలేని అమెరికా ప్రతినిధి విండ్‌మాన్ చెప్పాడు.
నిజంగా యుద్ధం జరుగుతుందా? అసలెందుకీ హూంకరింపులు? ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యం, జాతీయ సమగ్రత పరిరక్షణకోసమే ఇది అంటున్నారు. ఇదొక పెద్ద అబద్దం. రష్యాను దెబ్బతీయాలంటే దాని సరిహద్దులకు నాటోను విస్తరించాలన్నది అమెరికా ఎత్తుగడ. 2014లో రష్యాకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్ పాలకులను కుట్ర చేసి గద్దెదింపారు. తాజా ఉద్రిక్తతలకు మూలం, రష్యా-ఉక్రెయిన్ విబేధాలకు 2013 పరిణామాలు నాంది. ఐరోపా యునియన్‌తో ఆర్థిక సంబంధాలను పటిష్టం చేసుకోవాలన్న ప్రతిపాదనను నాటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ తిరస్కరించాడు. 2013 నవంబరులో దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శకులకు అమెరికా, ఐరోపా దేశాలు, యనుకోవిచ్‌కు రష్యామద్దతు ఇచ్చింది. ఆర్థిక సంబంధాల ముసుగుతో నాటోలో చేర్చుకోవాలని అమెరికా చూస్తే, వ్యతిరేకించి నిలువరించాలన్నది రష్యా ఎత్తుగడ. మరుసటి ఏడాది ఫిబ్రవరిలో యనుకోవిచ్ దేశం వదలిపారిపోయాడు. మార్చినెలలో క్రిమియా ప్రాంతంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ జనం రష్యాతో కలవాలని తీర్పు చెప్పారు. దాన్ని అవకాశంగా తీసుకొని రష్యా తనతో విలీనం చేసుకుంది.(గతంలో రష్యా రిపబ్లిక్లో భాగంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని నాటి సోవియట్ పాలకులు పాలనా సౌలభ్యత కోసం ఉక్రెయిన్‌లో కలిపారు.) మరో రెండు నెలల తరువాత తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటు వాదులు డోన్‌టెస్క్, లుహాన్స్క్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా వేరుపడాలని జనం చెప్పారు. దాన్ని ఉక్రెయిన్ తిరస్కరించింది. తరువాత అక్కడి వేర్పాటు వాదులు ఆయుధాలు పట్టి అనేక ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. ఇప్పటికీ అదే స్థితి కొనసాగుతోంది. వారికి రష్యా మద్దతు ఇస్తోంది. 2015లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ ఎవరూ దానికి కట్టుబడిలేరు. అంతర్యుద్దంలో 15వేల మంది మరణించారని అంచనా.
ఇప్పుడు ఆ వేర్పాటువాదులు కోరుతున్నట్లుగా వారిని రష్యా గుర్తించినా లేదా వారికి మద్దతుగా సైన్యాన్ని పంపినా ఆ పేరుతో రష్యా మీద దాడికి దిగాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకుగాను పచ్చి అవాస్తవాలను ప్రచారంలో పెట్టారు. మధ్యధరా సముద్రంలో నాటో కూటమి ఇప్పుడు ''నెప్ట్యూన్ స్ట్రైక్ 22'' పేరుతో ఫిబ్రవరి నాలుగు వరకు సైనిక విన్యాసాలు జరుపుతున్నది. ఇంకా డైనమిక్ మంటా 22, డైనమిక్ గార్డ్, కోల్డ్ రెస్పాన్స్ 22 పేరుతో కూడా సైనిక విన్యాసాలు జరపనున్నాయి. ఇవన్నీ బలప్రదర్శన తప్ప మరొకటి కాదు. బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, విదేశాంగశాఖ చేసిన ప్రకటనలో ఉక్రెయిన్‌లో తన అనుకూల మాజీ ఎంపీ మురాయెవ్‌ను గద్దెమీద నిలిపేందుకు రష్యాకుట్ర పన్నినట్లు ఆరోపించింది. దీని మీద స్పందించిన అతగాడు బ్రిటన్ గాలితీశాడు. బ్రిటన్ విదేశాంగశాఖ గందరగోళంలో ఉన్నట్లుంది. రష్యా నామీద నిషేధం విధించింది, అంతేకాదు నాతండ్రి సంస్థ నుంచి డబ్బు తీసుకోకుండా ఆ సంస్థనే స్వాధీనం చేసుకుందని చెప్పాడు. అయినా సరే ప్రచారం ఆపలేదు, అమెరికా దాన్ని లంకించుకుంది. నాటో దేశాల్లో 20లక్షల మందికి పైగా కరోనాతో మరణించినా వారికి పట్టలేదు. ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం పేరుతో కవ్వింపులకు దిగుతున్నారు. ప్రజారోగ్యరక్షణ ఖర్చును ఆయుధాల మీద ఖర్చు చేస్తున్నారు.
సోషలిస్టు వ్యవస్థను కూల్చివేసి, స్వాతంత్య్రం ప్రకటించుకున్న తరువాత ఉక్రెయిన్ కుక్కలు చింపిన విస్తరిలా మారింది. ఎవరికి దొరికిన ప్రజాసంపదలను వారు స్వంతం చేసుకున్నారు. నడమంత్రపు సిరిగాళ్లు ముందుకు వచ్చారు. ఇప్పుడు అన్ని రంగాలను వారే శాసిస్తున్నారు. మీడియా, అధికారులు, న్యాయమూర్తులు, ఎంపీలు అందరూ సంతలోని సరకులుగా మారారు. ఎవరికి వారు స్వంత సాయుధ ముఠాలను ఏర్పాటు చేసుకున్నారు. ఫాసిస్టు శక్తులు రాజకీయాల్లోకి వచ్చాయి. 2014లో రష్యా అనుకూల యనుకోవిచ్‌ను గద్దె దించేందుకు ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు అమెరికా విదేశాంగ సహాయమంత్రి విక్టోరియా న్యూలాండ్ స్వయంగా చెప్పారు. నాటి జర్మన్ మంత్రి స్వయంగా ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపాడు. తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదులతో తలపడేందుకు ఏర్పాటు చేసిన అజోవ్ రెజిమెంట్ అనే కిరాయి సాయుధమూకకు 2014 కుట్రలో జైలు నుంచి విడుదలైన నేరగాడు ఆండ్రీ బిలెట్స్కీ నేత. పచ్చి నాజీ. ఇలాంటి ముఠాలను ఉక్రెయిన్ మిలిటరీతో సమన్వయం చేసి వేర్పాటువాదుల మీదకు వదులుతున్నారు. ఈ రెజిమెంట్‌కు మీడియా, రాజకీయపార్టీ, సాయుధ శిక్షణా కేంద్రాలు, ఆయుధాలు ఉన్నాయి.
వివిధ కారణాలతో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తమ స్వంత మిలిటరీ సిబ్బంది పాత్ర నామమాత్రం గావించి కిరాయి మూకలను దించటం ఇటీవలి కాలంలో నానాటికీ పెరుగుతోంది. సిరియాలో అది స్పష్టంగా కనిపించింది. గత కొద్ది సంవత్సరాలుగా అలాంటి మూకలకు కేంద్రంగా ఉక్రెయిన్ మారింది. గత ఆరు సంవత్సరాలుగా 50దేశాల నుంచి 17వేల మందికి పైగా కిరాయి మూకలు అక్కడకు వచ్చినట్లు ఎఫ్బిఐ మాజీ ఏజంట్ అలీ సౌఫాన్ చెప్పినట్లు గతేడాది టైమ్ పత్రిక రాసింది. వీరందరికి అక్కడి అమెరికా అనుకూల ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. అజోవ్ సంస్ధను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధగా ప్రకటించాలన్న 40మంది ఎంపీల వినతిని అమెరికా సర్కార్ బుట్టదాఖలు చేసింది. ఇలాంటి నయా నాజీ మూకలకు అమెరికా శిక్షణ, ఆయుధాలను అందచేస్తోంది. ఇది బరాక్ ఒబామా ఏలుబడి నుంచీ జరుగుతోంది. కొత్తగా ఏర్పాటు చేసిన సరిహద్దు రక్షణ దళాలతో పాటు ప్రయివేటు సాయుధ ముఠాలకూ శిక్షణ ఇస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక గతేడాది డిసెంబరు 26న రాసింది. ఇప్పుడు మిలిటరీతో పాటు ఇలాంటి ముఠాలను కూడా సన్నద్దం చేయటాన్ని బట్టి వారిని ఎలా ఉపయోగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాన్ని, ఉద్యమించే కార్మికవర్గాన్ని అణచేందుకు, రష్యాతో గిల్లి కజ్జాలు పెట్టుకొనేందుకు వీరిని ముందుకు నెట్టే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌లోని డోన్‌టెస్క్, లుహానస్క్ ప్రాంతాలలో వేర్పాటు వాదులపైకి వీరిని ఉసిగొల్పితే వారికి మద్దతుగా రష్యా రంగంలోకి దిగవచ్చని, దాన్ని సాకుగా చూపి నాటో దేశాలు దాడులకు పూనుకొనే ఎత్తుగడ కూడా ఉంది. ఇది ఒక అంశం మాత్రమే.
మరో రెండు దశాబ్దాల వరకు నాటో కూటమిలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వబోమని రష్యాను నమ్మించేందుకు అమెరికా పూనుకుంది. అమెరికా కడుపులో దుష్టాలోచన లేకపోతే ఇప్పుడు ఆయుధ సమీకరణ ఎందుకు అని అనుమానించిన రష్యా రిజర్వు దళాలు, క్షిపణులను మోహరిస్తున్నది.పశ్చిమ దేశాలు ప్రత్యేకించి అమెరికన్ మీడియా యుద్దోన్మాదంతో ఊగిపోతున్నది. జనానికి ఎక్కిస్తున్నది. ఏక్షణమైనా దాడులు జరగవచ్చంటూ వర్ణిస్తున్నది. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఉక్రెయిన్‌లో మూడు లక్షల మందికి ఆయుధ శిక్షణ ఇచ్చామని వారికి ఆయుధాలు, డబ్బు అందచేస్తే వారే రష్యా సంగతి చూసుకుంటారని తన మిత్రదేశాలకు అమెరికా చెప్పినట్లు వార్తలు. నాటో కూటమి దేశాలన్నింటా మీ చావు మీరు చావండి, కరోనాతో సహజీవనం చేయండి అంటూ వదిలేసిన పాలకుల మీద కార్మికవర్గం ఆగ్రహంగా ఉంది. అటువంటప్పుడు యుద్ధానికి మద్దతు ఏమేరకు ఇవ్వగలరన్నది సందేహమే. ఇదే విధంగా రష్యాలో వ్లదిమిర్ పుతిన్ స్థితి కూడా అంత సానుకూలంగా లేదు. అందువలన రెండు పక్షాలూ బేరసారాలు తప్ప తెగే దాగా లాగే పరిస్థితి ఉండకపోవచ్చు. పుతిన్ మాటకు గౌరవం, విలువ ఇవ్వాలంటూ ఢిల్లీలో మాట్లాడిన జర్మన్ నౌకాదళాధిపతికి స్వదేశం వెళ్లే సరికి ఇక చాలు ఇంటికి దయచేయండి అనే వర్తమానం సిద్దంగా ఉంది. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని విచారం వెలిబుచ్చినా పదవి ఊడింది. మరోవైపు ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వకూడదని జర్మనీ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఎస్తోనియాకు తాము అందచేసిన వాటిని కూడా ఉక్రెయిన్‌కు తరలించరాదని షరతు పెట్టింది. రష్యాతో సంబంధాల అంశంలో జర్మనీలో భిన్న వైఖరులున్నట్లు ఈ పరిణామాలు వెల్లడించాయి. ఆర్థిక ఆంక్షలపై జర్మనీ అంగీకరించటంలేదు. రష్యానుంచి పెద్ద గాస్ సరఫరా ప్రాజెక్టుకు జర్మనీ మద్దతు ఇస్తున్నది. ఐరోపా యునియన్ నుంచి వెళ్లిపోయిన బ్రిటన్ మాత్రం అమెరికాకు పూర్తి మద్దతు ఇస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఆంక్షలకు అలవాటు పడిన రష్యా ఇంతకంటే తమను చేసేదేముందనే తెగింపుతో ఉంది.
ఉక్రెయిన్ వేర్పాటు వాద ప్రాంతాలను స్వతంత్రదేశాలుగా రష్యా గుర్తిస్తే స్వల్పవివాదం తలెత్తవచ్చు. అది కూడా వేర్పాటువాదులు, ఉక్రెయిన్ మిలిటరీకే పరిమితం కావచ్చు తప్ప నాటో రష్యా పోరుగా మారే అవకాశాలు పరిమితం. ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, ఉక్రెయిన్‌కు అందచేసిన ఆయుధాలను వెనక్కు తీసుకోవాలని రష్యాకోరుతోంది. అమెరికా నిరాకరిస్తోంది. ఉక్రెయిన్ నాటో కూటమికి దగ్గరగా ఉన్నప్పటికీ దానిలో సభ్యురాలు కాదు. గతంలో జార్జియాలో రెండు ప్రాంతాలు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నపుడు రష్యాగుర్తించింది. రెండు దేశాల మధ్య 2008లో స్వల్పపోరు జరిగింది. ఇప్పుడు కూడా అదే మాదిరి పరిణామాలు ఉంటాయా? ప్రతి మేఘం వర్షించదు ప్రతి ఉరుముకూ పిడుగులు పడవు. ప్రతి పరిణామమూ వినాశకర పోరుకు దారితీయదు.
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288