Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంద్రాగస్టు.. చబ్బీస్ జనవరిని జాతీయ పండుగలుగా జరుపుకుంటాం మనం. ఆసేతు హిమాచలం భారత జాతి యావత్తు ఈ రోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నది. అయితే రెండు పండుగల మధ్య తేడా మాత్రం చాలా కీలకమైనది. పంద్రాగస్టు మన దేశానికి స్వాతంత్రం తీసుకువస్తే.. ఆ స్వాతంత్రం రాజులు, మహరాజులు, ధనికస్వాములకే కాకుండా.. దేశ ప్రజలందరికీ చెందేట్టుగా చేసింది మాత్రం చబ్బీస్ జనవరి. జనవరి 26, 1950న సర్వ సత్తాక ప్రజాతంత్ర రిపబ్లిక్‌గా మన దేశం అవతరించడానికి కారకులయిన అంబేద్కర్, నెహ్రూ తదితర మహనీయులకు వందనాలు అర్పిస్తూనే.. వారి నాటి కృషిని నిష్ఫలం చేయడానికి నేడు సాగుతున్న కుట్రలను ఎదుర్కోవడానికి దేశప్రజలు సమాయత్తం కావాలి.
1947 నాటికి.. అశేష త్యాగాలతో బ్రిటిష్ వాళ్లని ఈ దేశం నుండి వెళ్లగొట్టాక.. నవ భారత ప్రస్థానం అంత సాఫీగా ఏం మొదలు కాలేదు. దేశ భవిష్యత్తు రూపురేఖల గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. జమీందారులు, మాజీ రాజుల వారసులు, మత నాయకులు, భూస్వామ్య శక్తుల వారందరూ తమ గత కాలపు దోపిడీకి సహకరించిన పాత వ్యవస్థనే దేశంలో పునః ప్రతిష్ట చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. పాతకాలపు రాజుల నుండి బ్రిటిష్ వాడు అధికారం గుంజుకున్నాడు కాబట్టి.. ఇప్పుడు బ్రిటిష్ వాడిని వెళ్లగొట్టిన తర్వాత.. ఆ రాజుల వారసులను వెతికి తీసుకొచ్చి వాళ్లకు గద్దెలను అప్ప చెప్పడమే సనాతన ధర్మమూ, సమంజసమూ అనే రీతిలో ఈ ప్రగతి నిరోధక శక్తుల వాదనలు కొనసాగాయి. వారందరి శుష్కవాదనలను పూర్వపక్షం చేస్తూ.. ఈ దేశం ఇక ఎంత మాత్రం వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు, భరతమాత చూపు ఇక ఆగామి పథం వైపే ఉంటుంది, రాజులు, జమీందారులు, మత నాయకులను చరిత్ర చెత్తబుట్టలో పడేసి ముందుకు సాగడమే దేశానికి శ్రేయస్కరమని స్పష్టమైన పంథాను నాటి జాతీయ నాయకులు అవలంబించారు.
మనుషుల సామాజిక ఆర్థిక స్థాయిని బట్టి వాళ్ల హక్కులు నిర్ధారించే కుత్సిత మనుధర్మం ఈ దేశంలో రెండు వేల ఏండ్లుగా రాజ్యం చేస్తే.. దాన్ని భూస్థాపితం చేస్తూ.. కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడాలు లేకుండా మనుషులందరికీ సమాన హక్కులనందించే సరికొత్త వ్యవస్థ అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతో రూపుదాల్చింది. ఈ గడ్డ మీద పుట్టిన మనుషులందరూ సమానులేనన్న మానవతా సూత్రాన్ని మొట్ట మొదటి సారిగా శాసన బద్ధం చేసిన మహౌన్నత స్వేచ్ఛా పతాక మన భారత రాజ్యాంగం!
స్వాతంత్య్ర సమరం సాగుతున్నప్పుడు అందులో పాల్గొనకుండా.. మత కార్యక్రమాలకు శక్తియుక్తులు వెచ్చించడమే తమకు ముఖ్యమంటూ నిస్సిగ్గుగా ప్రకటించుకున్న మతోన్మాద శక్తులు.. స్వాతంత్ర సిద్ధి జరిగి, నవ రాజ్యాంగ రూపకల్పన సాగుతున్నప్పుడు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. దేశ ప్రజలని కులాల వారిగా చీల్చి దేశ అనైక్యతకు, వెనుకబాటుతనానికీ మూలకారణంగా నిలిచిన మనుస్మృతియే అసలు రాజ్యాంగంగా భావిస్తున్న ఈ మనువాద- మతోన్మాద శక్తులు.. తొలినాటి నుండి భారత రాజ్యాంగాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. వారు శిరోధార్యంగా భావించే మనుస్మృతి ప్రకారం కడజాతి వాడైన అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రచన జరగడం మనువాదులకు అస్సలు మింగుడు పడలేదు. ''మనువు స్థానంలో పంచముడైన అంబేద్కర్‌ని ఎట్లా ఒప్పుకుంటాం..?'' అంటూ దురహంకార పూరితంగా హుంకరించారు వాళ్ళు. స్వతంత్ర భారత రాజ్యాంగం.. మనుధర్మ సూత్రాలకు అనుగుణంగా ఉండాలంటూ డిమాండ్ చేసారు. 26 నవంబరు 1949న దేశ రాజ్యంగ సభ రాజ్యంగాన్ని స్వీకరించిన తరువాత.. 30 నవంబరు 1949 సంచికలో ఆరెస్సెస్ అధికార పత్రిక ''ఆర్గనైజర్'' భారత రాజ్యాంగాన్ని తూలనాడుతూ ఇలా రాసింది.. ''భారతదేశానికి రాజ్యాంగం ఇప్పుడు కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. ప్రాచీన కాలంలో మనువు రాసిన సూత్రాలు ఉన్నప్పటికీ వాటి ప్రస్తావనే రాజ్యాంగంలో లేకపోవడం పెద్ద అపరాధం. ప్రపంచానికే ఉత్తేజంతో దారి చూపగల ఆరాధనపూరితమైన మనుధర్మ శాస్త్రం.. అంబేద్కర్ రాజ్యాంగ పండితులకూ గుర్తు కూడా రాలేదు.''
ఆర్ఎస్ఎస్ రెండవ సర్ సంఘచాలక్ ఎం.ఎస్. గోల్వాల్కర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అసలు విలువ లేనిదంటూ తేల్చిపారేశాడు. ''పాశ్చాత్య దేశాల రాజ్యాంగాల నుండి అక్కడో ముక్క, ఇక్కడో ముక్క పేర్చి.. భారత రాజ్యాంగమంటూ వీళ్ళు మనకు చూపెడుతున్నారు. అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగంలో భారతీయమైనదంటూ ఏదీలేదు.. అంతా పరాయిదే'' నంటూ తేల్చేసాడాయన. కులం పేరుతో తన సోదరులను బానిసలుగా చూడడం గోల్వాల్కర్ దృష్టిలో భారతీయత. దేశ ప్రజలందరూ సమానులేనని చెబితే.. అది పరాయి భావన. ఇలా సాగింది ఈ దేశ భక్తుల కుతర్కం!
నడుస్తున్న కాలంలోనూ ఈ మనువాద - మతోన్మాదులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్ల తమ వ్యతిరేకతను ఏమాత్రమూ దాచుకోవడం లేదు. బీజేపీ పార్టీ తరఫున లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించిన సుమిత్రా మహాజన్ 2018లో జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక సమావేశంలో ప్రసంగిస్తూ.. ఉద్యోగాలలో రిజర్వేషన్ల కారణంగా దేశానికి హాని కలుగుతుందనీ, రిజర్వేషన్లను ఇంకెంత కాలం కొనసాగిస్తామంటూ ప్రశ్నించారు. ''ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అనుభవిస్తున్నవారు.. తమ కారణంగా సమాజం ముక్కలవుతుందని గుర్తించాలి!'' అంటూ సుమిత్రా హితవు పలికారు. అంతకు ఓ ఏడాది క్రితమే బీజేపీ అగ్రనేత, ఉత్తరప్రదేశ్ మహిళా విభాగం అధ్యక్షురాలు మధుమిశ్రా పార్టీ సమావేశంలో మాట్లాడుతూ... ''ఒకప్పుడు మన బూట్లు పాలిష్ చేసినోళ్ళు ఇప్పుడు మనలను పాలిస్తున్నారు. వారికి అధికారం రావడానికి రాజ్యాంగమే కారణం. బీజేపీ వాళ్లందరమూ ఐక్యమై దీన్ని అడ్డుకోవాలి'' అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. పోయిన నెల ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ధర్మసంసద్ పేరిట విద్వేష ప్రసంగాల వేదిక నేర్పాటు చేసిన యతి నర్సింగానంద్ అనే మత నాయకుడు.. రాజ్యాంగమూ సుప్రీంకోర్టుల పట్ల తమకు ఎలాంటి విశ్వాసం లేదని బహిరంగంగా ప్రకటించాడు. దేశ రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్లు కుక్క చావు చస్తారంటూ శాపనార్థాలు పెట్టాడు. తెలంగాణ సర్కార్‌కు రాజగురువుగా వ్యవహరిస్తున్న చినజీయర్ స్వామి సైతం తన మత ప్రవచనాలలో భాగంగా మెజార్టీ శ్రామికవర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆహార సంస్కృతి ని తూలనాడుతూ మాట్లాడాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల... అణగారిన వర్గాల పట్ల ఈ మనువాద మూకల వైఖరి ఇది!
బీజేపీ ప్రభుత్వంలో గతంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన అనంత కుమార్ హెగ్డే అనే నాయకుడు 2017లో కర్నాటకలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ దేశ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికే తాము అధికారంలో కొచ్చామని స్పష్టంగా తేల్చేసాడు. ప్రయివేటీకరణ మా విధానమని ప్రకటిస్తూ.. ఎల్ఐసీ, బ్యాంకులు రైల్వే విశాఖస్టీల్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని ప్రయివేటు ఆసాముల పరం చేయడం సైతం క్రమక్రమంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యపరచడానికి జరుగుతున్న కుట్రే. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తే రాజ్యాంగానికి గుండెకాయ లాంటి ''సంక్షేమ రాజ్య భావన'' ఆవిరైపోతుంది. రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం లేకుండానే.. రిజర్వేషన్లు వాటికవే కనుమరు గవుతాయి. దురదృష్టవశాత్తూ ఈ కుట్రలని దేశ ప్రజలు సరిగ్గా గుర్తించలేకపోతున్నారు.
అంబేద్కర్, నెహ్రూ, పటేల్, ఆజాద్‌లతో సహా.. స్వాతంత్రోద్యమ నేతలందరూ సమతావాద నవ రాజ్యాంగం వెలుగులో దేశం ముందడుగు వేయాలని ఆనాడు దృఢంగా విశ్వసించారు. స్వాతంత్య్రం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్థం పునాదులై ఇల్లులేచి, సమస్త భారత జనావళికి శుభం చేకూరాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని వారికి.. బ్రిటిష్ రాణికి క్షమాభిక్ష పత్రాలు సమర్పించి లొంగిపోయిన వారికి, ''బ్రిటిష్ వారితో పోరాడటం మా లక్ష్యం కాదు.. మత రాజకీయాలే మా పరమావధి'' అంటూ ప్రకటించిన వారికీ.. నేడు గద్దెనెక్కిన వారి వారసులకీ.. స్వాతంత్య్రోద్యమ భావనలు, రాజ్యాంగ విలువలూ ఎలా ఒంటబడతాయి? గతకాలపు మితవాదపు ప్రతినిధులైన వారికి ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి మను ధర్మాన్ని పునః ప్రతిష్ట చేయడమే అసలు ఎజెండా. దేశంలోని మెజారిటీ శ్రామిక వర్గాలకు మాత్రం సెక్యులర్ సోషలిస్టు రాజ్యాంగమే వారి ప్రయోజనాలకు రక్ష. ఆ రాజ్యాంగాన్ని సంరక్షించుకునే దీక్షతో సమైక్యంగా ముందడుగు వేయడం.. అత్యంత ప్రాధాన్యత గల దేశభక్తియుత కర్తవ్యంగా నేడు మన ముందు నిలిచి ఉన్నది.
-ఆర్. రాజేశమ్, సెల్: 9440443183