Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశానికి స్వాతంత్య్రం లభించి 75సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్'ను నిర్వహించడానికి సంబంధించి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనను జనవరి 11న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) విడుదల చేసింది. బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం కోసం భారతీయులు సాగించిన పోరాటాన్ని వక్రీకరించడానికి, ఆ చరిత్రను తిరిగి రాయడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలన్న మోడీ ప్రభుత్వ ఉద్దేశ్యం ఈ ప్రకటనలో స్పష్టంగా వ్యక్తమైంది. ''ఈ స్వాతంత్య్ర ఉద్యమం కేవలం బ్రిటిష్ పాలనకే పరిమితం కాలేదు. అంతకు ముందు కూడా భారతదేశం దాస్య పాలనలో సాగింది'' అని ఆ ప్రకటన పేర్కొంది. ఈనాడు ఉన్న భారత ఉపఖండం భౌగోళిక మ్యాప్ గతంలో వివిధ రాజ్యాలుగా విభజించబడి ఉంది. వాటిని బ్రిటిష్ వారు సంస్థానాలని పిలిచేవారు. బ్రిటిష్ వారిని పారద్రోలి, దేశానికి స్వాతంత్య్రం సంపాదించుకున్న తర్వాత 650కి పైగా ఇటువంటి సంస్థానాలన్నీ యూనియన్ ఆఫ్ ఇండియాగా ఒక్క చోటకు చేర్చారు. దీన్ని ప్రాతిపదికగా చేసుకునే రాజ్యాంగ నిర్ణాయక అసెంబ్లీ భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం లభించిన రెండున్నరేండ్ల తర్వాత 1950లో ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడం ద్వారా లౌకిక, ప్రజాతంత్ర, భారత రిపబ్లిక్ ఏర్పడినట్లు ప్రకటించారు. బ్రిటిష్ వలస పాలనను విజయవంతంగా ఓడించిన తర్వాత భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
ఆ రకంగా, మహత్తరంగా సాగిన ఈ స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములు కాని ఆర్ఎస్ఎస్, హిందూత్వ భావజాలపు పూర్వీకులు వంటివారు-భారతీయులందరూ వారి కుల, మతాలతో నిమిత్తం లేకుండా, మనకు స్వాతంత్య్రం సాధించడానికి, ఈ లౌకిక, ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ను సాధించడానికి చేసిన అపారమైన త్యాగాలన్నింటినీ పూర్తిగా విస్మరించారని స్పష్టమైంది.
మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాటంగా పేర్కొనే 1857 తిరుగుబాటుకు స్వామి వివేకానంద, రమణ మహర్షి వంటి వారు స్ఫూర్తినిచ్చారని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటన పేర్కొంది. కానీ స్వామి వివేకానంద 1863లో జన్మించగా, రమణ మహర్షి 1879లో జన్మించారు. కాబట్టి, వారు 1857 తిరుగుబాటుకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని చెప్పుకోవడం హాస్యాస్పదం తప్ప మరొకటి కాదు.
1857లో వచ్చిన గదర్ పోరాటం భారత ప్రజలు సాగించిన ఐక్య తిరుగుబాటు. ఇందులో హిందువులు, ముస్లింలు ఇరువురూ ప్రముఖంగా పాత్ర పోషించారు. ఝాన్సీ రాణి లక్ష్మీబారు, తాంతియా తోపే, 1857 పోరాటంలో పాల్గొన్న ఇతర నేతలు అందరూ కలిసి బ్రిటిష్ వారి నుండి మనకు స్వాతంత్య్రం లభించిందని పేర్కొంటూ మొఘల్ పాలకుడు బహదూర్ షా జాఫర్ పేరు పెట్టిన ఎర్రకోట బురుజుల నుండి స్వతంత్ర భారతదేశాన్ని ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ భాషలో చెప్పాలంటే మొఘల్ పాలకుడు బహదూర్ షా జాఫర్‌ను 'బాబర్ కీ అలద్'గా ఎద్దేవా చేస్తారు.
ముస్లింలను ఊచకోత కోయాలంటూ ధర్మ సంసద్ సమావేశాల్లో రెచ్చగొట్టేలా పిలుపులివ్వడం, అసభ్యకరమైన యాప్‌లతో సోషల్ మీడియాలో ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకోవడం, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు 80:20శాతం (ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం జనాభా దాదాపు 19శాతం) మధ్య జరిగే పోటీ అని యూపీ ముఖ్యమంత్రి ప్రకటించడం ఇటువంటి ద్వేషపూరిత ప్రచారాన్ని చూస్తుంటే భారత రిపబ్లిక్ ప్రజాస్వామ్య స్వభావాన్ని మార్చేందుకు ఆర్ఎస్ఎస్, మోడీ ప్రభుత్వానికి గల ఉద్దేశ్యాలు స్పష్టంగా వెల్లడవుతున్నాయి.
భారత రాజ్యాంగంలో పేర్కొన్న భారత రిపబ్లిక్ లౌకిక, ప్రజాస్వామ్య స్వభావాన్ని మార్చి, ఆ స్థానంలో క్రూరమైన, అసహనంతో కూడిన ఫాసిస్టు 'హిందూత్వ రాష్ట్ర'ను ఏర్పాటు చేయాలన్న వారి నీచపుటెత్తుగడలు స్పష్టమయ్యాయి. స్వాతంత్య్రం కోసం భారత ప్రజలు సాగించిన మహత్తర పోరాటానికి ఇది పూర్తి వ్యతిరేకంగా ఉంది.
''అజ్ఞాతంలో ఉన్న స్వాతంత్య్ర సమరయోధులపైకి అందరి దృష్టిని మరల్చాలనే ఉద్దేశ్యంతోనే అమృత్ మహౌత్సవ్ ఉత్సవాలను ప్రారంభించినట్లు పిఐబి ప్రకటన పేర్కొంది. అయితే దీని వెనుక దుష్టపూరితమైన ఆలోచనలతో కూడిన ఎజెండా దాగుంది. వాస్తవానికి బ్రిటిష్ వారితో చేతులు కలిపి కుమ్మక్కైన ఆర్ఎస్ఎస్-హిందూత్వ శక్తులను స్వాతంత్య్ర పోరాట యోధులుగా చూపించడానికి జరిగే ప్రయత్నమే ఇది. చివరకు ఆర్ఎస్ఎస్ గురించి సానుభూతిగా రాసిన పుస్తకాల్లో (1987లో వాల్టర్ కె.ఆండర్సన్, శ్రీధర్ డి. దామ్లే రాసిన 'ది బ్రదర్హుడ్ ఇన్ శాఫ్రన్-తదితర పుస్తకాలు) కూడా స్వాతంత్య్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ లేకపోవడం గురించి, తదనుగుణంగా బ్రిటిష్ వారి నుండి ఆర్ఎస్ఎస్కి లభించిన రాయితీల గురించి వివరంగా పేర్కొన్నారు. వాస్తవానికి, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా బాంబే హౌం శాఖ ''సంఫ్‌ు ఉద్దేశ్యపూర్వకంగానే తనను తాను చట్టం పరిధిలో ఉండేలా చూసుకుంది. ముఖ్యంగా, 1942 ఆగస్టులో చెలరేగిన అల్లర్లు, ఘర్షణల్లో పాల్గొనకుండా దూరాన్ని పాటించింది...'' అని వ్యాఖ్యానించింది (1987లో రాసిన ఈ పుస్తకంలో 44వ పేజీలో ఆండర్సన్, డామ్లేలు ఉటంకించారు). 'హిందూత్వ రాష్ట్ర'ను స్థాపించాలన్న వారి ఆకాంక్ష కారణంగానే ఆర్ఎస్ఎస్, బ్రిటిష్ వారికి మిత్రపక్షంగా ఉండేలా వ్యవహరించింది.
బ్రిటిష్ వారితో కుమ్మక్కవడంపై ఇంతలా నిర్థారణలతో కూడిన రికార్డు ఉన్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ మాత్రం స్వాతంత్య్రోద్యమంలో కమ్యూనిస్టుల పాత్రకు వ్యతిరేకంగా అసత్యాలను వ్యాప్తి చేయడంలో అలుపన్నదే లేకుండా పని చేస్తోంది. క్విట్ ఇండియా ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్రకు సంబంధించి, 1992 ఆగస్టు 9న దేశం 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ భారత పార్లమెంట్లో అర్థరాత్రి జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ''కాన్పూర్, జంషెడ్పూర్, అహ్మదాబాద్‌లో మిల్లులపై పెద్ద ఎత్తున దాడులు జరిగిన తర్వాత, లండన్ లోని సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కు 1942 సెప్టెంబరు 5న ఢిల్లీ నుండి ఒక లేఖ వెళ్ళిందని... ఆ లేఖలో భారత కమ్యూనిస్టు పార్టీ గురించి, ఆ పార్టీకి చెందిన పలువురు సభ్యుల వ్యవహార శైలి గురించి పేర్కొంటూ బ్రిటిష్ వ్యతిరేక విప్లవకారులతో కూడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని రుజువైంది'' అని చెప్పిన వైనాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు. ఆ ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటే క్విట్ ఇండియా ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర ఏమిటన్నది స్పష్టమవుతుంది.
కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ బ్రిటిష్ వ్యతిరేక విప్లవ వీరులేనంటూ భారత పార్లమెంట్లో జరిగిన ఒక అధికార కార్యక్రమంలో స్వతంత్ర భారత రాష్ట్రపతి సూటిగా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా అంతకు మించి ఇంకా ఏమైనా చెప్పాలా?
భారత రాజ్యాంగంలో హామీ కల్పించిన రీతిలో మరింత సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం దిశగా ముందుకు సాగే భారతీయులందరితో కలిసి... మన స్వాతంత్య్ర పోరాట వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు గాను భారత రిపబ్లిక్‌ను ఏర్పరచుకున్నాం. గణతంత్ర స్వభావాన్ని మార్చేందుకు సాగుతున్న విద్వేష ప్రచార ఎజెండాను తప్పనిసరిగా ఓడించాలి. ''ఇండియా, అదే భారత్'' కోసం, స్వతంత్ర భారత దేశపు స్వభావాన్ని మార్చాలని కోరుకుంటున్న శక్తులను ఓడించాల్సిందే.
('పీపుల్స్డెమోక్రసీ' సంపాదకీయం )