Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిభా పాటవాలు అనేవి కొందరు వ్యక్తుల సొత్తు కాదని, సామాజిక జీవనంలో అందుబాటులో ఉండే అవకాశాలను బట్టి సంక్రమిస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. రిజర్వేషన్ల వలన ప్రతిభ దెబ్బతింటుంది అనే వాదన ఎప్పుడూ ఉండేదే. 2020-21 విద్యా సంవత్సరానికి నీట్-పీజీ (మెడికల్, డెంటల్ పీజీ కోర్సులు) సీట్ల భర్తీ విషయంలో అదే వాదన మరోసారి ముందుకొచ్చింది. ఓబీసీ రిజర్వేషన్ కోటాలో ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయిన వారికి పీజీ కోర్సులకు కూడా అదే రిజర్వేషన్ వర్తింప చేయడం ఏమిటని పిటిషనర్లు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఒకసారి డాక్టర్ అయిన వారికి ఇంకా వెనుకబాటుతనం ఏమిటి? అని ప్రశ్నించారు. నీట్ పరీక్షలో పొందిన మెరిట్ ను దాటవేసి రిజర్వేషన్ వారికి సూపర్ స్పెషాలిటీ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తే అది దేశానికే నష్టం అని వాదించారు. ఉన్నత శ్రేణి డిగ్రీ, సబ్జెక్టులో నైపుణ్యం కలవారికే మెడికల్, డెంటల్ పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్ ఇవ్వాలని, రిజర్వేషన్లు అమలు చేయవద్దని అభ్యంతరం చెప్పారు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు పొందిన వారికే ప్రతిభ ఉంటుందని, రిజర్వేషన్ ద్వారా సీట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి ప్రతిభ ఉండదు అనేది ఆ వాదనల సారాంశం. ఆ వాదనలను నిరాకరిస్తూ జస్టిస్ డాక్టర్ ధనుంజయ వై. చంద్రచూడ్, జస్టిస్ ఏ. ఎస్. బోపన్న ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ నెల (2022 జనవరి) 20న వెలువరించిన తీర్పులో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యానాలు మరియు పేర్కొన్న నిర్ధారణలు క్రింది విధంగా ఉన్నాయి.
''సామాజిక పరమైన, విద్యాపరమైన వెనుకబాటుతనం ఒక డిగ్రీ సర్టిఫికేటుతో పోయేది కాదు. డిగ్రీ పాసైనంత మాత్రాన సంపన్నులు, పేదలు సమానం కారు. వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. అసమానత అనేది సామాజిక చట్రంలోనే ఉంది. శతాబ్దాలుగా అణగారిన వారికి ఒకసారి కొంత ఆర్ధిక ప్రయోజనం కలిగినంత మాత్రాన, ఒక ఉద్యోగం వచ్చినంత మాత్రాన ఆటోమాటిక్‌గా వారి పిల్లలకు రిజర్వేషన్ అవసరం లేకుండా పోదు'' అని ధర్మాసనం చెప్పింది. ప్రతిభ అనేది సామాజిక, సాంస్కృతిక సంపత్తి. అది అనేక అవకాశాల అందుబాటు ద్వారా సంక్రమిస్తుంది. ఒకటి, కుటుంబ నేపథ్యమే ప్రతిభకు మౌలిక పెట్టుబడి. సంపన్న కుటుంబంలో పుట్టిన బిడ్డకు సహజంగానే ప్రతిభా పాటవాలకు సంబంధించిన పునాది ఉంటుంది. రెండు, సంపన్నుల పిల్లలు మెరుగైన విద్యావకాశాలు ఉండే పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుకుంటారు, పైగా ట్యూషన్, కోచింగ్ సదుపాయాలు కూడా అందుకుంటారు. అందువలన అధిక మార్కులు, ర్యాంకులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మూడు, బంధువులు, స్నేహితులు విద్యావంతులు కావడం వలన, వారు విద్యారంగంలో కీలకమైన స్థానాల్లో ఉండడం వలన ఎకడమిక్ గైడెన్స్, పరీక్షల్లో సహకారం లభిస్తుంది. సీనియర్ న్యాయవాదుల్లో, న్యాయమూర్తుల్లో ఎక్కువమంది సంపన్న కుటుంబాలవారు ఉండడం వలన కోర్టుల్లో వ్యాజ్యాలు వేసి న్యాయ సహాయం పొందుతుంటారు. రాష్ట్రాల హైకోర్టులో మరియు సుప్రీంకోర్టులో నలిగే రిజర్వేషన్కి సంబంధించిన వ్యాజ్యాల్లో ప్రతిభ ముఖ్యమైన వాదనగా ఉంటుంది. రిజర్వేషన్ లబ్ధిదారులు అనివార్యంగా కోర్టుల్లో డిఫెండ్ చేసుకోవాల్సి వస్తే, వారి తరఫున వాదించే న్యాయవాదులు కోర్టులను పెద్దగా ప్రభావితం చేయలేరు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సంపన్నులదే కావడం వలన రిజర్వేషన్కి వ్యతిరేకంగా మెరిట్‌ని సపోర్ట్ చేసే వార్తలే ఎక్కువగా ప్రచారం అవుతుంటాయి. అందువలనే 'మెరిట్' అనేది సామాజిక జీవనంలో అవకాశాలు కలవారికి సంక్రమించే మేధో సంపత్తి తప్ప వ్యక్తుల సొత్తు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
'ప్రతిభ' అనేది సామాజిక సంపత్తి అయినా వివిధ అవకాశాల ద్వారా దాన్ని సొంతం చేసుకోగలిగిన వ్యక్తులే అధికారాన్ని ఆక్రమించాలి అనుకుంటే అది ప్రజాస్వామ్యంలో చెల్లదు. సమాజ అవసరాలకు, అభ్యున్నతికి ఉపయోగపడితేనే తప్ప వ్యక్తుల స్వార్థానికి, స్వలాభానికి పరిమితమయ్యే దానిని ప్రతిభగా గుర్తించాల్సిన అవసరం లేదు. సామాజిక సంపత్తి అయిన ప్రతిభా పాటవాలను, తెలివితేటలను, నైపుణ్యాలను అందిపుచ్చుకొని వివిధ రంగాల్లో రాణించి పేరు ప్రతిష్టలతో పాటు కోట్లకు పడగలెత్తిన వారి ప్రతిభ సమాజానికి ఉపయోగపడేది కాదు, పైగా దాని వలన నష్టం కూడా. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం కల్పించిన విద్యావకాశాలను ఉపయోగించుకొని ఉన్నత సాంకేతిక విద్యల్లో నిష్ణాతులైన వారిలో విదేశాలకు, కార్పొరేట్ కంపెనీలకు సేవ చేస్తున్న వారి వలన స్వదేశానికి ఒరిగేదేముంది? గ్రామీణ ఆసుపత్రుల్లో పనిచేయడానికి, పేద ప్రజలకు వైద్యం చేయడానికి ఇష్టం లేని స్పెషలిస్ట్ డాక్టర్ల మెరిట్ వలన ఒరిగేదేముంది? ప్రభుత్వ ఖర్చుతో ఐఏఎస్ పట్టా పుచ్చుకొని, ఉన్నత అధికార పదవుల్లో వుంటూ, రాజ్యాంగ బాధ్యతలను విస్మరించి అధికార పార్టీలకు తలవొంచి ప్రజా ప్రయోజనాలను పట్టించుకోని సామాజిక స్పహ లేని అధికారుల ప్రతిభ వలన ఒరిగేదేముంది? ఈ నేపథ్యంలో సమాజానికి, ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడే ప్రతిభనే అసలైన ప్రతిభగా గుర్తించాలి, ఆ మేరకే విద్యా, ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలి అనే న్యాయమూర్తుల వ్యాఖ్యానం బహుదా ప్రశంసనీయమైనది.
ప్రతిభా పాటవాలు అనేవి అందరిలో సమానంగా ఉండవు. హెచ్చు తగ్గులు సహజం. కులాల పేరుతో అనేక అసమానతలు గల భారతీయుల్లో అవి మరింత తీవ్రంగా ఉన్నాయి. అందువలన పరిపాలనలో అందరికీ సమాన వాటా ఉండాలంటే ప్రతిభా పాటవాల్లో హెచ్చుతగ్గులు ఉన్నా అందరికీ అవకాశం కల్పించాలి. మెరిట్ ప్రాతిపదికనే విద్యా ఉద్యోగాల్లో ప్రవేశాలు అనుమతిస్తే ఆధిపత్య కులాల, సంపన్నుల పెత్తనమే కొనసాగుతుంది. ఆ పరిస్థితిని నివారించి విద్యా ఉద్యోగాల్లో అందరికీ అవకాశాలు కల్పించడం కోసమే రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ సదుపాయం కల్పించడం జరిగింది. ఆధిపత్య కులాల వారు, సంపన్నులు మెరిట్ ద్వారా విద్యా ఉద్యోగాలు పొందితే, నిమ్న జాతులు, వెనుకబడిన వారికి రిజర్వేషన్ ద్వారా అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. మెరిట్, రిజర్వేషన్ సదుపాయాలను సమపాళ్లలో మేళవించడం ద్వారానే సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని సాధించగలం అనే ధర్మాసనం వ్యాఖ్యానాలు ఎంతో అభినందనీయం. ఈ వ్యాఖ్యానాల వెనుక విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రతిభకే పట్టం కట్టాలనే వాదన సరైంది కాదని, పరిపాలనా సామర్థ్యం కొరకు రిజర్వేషన్లు 50శాతం కంటే మించవద్దు అని గతంలో వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల సారాంశం దాగి ఉన్నది. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రతిభకే ప్రాధాన్యం ఇవ్వాలని, రిజర్వేషన్ విధానం వలన దేశానికి నష్టం జరుగుతుందనే వాదనను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పు ముదావహం.
- నాగటి నారాయణ
సెల్:9490300577