Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1990 దశకంలో డా||మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన నయా ఉదారవాద విధానాలు దేశంలో మితవాద శక్తుల ఉద్యమం పెరగడానికి ఏ విధంగా తోడ్పడింది?
- ఈ విషయాన్ని నేను నా ''కాషాయ కెరటం'' (శాఫ్రన్ వేవ్) అన్న గ్రంథంలో చర్చించాను. మొదట్లో బీజేపీ ఈ విధానాలను తీవ్రంగా విమర్శించింది. ఆరెస్సెస్‌లోని పాతతరం నాయకులంతా ఆ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ విధానాలు పాశ్చాత్య వినిమయ ధోరణులకు, నైతిక దిగజారుడుకు, అతి పాశ్చాత్యీకరణకు దారి తీస్తాయని ఆందోళన చెందారు. ఎస్.గురుమూర్తి అనే ఆరెస్సెస్ వ్యక్తి నాయకత్వంలో 'స్వదేశీ జాగరణ్ మంచ్' అనే సంస్థ కూడా ఏర్పడింది. నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయంగా ఆధునిక తరహా స్వదేశీ విధానాన్ని ప్రతిపాదించింది. అయితే, 1990 దశకం మధ్యలో బీజేపీ తన పల్లవి మార్చింది.
మొదట్లో ఉదారవాద విధానాల పట్ల విముఖతకు కారణం బీజేపీ ఫక్తు మితవాద పార్టీగా ఆనాడు లేకపోవడమే. అమెరికా లోని రిపబ్లికన్ పార్టీ అటువంటి ఫక్తు మితవాద పార్టీకి నమూనాగా చెప్పుకోవచ్చు. స్వేచ్ఛా మార్కెట్‌కు, వ్యక్తుల సంపదను పెంచుకోడానికి ఎటువంటి అవధులూ ఉండరాదనేది ఆ పార్టీ విధానం. అటువంటి భావాలను మొదట్లో ఆరెస్సెస్‌లోని చాలామంది ఆమోదించేవారు కాదు. ఇప్పటికీ వారిలో కొందరికి ఈ భావాలంటే పడదు.
ఈ తరహా నాయకులు ఆర్థిక విధానాలలో ఉదార వాదం అంటే విముఖత కలిగి ఉండడమే కాదు. కుటుంబం, సంస్కృతి వంటి అంశాలలో ఉదారవాద భావాలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు కూడా. కేవలం కొద్దిమంది చేతుల్లో అపారమైన సంపద పోగుపడడాన్ని కూడా వారు వ్యతిరేకించారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన చోట్ల ఆ పార్టీ నేతల్లో కొంతమంది ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాగా సంపద పోగేసుకున్నారు. ఈ పాతతరం వారు ఆ ధోరణులను వ్యతిరేకించారు.
1990 దశకంలో బీజేపీ తన రాజకీయ పాట పల్లవి మార్చింది. 1998లో వాజ్‌పేయి ప్రధాని అయ్యే నాటికి బీజేపీ పూర్తిగా కాంగ్రెస్ తాలూకు సరళీకరణ విధానాలను భుజానికెత్తుకుంది. ఈ విధమైన మార్పు రావడానికి ఒక దశాబ్ద కాలం పట్టింది. బీజేపీలోని ప్రమోద్ మహాజన్ వంటి వారు పూర్తిగా నయా ఉదారవాద విధానాలకు అనుకూలం. ఆ కాలంలో 'కర' సేవకులకు, 'కారు' సేవకులకు మధ్య ఉండే తేడాను గురించి జోకులు వేసుకునేవారు కూడా. 1990 దశకంలో ఈ విధానాలు దేశంలో పరిస్థితులు పెనువేగంగా మార్పుకు దారి తీస్తున్నాయని, అనేక కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు భావించేలా చేశాయి. కొత్త కొత్త భవనాలు లేచాయి. డబ్బు సంపాదించి ధనవంతులు కావడానికి కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి. వినిమయ సంస్కృతి వచ్చింది. పాత, కొత్త తరాల మధ్య అంతరం పెరిగింది. ఈ పెనుమార్పులు సృష్టించిన ప్రభావం బీజేపీ ఓట్ల వేటకు అనువైన పరిస్థితులను కలిగించింది.
ఇన్ని మార్పుల మధ్య ''మేము భారతీయ విలువలకు కట్టుబడి ఉన్నాం'' అన్న బీజేపీ సందేశం ఆ పార్టీకి ఒక మితవాద వైఖరిని అవలంబించడానికి వీలు కల్పించింది. ఆ వైఖరి ఆధునిక కాలానికి అనుగుణంగా ఉంటూనే సాంప్రదాయ భారతీయ విలువలకు కూడా కట్టుబడి ఉండే లక్షణాన్ని కలిగివుంది. ఇది చాలామంది ఓటర్లను ఆకర్షించింది. ఆ విధంగా, పరోక్షంగా నయా ఉదారవాద విధానాలు బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదం చేశాయి. అంతే తప్ప ఆ విధానాలు స్వతహాగా బీజేపీ విధానాలైతే కావు.
అసలు బీజేపీకి ఒక పొందికైన ఆర్థిక విధానం అంటూ ఏదైనా ఉందా ?
- లేదు. అటువంటిది ఏదీ వాళ్ళకి ఉందని నేను భావించడం లేదు. వాజ్‌పేయి కాలంలో వాళ్ళు చేసిందల్లా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన విధానాలను ఆచరణలో కొనసాగించడమే. ఎటువంటి గణనీయమైన మార్పులనూ వారు తీసుకురాలేదు. స్వదేశీ జాగరణ్ మంచ్ని పూర్తిగా పక్కకు నెట్టేశారు. ప్రభుత్వ పెత్తనం కింద నడిచే ఆర్థిక వ్యవస్థవైపు వెనక్కి మళ్ళాలని వారిలో ఎవరూ అనుకోలేదు. యువతరంలోను, కొత్తగా ముందుకొచ్చిన మధ్యతరగతిలోను నయా ఉదారవాద విధానాలు బాగా సానుకూలతను సంపాదించాయి. ఈ కొత్త మధ్యతరగతి ఓట్లను గెలుచుకోవాలని బీజేపీ భావించింది. ఎందుకంటే ఆ తరగతి దగ్గర డబ్బు ఉంది. ఆకాంక్షలున్నాయి, ఆశలున్నాయి.
కాబట్టి ఈ రోజు బీజేపీ అనుసరించే ఆర్థిక విధానాలు ఓ పద్ధతీ పాడూ లేకుండా ఉన్నాయి. జీఎస్టీ బిల్లునే తీసుకోండి. అది యూపీఏ హయాంలోనే తయారైంది. ఆ వ్యవసాయ చట్టాలనే తీసుకోండి, అదేమీ వాళ్ళ బుర్రల్లోంచి వచ్చినది కాదు. ఆ చట్టాల్లోని చాలా అంశాలు యూపీఏ హయాంలోనే మొదలయ్యాయి. కొన్ని సగం సగం అమలులోకి వచ్చాయి కూడా. ఆరెస్సెస్‌లో చాలా మందికి రిజర్వేషన్లు అంటే పడదు. కాని ఈ రోజు బీజేపీ ఆ రిజర్వేషన్లను ఏమైనా అటూ ఇటూ మార్చ గలదా? లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి దేశంలో చాలా చోట్ల ఒబిసిల్లో, దళితుల్లో మద్దతుదార్లు ఉన్నారు.
కాంగ్రెస్ హయాంలో ప్రయోజనాలు పొందలేకపోయిన కొన్ని పారిశ్రామిక బృందాలకి ఇప్పుడు బీజేపీ చాలా రకాలుగా సానుకూలంగా వ్యవహరిస్తోంది. అయినప్పటికీ, అది అనుసరిస్తున్న ఆర్థిక విధానాల్లో మౌలికంగా ప్రత్యేకమైన మార్పులు అంటూ ఏవీ లేవు. బహుశా పెద్ద నోట్ల రద్దు అనేది ఒక్కటే బీజేపీ మార్కు ఉన్న విధానం అని చెప్పొచ్చు. దానివలన నరేంద్ర మోడీకి తాత్కాలికంగా విజయం లభించినట్టు అనుకున్నా, అవినీతిని అరికట్టడం గాని, నల్ల ధనం నిర్మూలన కాని ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన గాని ఏదీ జరగలేదు. వెనక్కి తిరగి చూసుకుంటే పెద్దనోట్ల రద్దు కార్యక్రమం అమలు జరిగిన తీరు అనేక అనుమానాలకు దారితీస్తున్నది కూడా.
ఆర్థిక విధానాల విషయంలో బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య తేడా ఏమైనా ఉందా?
- 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు చాలామంది వ్యాపారవేత్తలు అనేక ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ కన్నా ఎక్కువగా సరళీకరణను వేగవంతం చేస్తానని, ఎన్నో సంస్థలను ప్రయివేటీకరిస్తానని, అనేక ఆంక్షలను ఎత్తివేస్తానని మోడీ 2014లో అన్నారు. కాని వాస్తవానికి ఆ విధంగా జరగలేదు.
ఆర్థిక రంగం గురించి, పారుబకాయిల గురించి ఆలోచిద్దాం. ఈ సమస్యను అప్పటికే కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. కాని ఇప్పటికీ ఆ విషయంలో బీజేపీ నిర్ణయాత్మకంగా వ్యవహ రించలేకపోతున్నది. కొత్త విధానాలను రూపొం దించడంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కన్నా చాలా మెరుగు. కాంగ్రెస్ దగ్గర చాలామంది టెక్నోక్రాట్స్ ఉన్నారు. ఇందులో సందేహంలేదు. యూపీఏ ప్రవేశపెట్టిన చాలా సంక్షేమ పథకాలను, సంక్షేమ రాజ్యాన్ని బీజేపీ ఇప్పుడు ధ్వంసం చేస్తున్నది అని చెప్పడం వాస్తవ పరిస్థితిని సరిగ్గా వివరించదు. నిజానికి బీజేపీ కూడా చాలా సంక్షేమ పథకాలను తీసుకువస్తోంది.
కొన్ని దశాబ్దాలుగా భారతీయులు ప్రభుత్వాల నుండి సహాయాన్ని ఆశించడానికి, చాలా రంగాల్లో ప్రభుత్వమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరడానికి అలవాటు పడ్డారు. ఆ పరిస్థితిని మార్చడానికి బీజేపీ ప్రయత్నించడం లేదు. ఎందుకంటే బీజేపీ ఆ పని చేయలేదు. అధికారంలో కొనసాగడానికి బీజేపీ చాలా మంది ప్రజలు ఆశిస్తున్న మేరకు స్పందించాల్సి ఉంది.
ఒకవేళ కాగ్రెస్ మళ్ళీ అధికారంలోకి గనుక వస్తే విద్యా విధానంలో, సాంస్కృతిక విధానంలో, మైనారిటీలకు సంబంధించిన విధానంలో చాలా పెద్ద మార్పులు ఉంటాయని నేను భావిస్తున్నాను.
అయితే, పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ లను తొలగించడం, ప్రయివేటీకరణ, ఆర్థిక సంస్కరణలు వంటి అంశాలలో కాంగ్రెస్ కూడా ఇప్పటి విధానాన్నే అమలు చేస్తుంది. అరుణ్‌శౌరి బీజేపీ ప్రభుత్వాన్నుంచి బైటకు వచ్చినప్పుడు చెప్పిన విషయాలు నాకు గుర్తున్నాయి. బీజేపీకి, కాంగ్రెస్‌కి మధ్య తేడా పెద్దగా లేదని ఆయన అన్నారు. బీజేపీ అంటే ''కాంగ్రెస్ ప్లస్ కౌ'' (కాంగ్రెస్‌కి గోవుని కలిపితే అదే బీజేపీ) అన్నారు.
దేశంలోని మితవాద ఉద్యమానికి ప్రవాస భారతీయుల నుండి ఏమేరకు నిధుల తోడ్పాటు లభిస్తోంది? హిందూ జాతీయవాద ఉద్యమాలకు అందుతున్న నిధుల గురించి మీకు ఏ మేరకు అవగాహన ఉంది?
- విదేశాల నుండి నిధులను సమీకరించడానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రెండు సంవత్సరాలలోనూ ఏం చేశారో చూడండి. ఆయన న్యూయార్క్ వచ్చి అక్కడి అభినందన సభలో పాల్గొన్నారు. నేను నివసించే సిలికాన్ వ్యాలీ ప్రాంతానికి వచ్చారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళారు. లండన్, కెనడా, ఆస్ట్రేలియా పర్యటించారు. ఇవన్నీ విదేశాల్లో నిధులను సేకరించడానికి చేసిన పర్యటనలే. ప్రవాస భారతీయుల్లో అత్యంత సంపన్నులు జీవించే ప్రాంతాలన్నింటికీ ఆయన వెళ్ళారు. వాళ్ళు కూడా తాము నివసించే దేశాల్లో హిందూత్వ గురించి ప్రచారం చేయడానికి ఉత్సుకతతో ఉన్నారు. ఇక్కడ ఎక్కువమంది ఎన్ఆర్ఐలు డెమాక్రటిక్ పార్టీకి ఓటు చేస్తారు. వారిలో ఎక్కువమంది బీజేపీకి ఆర్థికంగాను, రాజకీయంగాను మద్దతు ఇస్తారు.
హిందూత్వ ఉద్యమానికి గట్టి ప్రతిఘటన ఇచ్చేది వామపక్షాలు మాత్రమే అని మీరు భావిస్తున్నారా?
- భారతదేశంలో వామపక్షాలు కొంత పునరాలోచన చేయాలని నేను అనుకుంటున్నాను. కేరళలో వామపక్షాలు విజయాలు సాధిస్తున్నాయి. అక్కడ దేశంలోకెల్లా అత్యుత్తమమైన ప్రజారోగ్య వ్యవస్థని, ప్రజా పాలనా వ్యవస్థని అవి నెలకొల్పడమే ఆ విజయాలకు కారణం. మొత్తంగా చూస్తే భారతదేశంలో రాజకీయ శక్తుల పున:సమీకరణ జరుగుతోందని నేను భావిస్తున్నాను. 1980 దశకంలో ముందుకొచ్చిన కుల రాజకీయాలు వ్యవస్థాపరంగా శాశ్వత ప్రభావాన్ని కలిగించే మార్పులను తీసుకురాలేకపోయాయి. బిఎస్పి బలంగా ముందుకొచ్చినా, చిహ్నాల మీద చూపించిన శ్రద్ధ ఆర్థిక, వ్యవస్థాపర సంస్కరణలపై చూపలేకపోయింది.
సంక్షేమ పథకాల అమలును సమర్ధవంతంగా నిర్వహించడంలో, పాలనలో అవినీతిని కనిష్ట స్థాయిలో ఉంచడంలో వామపక్షాలు ఆదర్శవంతమైన ఉదాహరణలను నెలకొల్పాయి. కాని ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వామపక్షాలు ఇతర శక్తులను కలుపుకు రావలసి ఉంది. దేశంలో బలంగా పెరుగుతున్న దళిత ఉద్యమానికి వామపక్షాలకు మధ్య సంబంధం కొంత ఒత్తిడికి గురవుతోంది. దళితుల నుండి, గిరిజనుల నుండి బీజేపీకి చాలా ప్రతిఘటన ఎదురవుతోంది. కాని ఆ తరగతులకు, వామపక్షాలకు మధ్య సంబంధం అంత స్పష్టంగా ఉండడం లేదు. ఒబిసి ఉద్యమాలతో కూడా కలిసి వ్యవహరించాల్సి ఉంటుంది. కాని అది కష్టం. దళితులు, గిరిజనులు, ముస్లింలు, మైనారిటీలు కలిస్తే జనాభాలో మెజారిటీ భాగం అవుతారు. బీజేపీ పాలనలో అత్యధికంగా బాధలు పడుతున్నది వాళ్ళే. ఈ శక్తులనన్నింటినీ సమీకరించాలి.
- డా||ధామస్ హాన్సెన్