Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'2022లో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం' 2016 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ ఇది. 2016 నుంచి 2021 వరకు ప్రభుత్వం ఆరుసార్లు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. వ్యవసాయ రంగానికి నిధులు కేటాయిస్తూ వచ్చింది. అయితే మరోసారి 2022 ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయగలిగిందా? అసలు బడ్జెట్లో వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఇస్తోందా? అన్నదాతల కష్టాలను పరిగణనలోకి తీసుకుంటుందా? చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
3.3శాతానికి మించని వృద్ధి
2022 వచ్చేసింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు రైతుల ఆదాయం రెట్టింపైందా..? అంటే ఎవరైనా చెప్పేది లేదనే. 2016 నుంచి ఏడాదికి 14శాతం చొప్పున పెరిగితేనే రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేది. కాని ఇది ఏనాడూ 3.3శాతానికి మించలేదు. డబులింగ్ ఫార్మర్స్ ఇన్కం కమిటీ రిపోర్టు ప్రకారం 2014లో ఏడాదికి రైతుల ఆదాయం రూ.70 వేలు. 2020 నాటికి అది స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కూడా కాస్త అటూ ఇటూగా ఉంది. ద్రవ్యోల్బణం పెరిగిన మాదిరిగా రైతుల ఆదాయం పెరగలేదని నివేదిక చెబుతోంది. 2020-21 ఆర్థిక సర్వే ప్రకారం.. దేశ ఆర్థికరంగం మొత్తం జి.వి.ఎ. 7.2శాతం తగ్గగా వ్యవసాయరంగం జి.వి.ఎ. స్వల్ప పురోగతిని సాధించింది. అయితే ఈ వృద్ధి రైతుల ఆదాయాలు పెంచేందుకు దోహదపడలేదు. పదిహేను సంవత్సరాల్లో జీడీపీలో వ్యవసాయం వాటా 20శాతం దాటడం ఒకటేసారి జరిగింది. 2020-21 ఆర్థిక సర్వే ప్రకారం ఈ ఏడాది జీడీపీ పనితీరులో వ్యవసాయ రంగం ఒక్కటే ఆశావహమైన రంగంగా నిలిచింది. ఇతర అన్ని రంగాలూ దారుణమైన నష్టాలను చవిచూసినప్పటికీ వ్యవసాయరంగం ఒక్కటే 3.4శాతం పురోగతి సాధించింది. అయితే కరోనా పరిస్థితుల్లోనూ రైతులు శ్రమించడం ద్వారానే ఇది సాధ్యమైంది తప్పితే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలేవీ లేవు. వ్యవసాయ అప్పులు కూడా 59శాతం పెరిగాయి. 2012-13లో వ్యవసాయ కుటుంబాల సగటు అప్పు రూ.47,000గా ఉంటే.. 2018-19లో ఆ అప్పు రూ.74,121కి పెరిగిపోయింది.
రాష్ట్రాల వారీగా ప్రణాళికలు రూపొందిస్తేనే..
దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో వ్యవసాయానిది కీలకపాత్ర. అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధిక సాగుభూమి కలిగి ఉన్నది భారతదేశం. కానీ ఉత్పత్తిలో మాత్రం మూడో స్థానంలో ఉంది. 60శాతం జనాభా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. బిహార్, ఝార్ఖండ్, ఒడిశా లాంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే కేరళ, పంజాబ్, హరియాణా లాంటి రాష్ట్రాల్లో రైతుల ఆదాయం ఎక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా ఒకేలా ప్రణాళికలు అమలుచేస్తే రైతుల ఆదాయం రెట్టింపయ్యే అవకాశం లేదు. రాష్ట్రాల వారీగా, అంశాల వారీగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సి ఉండగా, అటు వైపు కేంద్రం ఆలోచించడం లేదు.
గత బడ్జెట్ను చూసుకుంటే..
2020-21 బడ్జెట్తో పోల్చుకుంటే 2021-22 బడ్జెట్లో కేటాయింపులు 5.63శాతం మేర పెరిగి, రూ.1,31,531 కోట్లకు చేరాయి. 2020-21లో రూ.1,42,762 కోట్ల వ్యయం అవుతుందని మంత్రిత్వశాఖ అంచనా వేసింది. ఇది సవరించిన దశలో 13శాతం తగ్గి రూ.1,24,520 కోట్లకు చేరుకుంది. ప్రాథమికంగా అంచనా వేసిన దాని కంటే తక్కువ లబ్ధిదారుల కవరేజీ కారణంగా పీఎం కిసాన్ యోజన ప్రతిపాదిత వ్యయంలో రూ.10,000 కోట్ల కోత పెట్టారు. 2020-21, 2021-22లో పీఎం కిసాన్ యోజన పథకానికి రూ.65,000 కోట్లు కేటాయించారు.
రైతు వ్యతిరేక విధానాలే..
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక విధానాలే అవలంభించింది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అది నిజమేననితేలుతోంది. ఇటీవల ఎరువులపై సబ్సిడీ ఎత్తేసి రైతుల నడ్డి విరిచింది. ధరలు విపరీతంగా పెంచింది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రం నుంచి కనీస స్పందన లేకుండాపోయింది. ఎఫ్సీఐనీ క్రమంగా నిర్వీర్యం చేస్తోంది. ధాన్యం సేకరణ బాధ్యతలను రాష్ట్రాలకు ఇస్తోంది. దేశంలో 51రకాల పంటలు పండుతుండగా కేవలం 23రకాల పంటలకే కేంద్రం మద్దతుధర ప్రకటిస్తోంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకమైతే ఎవరికీ పనికి రాకుండా ఉంది. కేంద్ర ప్రభుత్వ నూతన ప్రతిపాదిత కరెంట్ చట్టాలతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకువస్తోంది. మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతులు తీవ్రంగా ఆందోళన చేయడంతో వాటిని విరమించుకుంది.
పెరగాలంటే..
రైతుల ఆదాయం పెరగాలంటే ముందుగా ప్రభుత్వం వ్యవసాయ ఖర్చులను తగ్గించాల్సి ఉంటుంది. ఉత్పాదకతను పెంచి, గిట్టుబాటు ధరలు కల్పించాలి. కనీస మద్దతు ధరను పూర్తిస్థాయిలో అమలు చేయాలి. వ్యవసాయానికి కేటాయించే బడ్జెట్లో కనీసం రెండుశాతం పరిశోధనలకు వెచ్చిస్తే భవిష్యత్తులో ఫలితముంటుంది. వ్యవసాయంతో పాటు ఇతర రంగాలు కూడా అభివృద్ధి చెందితేనే వ్యవసాయంపై ఆధారపడ్డవారు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశముంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, హార్టికల్చర్, మత్స్య పరిశ్రమ తదితర రంగాల వైపు మళ్లించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే అవకాశముంటుంది.
కేటాయింపులు పెరగాల్సిన అవసరం
గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈసారి వ్యవసాయానికి మరింత బడ్జెట్ పెంచాల్సి ఉందన్నది వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్న మాట. వ్యవసాయ సబ్సిడీలను మరించ పెంచాలని చాలా మంది కోరుతున్నారు. ఎరువులపై సబ్సిడీతో పాటు.. రవాణాపై సబ్సిడీని కూడా పెంచాలని కోరుతున్నారు. ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం ఎక్కువ కేటాయింపులు ఉండాలని కూడా కోరుకుంటున్నారు. రాష్ట్రాలనూ సమన్వయం చేసుకుంటూ.. స్థానిక పరిస్థితులను బట్టి.. సమగ్రమైన ప్రణాళిక రూపొందిస్తేనే ఇంకా ఐదు నుంచి పది సంవత్సరాల్లోనైనా రైతుల ఆదాయం రెట్టింపయ్యే అవకాశముంది. బడ్జెట్లో కూడా అదే స్థాయిలో వ్యవసాయానికి కేటాయింపులు ఉంటేనే అది సాధ్యమవుతుంది.
- ఫిరోజ్ ఖాన్
సెల్:9640466464