Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణలో కొలువులకై తండ్లాట ఏడేండ్లయినా కొనసాగుతూనే ఉంది. ఉద్యమ సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నీటిమీద రాతలే అయినవి. పాలకులు కొలువులు ఇచ్చింది మూరెడు చెప్పుకునేది మాత్రం బారెడు ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి రెండేండ్లలో 1,07,744 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పింది. కానీ ఇప్పటివరకు భర్తీ చేసింది నిండా 80వేలు కూడా దాటలేదు. నియామకాల కోసం రాష్ట్ర సాధన ఉద్యమంలో నిప్పురవ్వలై మండిన యువ గుండెలు, ఎగిసిన పిడికిళ్ళు ఇప్పుడు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నవి. ఆశ కల్పించి ఆర్భాటంగా ఏర్పాటుచేసుకున్న టి.ఎస్.పి.ఎస్.సి సంస్థ ఒన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓ.టి.ఆర్)లో నమోదు చేసుకున్న 24,82,888 మంది నిరుద్యోగులంతా నౌకరి ఇవ్వని ఆ సంస్థ నిర్వాకాన్ని వికారంగా చూస్తున్నారు. ఈ చదువుకున్న గ్రాడ్యుయేట్స్‌కు కొలువివ్వని చేతగాని తనం ఎవ్వరిది? వీళ్లేకాక చదువు మధ్యలో ఆపినవారు, అసలు చదువులేని యువత, నమోదు చేసుకోనివారిని కూడా కలుపుకుంటే నిరుద్యోగుల సంఖ్య నలభైలక్షలు దాటుతుంటే వీళ్ళ మొఖంచూసే వారే లేరు. ఇలా ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత గల ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నది. కనీసం ఉన్న ఖాళీల్లో కూడా భర్తీకి ప్రయత్నం లేదు. బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదిక ప్రకారం తెలంగాణలో 1,91,126 ఖాళీలు ఉన్నట్లు తేలింది. వీటి భర్తీపై ఊసే లేదు. ఏ ఎన్నికలు వచ్చినా భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని మాటలు, స్టేట్ మెంట్స్, పత్రిక ప్రకటనలు వస్తాయి. ఎన్నికలయ్యాక ఎప్పటిలాగే గప్ చుప్.
ముఖ్యమంత్రి దళిత బంధు కథ బాగానే అల్లి దళితులకు ''బంధు'' అవుదామనే ఎత్తు వేశాడు. కానీ దళిత యువతకు ఏండ్లుగా ఇవ్వాల్సిన ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు 20వేలు భర్తీ చేయకుండా దళిత నిరుద్యోగులకు రాబందు అయితుండు. కరోనా వల్ల వైద్య ఉద్యోగాల అవసరం ఎంత ఉందో తెలిసిందే. కానీ వైద్యశాఖలో ఉన్న 30,570 ఖాళీల భర్తీకి మాట కూడా లేదు. కేజీ నుండి పీజీ ఉచిత విద్య ఎప్పుడో యాది మరిచిండు. వచ్చే విద్యాసంవత్సరం ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే 23,998 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే సాధ్యమా? ప్రతి సంవత్సరం వేయాల్సిన టెట్ నాలుగేండ్లయినా వేయక, టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్న బీఎడ్, డీఎడ్‌లు పూర్తి చేసిన అభ్యర్ధుల కళ్ళు కాయలు కాస్తున్నాయి. రెవెన్యూలో 7,961 ఖాళీలు ఉన్న ఫలితంగా ఫైల్లు కదలటానికి నెలలు పడుతున్నాయి. కంప్యూటర్ ఆపరేటర్లు లేక, క్లర్కులు లేక కూడా కొత్త జిల్లాల్లో, కొత్త మండలాల్లో పనులు మొరాయిస్తున్నాయి. పంచాయతీరాజ్‌లో 12,628 ఖాళీల భర్తీలేదు. అవసరమో, ఆందోళనవల్లో పోలీస్‌లపై ఆధారపడే ప్రభుత్వం ఎన్నో కొన్ని పోలీస్ ఉద్యోగాలు మాత్రం రాష్ట్రంలో ఇచ్చింది. కానీ పోలీస్ ఉద్యోగాల్లో కూడా ఇంకా 37వేల ఖాళీలు నింపడం లేదు. అసలు తెలంగాణలో రెండు లక్షల ఖాళీలున్నట్లు పీఆర్సీ నివేదిక చెప్తున్నా నిజానికి ఆ ఖాళీలు 3లక్షలు ఉంటాయి. వీటిపై స్పష్టత ఇవ్వకుండా ఖాళీలను రెంటెడ్, ఔట్ సోర్సింగ్‌తో నెట్టుకొస్తూ నిరుద్యోగుల కళ్ళల్లో కారం కొడుతుండ్రు.
కరోనా అనంతరం అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. టీచర్స్, లెక్చరర్స్, సెక్యూరిటీ సిబ్బంది, ఆఫీసుల్లోని కింది స్థాయి వర్కర్స్ ఇలా అనేక మంది రోడ్డున పడ్డారు. కొత్తగా నిరుద్యోగ ప్రపంచంలో అడుగుబెట్టే వారికి ప్రతి సంవత్సరం కంపెనీలు తీసుకొనే ఫ్రెషర్స్ ఎంప్లాయిమెంట్ కూడా తగ్గింది. 30శాతం పైగా తీసుకునే న్యూ ఎంప్లాయిమెంట్ ఇప్పుడు 20శాతం కూడా లేదు. ఇదంతా ప్రచ్ఛన్న నిరుద్యోగిత కింద ఎక్కడా కనబడకుండా, నమోదు కాకుండా ఉంటుంది. కానీ, నిరుద్యోగ సైన్యం పెరుగుతుంది.
రెండవ దఫా ఎన్నికల సమయాన నిరుద్యోగులందరికి రూ.3016లు భృతి ఇస్తామని చెప్పి మూడేండ్లు అయినా కనీసం విధి విధానాలు రూపొందించలేదు. 2019 బడ్జెట్లో 1810 కోట్లు కేటాయించి అట్లానే మురగబెట్టారు. ఆ నిధి ఏమైందో ఏ బొక్కసంలో నింపారో తెలియదు.
ప్రయివేటు ఉద్యోగాల కల్పన కూడా భారీగా తగ్గింది. కొత్త కంపెనీలు వచ్చింది లేదు. ప్రయివేటు కంపెనీలు వస్తాయని భూములు కేటాయించి అప్పనంగా ల్యాండ్స్ కట్టబెట్టే పనే తప్పితే పైసా కూడా ఉపయోగం జరుగలేదు. 3వేల కంపెనీలు వచ్చాయని ఆర్భాటంగా చెప్పి ఎన్ని కంపెనీలు వచ్చినయో అన్ని ఉద్యోగాలు కూడా కల్పించలేదు. కరోనా వల్ల సాఫ్ట్ వేర్లో ఉన్న ఉద్యోగాలు ఊడ్చుకపోయాయి.
తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే విధానం నేడు రాష్ట్రానికి కావాలి. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు అన్నింటిపై శ్వేత పత్రం విడుదల చేయాలి. ఖాళీల భర్తీకి జంబో నోటిఫికేషన్లు ఇవ్వాలి. అలాగే ప్రయివేటు ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక తయారు చేయాలి. ఆయా జిల్లాలకు వాటి భౌగోళికత ఆధారంగా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు. ఉదాహరణకు పశువులు ఎక్కువగా ఉన్న ఉమ్మడి మహాబుబ్‌నగర్‌లో తోళ్ల పరిశ్రమ, నల్గొండలో జ్యూస్ పరిశ్రమలు, ఖమ్మంలో గ్రానైట్ పరిశ్రమలు లాంటివి ఏర్పాటు చేస్తే ఆయా జిల్లాల్లోనే స్థానికంగా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. అందరూ ఒకే ఐటి మీద ఆధారపడే అవకాశం ఉండదు. అందుకే సమగ్ర ప్రణాళిక, ఉద్యోగ కల్పన విధానం తయారు చేయాలి. ఇక దేశంలో యువతకు ఎన్నో భ్రమలు కల్పించిన మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అయ్యింది. కానీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని ఉన్నోళ్ల వికాసమే తన ప్రభుత్వ థ్యేయమన్నట్లు మోడీరాజ్ కొనసాగుతోంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే పనే మోడీ ప్రభుత్వం చేస్తున్నది. నోట్లరద్దు, జీఎస్టీ వల్ల కోటి ఉద్యోగాలు ఊడగొట్టారు. ఈ కాలంలో కరోనా కంటే ముందే గత 45ఏండ్లలో అత్యధిక నిరుద్యోగ భారతదేశాన్ని సృష్టించి మోడీ బీజేపీ ప్రభుత్వం రికార్డ్ సృష్టించింది. మేక్ ఇన్ ఇండియా, అంకురాలు అని ఊదరగుడుతున్నారు తప్ప న్యూ రిక్రూట్మెంట్ లేదు. బ్యాంక్, రైల్వే ఉద్యోగాల భర్తీ బ్యాన్ కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నది. మరోవైపు ఈ సంస్థలనూ 'ప్రయివేటు'కు అప్పనంగా అప్పగించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒక్కో సంస్థనూ కార్పొరేట్లకు తెగనమ్ముతూ ఉద్యోగా లను కుదించేస్తున్నది.
సమాచార హక్కు చట్టం ద్వారా అందిన సమాచారం, పార్లమెంటులో ప్రభుత్వం వెల్లడించిన సమాచారం, ప్రభుత్వ గణాంకాల ప్రకారం... కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు 9.10లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే, సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఐఐఎంలు, నిట్లు, కేంద్ర పరిధిలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు (కేవీలు), జవహర్ నవోదయ విద్యాలయాల్లో దాదాపు 37వేల ఉద్యోగాలు భర్తీకి నోచుకోలేదు. రాష్ట్రాల్లో అధిక భాగం కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ప్రాథమిక పాఠశాలల్లో 8.53లక్షల పోస్టులు, ఆరోగ్య రంగంలో 1.68 లక్షలు, అంగన్వాడీ వ్యవస్థలో 1.76లక్షల ఉద్యోగాలు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో 2లక్షల పోస్టులు, ఇండియన్ ఆర్మీలో 1.07 లక్షల ఉద్యోగాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీ ఎఫ్)లో దాదాపు 92వేల పోస్టులు, దేశవ్యాప్తంగా రాష్ట్ర పోలీసు విభాగాలు, జ్యుడీషీయల్ కోర్టుల్లో 5.31 లక్షల ఉద్యోగాలు, కిందిస్థాయి కోర్టుల్లో 5వేలకు పైగా పోస్టులు భర్తీకి నోచుకోక మూలుగుతున్నాయి. మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాల జాడే లేకపోగా, ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తోంది.
దేశంలో ఉద్యోగాల కోసం కోట్లాది నిరుద్యోగులు ఆవురావురంటుంటే అధికార బీజేపీ, ఆర్ఎస్ఎస్లు యూత్‌ని భావోద్వేగాలతో రెచ్చగొడుతున్నాయి. యువతను మతం పేరుతో చీల్చి, కొట్లాట పెట్టి అలా రెచ్చగొట్టిన మంటలలో చలికాచుకొనే యత్నం చేస్తున్నాయి. ఇది యువత అర్థం చేసుకొని పోరాడే నిప్పురవ్వలైతేనే నౌకరు యువత చేతికి అందుతుంది.
- ఎ. విజయ్ కుమార్
సెల్:9573715656.