Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో నూతన జిల్లాలకు పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా ఉమ్మడి జిల్లా యూనిట్‌గా సీనియార్టీనే ప్రతిపాదికగా తీసుకొని బదిలీలు చేయడంపట్ల బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులను జిల్లాల వారీగా కేటాయిస్తున్న సమయంలో సీనియారిటీని ప్రాతిపదికన తీసుకుంది. సీనియర్లు అంతా పట్టణ ప్రాంతాలను ఎంచుకున్నారు. దీంతో గత రెండు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు సాధించిన జూనియర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మారు మూల ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాను పరిశీలిస్తే.. సీనియర్లు అనేక మంది వరంగల్, హన్మకొండ తదితర పట్టణాలకు సమీపంలోని పాఠశాలలను ఎంచుకున్నారు. దీంతో జూనియర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జూనియర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. క్యాడర్ వారీగా ఉద్యోగులను కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. ప్రమోషన్లు ఆలస్యంగా పొందిన అనేకమంది కేడర్‌లో జూనియర్లు కావడం వల్ల సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వివాదాస్పదంగా మారిన 317 జీవో మరియు జోన్ల గురించి తెలుసుకుందాం...
కొత్త జిల్లాలు.. కొత్త జోన్లు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి రాష్ట్రంలోని 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 33 జిల్లాలుగా విభజించింది రాష్ట్ర ప్రభుత్వం. తొలుత 2016 అక్టోబరులో 31 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. మరో రెండు కొత్త జిల్లాలుగా 2019 ఫిబ్రవరిలో ములుగు, నారాయణపేటలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో 9 మండలాలు ఉంటే, మరికొన్ని జిల్లాల్లో 30 పైగా మండలాలు ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడిన వెంటనే ఉద్యోగులను వర్క్ టు ఆర్డర్ కింద కొత్త జిల్లాలకు కేటాయించారు. శాశ్వత కేటాయింపులు జరగలేదు. అలాగే.. 2018లో ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. రాష్ట్ర విభజనకు ముందు వరకూ తెలంగాణలోని మొత్తం పది జిల్లాలు జోన్-5, జోన్-6 కింద ఉండేవి. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మొత్తం 31జిల్లాలను 7జోన్లు, 2 మల్టీ జోన్లుగా పునర్వ్యవస్థీకరించింది. దీనికి 2021లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది.
జీఓ 317 జారీ
కొత్త జోన్ల వ్యవస్థ అమలులోకి రావటంతో.. కొత్త జిల్లాలకు, కొత్త జోన్లకు, మల్టీ జోన్లకు.. ఉద్యోగాలను, ఉద్యోగులను సర్దుబాటు చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం 317జీవో జారీ ద్వారా ప్రారంభించింది. ఇందుకోసం 2021 డిసెంబర్ 6వ తేదీన ప్రభుత్వం 317 జీఓను జారీ చేసింది. పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలోని ఉద్యోగులు.. ఆ పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పరిధిలోని కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీ జోన్లలో తాము కోరుకున్న చోటుకు వెళ్లటానికి ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది. ఈ ఆప్షన్లకు ఆ కేడర్ పోస్టులో సీనియారిటీని ప్రధాన ప్రాతిపదికగా నిర్ణయించింది. అలాగే.. వికలాంగులు, వితంతువులు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాలు ఉన్న వారికి ప్రత్యేక ప్రాధాన్యత కింద ఆప్షన్లు ఎంచుకునే వెసులుబాటునిచ్చింది. ఆప్షన్లను సమర్పించటానికి జిల్లా స్థాయిలో వారం రోజులుబీ జోనల్, మల్టీ-జోనల్ స్థాయిలో మూడు రోజుల సమయం ఇచ్చింది.
అంటే.. ఉద్యోగులు సీనియారిటీ ప్రకారం తాము కోరుకున్న జిల్లాను ఆప్షన్‌గా ఎంచుకున్నారు. ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఆయా జిల్లాల్లో ఉన్న ఖాళీల మేరకు అక్కడికి బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఖాళీలు నిండిపోయి సీనియారిటీ తక్కువగా ఉన్న వారికి ఆ ఆప్షన్ లభించలేదు. దీంతో వారు కోరుకున్న ప్రాంతంలో.. అది తమ స్థానిక జిల్లానే అయినా - పోస్టింగ్ లభించలేదు. తమ స్థానిక జిల్లా కాకపోయినా వేరే జిల్లాకు శాశ్వత పోస్టింగ్ మీద వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశం మీద ఉపాధ్యాయ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళన...
ఈ నేపథ్యంలో జీఓ 317ను వ్యతిరేకిస్తూ డిసెంబర్ చివరి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమను సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోవడం, తప్పుల తడక సీనియార్టీ జాబితాలు, కేటాయింపు జాబితా తయారీలోనూ లోపాలున్నాయని వారు ఆరోపిస్తున్నారు. పైస్థాయిలో పలుకుబడి ఉన్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నగరాలు, పట్టణాల్లో పోస్టులు పొందు తున్నారని ఆరోపిస్తున్నారు. వారికన్నా ఎక్కువ సీనియారిటీ ఉన్నా, కొత్త ప్రాంతాల స్థానికులు కాకపోయినా కూడా పలుకుబడి లేని వారిని శాశ్వత కేటాయింపులతో మారుమూల ప్రాంతాలకు బలవంతంగా బదిలీచేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు.
స్థానికతకు చోటు లేకపోవడంతో ఆందోళన ఉధృతం
ఉద్యోగుల బదిలీల్లో స్థానికతను అధికారులు విస్మరిస్తుం డటంతో.. కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిన ప్రధాన లక్ష్యం నీరుగారిపోతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
మానసిక ఒత్తిడితో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆత్మహత్యలు
నూతన జిల్లాల కేటాయింపుతో అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తమ సొంత జిల్లాకు ఉద్యోగ కాలంలో ఎన్నటికీ తిరిగి రాలేమని భావించి ఆందోళనకులోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భార్య భర్తలను ఒక దగ్గరికి చేర్చడం, వితంతువులు, అవివాహితులకు ప్రాధాన్యమివ్వడం, పరస్పర బదిలీలు నిర్వహించడం, భవిష్యత్తులో జరిగే బదిలీలు, ప్రమోషన్లలో సొంత జిల్లాకు రావడానికి అవకాశం కల్పించడం చేయాలని, 317 జీఓ సవరణకు చర్యలు చేపట్టాలని బాధిత ఉపాధ్యాయ ఉద్యోగులు కోరుతున్నారు.
- పిన్నింటి బాలాజీరావు, 9866776286