Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్టీసీ అధికారులు, సూపర్వైజర్స్ తీసుకుంటున్న నెలవారీ అలవెన్స్‌లను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలిపి వేస్తున్నట్లు అర్జంటు ఆర్డర్ నోట్ (ఖఉ చీశ్ీవ)ను 21 జనవరి 2021న విడుదల చేశారు. అయితే డాక్టర్లకు ఇస్తున్న బయోహెజార్డ్ రిస్క్ అలవెన్స్, ఆర్టీసీ వాహనం పొందని అధికారి, సూపర్వైజర్స్కు కన్వేయన్స్ అలవెన్స్, డిపో మేనేజర్స్‌కు షెడ్యూల్స్ ఆధారంగా ఇచ్చే అలవెన్స్, క్లాజ్-2 సూపర్వైజర్స్కు ఇచ్చే కన్వేయన్స్ అలవెన్స్, డిపోలలో పనిచేసే క్లాస్-2 సూపర్వైజర్స్ ఫీల్డ్ అలవెన్స్‌లు చెల్లిస్తారు. ఈ ఉత్తర్వు వెలువడగానే సహజంగానే కార్మికులు, వార్త చదివిన ప్రజలు కూడా 'అబ్బా! భలే పని చేసిండిరా ఎండి గారు, తిక్క కుదిరింది' అనుకునే వారే ఎక్కువ ఉంటారు. కార్మికులు పొందుతున్న వాటికి, అధికారులు పొందుతున్న వాటికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా వుండటమే కార్మికులు ఇలా అనుకోవడానికి కారణం.
ఇటువంటి చర్యే సాహసోపేతమైనదే. అయితే, ఇటువంటి చర్యతోనే ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమ వుతాయా? ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో పెరిగి, ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందా? గడచిన రెండు సంవత్సరాలుగా కరోనా, దాని నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల వల్ల కోల్పోయిన ఆదాయం తిరిగి వస్తుందా? ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించకుండా ప్రజా రవాణా సంస్థ ఆర్ధికంగా పుంజుకోవడం సాధ్య మేనా? ఆర్టీసీకి ఉన్న అప్పులు, లయ బిలిటీస్ అన్ని తీర్చివేయగలుగుతుందా? కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు అన్నీ చెల్లించేస్తారా?
ఇటీవల కాలంలో ప్రజల మధ్య ఆర్టీసీ హాట్ టాపిక్‌గా ఉంది. ఆ సంస్థ ఎం.డి.ని ఇంటర్వ్యూ చేయడానికి ఎలక్ట్రానిక్ మాధ్యమం క్యూ కడ్తున్నది. అయితే ఆర్టీసీ ఎండి ఇచ్చిన ఇంటర్వ్యూలలో కొన్ని అంశాలు స్పష్టత ఇవ్వకపోగా గందరగోళంగా ఉంటున్నాయి. ఆర్టీసీ కార్మికుల రెండు వేతన ఒప్పందాలు, 6 డిఎలు, 2013 అరియర్స్ బకాయిలు వంటివి ఉన్నాయి కదా? అవి ఎప్పుడు పరిష్కరిస్తారు? అని అడిగితే వాటిని ఇస్తాం అని చెప్పడం సానుకూల అంశమే. అలాగే ఆర్టీసీ ఎప్పుడు లాభాలలోకొస్తుంది అంటే, వచ్చే ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి అని అన్నారు. అంటే 2023 ఏప్రిల్ వరకు ఏ ఆర్థిక సమస్యను పరిష్కరించలేము అని చెపుతున్నట్లుగానే భావించాల్సి వస్తుంది?
నిజంగా ఆర్టీసీ లాభాలలోకి రాకపోవడానికి కారణం కేవలం యాజమాన్యం వైఫల్యమేనా? గతంలో సంస్థకు ఎండి లుగా పని చేసిన వారందరూ సమర్థులు కాదు కనుకనే నష్టాలు వచ్చాయా? ఇప్పుడున్న ఎం.డి సమర్థుడు కనుక లాభాలలోకి వస్తుందా? 2008-09 నుండి 2020-21 వరకు 13 సంవత్సరాలు వరుసగా ఆర్టీసీ ఆదాయం కంటే ఖర్చే ఎక్కువగా ఉంటుంది. ఆర్టీసీ చేస్తున్న ఖర్చులు 10రకాలుగా ఉన్నాయి. 1. పర్సనల్ కాస్ట్ 2. వర్క్‌షాప్ ఖర్చులు 3. పవర్ (ఆయిల్) 4. టైర్స్, ట్యూబ్స్ 5. ఎం.వి.టాక్స్ 6. తరుగుదల 7. ఇతరములు (ఇన్సూరెన్స్ Ê యాక్సిడెంట్ క్లెయిమ్‌లు) 8. స్టోర్స్, లూబ్స్ 9. వడ్డీ 10. ఓవర్ హెడ్స్.
టిఎస్ ఆర్టీసీ ఆదాయంలో పర్సనల్ కాస్ట్ 46శాతంగా ఉందని, దీనిని తగ్గించాలని మేనేజింగ్ డైరెక్టర్ అంటున్నారు. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం 7వ పిఆర్సి నివేదికలో రూ.21,000 కనీస వేతనం ఉండాలని, తెలంగాణ రాష్ట్ర మొదటి పిఆర్సి నివేదిక 19,000 కనీస వేతనం ఉండాలని సిఫార్సు చేశాయి. ఆర్టీసీలో 4వ తరగతి ఉద్యోగి అయిన కళాసి బేసిక్ వేతనం కేవలం రూ.10,880లు, కండక్టర్‌కు రూ.12,610లు, డ్రైవర్‌కు రూ.13,780లు మాత్రమే ప్రారంభ స్కేల్స్ ఉన్నాయి. 2017 నుండి రావలసిన రెండు పేస్కేల్స్, 6డిఎలు ఇంకా అమలు జరగలేదు. ప్రభుత్వాలు ప్రకటించిన కనీస వేతనాలలో కేవలం 50శాతం మాత్రమే పొందుతున్న ఆర్టీసీ కార్మికులకు అవుతున్న పర్సనల్ కాస్ట్‌ను తగ్గిస్తామంటే అర్థం ఏమిటి?
వర్క్‌షాప్ ఖర్చులు, ఇంధన ధరలు, టైర్స్, ట్యూబ్స్ ధరలు, ప్రమాదాల క్లెయిమ్‌ల చెల్లింపు, స్టోర్స్, అప్పులపైన వడ్డీ చెల్లింపు వంటివి ఆర్టీసీ చేతిలోలేనివి. గడచిన 1000రోజులలో 289 సార్లు డీజిల్ ధరలు పెరిగాయి. అలాగే ఇనుము ధరలు, విడి భాగాలు, టైర్స్, ట్యూబ్‌ల ధరలు పెరిగాయి. ఇవన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలననే పెరిగాయి తప్ప, ఆర్టీసీ యాజమాన్య లోపం వల్ల కాదు. ఎం.వి. టాక్స్, అప్పులపై వడ్డీ అనేవి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అంశాలు. ఆ ఇంటర్వ్యూలో ఆర్టీసీకి ప్రభుత్వం చేయాల్సిన ఆర్థిక సహాయాల గురించి ఎండి ఒక్కమాట మాట్లాడకపోవడం యాదృచ్ఛికమైనదని అనుకోలేం. 2014-15 నుండి 2020-21 వరకు బస్‌పాస్‌ల రాయితీల చెల్లింపు రూపంలో రావలసినవి రూ.3708.39 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీ లోన్స్ తిరిగి చెల్లింపునకు రూ.1568.63 కోట్లు, కలిపి రూ.5276.93 కోట్లు రావలసి ఉండగా, ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు, ఇప్పించిన అప్పులు కలిపి సంస్థకు ఇచ్చింది రూ.6284.97కోట్లు. అంటే ఏడేండ్లలో ప్రభుత్వం అదనంగా ఇచ్చింది కేవలం రూ.1008.04 కోట్లు, అంటే సంవత్సరానికి రూ.144 కోట్లు మాత్రమే ఇచ్చింది. మనకొస్తున్న ఆదాయంలో ఎం.వి.టాక్స్ కోసం రోజుకి కోటి, అప్పులపై వడ్డీ రోజుకి కోటి చెల్లించాల్సి వస్తున్నది.
అలాగే గత రెండు సంవత్సరాలు గాను, ఈ సంవత్సరంలో కరోనా పరిస్థితుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజారవాణ సంస్థలలో ప్రజలు ప్రయాణించడం తగ్గిందని యూఐటీపీ, ఐఎంఎఫ్, డౌన్ టు ఎర్త్ అధ్యయనాలు రుజువు చేశాయి. దీనికి టిఎస్ ఆర్టీసీ మినహాయింపు కాదనే విషయం గౌరవ ఎం.డి.కి తెలియనిదేమి కాదు. కరోనా వల్ల రైడర్ షిప్ తగ్గిందని, మెట్రో రైల్ నిర్వహణ నుండి తప్పుకుంటామని ఎల్ అండ్ టి సంస్థ చేస్తున్న విజ్ఞప్తిని మన్నించి, ఆ సంస్థ నష్టాలను తిరిగి చెల్లించడం కోసం సిద్ధపడ్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తన బిడ్డ అయిన ఆర్టీసీకి మాత్రం ఎందుకు నిధులు కేటాయించదు?
ప్రభుత్వం నిధులు ఇవ్వనందువల్ల, సంస్థకు అందుబాటులో ఉన్న పి.ఎఫ్ నిధులు రూ.1600 కోట్లు, సిసిఎస్‌కు సంబంధించిన రూ.1000 కోట్లు వాడుకొన్నది. అలాగే ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి నిధులను తన అవసరాలకు వాడుకొన్నది. బ్యాంక్ నుండి అప్పులు తెచ్చి సిసిఎస్‌కు రూ.400 కోట్లు ఇచ్చినా, ఇంకా రూ.600 కోట్లు బకాయి ఉంటుంది. సిసిఎస్ కోసం కార్మికుల నుండి రికవరీ చేస్తున్న డబ్బులు సిసిఎస్‌కు నెలవారి చెల్లించకపోతే, ఆ సంస్థ సంక్షోభంలోకి నెట్టబడ్తుంది. అలాగే ప్రావిడెంట్ ఫండ్ నిధులు చెల్లించనందున ఉద్యోగంలో ఉండి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పిఎఫ్ ట్రస్ట్ ద్వారా చెల్లించాల్సిన 'ఎంప్లాయీ డిపాజిటెడ్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం' (ఇడిఎల్ఐఎస్) ద్వారా చెల్లించాల్సిన రూ.7 లక్షలు కూడా చెల్లించడం లేదు. రిటైరైన వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదు.
మొత్తం సంస్థ పరిస్థితి, సంస్థలోని కార్మికుల పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు కేవలం కాయకల్ప చికిత్సతోనే ఆర్టీసీలో అద్భుతాలు జరగవు. కార్మికుల జీవితాలు బాగుపడవు. రాష్ట్ర బడ్జెట్లో ఒకశాతం నిధులు ఆర్టీసీకి కేటాయించాలి. ఆర్టీసీకి ఉన్న అప్పులను ఈక్విటీగా మార్చాలి. ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులను తగ్గించాలి. పర్యావరణం కోసం కేటాయించిన డబ్బులో 20శాతం ఆర్టీసీకి ఇచ్చేలా చూడాలి. కరోనా వల్ల ఆదాయంలో ఏర్పడ్డ గ్యాప్‌ను ప్రభుత్వం భర్తీ చేయాలి. కార్మికులకు రెండు వేతన ఒప్పందాలు, డీఏలు అమలు చేయాలి. 2013 అరియర్స్ బకాయిల బాండ్స్ తక్షణమే చెల్లించాలి. అలాకాకుండా కార్మికులను అర్థాకలితో పస్తుబెట్టి, పర్సనల్ కాస్ట్ (జీతాల ఖర్చు) 46శాతం ఉంది, దానిని తగ్గించాలని చూస్తే ఎలా?
70 సంవత్సరాలుగా ఆర్టీసీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నది కార్మికులు, కార్మిక సంఘాలు. 2001లో ప్రపంచ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా 24 రోజుల సమ్మె, 2005లో ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా 5 రోజుల సమ్మె, 2019లో ఆర్టీసీ రక్షణ కోసం 55రోజుల సమ్మె ఇలా పోరాటాలతోనే ప్రభుత్వ విధానాలను వెనక్కి కొట్టి ప్రజా రవాణా సంస్థను కాపాడుకుంటున్నది కార్మికోద్యమం. ప్రస్తుతం కార్మికోద్యమంపై విధించిన అప్రకటిత నిషేధాన్ని తొలగించి, ఆర్టీసీ నిర్వహణలో కార్మిక సంఘాలను భాగస్వాము లుగా చేయాలి. ఈ విధంగా అన్ని వైపులా అందర్నీ కలుపుకొని ముందుకు పోయినప్పుడే ఆర్టీసీ మనుగడ సాధ్యమవుతుంది తప్ప మరే ఇతర దగ్గర దారిలేదని గుర్తించాలి.
- పుష్పా శ్రీనివాస్