Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలుగు వారాల క్రితం, 2022 నూతన సంవత్సరం సందర్భంగా అందరం సంతోషంగా శుభాకాంక్షలు చెప్పుకున్నాం. కానీ, కోవిడ్-19 థర్డ్‌వేవ్ ఒమిక్రాన్ వేరియంట్‌తో మన జీవితాలు తలక్రిందులు కాకూడదనే విశ్వాసం అలాగే మిగిలింది. డెల్టా కన్నా ఒమిక్రాన్ ఎక్కువగా వ్యాప్తి చెంది, తక్కువ ప్రభావం చూపుతున్నప్పటికీ, మనపై విధించిన ఆంక్షలు రోజువారీ జీవితాలపై మరొకసారి ప్రభావం చూపుతున్నాయి. ఒకవేళ రాత్రి కర్ఫ్యూలు, సరిహద్దుల్లో సోదాల లాంటి నిబంధనలు ఇంతకు ముందున్న వేరియంట్‌ను కట్టడి చేయకుంటే, అవే నిబంధనలు వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్‌ను కూడా కట్టడి చేయవనే విషయం వివేకవంతులకు స్పష్టమవ్వాలి.
లోపించిన హేతుబద్ధత
కానీ, మనం ఇరవై నెలల పాటు పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించి నప్పుడే మన హేతుబద్ధతను వదిలేశాం. ఒమిక్రాన్ పట్ల అహేతుకమైన స్పందన, ముఖ్యంగా పిల్లలపై ప్రభావాన్ని చూపుతుంది. రాజకీయ నాయకులకు పాఠశాలలు ఒక తేలికైన లక్ష్యాలుగా మారాయి. పాఠశాలల మూసివేత, కోవిడ్‌ను కట్టడి చేసే ఒక సున్నితమైన చర్య అనీ, దాని కోసం వారేదో చేస్తున్నారనే భావనను ప్రజల్లో కలిగిస్తుంది. కానీ ఇది, హేతుబద్ధతలో, వాస్తవంలో పాదుకొనని ఒక భావోద్వేగ ప్రతిచర్య. కోవిడ్-19 రెండవ వేవ్ ముందు కూడా, చిట్ట చివరికి మూసివేసేది, మొట్ట మొదట ప్రారంభించాల్సింది పాఠశాలలేనని అనేకమంది నిపుణులు సూచించారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకోక పోవడం వల్ల కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన కాలంలో సుదీర్ఘకాలం పాటు పాఠశాలలు మూసివేసిన దేశాలలో మన దేశం ఒకటిగా నిలిచింది. ఒమిక్రాన్ తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ, పిల్లల ఆరోగ్య సంరక్షణా చర్యలను పాటిస్తూనే, అనేక దేశాల్లో పాఠశాలలను తెరిచారు.
పిల్లలను కాపాడేందుకే పాఠశాలలను మూసివేస్తున్నామనే కారణాన్ని ప్రధానంగా చూపుతున్నారు. ఈ కారణాన్ని ఒకసారి పరిశీలిస్తే, కార్లు, మోటారు వాహనాలు ప్రమాదకరం కాబట్టి వాటిలో ప్రయాణించకూడదని ప్రభుత్వం మనకు చెప్పిందనుకుందాం, అప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉండాలి? మనం ఖచ్చితంగా దానిని అసంబద్ధమైన విషయంగా పరిగణించాలి. 25ఏండ్ల లోపు వారికి, రోడ్డు ప్రమాదాల వల్ల వాటిల్లే ప్రమాదం కంటే కోవిడ్-19 వల్ల వాటిల్లే ముప్పు చాలా తక్కువని ఇప్పుడు గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి, పిల్లలను రక్షించుకునేందుకే పాఠశాలల మూసివేత అనేది, (పిల్లలను కార్లలో ప్రయాణించకుండా నిషేధం విధించడమంత) అహేతుకమైన విషయం.
పాఠశాలలు కరోనా వైరస్‌ను పెద్ద ఎత్తున వ్యాప్తి చేసే కేంద్రాలా? పిల్లలు పాఠశాలల నుండి వైరస్‌ను ఇంటికి మోసుకెళ్ళి, పెద్దలకు అంటిస్తారని మనకు చెపుతున్నారు. పాఠశాలలు కోవిడ్-19 వ్యాపింపజేసే ప్రధాన కేంద్రాలని శాస్త్రీయంగా నిరూపించే రుజువు చాలా బలహీనంగా ఉంది. వాస్తవానికి, అధ్యయనాలు వీటికి భిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు, స్పెయిన్‌లోని పాఠశాలలో అన్ని వయసులకు చెందిన ఒక మిలియన్ పిల్లల గణాంకాలను విశ్లేషించి, వైరస్ వ్యాప్తి ఒక శాతం కన్నా తక్కువే ఉందని తేల్చారు. అంతేకాకుండా, చిన్న వయసులో ఉన్న పిల్లల్లో వైరస్ వ్యాప్తి కూడా చాలా తక్కువగా అంటే 0.2 శాతంగా (ప్రీ ప్రైమరీ పిల్లలు) ఉంది. కాబట్టి, దేశంలో అనేక రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాలను, ప్రాథమిక పాఠశాలలను మూసివేయడం అశాస్త్రీయమైన చర్య. పదహారు సంవత్సరాల లోపు పిల్లలు చదువుకునే పాఠశాలలను స్వీడన్లో మూసివేయలేదు. ఇతర వృత్తులలో ఉన్న వారితో పోలిస్తే ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొనలేదు. భారత దేశంలో బ్యాంకులు, మార్కెట్లు, బస్సులు, రైళ్ళు, విమానా శ్రయాలు, ఆఖరికి మాల్స్, సినిమా థియేటర్ల లాంటి ప్రదేశాలు జనంతో కిటకిటలాడుతుంటే, పాఠశాలలు మాత్రమే వైరస్‌ను మోసుకెళ్ళే ప్రాంతాలెలా అవుతాయి? ఇక్కడే మనమెవర మైనా విజ్ఞతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.
పరిణామాలు
ఆన్లైన్ విద్యా విధానం సరియైన విద్యను అందిస్తుందా? ఇంతకు మునుపు కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో, పిల్లలు దాని బారిన పడ్డారా లేదా అనే విషయం మనకు తెలియదు కానీ, భౌతిక విద్యా బోధన విధానానికి మాత్రం ఆన్లైన్ విద్య ప్రత్యామ్నాయం కాదనే విషయం మనకు తెలుసు. పిల్లలు ముఖ్యంగా ప్రైమరీ, ప్రీ ప్రైమరీ చదివే పిల్లలు కేవలం మానవ పరస్పర చర్యల (హ్యూమన్ ఇంటరాక్షన్) వలన నేర్చుకోగలగడంతోపాటు సామాజికంగా, మానసికంగా అభివృద్ధి చెందగలరు. అయినా, పాఠశాలలు మూసివేయడం ద్వారా మనం వారి జీవితాలతో ప్రయోగాలు చేస్తున్నాం. ఈ ప్రయోగాల ఫలితాలు చాలా వినాశనకరంగా ఉంటున్నాయి. సెప్టెంబర్, 2021 పూర్తి సర్వే నివేదిక దాని ప్రభావం ఎలా ఉందో తెలియజేస్తుంది. పిల్లల చదివే, రాసే సామర్థ్యం స్థాయి బాగా తగ్గిపోయింది, సగం మంది పిల్లలు కొన్ని పదాల కంటే ఎక్కువ చదువలేక పోతున్నారు. మూడో వంతు పిల్లలు చదువుకునే క్రమంలోనే లేరు.
విద్యకు సంబంధించిన సమస్యలు ఏదో ఒక రోజు పరిష్కారం చేస్తారనే ఒక నిరాధారమైన, అస్పష్టమైన హామీలను అంగీకరించినప్పటికీ, మానసిక ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. పాఠశాలలు మూసివేసినప్పటికీ, పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా పెరిగినట్లు యూకే నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా, ''అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్'' పిల్లల్లో మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ''జాతీయ ఎమర్జెన్సీ''గా పేర్కొంది. భారతదేశంలో, మానసిక ఆరోగ్య సమస్యల్ని పక్కకు పెడితే, పాఠశాలల మూసివేత తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. మద్యాహ్న భోజన పథకాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా పౌష్టికాహార లోపాల సమస్య మరింత అధ్వాన్నంగా తయారైంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా కొన్ని దశాబ్దాలుగా సాధించిన ప్రగతి, పాఠశాలల మూసివేత కారణంగా వెనుకపట్టు పట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం, 10.1 మిలియన్ల మంది పిల్లలు బాలకార్మికులుగా ఉన్నారనే ఒక అంచనా ఉంది. పౌష్టికాహార లోపాలు, బాల కార్మికులకు సంబంధించిన రోజువారీ సమాచారం మన వద్ద ఉండి ఉంటే, బహుశా మనం భారతదేశంలోని పిల్లల బాధల పైన దృష్టి పెట్టడమే కాకుండా, సుదీర్ఘకాలం పాటు పాఠశాలలు మూసివేసి ఉండెడివాళ్ళం కాదు.
వ్యాక్సినేషన్ వాదన
ఈ సందర్భంగా, పిల్లలకు కోవిడ్-19 టీకాలు వేసిన తరువాత మాత్రమే క్షేమంగా ఉన్నారనే ఒక కల్పిత కథ ఉంది. దీనిని కొట్టివేస్తూ, పెద్దవారికి టీకాలు వేయడానికి ముందే కొన్ని దేశాల్లో పాఠశాలలు తెరిచారనే వాదన కూడా ఉంది. పిల్లలు పాఠశాలల నుండి ఇంటివద్ద ఉండే పెద్దలకు వైరస్‌ను అంటించే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉందని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం కోవిడ్-19 వ్యాక్సిన్లు అంటువ్యాధిని అడ్డుకోలేవనే విషయం తెలుసు కాబట్టి, పెద్దవారి ప్రయోజనాల కోసం, పిల్లల పాఠశాలలను మూసివేయడం అసంబద్ధమైన విషయం. పిల్లలకు శాస్త్రీయమైన పరీక్షల తర్వాత ఉపయుక్తమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేరు, ఇప్పటికీ పరిశీలనలో ఉన్న వ్యాక్సిన్‌కు విద్యను, పాఠశాలలను ముడిపెట్టడంలో అర్థం లేదు. పిల్లలకు కోవిడ్-19 ఎమర్జెన్సీ లేదు కాబట్టి వారికి వ్యాక్సిన్ అత్యవసరం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇది వాస్తవానికి, రోగి నిరోధకశక్తి పైన ''నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్''(ఎన్‌టీఏజీ) అభిప్రాయం.15-18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వ ఆమోదం, ఎన్‌టీఏజీ అభిప్రాయాన్ని సవాల్ చేస్తుంది.
విద్య అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. పాఠశాలలను సుదీర్ఘకాలం పాటు మూసివేయడం ద్వారా, ఒక బలహీనమైన ప్రత్యామ్నాయానికి అవకాశం ఇవ్వడం ద్వారా, మనం పిల్లల హక్కులను ఉల్లంఘనకు గురిచేస్తున్నాం. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పిల్లల కోసం నోళ్ళు విప్పాలి. అంటువ్యాధుల వ్యాప్తి, నియంత్రణ శాస్త్రవేత్తలు, డాక్టర్లు, విద్యావేత్తలు ధృవీకరించిన ''పిల్లలకు 2022 సంవత్సరం సంతోషంగా ఉండాలని'' కోరుతూ మనలో ఒక గ్రూప్ ఒక ప్రయత్నాన్ని ప్రారంభించింది. 2022 ఆ తరువాత కాలం కూడా పిల్లలు అన్ని విధాలా సంతోషకర మైన పాఠశాల జీవితం, సంతోషకరమైన బాల్యాన్ని పొందాలని ఆశిద్దాం. పిల్లలు, బాధించని కోవిడ్-19 వల్ల కాక, అహేతుకమైన, అసంబద్ధమైన నియమ నిబంధనలతో పాఠశాలల మూసివేతతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పౌర సమాజంలోని పిల్లల సంతోషం కోసం ప్రతీ ఒక్కరం స్పందించాలి.
(''ద హిందూ'' సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్, 9848412451
- భాస్కరన్ రామన్