Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మూడో ఉధృతి కొనసాగుతున్నది. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మిజోరామ్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబో తున్నాయి. పేదరికం తీవ్రమవు తున్నది. రైతన్నల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఆకలి చావులు నివారించేందుకు సామూహిక భోజన శాలలను తెరవమని సుప్రీం ధర్మాసనం కోరుతున్నది. పెట్రోల్, డీజిల్ ధరలతో సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిరుద్యోగం ప్రమాదస్థాయికి చేరి ఆగ్రహంతో బుసగొడుతున్నది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అవకతవకల కారణంగా యువతలో ఆగ్రహ జ్వాలలు చెలరేగి యూపీ, బీహారుల్లో విధ్వంసానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న రానున్న బడ్జెట్ ఎలా ఉండబోతున్నది? ఉపశమన చర్యలు ఏమైనా ఉంటాయా? లేక పెనం నుండి పొయ్యిలో పడిన చందంగా ఆర్థిక విపత్తు మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుందా? అనే సందేహాలు సహజంగా రాకమానవు.
కాగా, మనదేశంలోని వందమంది కోటీశ్వరులు రూ.57లక్షల కోట్ల సంపద కలిగి ఉన్నట్టు ఇటీవల గ్లోబల్ రిపోర్టు (ప్రపంచ నివేదిక) తెలిపింది. ఇది రెండేండ్ల ఆర్థిక బడ్జెట్‌కు ఇంచుమించు సమానమని గమనించాలి. అదే విధంగా మన దేశంలో 50శాతం జనాభా అంటే సగం మంది కేవలం 6శాతం సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. ఈ ఒక్క కోవిడ్ సంవత్సరంలోనే 102 మందిగా ఉన్న శతకోటీశ్వరులు (బిలియనర్స్) 142కు పెరిగారు. 23లక్షల కోట్లుగా ఉన్న వారి సంపద ఏడాదిన్నర కాలంలోనే అకస్మాత్తుగా 57లక్షల కోట్లకు పెరిగిందట. ఫలితంగా మరో నాలుగున్నర కోట్ల మంది ప్రజానీకం దుర్భర దారిద్య్రంలోకి జారిపోయారు.
ఈ విపరిణామానికి బాధ్యులు ఎవరు? నిస్సందేహంగా పాలకులు, వారి విధానాలే. ఇది ఇలా ఉండగా రానున్న కాలంలో మన ఆర్థిక పరిస్థితులు మరింతగా దెబ్బతీసే రీతిలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, బంగారం ధరలు పెరగనున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా తన సంక్షోభం నుండి గట్టేక్కేందుకు వడ్డీరేట్లను మూడు దఫాలు పెంచబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ స్పెక్యులేషన్ (అంచనా) గనుక నిజమైతే విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ వలన మన రూపాయి ఇంకా బలహీనమవుతుంది.
ఇప్పటికే మన విద్యా, వైద్య రంగాలు ప్రయివేటు కార్పొరేట్ల కోరల్లో చిక్కుకుని కుదేలు అవుతున్నాయి. అంతర్జాతీయంగా మన ప్రాథమిక, ఉన్నత విద్యల నాణ్యత ప్రమాణాలు చివరిస్థానాల్లో ఉంటున్నాయి. ఆరోగ్యంలో కూడా అంతే. స్త్రీలు - పిల్లల్లో దాదాపు నలభైశాతం మంది పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారు. చాలా గ్రామాల్లో మౌలిక విద్యా, వైద్య సదుపాయాలే కాదుకదా తాగునీటి సౌకర్యం కూడా లేక అల్లాడుతున్నారు. భూసారం దెబ్బతింటున్నది. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం పెరుగుతున్నది.
అయినా ఎలాంటి వైపరీత్య పరిస్థితిల్లోనూ మన రైతు ఏటికి ఎదురీదినట్టు నిరంతరం సేద్యం చేస్తూ తిండిగింజలను అందిస్తూనే ఉన్నాడు. అయినా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు ఏయేటికాయేడు రైతుకు భారమవుతూనే ఉన్నాయి.
మరి ఈ నేపథ్యంలో కేంద్రం 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను అయిదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్తానని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ఇంకా బీరాలు పలుకుతున్నది. వాస్తవాల ప్రాతిపదికగా బడ్జెట్ రూపకల్పన చేయడానికి సుదూరంగా ఉన్నది. ఏదేశమైనా సుస్థిర అభివృద్ధి సాధించాలంటే ఆ దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే ఏకైకమార్గమని సర్వత్రా వెల్లడయ్యే అభిప్రాయం. ముందుగా పేదరికం తొలగిపోవాలి. పేదల ఆదాయం కనీసం నెలకు అదనంగా రూ.5వేలు పెంచేలా బడ్జెట్ చిత్తశుద్ధితో దృష్టిసారిస్తేనే తప్ప ఆ పేదల బతుకులు, ముఖ్యంగా అసంఘటితంగా ఉన్న వలస కార్మికుల వ్యవసాయ కూలీల బతుకులు నిలబడబోవని పలువురు ఆర్థిక వేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో పన్నులు విధించే కార్యక్రమంలో విప్లవాత్మక మార్పు రావాలని ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక సూచిస్తున్నది. వేతన జీవులు, కార్మికులు, కర్షకులు, దిగువ, ఎగువ, మధ్యతరగతి ప్రజలు, అట్టడుగు నిరుపేదలు అందరూ దేశంలో 95శాతం పన్నుల భారం మోస్తున్నారని వివరించింది. సంపన్నుల గుప్పెట్లో పేదలు రోజు రోజుకు పిప్పి అవుతూ ఊపిరి పోగట్టుకునేలా జీవన్మరణ పోరాటం సాగిస్తున్నట్టు ఆ నివేదిక తేటతెల్లం చేసింది.
భారత్ ఆర్థికంగా తనకు తానుగా నిలబడాలన్నా పేదల ఆదాయం పెంచడంతో పాటు, కార్పొరేట్ పెట్టుబడుల కంటే ప్రభుత్వ పెట్టుబడులపై నిలబడటమే శరణ్యమని ఆ ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ బడ్జెట్ రాబోతున్నది.
- కె. శాంతారావు
సెల్: 9959745723