Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దృశ్యమంటే ఏమిటి గురువా అన్నాడు శిష్యుడు.
దృశ్యమంటే కనిపించేది నాయనా అన్నాడు గురువు.
వెంటనే అదృశ్యమంటే ఏమిటనీ అడిగాడు.
కనిపించనిది శిష్యా అన్నాడు.
ఉండీ కనిపించనిదా లేక లేనప్పుడు కనిపించనిదా అని తిరిగి ఆడిగాడు శిష్యాధముడు.
వీడు తనకే ఏదో నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడని అనుకున్న గురువు కళ్ళు తెరిచి చూస్తే కనిపించేది దృశ్యం, అదే కళ్ళు మూసుకుంటే అదృశ్యమన్నాడు గురువు. కళ్ళకు కనిపించేది దృశ్యము కనిపించనిది అదృశ్యమన్నాడు కూడా.
అయితే రాజు దృశ్యము పాలన అదృశ్యము అంతే కదా అన్నాడు శిష్య పరమాణువు.
ఇక ఈ టాపిక్ ఆపుదాము ఆకలిగా ఉంది ఏవైనా పళ్ళు పట్టుకు రమ్మన్నాడు గురువు. తెస్తే ఇద్దరూ తిన్నారు.
పళ్ళు దృశ్యము ఆకలి అదృశ్యము, తిన్న తరువాత పళ్ళు అదృశ్యము ఆకలి ఎప్పుడూ అదృశ్యము కదా గురువా అన్నాడు శిష్యుడు.
గురువుకు నిద్రతో పాటు కోపమొచ్చింది, నీకు ఇంకా క్లారిటీ రావాలంటే దృశ్యం, దృశ్యం-2 సినిమాలు చూడమన్నాడు.
తెలంగాణలో చూస్తే మేలా ఏపీలో చూస్తే మేలా ఎందుకంటే అక్కడ సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తున్నారట కదా అన్న శిష్యుడి మాటలు పూర్తికాకముందే గురువు మెలకువ అదృశ్యమై గురక రూపంలో నిద్రిస్తున్న గురువు దృశ్యంగా కనబడ్డాడు శిష్యుడికి.
అలా మన జీవితమంతా కనిపించేదాన్ని, కనిపించనిదాన్నీ కనిపించినా మనం ఎలా చూస్తున్నామో తెలియనిదాన్నీ, తెలిసినా కూడా అంగీకరించనిదాన్ని... ఇలా ఎన్నో రకాల కలయికలుగల విషయాలను మనకు తోచినట్టు, మనకు అర్థమయినట్టు అర్థం చేసుకుంటుంటాం. అనుమానమొస్తే ఎవరినైనా అడుగుతాం. ఇంత చిన్న విషయాన్ని కూడా అడగాలా అన్న అహం అడ్డొస్తే ఇక అడగం. మన సొంత పైత్యంతో దాన్ని మనసులో దాచుకుంటాం. అది అలాగే ప్రింటయిపోయి నిజాన్ని మనకు కనిపించకుండా చేస్తుంది. అంటే అదృశ్యం చేస్తుంది. కనిపించేది కనిపించినట్టే ఉంది అనుకుంటే పొరబాటు. ఉదాహరణకు సముద్రంలో మంచుకొండ పైకి కొద్దిగా కనిపిస్తుంది. పైది మాత్రమే అనుకుంటే సముద్రంలో కాలేసినట్టే. అడుగుభాగాన ఆ మంచుకొండ ఇంకా ఎక్కువగా పైకి కనిపించేదానికన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే కనిపించేది, కనిపించనిది మాత్రమే కాదు ఎలా కనిపించేది, ఎందుకలా కనిపించేది అన్న విషయాలు బాగా తెలుసుకోవాలి.
కనబడుటలేదు అని పేపర్లలో ప్రకటనలు చూస్తుంటాం. కింద ఫొటో ఉంటుంది. అంటే ఆ వ్యక్తి తమ బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులు ఇలా తమ వారికి కనిపించకుండా పోయాడని అర్థం. కనిపిస్తే చెప్పమని సెల్ నెంబరు ఇచ్చి ఉంటారు. అంతే తప్ప ఆ ఫొటోలో ఉన్న వ్యక్తికీ కళ్ళు కనిపించడం లేదని కాదు. మా పోకిరి ముత్రుడొకడున్నాడు... ఈ మధ్య కనిపించలా అని ఎవరైనా అంటే కళ్ళ డాక్టరుకు చూపించుకో అంటాడు. అవతలివాడి కోపమొస్తే వీడిని మంచి మెంటల్ డాక్టరుకు చూపమని పక్కనున్న నాకు చెప్పడం ఖాయం. ఇక కళ్ళ డాక్టరు దగ్గర చదువొచ్చిన వాళ్లకు అక్షరాలూ, రాని వాళ్లకు గీతలూ ఉంటాయి బోర్డ్ మీద. అది గుర్తుపట్టి చెప్పాలి. మందు బాబులకు ఆ మందుబాటిళ్ల బొమ్మలు, స్త్రీలకు నగల బొమ్మలు చూపించి టెస్టు చేసినట్టు వాట్సాప్లో కార్టూనులు పెడుతుంటారు, అది తమాషా కోసం.
కాంతి ప్రసరించినప్పుడు దృశ్యాదృశ్యముల కలయికే అంటూ భౌతిక శాస్త్రం టీచరు చిన్నప్పుడు బోధించి ఉంటారు. వెంటనే తెలుగు మేష్టారు వచ్చి ప్రవరాఖ్యుడు కళ్లకు ఎదో రాసుకుని ఒక చోట అదృశ్యమై డైరెక్టుగా హిమాలయాల్లో ప్రత్యక్షమవుతాడని చెబుతారు. సైన్సు ఒకటి చెబుతుంటే ఈ తెలుగు ఒకటి చెబుతుందని మన చిన్ని మెదళ్ళు కొద్దిగా కంగారు పడతాయి. అసలు శక్తి ఉపయోగించకుండా ఏ వస్తువునూ కదిలించలేమని ఒకరు చెబితే, హాం ఫట్ అని మాంత్రికుడో, రాక్షసుడో సినిమాలో కొన్నింటిని సృష్టిస్తాడు, కొన్నింటిని మాయం చేస్తాడు. అవన్నీ కూడా సైన్సును వాడుకుని చేసినవే. అక్కడ సైజును అదృశ్యం చేసి ఏవో శక్తులను ప్రత్యక్షం చేస్తారు. అక్కడా మనం కన్ఫ్యూజ్ కాకూడదు.
చిన్నప్పుడు అంటే ఓ ముప్ఫయి సంవత్సరాల ముందు, బాలానగర్ నుండి గచ్చిబౌలికి నవోదయ స్కూలులో చదివే మా అక్క కూతురిని చూడడం కోసం బండిలో పోయే వాళ్ళం. ఎంతసేపు పోయినా రాదు. మధ్యలో ఐ.డి.పీ.ఎల్ కనిపించేది. అవన్నీ చూపిస్తూ చెప్పేవాడు మా బావ. ఇప్పుడు అది కనబడకుండా చేశారు. చెట్లు పెరిగి ఎందరికో మందులిచ్చి కాపాడిన ఆ ఫార్మా కంపెనీ మాయమై పాడుబడిన బంగళాలా కనిపిస్తోంది ఇప్పుడు. అదే ఉంటే ఈ కరోనాను ఎప్పుడో మాయం చేసేది అనిపిస్తుంది. ఇప్పుడు ఖాళీ స్థలాలన్నీ మాయమై పెద్ద హైటెక్ సిటీ, పెద్ద పెద్ద అపార్టుమెంట్లు కనిపిస్తాయి. ఆ ఐ.డి.పీ.ఎల్.తోపాటు ఆల్విన్, హెచ్.ఎం.టి. మొదలైనవి మాయమయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో. వాటిని మాయం చేసిన వాళ్ళు కూడా మాయమయ్యారు. అయితే అంతకంటే మాయగాళ్లు ఇప్పుడు మన తలలపై కూచున్నారన్న విషయం మరువరాదు.
ఇక కవిత్వాల్లో కూడా ''మనిషి మాయమయ్యాడు కాస్త చూసిపెట్టండి'' అని మనిషి కనిపించడం లేదు, మార్కెట్లు ప్రత్యక్షమయ్యాయని రాస్తున్నారు. మానవత్వం కనిపించడం లేదు మార్కెట్ లీలలు మాత్రమే కనిపిస్తున్నాయనీ రాస్తున్నారు. నిజంగా అవన్నీ నిజం. పొద్దున్న లేచింది మొదలు మనమేం కొనాలో, ఏం తినాలో అని చూపించేవే. మన వేతనాలు మాత్రం ఈ ఖర్చులకు మాయమవు తుంటాయి. అందుకే రాబోయే జీతాలు కూడా అదృశ్యమయ్యే విధంగా వాయిదా పద్ధతిలో పట్టుకుంటాం అని ఎక్కడ చూసినా ఈ.ఎం.ఐ.లు రాజ్యమేలుతున్నాయి. నెలంతా పడ్డ కష్టం ఒక్కరోజులో మాయమవుతుంది.
కాబట్టి మనం బాగా కనిపించవలసిన వాటిని కనిపించేలాగా చేసుకొని వాటిని మనముందు అదృశ్యం చేసేవాళ్లను మనమే మనకున్న ఒకే ఒక ఆయుధం ఓటుతో వేటు వేయకుంటే చివరకు మనమే మాయమవుతాం. అందుకే వద్దనుకున్నవాళ్లను హాం ఫట్ చేయండని మనవి...
- జంధ్యాల రఘుబాబు
సెల్: 9849753298