Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాత్మాగాంధీ! భారత స్వాతంత్ర పోరాటానికి సారథిగా చరిత్రలోనూ ప్రజల హృదయాలలోనూ నిలిచిపోయిన జాతిపిత. దేశం మూలమూలలకీ స్వరాజ్యపోరాటం పిలుపు విస్తరింపజేసిన నేత. బ్రిటిష్ రాజధాని లండన్‌లో ఉండగా స్వాతంత్ర స్ఫూర్తి పెంచుకుని, దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి దురహంకారంపై పోరాడి, మాతృదేశ విముక్తి కోసం అంకితమైన ఆదర్శనేత. ఆ క్రమంలో నిరాడంబరత్వం, త్యాగనిరతి వంటి లక్షణాలకు ప్రతీకగా నిలిచి మహాత్ముడు అనిపించుకున్న వ్యక్తి. గాంధీజీ నిర్వహించిన ఉద్యమాలు, ఉపసంహారాలపై అనేక విమర్శలున్నాయి. అయితే స్వాతంత్ర మౌలిక లక్ష్యాన్ని సచేతనంగా ఉంచడం, బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులు ఏదో విధంగా చర్చలకు రావలసిన పరిస్థితి కల్పించడం ఆయన నాయకత్వ నైపుణ్యంలో భాగమైంది. 'ఆ ఆర్థనగ ఫకీరు బ్రిటిష్ చక్రవర్తితో మాట్లాడటాన్ని నేను ఊహించలేను' అన్న చర్చిల్ వంటివారికి గాంధీ ఆచరణతోనే సమాధానమిచ్చారు. ఇంతటి శక్తి గాంధీకి లభించిందంటే కేవలం ఆయన నైతికనిష్ట మాత్రమే కారణం కాదు... భిన్నమతాలతో కూడిన ఈదేశంలో హిందూ ముస్లిం ఐక్యత, మతసామరస్యాన్ని ప్రాతిపదికగా చేసుకోవడం అందుకు దారితీసింది. 1920 తర్వాత క్రమంగా ఆయన పట్టు పెరిగిన కొద్దీ ఈ దిశలో అనుసరించిన వ్యూహాలను విచ్ఛిన్నం చేసేందుకు పరాయి పాలకులు విభజించి పాలించే విధానం అనుసరించారు. మొదట ఆరెస్సెస్, తర్వాత ముస్లింలీగ్ హిందూమహాసభ వంటివి అందుకు సాధనాలయ్యాయి. మత కలహాలూ రగిలించాయి. చివరకు అది దేశ విభజనకు దారితీసింది.
దేశస్వాతంత్ర పోరాటసారథి అయినా ఆయన స్వతంత్రం తర్వాత ¸ అధికార వ్యవస్థలో భాగం కాలేదు సరికదా వేడుకలలోనూ పాలుపంచుకోలేదు. ఆ మతమారణహోమం మధ్య శాంతిసామరస్యాల కోసమే తల్లడిల్లి పోయారు. నౌఖాలిలో శాంతిస్థాపన కోసం ఆయన చివరి యాత్ర చేశారు. తిరిగివచ్చాక కొంత కాలానికే హిందూ మతోన్మాది పూర్వాశ్రమ ఆరెస్సెస్ వాది, విడిసావర్కర్ శిష్యుడు నాథూరాం వినాయక్ గాడ్సే 1948 జనవరి 30న ఆయనను అమానుషంగా కాల్చిచంపాడు. మన జీవితాల్లోంచి దీపకాంతి నిష్క్రమించింది అని తొలిప్రధాని నెహ్రూ జోహారులర్పించారు. గాంధీజీ హత్యకు గాడ్సే పథకాలు, ముందు రోజుల్లో ప్రత్యక్ష్యంగా రెక్కి నిర్వహించిన విషయం బయిటకు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శకు గురైంది. అప్పటి హొంమంత్రి సర్దార్ పటేల్‌కు గాంధేయవాదిగా పేరు. గాంధీజీ హత్యకు ముందు నెహ్రూ పటేల్ మధ్య విభేదాల పరిష్కారం కోసం ఆఖరిసారి చర్చలు జరిపి ప్రార్థన సమయం ఆలస్యమైందని హడావుడిగా వెళ్లారు. ఆ సమయంలో పాదాభివందనం చేస్తానంటూ వచ్చిన గాడ్సే గుళ్లవర్షం కురిపించారు. హేరాం అంటూ ఆయన ప్రాణాలు వదిలారని రాజ్‌ఘాట్‌లో ఆయన సమాధిపైనా ఆ అక్షరాలే లిఖించారు. (అలా అనలేదని కొంతమంది పరిశోధించారు.) అదేమో గాని రఘుపతి రాఘవ రాజారాం అన్న గాంధీ ఈశ్వర అల్లా తేరేనామ్ అంటూ అన్ని మతాలు ఒక్కటేనని చాటారు. నేను హిందువును, ముస్లిమును, క్రైస్తవుణ్ని, యూదును అంటూ అన్ని మతాలు ఒకటేనని చెప్పిన గాంధీ పలుకులు సుప్రసిద్ధం.
బైబై టు అబైడ్ విత్‌మి
ప్రముఖ స్కాట్లాండ్ కవి రాసిన ''అబైడ్ విత్ మి''(నాతో ఉండు) అన్న క్రైస్తవ ప్రార్థనా గీతంకూడా ఆయనకు చాలా ఇష్టం. ప్రతిఏటా రిపబ్లిక్ దినోత్స సైనిక పాటవ ప్రదర్శనల తర్వాత జనవరి 29న క్రమ పద్ధతిలో నిష్క్రమించేప్పుడు అబైడ్ విత్ మి గీతాన్ని వినిపించడం రాజ్యాంగ ఆమోదం నాటి నుంచి కొనసాగుతున్న ఆనవాయితీ. ఈ ఏడాది ఆజాదీకా ఆమృతోత్సవ్ అంటూనే మోడీ సర్కార్ ఆ పాటను ఎత్తివేసింది. 1962లో చైనాతో జరిగిన సాయుధ ఘర్షణ సందర్భంలో లతామంగేష్క్ర్ పాడిన ఆయే వతన్కె లోగ్ను ఆ స్థానంలో ప్రవేశపెట్టింది. 2020లోనే ఈ ప్రయత్నం చేసినా విమర్శలు రావడంతో 2021లో పునరుద్ధరించి ఇంతలోనే మళ్లీ తొలగించారు. గాంధీజీ పట్ల ఈ ప్రభుత్వ గౌరవం ఏపాటిదో తెలియడానికి ఇది తాజా ఉదాహరణ. వాజ్‌పేయి హయాంలోనే సావర్కార్‌ను పార్లమెంటులో ప్రతిష్టించగా ఇప్పుడు మోడీ హయాంలో ఏకంగా గాడ్సే నామస్మరణ వరకూ వచ్చాం. కేంద్రం ప్రకటనల్లోనూ, మోడీ ప్రవచనాల్లోనూ పలుసార్లు గాంధీజీ ప్రస్తావన వస్తున్నా అది స్వచ్ఛభారత్ ప్రచారానికే. ప్రపంచ ప్రసిద్ధమైన గాంధీ ప్రతీక తొలగించలేరు గనక అరకొరగా అసందర్భంగా ఆయనను ప్రస్థావిస్తుంటారు. విదేశీ అతిథులను సబర్మతి ఆశ్రమం తీసుకు వెళ్లి ఫొటో సెషన్ అయిపోగానే హడావుడిగా పరిగెడుతుంటారు. గాంధీజీ ఆశయాలకు విరుద్దంగా ఆ అశ్రమాన్ని ఆధునీకరించే పథకం అమలు చేయడం పట్ల ఎన్ని విమర్శలు వచ్చినా అనుకున్నదే చేసుకుపోతున్నారు.
ముప్పయ్యేళ్లు.. కొత్తకోణాలు
నిజానికి 1992 డిసెంబర్ 6న అయోధ్యలో వివాదాస్పద బాబరీ మసీదు కట్టడాన్ని సంఫ్‌ుపరివార్ కుట్రతో కూల్చివేసిన తర్వాత 1993 జనవరి 30 గాంధీ జయంతిని వామపక్షాలు ఇతర లౌకిక శక్తులు ప్రతిజ్ఞా దినంగా పాటించాయి. గాంధీజీ మతసామరస్య వారసత్వం కొత్త అర్థం సంతరించుకుంది. మరో పదేండ్లకు 2002లో గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా ఘోర జాతిహత్యాకాండ ఈ క్రమంలో మరో హెచ్చరిక అయింది. కార్పొరేట్ శక్తుల వత్తాసుతో మోడీ నిరాఘాటంగా కొనసాగడమే కాదు ప్రధాని కూడా కాగలిగారు. రిలయన్స్ అంబానీ ఆ రోజుల్లో గుజరాత్లో పారిశ్రామిక వేత్తల సభల్లో మాట్లాడుతూ గాంధీజీ, ధీరుభారు, మోడీలు దేశానికి గుజరాత్ ఇచ్చిన కానుకలని కొనియాడారు. మోడీ ప్రధాని అయ్యాక సర్దార్ పటేల్‌ను ఎక్కువ చేసి నెహ్రూను వెనక్కు నెట్టడానికి పథకం ప్రకారం ప్రయత్నం మొదలైంది. కాంగ్రెస్‌లో నెహ్రూ ఉదారవాదిగా పటేల్ మితవాదిగా పేరొందారు. 3000 కోట్ల ఖర్చుతో అహ్మదాబాద్‌లో పటేల్ విగ్రహ స్థాపన ఇందులో భాగమే. గాంధీజీ హత్యానంతరం ఆరెస్సెస్‌ను నిషేదించిన వ్యక్తే పటేలే. అయితే తర్వాత నెహ్రూ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈ నిషేదం తొలగించింది కూడా ఆయనే. రిపబ్లిక్ దినోత్సవాన నేతాజీ హాలోగ్రామ్‌ను ఆవిష్కరించడం ద్వారా ఆయననూ తమ ఖాతాలో కలుపుకోవడానికి సర్కారు ప్రయత్నాలు తీవ్రం చేసింది. ఇండియా గేట్ దగ్గర గతంలో కింగ్‌జార్జి విగ్రహం తొలగించిన ఖాళీ పీఠంపై నేతాజీ విగ్రహం నెలకొల్పుతున్నారు. నేతాజీ కూడా ఆరెస్సెస్ తరహా భావజాలన్ని ఆమోదించే వ్యక్తి కాదు. ఎర్రకోటపై ప్రధానిగా చేసిన తొలి ప్రసంగంలోనే నెహ్రూ నేతాజీ లేకపోవడం లోటుగా ఉందని గుర్తు చేసుకున్నారు. కనుక నెహ్రూనూ ఆయననూ ప్రత్యర్థులుగా చూపడమూ చారిత్రికత కాదు. నేతాజీ గాంధీని ఎదిరించి కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికవడానికి సుందరయ్య నాయకత్వంలో ఆంధ్ర ప్రతినిధులు ఓటు చేయడం చాలా సహాయపడింది. నేతాజీ నాజీ జర్మనీసాయం తీసుకోవడం సరికాదని కమ్యూనిస్టులు విమర్శించారే గానీ తన వ్యక్తిత్వాన్నీ దేశభక్తినీ ప్రశ్నించిందిలేదు. నేతాజీ కూడా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా నాటి సోవియట్ సాయం పొందడానికి ప్రయత్నించి తర్వాత జర్మనీ వెళ్లారు. కాగా నేతాజీని స్టాలిన్ ప్రభుత్వం జైలుపాలు చేసిందనీ అక్కడే ఆయన చనిపోయారనీ తాడూబొంగరం లేని కథలు నిజమని చూపించేందుకు మోడీ స్వయంగా రహస్య పత్రాల విడుదల ప్రహసనం నడిపించి భంగపడ్డారు. రిపబ్లిక్ వేడుకలకు బెంగాల్ ప్రభుత్వం పంపిన నేతాజీ శకటాన్ని నిరాకరించి, మళ్లీ తనే ఆయన హాలోగ్రామ్‌ను ఆవిష్కరించి ద్వంద్వనీతి ప్రదర్శించుకున్నారు.
ఒకోచోట ఒకో చిచ్చు
గాందీజీ, నేతాజీ, పటేల్ ఎవరైనా సరే దేశభక్తులూ మతసామరస్య వాదులే గాని మతతత్వాన్ని సహించేవారు కాదు. వారిలో ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని ముందుకు తేవడం ప్రస్తుత పాలకుల కుటిలనీతికి దర్పణం. ఇప్పుడు యూపీ ఎన్నికల ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రవాస ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాజామహేంద్ర ప్రతాప్ యూనివర్సిటీ ప్రారంభించి అమిత్ షా శివాజీ పేరు చెప్పడమూ అవసరార్థపు వ్యూహాలు మాత్రమే. అదే సమయంలో గాంధీజీ పాదుకొల్పిన సామరస్య లౌకిక సంప్రదాయాలను వమ్ము చేసే వక్రనీతీ చూడవలసి ఉంటుంది. బీజేపీ నేతల ఈ ప్రచారాలను మీడియా సోషల్‌మీడియా కథనాల వీటినే వేగంగా ప్రజల బుర్రల్లోకి జొప్పించే ప్రయత్నం పెద్దఎత్తునే సాగుతున్నది. హైదరాబాద్ చార్మినార్ నుంచి గుంటూరులో జిన్నా టవర్ వరకూ విద్వేష ప్రచారాస్త్రాలవు తున్నాయి.పేర్లమార్పిడి ప్రతిపాదనలు చరిత్రను తారుమారు చేసి చూపిస్తున్నాయి. చార్మినార్‌లో వివాదాస్పద భాగ్యలక్ష్మి ఆలయం బీజేపీ ప్రదర్శనల ప్రారంభ బిందువుగా మారింది. హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా మార్చాలని చెప్పడానికి చరిత్రలో ఆధారంలేని భాగమతిని తీసుకొస్తున్నారు. వాస్తవానికి బాగ్ అంటే తోట. బషీర్‌బాగ్, బాగ్ అంబర్‌పేట, బాగ్లింగ్పల్లి ఇలా బాగ్ల మయంగా ఉంది గనక హైదరాబాద్‌ను బాగ్‌నగర్ అనాలని బెర్నియర్ అనే పాశ్చాత్య చరిత్రకారుడు ఎప్పుడో రాశాడు. ఇక జిన్నాటవర్ ఆయన కాంగ్రెస్‌లో ఉన్న కాలంలోనే నిర్మాణమైంది. వాస్తవానికి బీజేపీ ఇటీవలి వరకూ పాలించిన ముంబాయిలో జిన్నా నివాసం జిన్నా హౌస్ ఇప్పటికీ ఉంది. జిన్నా మనవడైన పారిశ్రామికవేత్త నస్లీవాదియా బీజేపీకి నిధులు సమకూర్చడం అందరికీ తెలుసు. వారే గుంటూరులో జిన్నాటవరెక్కి టక్కరి వేషాలు వేస్తారు. ఇది స్వచ్ఛభారత్ ప్రచారం మాటున కక్ష భారత్‌ను రగిలించే ద్వంద్వనీతిరాజకీయం.
ముందునుంచే వెనక్కు!
దేశ చరిత్రతోనూ, చారిత్రిక వాస్తవాలతోనూ చెలగాటమాడే ఈ తరహా ఉదాహరణలు ఆరెస్సెస్ బీజేపీల చరిత్రలో కోకొల్లలు. వాస్తవం ఏమంటే చరిత్ర అంటే జరిగిపోయిందే గాని చరిత్ర కథనం వర్తమానంలో జరుగుతుంది. గతం నుంచి వర్తమానానికి రావడమే కాదు, వర్తమానం నుంచి గతాన్ని చూపడమూ చూడటమూ చరిత్రలోనే జరుగుతుంది. చరిత్ర విజేతల ఖడ్గంతో రాయబడుతుందంటారందుకే. గతాన్ని నేటి అవసరాలకు అనుగుణంగా వక్రీకరించి చూపడం పాలకులకు ఎప్పుడూ అలవాటే. వ్యతిరేక అనుకూల ప్రచారాలు అలానే నడుస్తాయి. కమ్యూనిస్టులపై నిరంతరం అనేక అసత్య ప్రచారాలు చేసే పాలకులు వారు సాధించిన సానుకూల విజయాలు, సాగించిన విప్లవాల గురించి పొరబాటున కూడా ప్రస్తావించరు. కాంగ్రెస్ హయాంలోనూ గాంధీ కుటుంబం ఆమోదించిన నాయకులనే ఎక్కువ చేసిన మాట అసత్యం కాదు. ఎప్పుడైనాసరే కొందరు నాయకుల చుట్టూ పరిభ్రమణం కంటే విశాల జనరాశుల పాత్ర గుర్తించడం ముఖ్యం. అయితే తమకు సంబంధమేలేని స్వాతంత్ర పోరాటంతో సంధానం చేసుకోవడం, కొంతమందిని కాంగ్రెస్ నుంచి విడదీసి వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడటం మోడీ పాలనలో వ్యూహం. ఈ క్రమంలో వారి బోధనలూ ఆశయాలూ తారుమారవుతుంటాయి. గాంధీజీ మతసామరస్య సందేశం వెనక్కు కొట్టడం అలాటిదే. సరిగ్గా ఆ కారణం చేతనే మనం దాన్ని మరింత గట్టిగా నొక్కి చెప్పవలసి వస్తుంది. వర్తమానంలో చేసే పోరాటాలతో పాటు చారిత్రక వారసత్వం కూడా సవ్యంగా కాపాడుకోవలసి ఉంటుంది. గాంధీజీని ఆరెస్సెస్ తరహాలో మలుచుకునే ఈ అతి తెలివి వ్యూహాలను అప్రమత్తంగా గమనిస్తూనే ఆయన నిజమైన వారసత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజాస్వామిక వాదులపై ఉంటుంది.
- తెలకపల్లి రవి