Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశం కేంద్ర బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నది. ఏటా సమస్యల సుడిగుండం నుంచి బయటపడే చర్యల కోసం ఎదురుచూపు. అంతలోనే నిర్లిప్తత. గత ఎనిమిదేండ్ల అనుభవంలో ఒరిగిందేమిటన్న అసంతృప్తి. కానీ ఇది రెండేండ్ల కరోనా కాలం తర్వాత చూడబోతున్న బడ్జెట్. గత ఏడాది బడ్జెట్ నిరాశపర్చింది. బడాబాబులకు పండుగ చేసింది. కానీ ఫలితంగా ప్రజల పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందో లేదో నన్న ఆందోళనలో జనం ఉన్నారు.
ఆక్స్‌ఫామ్ ఇండియా అధ్యయనం ప్రకారం దేశంలో 84శాతం ప్రజల ఆదాయాలు పడిపోయాయి. 4.6కోట్ల పేదలు అత్యంత పేదరికంలోకి జారిపోయారు. కరోనా కాలంలో పేదరికంలోకి దిగజారిన కుటుంబాలలో ప్రపంచంలో సగం భారతదేశంలోనేనని తేలింది. 2019తో పోల్చితే 1.3కోట్ల మంది మహిళలు ఉద్యోగాలకు దూరమయ్యారు. 20కోట్ల మంది పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ నివేదిక వెల్లడించింది. 2020లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 94వ స్థానంలో ఉన్న దేశం 2021లో 101వ స్థానానికి దిగజారింది. 116 దేశాల అధ్యయనంలో భారత్ పరిస్థితి ఇది. ఆన్లైన్ విద్యపేరుతో 90శాతం విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఇదే కరోనా కాలంలో బడా పెట్టుబడిదారుల ఆస్తులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశంలో శతకోటీశ్వరుల సంఖ్య ఏడాదిలో 102 నుంచి 142కు పెరిగింది. వీరి ఆస్తి 2020 మార్చి నుంచి 2021 నవంబరు నాటికి 23.14లక్షల కోట్ల నుంచి రూ.53.16లక్షల కోట్లకు ఎగబాకింది. అదానీ ఆస్తి రూ.3,90,241కోట్ల నుంచి రూ.6,45,892 కోట్లకు పెరిగింది. ముఖేశ్ అంబానీ సంపద రూ.7,31,620 కోట్లకు చేరింది. అదానీ సంపద 1747 శాతం పెరిగింది. కరోనాకు ముందే దళితులు, గిరిజనులకు దాదాపు సగం మందికి ఆరోగ్య వసతి లేదనీ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారనీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అధ్యయనాలు తేల్చాయి. 30శాతం దళితులకు గృహవసతి లేదని కూడా తేలింది.
దేశ ఆర్థిక పరిస్థితి కరోనాకు ముందే ఐసీయూలో ఉన్నదని సాక్షాత్తు ప్రధాని ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద సుబ్రహ్మణియన్ 2019లోనే చెప్పారు. అప్పటికే నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాలలో ఎప్పుడూలేని అత్యధిక స్థాయికి చేరిందని నేషనల్ సాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ తేల్చింది. దేశంలో ఆర్థిక అసమానతలు అభివృద్ధికి ఆటంకంగా తయారైనాయని 'ది ఎకానమిస్ట్' వ్యాఖ్యానించింది. విద్య, వైద్యం కార్పొరేటీకరణ ఫలితంగా ప్రజల ఆదాయంలో సగం వీటికే పోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఆస్తులు అమ్మటం, కుదువ బెట్టడం మీదనే కేంద్రీకరించింది. ప్రభుత్వం దృష్టి అంతా ప్రయివేటీకరణ మీదనే ఉన్నది. 2018లోనే 54వేల కోట్లుగా విలువకట్టిన ఎయిర్ ఇండియాను 2021లో కేవలం 18వేల కోట్లకు టాటాకు కట్టబెట్టారు. ఇప్పుడు 38లక్షల కోట్ల విలువజేసే ఎల్ఐసీ మీద కేంద్రం దృష్టిసారించింది. అమ్మకానికి వేగంగా పావులు కదుపుతున్నది.
గత బడ్జెట్ నాటికే ఆరేండ్లలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రూ.9,11,107కోట్లు లాభాలు గడించాయి. ఈ లాభాలన్నీ బడాబాబులు మింగేసారు. రూ.13లక్షల కోట్ల అప్పులు ఎగవేసారు. వీటిలో రూ.9.3లక్షల కోట్లు మోడీ సర్కారు మాఫీ చేసింది. ఇప్పుడు ఏకంగా బ్యాంకులనే మింగే ప్రయత్నంలో బడాబాబులున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనూ, ప్రభుత్వరంగ సంస్థల్లోనూ 16లక్షల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అవీ భర్తీ చేయటం లేదు.
గత బడ్జెట్లోనే ఆహార సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, వ్యవసాయ బడ్జెట్, ఆహార భద్రత బడ్జెట్, ఉపాధి హామీ కేటాయింపులు తగ్గించారు. కుటుంబ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి బడ్జెట్టూ తగ్గించారు. రాష్ట్రాల కేటాయింపుల్లో కోతపెట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ల పేరు మీద, అంబరిల్లా నిధుల పేరు మీద కేటాయింపులే తప్ప ఖర్చులేదు. 20శాతానికి మించి ఆచరణలో ఖర్చుపెట్టలేదు. వెనుకబడిన తరగతులకు కేవలం రూ.1050 కోట్లు కేటాయించారు. అవీ ఖర్చు చేయలేదు. రాష్ట్రాలే రూ.5వేల కోట్లు నుంచి రూ.20వేల కోట్లు కేటాయిస్తుంటే కేంద్రం వెయ్యి కోట్లు కేటాయించడం హాస్యాస్పదం. ఇప్పుడు 40శాతం పెంచబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇంతకన్నా మోసం ఏముంటుంది? రూ.1050 కోట్ల మీద 40శాతం పెంపుదల అంటే... అంతకన్నా హాస్యాస్పద మేముంటుంది? పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవటమే గగనం అవుతున్నది. ఐఐఎంలో చేరితే రూ.1.8లక్షలు, ఐఐటీలో రూ.1.25లక్షల ఫీజు ఎవరు చెల్లించగలరు? అయినా కేంద్రంలో బీజేపీ సర్కారు ఉన్నత విద్యను వేగంగా ప్రయివేటీకరిస్తున్నది. ఇక ప్రపంచంలో అతి తక్కువ ఆరోగ్య బడ్జెట్ కేటాయిస్తున్న దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో ఉన్నది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు మీద పన్ను 348శాతం, డీజిల్ మీద 894శాతం పన్ను పెంచింది. మరోవైపు ఐదు సంవత్సరాలలో రూ.10.57లక్షల కోట్ల పన్నులు బడాబాబుల నుంచి వసూలు చేయలేదు. చిన్న చిన్న వ్యాపారులు మాత్రం పన్ను చెల్లింపులనుంచి తప్పించుకునే అవకాశం లేకుండా చేసింది. ఇంకోవైపు కార్పొరేట్ పన్ను 30శాతం నుంచి 22శాతానికి తగ్గించింది. సంపద పన్ను రద్దు చేసింది. ఇట్లా కోల్పోయిన ఆదాయాన్ని పెట్రోలియం ఉత్పత్తుల మీద పన్ను పెంచి ప్రజల మీద భారాలు మోపడం ద్వారా సమకూర్చుకున్నది. మొత్తం మీద ప్రజల బాధలు పెరిగాయి. పెద్ద పెద్ద పెట్టుబడిదారులు బలిసిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం బడ్జెట్‌కు ప్రాధాన్యత పెరిగింది. ప్రజల ఆదాయాలు పెంచే చర్యలు తక్షణం అవసరం. ప్రజల ఆదాయాలు పెరిగితే సరుకుల అమ్మకాలు పెరుగుతాయి. పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇవి ప్రజల ఆదాయాలు మరింత పెంచుతాయి. ప్రభుత్వం ప్రజోపయోగ విధానాల మీద ఖర్చు పెద్ద ఎత్తున పెంచాలి. దేశీయ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ విధానం మారాలి. ప్రభుత్వ విధానాలలో మౌలికమార్పు రావాలి. రైతులకు అప్పు సౌకర్యం కల్పించాలి. ఇది ఉపాధి అవకాశాలు పెంచుతుంది. విద్యా, వైద్యరంగాలకు భారీ కేటాయింపులు చేయవల్సిన సందర్భమిది. కరోనా బాధల నుంచి బయటపడేయటానికి నగదు సహాయం చేస్తూ, పేదలకు ఉచితంగా బియ్యం సరఫరా చేయటం అవసరం. ఇందుకు అవసరమైన కేటాయింపులు చేయాలి.
వీటన్నింటికీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్నదే అసలైన ప్రశ్న. సుమారు 35లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఇవన్నీ సాధ్యమా అన్న ప్రశ్న వస్తుంది. సాధ్యం కాదన్నది నిజం. బడ్జెట్ సైజు పెంచాలి. అందుకోసం ఆదాయపు వనరులు పెంచుకోవాలి. ప్రస్తుత ఆదాయంలో కూడా ఖర్చు విధానం మారాలి. పోగొట్టుకున్న దగ్గరే వెతుక్కోవాలని సామెత. సంపద పోగవుతున్న దగ్గరే వనరులు వెతుక్కోవాలి. ఆక్స్‌ఫామ్ అంచనాల ప్రకారం దేశంలో అత్యంత ధనికులైన పది మంది సంపదతో దేశంలో 25 సంవత్సరాల విద్యా బడ్జెట్ నిర్వహించవచ్చు. 98మంది అత్యంత ధనికుల మీద 4శాతం పన్ను విధిస్తే దేశ ఆరోగ్య సంక్షేమశాఖ రెండేండ్ల ఖర్చుకు సరిపోతుంది. బడిపిల్లలకు మధ్యాహ్న భోజన పథకం 17 సంవత్సరాలు నిర్వహించవచ్చు. ఒక్కశాతం పన్ను వసూలు చేస్తే ఏడు సంవత్సరాల ఆయుష్మాన్ భారత్ ఖర్చుకు సరిపోతుంది. కానీ కరోనా కష్టకాలంలో కూడా ప్రజలను వారి మానాన వారిని వదిలి కార్పొరేట్లకు పన్ను రాయితీ ఇచ్చిందీ ప్రభుత్వం. ఆ రాయితీ రద్దు చేయాలి. పన్ను పునరుద్ధరించాలి. సంపదపన్ను పునరుద్ధరించి కచ్చితంగా వసూలు చేయాలి. బడ్జెట్ అవసరాలు లెక్కించి, అవసరం మేరకు బడాబాబుల నుంచి పన్నులు వేసి వసూలు చేయాలి. ప్రయివేటీకరణ, ఆస్తులు కుదువబెట్టడం ఆపేయాలి. ప్రభుత్వశాఖలలో, ప్రభుత్వరంగ సంస్థలలో ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి. దేశ ప్రజల జీవితాలలో మౌలిక మార్పు రావాలంటే ఈ చర్యలు అనివార్యం.
- ఎస్. వీరయ్య