Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-2023 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్ క్రమంలోనూ దానిని ఎదుర్కోవటంలోనూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల వలన దేశంలో ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయని అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే 2018 జనవరి -మార్చి త్రైమాసిక కాలం నుంచి మొదలుకొని, దేశంలో కోవిడ్ ప్రవేశం ముందరి 2020 మార్చి కాలం వరకు కూడా దేశ స్థూల జాతీయోత్పత్తి ప్రతి త్రైమాసికంలోనూ వరుసగా తగ్గుతూనే వచ్చింది. అలాగే 2018-19 నాటికి దేశంలో నిరుద్యోగం 45సంవత్సరాల గరిష్టస్థాయిలో 7.1శాతంగా నమోదై ఉన్నది. ఈ సమస్యలన్నీ కోవిడ్ అనంతర కాలంలో మరింత ఉధృతమయ్యాయి. మొత్తంగా దేశ ఆర్థికస్థితి నేటికీ - కోవిడ్ ముందరినాటి స్థాయిని కూడా ఇంకా పూర్తిగా చేరుకోలేదు.
ప్రస్తుతం దేశంలో కోటాను కోట్ల మంది ప్రజలు అదనంగా దారిద్య్రంలోకి నెట్టబడి ఉన్నారు. అలాగే, నిరుద్యోగం కూడా 2018-19 నాటి గణాంకాల పరిస్థితి కంటే కూడా దారుణంగా దిగజారింది. ఈ క్రమంలోనే దేశంలోని మధ్యతరగతి కూడా ఆర్థికంగా చావుదెబ్బతిన్నది.
ఈ మొత్తం నేపథ్యంలోనే నేడు నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశంలోని మోజారిటీ ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా వ్యవసాయం గిట్టుబాటుకాక మరింత పీకలలోతు కష్టాలలో కూరుకుపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలి. అటు రైతాంగమే కాక, దేశ ప్రజలలోని అత్యధికులు కూడా కోరుకుంటున్నారు. అలాగే యువతను పీడిస్తున్న నిరుద్యోగం అంశంలో కూడా ఉపాధి కల్పనతో పాటుగా, నిరుద్యోగ భృతి వంటిదేదైనా ఆసరా ఉండాలనేది అనేకమంది అభిప్రాయం. ఇక బడ్జెట్ కార్పొరేట్లు, పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా కాక సామాన్య జనానికి అనుకూలంగా ఉండాలనేది 80శాతంపైగా అభిప్రాయపడుతున్నారని మింట్ పత్రిక - సీఓటర్ సర్వే చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం తాలూకు పీ.యమ్ కిసాన్, జాతీయ ఉపాధి హామీ పథకాలకు కేటాయింపులు పెరగవచ్చుననే అభిప్రాయమూ బలంగా ఉంది. మధ్య తరగతి ఉద్యోగ వర్గాలు కోరుకునే పన్ను మినహాయింపు స్థాయిని 6.25లక్షల రూపాయలకు పెంచాలనే ఆకాంక్షకూడా ఆ వర్గాలలో ఉంది. కానీ ఇదంతా జరగాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ''ద్రవ్యలోటు'' అనే మంత్రనగరి సరిహద్దును దాటే సాహసం చేయగలదా అన్నది ఇక్కడ కీలక ప్రశ్న. గత ఏడెనిమిదేండ్ల పాలనలో గతంలోని యూపీఏ ప్రభుత్వాన్ని మించి సంస్కరణల జపం చేస్తోన్న బీజేపీ పాలకులు, ఆర్థిక సంక్షోభం ఎంత ముదురుతున్నా, ఇప్పటివరకు సమస్య పరిష్కారానికి అవసరమైన భారీ స్థాయిలో వ్యయాలు చేసేందుకు వెనకడుగు వేస్తూనే ఉన్నారు. ఈ రకంగా ఖర్చులు పెంచుకుంటే.. అప్పులు పెరిగిపోతాయనీ (ఎటూ బీజేపీ పాలకులు ఇప్పటిదాకా తక్కువ అప్పులేమీ చేయలేదు) అలాగే అదనంగా డబ్బులు ముద్రించాల్సి వస్తుందనేవి బీజేపీ భయాలు. వాస్తవానికి ఈ భయాలు బీజేపీవి కావు, అవి మనకు అప్పులిచ్చి షరతులు విధించిన అంతర్జాతీయ ద్రవ్య సంస్థలూ, మన షేర్ మార్కెట్లో మదుపుచేసే ద్రవ్య సంస్థల భయాలు మాత్రమే. తన పాలనా కాలంలో తన సిద్దాంతమైన ''స్వదేశీ'' విధానాలకు తిలోదకాలొగ్గి ఈ అంతర్జాతీయ ద్రవ్య సంస్థలూ, ఫైనాన్స్ పెట్టుబడులకు గుడ్డిగా జో హుకుం అంటోన్న బీజేపీ పాలకులు ఖచ్చితంగా ఈ ద్రవ్యలోటు తాలూకు సరిహద్దులు దాటలేరు. కాబట్టి పిండికొద్ది రొట్టె అన్నట్టు ప్రస్తుతం సమకూరనున్న ఆదాయ పరిమితులలోనే స్థూలంగా ఈ బడ్జెట్ ఖర్చులను నిర్మలాసీతారామన్ సరిపుచ్చుతారు. అంటే.. ప్రస్తుతం దేశాన్ని పీడిస్తోన్న రకరకాల తీవ్ర ఆర్థిక సమస్యల పరిష్కారానికి కావలసినంత మేర కేటాయింపులు జరిగే అవకాశమేలేదు. ఉదాహరణకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కోరుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-2022) వచ్చిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వేసిన అంచనాల ప్రకారంగా ప్రస్తుతం రానున్న ఆర్థిక సంవత్సర కాలంలో ఈ పథకం అవసరాల కోసం రూ.2.64లక్షల కోట్లు కావలసి వస్తుందని ఒక ప్రముఖ సంస్థ అంచనా వేసింది. కాగా, ఉట్టికెక్కనమ్మ స్వర్గానికెక్కుతుందా అన్నట్టు 2022 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్లోనే అందుకు ముందరి 2021 కాలపు బడ్జెట్ కంటే కేటాయింపులలో కోత విధించి 76వేల కోట్ల మేరకే తొలుత రాల్చిన ప్రభుత్వం నేడు ఈ బడ్జెట్లో 2.64లక్షల కోట్ల రూపాయలు కేటాయించుతుందనుకోవడం ఉత్త భ్రమే.
అలాగే రైతాంగం కోరుకుంటున్న కనీస మద్దతు ధరను, శాస్త్రీయ పద్ధతిలో లెక్కించేందుకు అంగీకరించి ఆ పద్ధతికి చట్టబద్ధత కల్పిస్తే ''వచ్చిపడే'' అదనపు వ్యయాలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుందుకోలేం. దీనిలో భాగంగానే పలువురు ఆశించినట్టుగా పీఎం కిసాన్ పథకానికి కేటాయింపు పెంపు కూడా పెద్ద స్థాయిలో ఉండకపోవచ్చు. స్థూలంగా దేశంలోని వివిధ సామాన్య వర్గాల ప్రజలు, తాము ప్రస్తుతం చిక్కుకొని ఉన్న సమస్యల దృష్ట్యా సహజంగానే బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకుంటారు. కానీ ఈ ఆశలను నేరవేర్చగల సాహసం ఈ బడ్జెట్ చేయలేదు.
అమెరికా వంటి పెట్టుబడిదారీ దేశంలోనే నేడు ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ద్రవ్యలోటును గాలికి వదిలి (నేడది అమెరికాలో 14శాతంపైగా ఉంది). భారీఎత్తున ప్రజల సంక్షేమం కోసం, ఉపాధి కల్పన కోసం ఖర్చు పెడుతోంది. యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా అదే బాటలో ఉన్నాయి. ప్రజల బాగోగుల పట్ల శ్రద్ద ఉన్న అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా తమ తమ దేశాలలో ఉద్దీపనలు, వడ్డీరేట్ల తగ్గింపు రూపంలో భారీగా ఖర్చులు పెడుతున్నాయి. కాగా, అంతిమ పరిశీలనలో స్వంత ఆర్థిక విధానాలూ, వెన్నెముకలేని బీజేపీ ప్రభుత్వం వాస్తవానికి ఈ బడ్జెట్లో సంక్షేమ పథకాల పేరిట కొద్దిపాటి ఆడంబరపు మాటలూ, ఆచరణలో మరింతగా కార్పొరేట్లకు రాయితీలిచ్చే ప్రొడక్ట్విటీ అనుసంధానిత ప్రోత్సాహకాలు, కాలుష్య రహిత ఇంధనాలూ, వాహనాలకు ప్రోత్సాహం పేరిట కొంత కేటాయింపులు, గత అనేక సంవత్సరాలుగా మాటలు మాత్రమే కోటలు దాటిన మౌలిక సదుపాయాల నిర్మాణ ప్రాజెక్టులకు 10-20శాతం అదనపు కేటాయింపులతోనే ఈ బడ్జెట్ తంతును ముగించే అవకాశమే ఉంది. మించి ఇది ఐదు రాష్ట్రాల ఎన్నికల బడ్జెట్‌గా రూపు సంతరించుకునే అవకాశం ఉందని కూడా బీజేపీ ఆలోచనల తీరు తెలిసిన అందరి అభిప్రాయం కూడా..!
- డి. పాపారావు
సెల్: 9866179615