Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ద్రవ్యోల్బణం, మాంద్యం, పెరిగిపోతున్న ద్రవ్యలోటు - ఈ మూడింటి విషవలయంలో ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ చిక్కుకుపోయింది. ఇదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న పరిణామాల ప్రభావం వలన మన దేశం మరింతగా చిక్కుల్లో పడనుంది.
గత సంవత్సరం కరోనా మహమ్మారి ప్రభావం వలన దేశ ఆర్థికవృద్ధి లేకపోగా 7.3శాతం కుంచించుకుపోయింది. ఒకవేళ అధికారిక అంచనాలు పూర్తిగా సరైనవే అని భావించినప్పటికీ, 2021-22లో వృద్ధి 2019-20 కన్నా కేవలం 1.22శాతం మాత్రమే ఎక్కువగా ఉంటుంది. అంటే మనం అతి కష్టం మీద మళ్ళీ 2019-20 నాటి పరిస్థితికి చేరుకోవచ్చు. కాని, ఈ ఒమిక్రాన్ వేవ్ కారణంగా ఇది కూడా సాధ్యపడేలా లేదు. మన దేశ ఆర్థిక పరిస్థితి 2019-20 నాటి పరిస్థితికన్నా దిగువనే ఉండబోతున్నది.
2019-20తో పోల్చుకున్నప్పుడు వాస్తవ వ్యయం ఏ కాస్త అయినా పెరిగినప్పటికీ, ఆ పెరుగుదల గృహనిర్వహణ వ్యయంలో గాని, ప్రభుత్వ వ్యయంలో గాని కనపడలేదు. మరి దేనిలో ఆ వ్యయం పెరిగింది? ఉన్న పరిశ్రమల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోడానికి అదనపు వ్యయం జరిగింది. ఒక పక్క 2019-20లో జరిగిన వినిమయం కన్నా ఈ ఏడాది వినిమయం తగ్గిన పరిస్థితిలో ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా, దానిని పూర్తిగా వినియోగించలేని స్థితి నెలకొంది. దీని పర్యవసానంగా వచ్చే ఏడాది అదనపు పెట్టుబడులు పెరిగే బదులు ఇంకా తగ్గిపోతాయి. పెట్టుబడులు తగ్గిన మేరకు వినిమయం కూడా తగ్గుతుంది. దాని ఫలితంగా ఈ ఏడాది వచ్చిన కొద్దిపాటి వృద్ధికూడా వచ్చే ఏడాది కొనసాగ కుండాపోతుంది.
అంటే మనం ఇప్పుడు చూస్తున్న వృద్ధి చాలా తక్కువ మోతాదులో ఉండడమే కాకుండా, అది కూడా వచ్చే ఏడు కొనసాగకుండా పోతుంది. కొంతమంది ఇది ఇంగ్లీషు అక్షరం 'వి' షేపులో ఉండే రికవరీ అంటే మరికొంతమంది 'కె' షేపులో ఉండే రికవరీ అని అంటున్నారు. ఏదైనా, ఈ వృద్ధి ప్రజల కొనుగోలుశక్తి తగ్గిపోయిన కారణంగా చాలా పరిమితంగానే ఉంది అన్నది మాత్రం వాస్తవం.
ఇక్కడ రెండు ప్రత్యేకమైన అంశాలు ప్రభావం చూపిస్తున్నాయి. మొదటిది కరోనా మహమ్మారి కారణంగా: అప్పుడు విధించిన లాక్డౌన్ కాలంలో శ్రామిక ప్రజానీకానికి ఆదాయాలు లేకుండా పోయాయి. ప్రభుత్వం వారికి ఏ విధమైన సహాయమూ అందించలేదు. అందువలన వారంతా అప్పుల పాలయ్యారు. ఇప్పుడు కొంత వృద్ధి జరిగి, ఆ శ్రామిక ప్రజలకు కొంత ఆదాయాలు మళ్ళీ వస్తున్నాయి. గతంలో చేసిన అప్పులను తీర్చడం ఇప్పుడు వారికి ప్రథమ ప్రాధాన్యత అవుతుంది. అందుకోసం వారు తమ ఖర్చులను కుదించుకుంటారు. పెట్టుబడులు పెరగడం, ప్రభుత్వ వ్యయం పెరగడం వలన మామూలుగా రావలసినంత మెరుగుదల ఈ శ్రామిక ప్రజల వ్యయంలో ఈ కారణంగా కనిపించదు. వారి వినిమయం తగ్గినందువలన, పెట్టుబడులు పెరగడం కూడా ఆగిపోతుంది. అందువలన మన ఆర్థిక వ్యవస్థలో వృద్ధి లేకుండా నిలిచిపోతుంది. కనుక తగ్గిపోయిన ప్రయివేటు పెట్టుబడుల స్థానాన్ని కూడా భర్తీ చేసేంతగా ప్రభుత్వ వ్యయం పెరగనైనా పెరగాలి, లేదా నేరుగా ప్రభుత్వమే శ్రామిక ప్రజల చేతుల్లో అదనపు ధనాన్ని అయినా పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం అలా చేస్తుందా..?
ఇక పోతే రెండో అంశం. దీనికి, కరోనా మహమ్మారికి ఏ విధమైన సంబంధమూ లేదు. అంతకంటే ముందునుంచీ ప్రభుత్వం అమలు చేస్తున్న ద్రవ్య వ్యూహంతో ఇది ముడిపడివుంది. పెట్టుబడులు పెట్టేలా సంపన్నులను ప్రోత్సహించేందుకు వారికి భారీగా పన్ను రాయితీలనివ్వడం, అందువలన తగ్గిపోయే పన్ను ఆదాయాన్ని భర్తీ చేయడానికి శ్రామిక ప్రజలపై పరోక్షపన్నుల భారాన్ని పెంచడం, ఆ విధంగా ద్రవ్యలోటు పెరిగిపోకుండా చూసుకోవడం, తద్వారా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని సంతృప్తిపరచడం- ఇదీ ప్రభుత్వ ద్రవ్యవ్యూహం. 2016లోనే మోడీ ప్రభుత్వం సంపద పన్ను (వెల్త్ టాక్స్)ను రద్దు చేసింది. దానిద్వారా ఎక్కువ ఆదాయమేమీ రావడంలేదని ఆ సందర్భంగా చెప్పి తన చర్యను సమర్థించుకుంది. కాని ఏకంగా ఆ సంపదపన్నును ఎత్తివేయడం ద్వారా కార్పొరేట్లకు ఒక సంకేతాన్ని ఇచ్చినట్టైంది. ఆ తర్వాత 2019లో ఒక ఆర్డినెన్సు ద్వారా కార్పొరేట్ పన్నును 30 నుండి 22శాతానికి తగ్గించింది. అందువలన ప్రభుత్వం కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకోడానికి పరోక్షపన్నులను, ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులపై పన్నును పెంచింది. ఇటువంటి వ్యూహాన్ని అనుసరించినందువలన ఏం జరుగుతుందో చూద్దాం.
తేలికగా ఉండేందుకు ద్రవ్యలోటు 'సున్నా'గా ఉందని అనుకుందాం. రాబోయే కాలంలో కూడా ద్రవ్యలోటు పెరగకుండా సున్నా వద్దే ఉండాలని అందర్జాతీయ ద్రవ్య పెట్టుబడి మన ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇప్పుడు ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.100 మేరకు పన్ను రాయితీ ఇచ్చిందనుకుందాం. శ్రామిక ప్రజలు వినియోగించే సరుకులమీద పరోక్ష పన్నులను అదే రూ.100 ఆదాయం భర్తీ అయేందుకు అదనంగా పెంచిందనుకుందాం. అప్పుడు ఆ వస్తువుల ధరలు ఆ మేరకు పెరుగుతాయి. అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అయితే శ్రామిక ప్రజల ఆదాయాల్లో పెరుగుదల ఉండదు కనుక, ద్రవ్యోల్బణం కారణంగా వారి నిజవేతనాల విలువ తగ్గిపోతుంది కనుక, వారి కొనుగోలుశక్తి కూడా పడిపోతుంది. వినిమయం తగ్గింది కాబట్టి ఆ మేరకు ఉత్పత్తి అయిన సరుకులు అమ్ముడుపోకుండా నిల్వలు పేరుకుంటాయి. ఆ నిల్వలను తగ్గించుకోడానికి, ఆ సరుకులను మళ్ళీఉత్పత్తి చేయకుండా వాటి ఉత్పత్తిని తగ్గిస్తారు. అప్పుడు ద్రవ్యోల్బణంతో బాటు ఉత్పత్తిలో మాంద్యం కూడా ప్రవేశిస్తుంది. ప్రభుత్వ ద్రవ్య వ్యూహం వలన కలిగే తక్షణ ఫలితం ఇదే.
అయితే, ఉత్పత్తి తగ్గిపోయినందువలన పరోక్ష పన్నుల ద్వారా లభించే ఆదాయం రూ.100 కన్నా తక్కువగా ఉంటుంది. అందువలన ద్రవ్యలోటు ఏర్పడుతుంది. అంతవరకూ సున్నా ద్రవ్యలోటు ఉన్నది కాస్తా ఇప్పుడు పెరుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వ ద్రవ్య విధానం వలన ద్రవ్యోల్బణం, మాంద్యం, వాటితోబాటు ద్రవ్యలోటు పెరగడం - ఈ మూడూ సంభవిస్తాయి. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నది సరిగ్గా ఇదే.
అయితే ఇక్కడితోనే అయిపోలేదు. పరోక్షపన్నులు పెరిగి, వినిమయం తగ్గడం వలన, సరుకులు చెల్లుబాటు కాకుండా మిగిలిపోతాయి కనుక, ఆ తర్వాత వాటిని ఉత్పత్తి చేయడం తగ్గుతుంది. అంటే ఆ పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడం జరగదు. అలా జరగలేదు కాబట్టి పెట్టుబడిదారులు అదనపు పెట్టుబడులను పెట్టకుండా ఆగిపోతారు. పెట్టుబడులను పెంచేలా ప్రోత్సహించడానికే రూ.100 మేరకు పన్ను రాయితీలిచ్చినట్టు ప్రభుత్వం తొలుత సమర్థించుకుంది. కాని ఆచరణలో జరిగింది దానికి పూర్తి విరుద్ధం. అంటే అంతకుముందువరకూ ఉన్న మోతాదులోకూడా పెట్టుబడులను పెట్టడం ఆగిపోయింది. కొత్తగా పెట్టుబడులు రాకపోగా ఉన్నవి కూడా తగ్గిపోయాయి. అదీ ఈ ప్రభుత్వ తప్పుడు ద్రవ్య విధానపు పర్యవసానం.
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ కాలంలో శ్రామికప్రజలను ఆదుకోడానికి ప్రభుత్వం నిరాకరించింది. అమెరికా, యూరపియన్ యూనియన్ దేశాలు, ఇతర ముఖ్యమైన పెట్టుబడిదారీ దేశాలలో దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. కరోనా కంటే ముందే ప్రభుత్వం చేపట్టిన లోపభూయిష్టమైన ద్రవ్య విధానాన్ని కరోనా కాలంలో మన ప్రభుత్వం ప్రదర్శించిన ఈ వైఖరి మరింత దారి తప్పేట్టు చేసింది. నిరుద్యోగం భారీగా పెరగడానికి, ద్రవ్యోల్బణం వేగంగా పెరగడానికి, శ్రామిక ప్రజల స్థితి మరింత దిగజారడానికి, పెట్టుబడులు మరింత తగ్గిపోడానికి ఇది దారి తీసింది. కానీ కరోనా కాలంలో ప్రభుత్వం శ్రామిక ప్రజలను ఆదుకోడానికి ఖర్చు చేసివుంటే ఇంత దిగజారివుండేది కాదు.
ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ చిక్కుకున్న ఈ విషవలయానికి కారణం ప్రభుత్వం అనుసరించిన ఈ లోపభూయిష్టమైన ద్రవ్య విధానమే. దావోస్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో చాలామంది అమెరికాకు చెందిన శతకోటీశ్వరులు తమపై విధించే పన్నులను మరింత పెంచాలని కోరారు. వారిలో ఏదో దేశభక్తి పొంగిపొర్లి పోయినందువలన కాదు. శరవేగంగా పెరిగిపోతున్న సంపదల, ఆదాయాల అసమానతల వలన కలిగే వినాశకర పర్యవసానాలేమిటో వారికి తెలుసు. ఆ విధంగా అసమానతలు పెరిగిపోకుండా చూడడం మన దేశంలో ప్రభుత్వం బాధ్యత అని రాజ్యాంగం నిర్దేశించింది. కాని మోడీ ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. తన ఆశ్రిత కార్పొరేట్లను సంతృప్తి పరచడానికే అది పూనుకుంది. కార్పొరేట్ పన్నుల రేట్లను తగ్గించింది. అమెరికాలో బైడెన్ ప్రభుత్వం చేసినదానికి ఇది పూర్తి విరుద్ధం. అక్కడ ఆ ప్రభుత్వం కార్పొరేట్ పన్నులను పెంచి తన ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నించింది. పైగా ఇతర దేశాల ప్రభుత్వాలతో గట్టిగా బేరాలాడి అన్ని దేశాల్లోనూ కనీస కార్పొరేట్ పన్ను ఒక స్థాయికన్నా తక్కువగా లేకుండా చేసింది.
మనదేశంలో ఈ అవకతవక ద్రవ్య విధానం మోడీ అధికారంలోకి రాకమునుపే మొదలైంది. దీనిని మోడీ మరీ ఎక్కువగా సాగదీస్తున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. తొందర్లోనే బ్యారెల్ ధర 100 డాలర్లు చేరుతుందని అంటున్నారు. దాని వలన ఇక్కడ పెట్రో ధరలు మరింత పెరిగి అది మరింతెక్కువ ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. అందువలన శ్రామిక ప్రజల కొనుగోలుశక్తి మరింత పడిపోతుంది. అందువలన ఉత్పత్తిని మరింతగా పెట్టుబడిదారులు తగ్గించేస్తారు. అంటే మాంద్యం మరింత పెరగనుంది. ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే పేరుతో ప్రభుత్వం తీసుకోబోయే 'పొదుపు' చర్యలు మరింతగా శ్రామిక ప్రజల ఆదాయాలను దెబ్బ తీయనున్నాయి.
ఈ ఊబిలోనుంచి దేశం బైటపడడం ఎలా?
ఇప్పుడు ప్రభుత్వం భారీగా వ్యయాన్ని పెంచాలి. శ్రామిక ప్రజలకు నగదు నేరుగా అందించాలి. దానితోబాటు, ప్రభుత్వ విద్యా రంగంలో, ప్రభుత్వ వైద్య రంగంలో కూడా ప్రభుత్వ వ్యయం పెరగాలి. అప్పుడు శ్రామిక ప్రజలు విద్య, వైద్యం మీద చేసే ఖర్చు తగ్గుతుంది. వారి కొనుగోలుశక్తి మరింత పెరుగుతుంది. ఈ భారీ అదనపు వ్యయానికి కావలసిన వనరులకోసం సంపన్నులమీద పన్నులు అదనంగా విధించాలి. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇంతవరకూ అమలుచేస్తున్న అవకతవక విధానాన్ని పూర్తిగా విడనాడి, దానికి వ్యతిరేకదిశలో వ్యవహరించాలి.
ఈ విధంగా వ్యయాన్ని పెంచినందువలన ఆర్ధిక వ్యవస్థ కోలుకునే వలయంలో ప్రవేశిస్తుంది. ప్రజల కొనుగోలుశక్తి పెరిగినందువలన ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుతుంది. విద్య, వైద్యం మీద ప్రభుత్వ వ్యయం పెరిగినందువలన కూడా శ్రామిక ప్రజల కొనుగోలుశక్తి పెరుగుతుంది. అదే సంపన్నుల చేతుల్లో అదనంగా సంపద ఉంచితే వారేమీ దేశీయ సరుకుల్పి అదనంగా కొనరు. వీలైతే వారికి కావలసిన సరుకుల్ని దిగుమతి చేసుకుంటారు కూడా. దానివలన దేశంలో ఉండవలసిన సంపద కాస్తా విదేశాలకు తరలిపోతుంది. వారివద్ద ఎంత సొమ్ము ఉంది అన్నదానిని బట్టి వారి పెట్టుబడులు ఉండవు. పెట్టుబడులు పెడితే ఎంత మేరకు సరుకులు అమ్ముడుపోయే అవకాశం ఉంది అన్న దానిని బట్టి మాత్రమే వారు పెట్టుబడులు పెడతారు.
సంపన్నులపై అదనంగా పన్నులను పెంచి, శ్రామిక ప్రజలచేతుల్లో అదనంగా ధనాన్ని చేర్చడంవలన ఆర్థిక వ్యవస్థ కోలుకోవడమే గాక, శ్రామిక ప్రజల సాధికారత పెరు గుతుంది. తద్వారా దేశంలో ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. కాని ఈ విధంగా మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టే బడ్జెట్లో వ్యవహరిస్తుందా?
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్