Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలన చిత్ర రంగం ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలుసు. సినిమా ఒక హిట్టు కొడితే అందులో పని చేసిన వారందరికీ పేరొస్తున్నది. హీరో, హీరోయిన్లు, దర్శకులకు ఒన్ ప్లస్ ఒన్ ఆఫర్ చొప్పున అవకాశాలు వారి ఇంటి ముంగిటికే వస్తుంటాయి. దీంతో వారెక్కడికో పోతారు. ఆర్థిక కష్టాలూ తీరుతాయి. ఒకవేళ హిట్టు రాకపోతే జీవితం ఫట్టే. తనకు ఉన్న సినిమా ప్యాషన్‌ను వదులుకోలేక, తమ కుటుంబ సభ్యులకు, స్నేహితు లకు ముఖం చూపించలేక నరకయాతన అనుభవిస్తున్న కళాకారులు కొకోల్లాలు. అదే స్థాయిలో ఒక సినిమాకో, ఒక పాటకో, ఒక డైలాగ్కో ట్రెండింగ్ వస్తే నా సామిరంగా ఆ మజాయే వేరు. తాజాగా దర్శనం మొగిలయ్య కథే ఇందుకు మంచి ఉదాహరణ. ఎక్కడో నల్లమల అడవుల్లో ఉంటూ... అప్పుడప్పుడు రవీంద్ర భారతిలో 12 మెట్ల కిన్నెర వాద్యంతో ప్రదర్శనలిచ్చే మొగులయ్య... పిహెచ్డీ విద్యార్థి దాసరి రంగా ప్రోత్సహంతో వెలుగులోకి వచ్చిన ఆయన... బీమ్లానాయక్ చిత్రం టైటిల్ పాటతో ఒక్కసారిగా పాపులరై ఎక్కడికో పోయారు. కొడితే దిమ్మదిరిగి మైండ్‌బ్లాక్ అయినట్టు... దేశంలో అత్యున్నత పురస్కారం పద్మశ్రీనే కొట్టారు. మరోవైపు సీఎం కేసీఆర్ నుంచి ఇంటిస్థలం.. కోటి రూపాయల నగదు దక్కించు కున్నారు. ఇది చాలా సంతోషదాయకం. ఇక ఇటీవల విడుదలైన పుష్ప చిత్రంలోని తగ్గేదేలె డైలాగ్ హిందీ, మలయాళం, తెలుగు, కన్నడం వంటి భాషల్లోనూ తెగ వైరల్ అవుతున్నది. చివరకు క్రికెట్ ఆటగాళ్లు సైతం స్టార్ హోటళ్లలో శ్రీవల్లి (పుష్ప) పాటతో ఎంజారు చేస్తున్నారు. 2021 చివరాఖరిలో రాష్ట్రాన్నే ఉపేసిన బుల్లెట్ బండి పాటతో... షాద్‌నగర్ పరిసర కుగ్రామంలో పుట్టిన రచయిత లక్ష్మణ్‌కు ఎంతో పేరొచ్చింది. ఆ పాటను మెహన బోగరాజు పాడారు. ఇందులో మరో విశేషమేమంటే... తన భర్త అశోక్ కోసం పెండ్లి కూతురు సాయిశ్రేయ చేసిన డ్యాన్స్‌తో ఆ పాట తెలుగు రాష్ట్రాలనే డ్యాన్స్ చేయించింది. నెటిజన్లు సైతం విపరీతమైన వైరల్ చేశారు. నెటిజన్లకు నచ్చితే ట్రెండింగ్ దావానంలా వ్యాపిస్తుంది. అదే వారిని కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది.
- గుడిగ రఘు