Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగులు మార్చటంలో ఊసరవెల్లి దిట్ట. అందుకే మనలో ఎవరైనా మాటిమాటికి మాటలు మారుస్తున్నా.. చెప్పే దానికి, చేసే దానికి పొంతన లేకున్నా అలాంటి వాణ్ని ఊసరవెల్లితో పోలుస్తుండటం పరిపాటి. ఇప్పటిదాకా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా తన ఎత్తులు, జిత్తులు, పై ఎత్తులతో ఊసరవెల్లిని తలదన్నుతున్నది. కరోనా మొదటి, రెండో దశలో వచ్చిన వైరస్లు, సంబంధిత వేరియంట్లు ఒకసారి సోకితే టెస్టుల్లో పాజిటివ్ రావటం, ఆ తర్వాత 14 రోజులపాటు క్వారెంటైన్లో ఉండటం తప్పనిసరి అయ్యింది. కానీ జిత్తులమారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మాత్రం... రోజుకో రకంగా వ్యవహరిస్తూ జనాన్ని తికమక పెడుతున్నది. జలుబు, జ్వరం ఉంటే... నిర్దారణ పరీక్షల్లో ఒమిక్రాన్ అని తేలుతున్నది. సరే... అది సోకింది కదా..? అనుకుని నాలుగైదు రోజులు హోం క్వారంటైన్లో ఉండగానే... మళ్లీ శరీరం సాధారణ స్థితికి రావటం, టెస్టు చేయించుకుంటే నెగెటివ్ అని తేలటంతో రోగులు అవాక్కవుతున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు శరీరంలో నలతగా అనిపిస్తే, మళ్లీ టెస్టులు, ఆ తర్వాత పాజిటివ్... ఇదీ దీని తతంగం. చెప్పులోని రాయిలా, చెవిలోని జోరీగలా, కంటిలో నలుసులా, కాలుకు ముల్లులా.. అది ఓ పట్టాన మనల్ని వదలదు, ప్రశాంతంగా జనంలో కలవనివ్వదు. పోనీ ధైర్యం చేసి కలుద్దామా..? అనుకుని నలుగురున్న చోటుకు వెళ్లినప్పుడు ఎలర్జీతో పొర పాటున ఒక్క తుమ్ము తుమ్మినా, గొంతు పొరబోయి (సరాన పడి) ఓ దగ్గు దగ్గినా... ఆ నలుగురూ ఆమడ దూరం పరార్. పోనీలే... ఎందుకొచ్చిన గొడవనుకుని ఇంటికి చేరితే... ఎక్కడెక్కడో తిరిగొచ్చారు... ముందు వెళ్లి స్నానం చేసి రండంటూ ఇంటావడ ఆదేశాలు. ఇవీ రంగులు మార్చే ఊసరవెల్లి ఒమిక్రాన్ వేధింపులు.. సాధింపులు...
-బి.వి.యన్.పద్మరాజు