Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతీ యేటా ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌కు రాబోయే కాలంలో స్వస్తి చెప్పనున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నవి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2022 బడ్జెట్లో ఈ అంశం స్పష్టంగా తెలుస్తున్నది. కేంద్రం చేపట్టబోయే జమ ఖర్చులకు ముందస్తుగా పార్లమెంటు అనుమతి పొందాలన్న పద్ధతికి ఇక స్వస్తి పలకనున్నట్లు అర్థమవుతున్నది. ఇప్పటికే అనేక రంగాలకు సంబంధించిన అంశాలను పార్లమెంటులో చర్చకు పెట్టకుండానే ప్రజా వ్యతిరేకమైన సంస్కరణలు చేపడుతున్నారు. ఉదా. ఎల్ఐసీ చట్ట సవరణలను పార్లమెంటులో ప్రత్యేక చర్చ ద్వారా చేయకుండా ఆర్థిక బిల్లులో చేర్చి పార్లమెంటు అనుమతి పొందారు. ఇన్సూరెన్స్ సెక్టార్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74శాతానికి పెంచడానికి కూడా ఆర్డినెన్స్ మార్గాన్ని ఎన్నుకున్నారు. రూ.లక్షా నలబై ఐదు వేల కోట్ల రాయితీని కార్పొరేట్లకు 2020 మే నెలలో ప్రకటించినప్పుడు కూడా పార్లమెంటు అనుమతి తీసుకోలేదు, ఆర్డినెన్స్ కూడా పాస్ చేయలేదు. అనగా రాజ్యాంగం సూచించిన పద్ధతు లన్నింటికీ చరమగీతం పాడి కేవలం క్యాబినెట్ ఆమోదంతో తామనుకున్న దంతా చక్కబెట్టు కుంటున్న సంస్కృతి కన్పిస్తున్నది. భవిష్యత్తులో కేవలం డిపార్ట్మెంట్ సర్కులర్స్తోనే పనులన్నీ కానిచ్చే దిశలో కేంద్ర ప్రభుత్వ పాలన కనిపిస్తున్నది. ఇంతటి ఏకపక్ష ధోరణి మంచి పరిణామం కాదు.
తొంభై రెండు సంవత్సరాల ఆనవాయితీ ఉన్న రైల్వే బడ్జెట్‌ను 2017 నుండి సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. తద్వారా అత్యధిక ఉపాధికి ఆశ్రయమిచ్చే రంగానికి సంబంధించిన ప్రణాళికలకూ కేటాయింపులకూ సమాధి కట్టారు. ఏఏ రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ది అవసరముందో అంచనా వేసి అత్యంత చౌక రవాణాకు అవకాశమున్న రైల్వేలను విస్తరించడాన్ని కేవలం డిపార్ట్మెంట్ సర్కులర్లకు పరిమితం చేశారు. ఆశ్రిత పెట్టుబడిదారులకు మేలు చేయడానికీ, రాష్ట్రాల పట్ల పక్షపాతాన్ని కేంద్రం వహించడానికీ ఇలాంటి పద్ధతులు అవకాశాన్ని ఇస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో రైల్వే సంబంధిత కర్మాగారాలను ఏర్పాటు చేస్తే సమతుల అభివృద్ధి సాధ్యమన్న నానుడిని ఎందుకు వదిలేస్తున్నారు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైనట్టు? విలీనం చేసిన మొదటి సంవత్సరంలో కాస్త ప్రస్తావించారు కానీ ఆ తర్వాత దానిని వదిలేస్తున్నారు. పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలుంటాయన్న ప్రతిపాదన చేశారు. బ్యాంకులను నిర్వీర్యం చేసే ఈ చర్య సమర్ధనీయమైనది కాదు. మొన్నటికి మొన్న క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేస్తామని ప్రకటించిన కేంద్రం ఉన్న ఫళంగా డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడాన్ని సమర్థించే అంశాలు బడ్జెట్లో ప్రస్తావించనే లేదు.
ముప్పై తొమ్మిదిన్నర(39.5) లక్షల కోట్ల బడ్జెట్‌ను కేంద్ర మంత్రి ప్రతిపాదించారు. అయితే అట్టి మొత్తాన్ని ఏ విధంగా రాబట్ట బోతున్నారో, రాబడి మార్గాలేవో మాత్రం బడ్జెట్లో నిర్దిష్టంగా ప్రతిపాదించక పోవడం దేనికి సంకేతం? సదరు మొత్తాన్ని ఏ రంగాలకు ఎంతమేర కేటాయించారో చూస్తే కేవలం గత గణాంకాలకు జోడింపులుగానే ఉన్నాయి. అయా రంగాలలో ఏరకమైన అభివృద్ధికి బాటలు వేస్తున్నారో తెలుపకుండా ప్రకటించడం వంటివన్నీ వారి నిర్లక్ష్య పూరిత వైఖరికి నిదర్శనం. ప్రతిపాదించిన 39.5లక్షల కోట్ల బడ్జెట్ తీరు చూస్తే, కనీసం ఆర్థిక సర్వేలో ప్రకటించినన్ని గణాంకాల ఉద్దేశాలను కూడా సాధారణ బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు. అంటే దానిపైన కేంద్రానికి ఏ రకమైన సీరియస్‌నెస్ ఉందనుకోవాలి? పన్ను రాబడిపై, లోటుపై ఒక ఖచ్చితత్వపు విధానాన్ని బడ్జెట్లో ప్రతిపాదించే అలవాటుంది. దానిని ఎందుకు విస్మరించారు? జీఎస్టీ వసూళ్ళు బాగా పెరుగుతున్నాయని, అది ఎదుగుతున్న ఆర్థికాభివృద్ధికి సంకేతమని గట్టిగా వినిపించారు. జీఎస్టీ పరోక్ష పన్ను. పరోక్ష పన్నులు పెరుగుతున్నాయంటే జనాభాలో అత్యధికులు పన్ను కడుతున్నట్టు. అత్యధికులు పన్నులు కట్టడం మంచిదే. అయితే ఈ దేశంలో పది శాతం జనాభా దగ్గర దాదాపు అరవై శాతానికి పైగా అదాయమున్నప్పుడు ఆ పది శాతం ధనికులు ఎక్కువ పన్నులు కట్టాలిగా? కనీసం ఆదాయం ఎక్కువున్న వాళ్ళు ఎక్కువ పన్ను కట్టే విధంగానైనా బడ్జెట్ ఉండాలిగా? దేశంలో 84 శాతం ప్రజల ఆదాయాల్లో తగ్గుదల ఉన్నప్పటికీ పన్నులు కడుతున్నారంటే, ప్రజలు చచ్చీచెడి నిత్యవసర వస్తువులు వినియోగిస్తున్నారని అర్థం. కరోనా మహమ్మారి పుణ్యమా అని సేవా రంగం బాగా దెబ్బ తిన్నది. దానిపై ఆధారపడ్డ వారి కోనుగోలు శక్తి తగ్గిపోయింది. అనగా వ్యవసాయానుబంధ రంగాలనుండే మార్కెట్లో క్రయవిక్రయాల వ్యయాలు నమోదవుతున్నాయి. క్రింది స్థాయి ఆదాయార్జితమున్నవారే జీఎస్టీకి కూడా కారణమవుతున్నారు. సాధారణ ఆర్థిక అనుభవమున్న వారెవరైనా ఈ సంగతి చెప్పగలరుగా!
వ్యవసాయ రంగం 3.9శాతంతో అభివృద్ధి చెందిందని, కరోనా పాండమిక్‌ని కూడా ఎదుర్కొని ఈ ఘనత సాధించిందని, ఇది చాలా గొప్ప పరిణామమని ఆర్థిక సర్వేతో పాటు అందరూ కొనియాడారు. మరి అలాంటి వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఉండాల్సింది ఇలాగేనా..? గత కేటాయింపులతో తేడాపై కనీసమైన వివరణ కూడా బడ్జెట్లో ఇవ్వకపోతే దాని అర్థమేంటి? మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎన్ని కేటాయింపులు చేస్తారో అని దేశమంతా ఎదురుచూస్తుంటే, దాని గురించిన ఉపయోగంపై పల్లెత్తు మాట కూడా చెప్పకపోవడానికి కారణ మేంటి? వ్యవసాయరంగానికి ఇస్తున్న సబ్సిడీల మాటేమిటి? కిసాన్ సమ్మాన్ కింద నెలకు ఐదు వంద రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు. మరి దానిని కొనసాగిస్తున్నారా? దానిని పెంచాలనే డిమాండు ఉన్నది. పెంచుతున్నారా అనే అంశాన్నే ప్రస్తావించలేదు. వ్యవసాయ రంగం 3.9శాతం పెరిగిన మాట వాస్తవమే. కానీ దానిపై ఆధారపడిన వారి సంఖ్య దేశ జనాభాలో 60శాతం ఉన్నది. రెండేండ్ల వరకు స్థూల జాతీయ ఉత్పత్తిలో దాదాపు 18శాతానికి దగ్గరగా ఉన్న వ్యవసాయ రంగం పాలు ఇప్పుడు 15శాతానికి చేరువవుతోంది. దానికి కారణాలేమిటి? వందేండ్ల స్వతంత్ర భారత్ నాటికి దేశంలో సగం జనాబా పట్టణ ప్రాంతాల్లో ఉంటుందని ఆర్థిక సర్వే చెప్పింది. మరి దానికి సంబంధించిన ప్రణాళిక, కల్పించబోయే ప్రత్యామ్నాయ ఉపాధి వంటివి ప్రకటించొద్దా?
ఉపాధి కల్పన గురించి ఏ మాత్రం ప్రత్యేక శ్రద్ద పెట్టకపోవటం ఈ బడ్జెట్లో మరో పెద్ద లోపం. మేక్ ఇన్ ఇండియా ద్వారా అరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని సీతారామన్ ప్రస్తావించారు. ఏ రంగాల్లో కల్పిస్తారు? స్టార్టప్‌ల ద్వారా ఎవరికి వారు కల్పించుకునే స్వయం ఉపాధేనా? కేవలం కేంద్రంలోని అనేక సంఘటిత రంగాల్లోనే పది లక్షలకుపైగా ఖాళీలున్నట్లు అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు మొత్తుకుంటూనే ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తారో లేదో ఎందుకు ప్రస్తావించలేదు? దేశంలో సగానికి పైగా కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ ద్వారా నియామకాలున్నవి. వారి భద్రతకు సంబంధించి ఒక్క ప్రణాళికైనా ప్రకటించలేదు. చిన్న భరోసా కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ రంగాలను వాటాల రూపంలో విభజించి అమ్ముకోవడానికి ఉవ్విళ్ళూరు తున్న కేంద్రం... సదరు సంస్థల అభివృద్ధికి కారకులైన ఉద్యోగులకు పన్ను రాయీతీలు మాత్రం మంచిది. జీఐసీలో ఐదేండ్లుగా వేతన సవరణ బకాయీ ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. వ్యక్తిగత పన్ను శ్లాబుల్లో మూడేండ్లుగా మార్పు లేదని విలేఖర్లు ప్రశ్నిస్తే ''పన్నులు పెంచలేదు సుమా'' అంటూ ఆర్థిక మంత్రి ప్రస్తుతించడం దేనికి సూచిక ప్రత్యక్ష పన్నుల్లో నిబద్దతతో పన్నులు చెల్లించేది వేతన జీవులే. అలాంటి వారికీ, శతసహాస్త్ర కోటీశ్వరులకూ ఒకే రకమైన పన్ను శ్లాబులు ఉండటం సరైన పన్ను విధానం ఎలా అవుతుంది? పైగా కార్పొరేట్ పన్నుపై సర్ చార్జీ తగ్గించారు. ఆయుశ్మాన్ భారత్ వంటి ఆరోగ్య పథకాలకు సంబంధించి కూడా మెరుగు పరిచే ఏ ప్రతిపాదనా చేయక పోవడం గర్హనీయం. బడ్జెట్ మొత్తంగా చూసినప్పుడు వ్యక్తిగత పన్ను వెసులుబాట్లలో మధ్యతరగతి జీవిని విస్మరించిందీ బడ్జెట్. ఎన్ని కష్టాలొచ్చిన గత్యంతరం లేక స్వయం పోషకమైన వ్యవసాయరంగాన్ని దాని ఖర్మకు దాన్ని వదిలేసింది. చివరికి పారిశ్రామికాభివృద్ధికీ ఉపాధి కల్పనకూ ఏ మాత్రం ఊతమిచ్చేదిగా కూడా లేదు.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016