Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెనెజులా మరోసారి వార్తల్లోకి వస్తోంది. దానిపై మీడియా సంస్థలు, ప్రముఖులుగా ఉన్న కొందరు చేయని ప్రచారం లేదు. అక్కడ సమస్యల్లేవని ఎవరూ చెప్పలేదు. కాకపోతే కాళిదాసు కవిత్వానికి కొంత తమపైత్యాన్ని జోడించే వారి గురించి పట్టించుకోనవసరం లేదు. వెనెజులా సెంట్రల్(రిజర్వు) బాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో 686.4శాతం ద్రవ్యోల్బణం ఉంది. అంతకు ముందు సంవత్సరం 2,959.8శాతం ఉంది. గతేడాది సెప్టెంబరు నుంచి నెలవారీ ద్రవ్యోల్బణం ఒక అంకెకు పరిమితం అవుతోంది. వందలు, వేలఖాతాల్లో నమోదైన ద్రవ్యోల్బణం అంటే అర్థం ఏమిటి? ఒక వస్తువు ధర ఈ క్షణంలో ఉన్నది మరోక్షణంలో ఉంటుందన్న హమీ ఉండదు. చేతిలో ఉన్న కరెన్సీతో ఫలితం ఉండదు. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం కరెన్సీ మారకపురేటును స్ధిరంగా ఉంచేందుకు తీసుకున్న చర్యలతో ఫలితాలు కనిపించాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థ సరఫరాదార్లకు విదేశీ కరెన్సీ(డాలర్లలో) చెల్లింపులు చేస్తోంది. ఒక ఆశావహ పరిస్ధితి ఏర్పడింది. దీని అర్థం అంతా బాగుందని కాదు. ప్రభుత్వ టీవీలో దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు నడిచిన హైపర్ ద్రవ్యోల్బణం గత చరిత్రే అని, అయితే ఇప్పటికీ ఈ సమస్య తీవ్రమైనదే అన్నారు.
లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలకు చెందిన ఐరాస ఆర్థిక కమిషన్ వచ్చే ఏడాది ఈ ప్రాంతదేశాల జీడీపీ వృద్ధిరేటు సగటున 2.1శాతం కాగా, వెనెజులా రేటు 3 శాతంగా పేర్కొన్నది. గత ఏడు సంవత్సరాలలో ఇది తొలి సానుకూల సంవత్సరం కావటం గమనించాల్సిన అంశం, 2014 నుంచి ఇటీవలి వరకు దేశ జీడీపీ 75శాతం పతనమైంది. మరొక దేశం ఏదైనా ఈ స్థితిని తట్టుకొని నిలిచిందా? వెనెజులా వామపక్ష పార్టీల ఏలుబడిలో ఉంది తప్ప అమలు జరుపుతున్న విధానాలన్నీ పూర్తిగా సోషలిస్టు పద్దతులు కావు. అనేక ఆంక్షలు కుట్రల మధ్య అనేక పరిమితులతో ప్రభుత్వం పని చేయాల్సి వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత ప్రాంతాల్లో అధికారపక్షాలు ప్రతిపక్షాలను దెబ్బతీసి తమకు ఎదురు లేదని జనం ముందు కనిపించేందుకు చేస్తున్నదేమిటో తెలిసిందే. లాటిన్ అమెరికాలో వామపక్ష పార్టీలను, ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు అమెరికా, కెనడా, ఐరోపా ధనికదేశాలు ఇంతకంటే ఎక్కువగా ప్రాణాలు తీసే దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి. 2018లో డ్రోన్‌తో దాడి చేసి మదురోను హత్య చేయాలని చూశారు. అంతర్గత తిరుగుబాట్లను రెచ్చగొట్టి అసలు ప్రభుత్వాన్నే గుర్తించలేదు. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఎవరూ పెట్టుబడులు పెట్టవద్దని బహిరంగంగా ఇచ్చిన పిలుపులు వెనెజులా వ్యతిరేకులకు వీనుల విందుగా ధ్వనించి ఉండాలి.
మన దేశంలో వెయ్యిమంది జనాభాకు 44 కార్లు. ప్రపంచంలో కార్లసాంద్రతలో మనం 132వ స్ధానంలో ఉండగా అదే వెనెజులా 96వ స్థానంలో ఉండి 145కలిగి ఉంది. ఐరాస మానవాభివృద్ధి సూచికలో 2021లో మనం 131 స్థానంలో ఉంటే వెనెజులా 113లో ఉంది. ఈ అంకెలదేముంది అని తోసిపుచ్చవచ్చు, అలాంటి వారిని ప్రమాణంగా తీసుకోవాలా? వారి నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి? వారికి నచ్చితే విలువ లేకపోతే లేదు, ఎంత బాధ్యతా రాహిత్య వైఖరి? 2021లో ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం 116దేశాల్లో 101కాగా వెనెజులా 82లో ఉంది. ఎనిమిదేండ్ల మన ఘనమైన పాలన చేసిందేమిటి?
2014లో చమురు మార్కెట్లు పతనం కావటంతో ఎగుమతుల మీద ఆధారపడిన వెనెజులా తీవ్రంగా నష్టపోయింది. అమెరికా తదితర దేశాల ఆంక్షలతో చమురును వెలికితీసే కంపెనీలు ముఖం చాటేశాయి. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో కార్ల ఉత్పత్తి ఆగిపోయింది. ఒక సమాచారం ప్రకారం 2021 ప్రారంభంలో దేశంలో ఉన్న 41లక్షలకు పైగా కార్లలో సగానికి మాత్రమే అక్కడ ఉత్పత్తి జరిగే పెట్రోలు, డీజిలు సరిపోతుంది. గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డాట్‌కామ్ సమాచారం ప్రకారం జనవరి 24న అక్కడ లీటరు పెట్రోలు ధర రూ.1.87. ఇటీవలి కాలంలో తిరిగి ముడి చమురు ఉత్పత్తితో పాటు ధరలు పెరగటం దానికి ఎంతగానో ఉపశమనం కలిగించింది. డిసెంబరు 2021నాటికి రోజుకు పదిలక్షల పీపాలకు ఉత్పత్తి పెరిగింది. ఆంక్షల కారణంగా ఇప్పటికీ శుద్ధి కర్మాగారాలు మరమ్మతులకు నోచుకోలేదు.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వెనెజులాకు ఉపశమనం కలిగిస్తున్నాయి. చైనా, రష్యా, ఇరాన్‌తో చమురు రంగంలో కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాలు కీలకమైనవి. అమెరికా ఆంక్షల కారణంగా దాదాపు వెనెజులా చమురు ఉత్పత్తి నిలిపివేసిన తరుణంలో ఒప్పందం చేసుకున్న ఇరాన్ ఆహారం, చమురుటాంక్లను పంపి ఎంతగానో ఆదుకుంది. చాలా మందికి అర్థంగాని అంశం ఏమంటే వామపక్షాలు అధికారానికి రాకముందే అక్కడి చమురు పరిశ్రమ అమెరికా, ఐరోపా ధనికదేశాల సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైంది. అందువలన దానికి అవసరమైన విడిభాగాలు కావాలంటే పశ్చిమ దేశాల నుంచి, వాటి అనుమతితోనే తెచ్చుకోవాలి. దీన్ని అవకాశంగా తీసుకొని వెనెజులాను అవి దెబ్బతీస్తున్నాయి. రష్యా, ఇరాన్ ఇటీవలి కాలంలో ఆ సాంకేతిక పరిజ్ఞానానికి ప్రత్నామ్నాయం కనుగొనటంతో పశ్చిమ దేశాల ఆటలు సాగటం లేదు. భారీ సాంద్రత కలిగిన వెనెజులా ముడిచమురును శుద్ది సమయంలో పలుచన గావించేందుకు అవసరమైన డైల్యూటెంట్‌ను ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. వీటికి తోడు చమురు తవ్వకరంగంలో పోటీ కూడా వెనెజులాకు కలసివచ్చింది. చిన్న డ్రిల్లింగ్ సంస్థలు ముందుకు వచ్చాయి. అనేక ఆంక్షలను పక్కన పెట్టి తనకు అవసరమైన చమురు కొనుగోలు ద్వారా మరోరూపంలో చైనా పెద్ద ఎత్తున తోడ్పడింది. అమెరికా చంకలో దూరిన మనవంటి దేశాలపై అమెరికా వత్తిడి తెచ్చి వెనెజులా నుంచి చమురుకొనుగోలును నిలిపివేయించాయి. లాయడ్ లిస్ట్ ఇంటర్నేషనల్ ప్రకారం 2020లో 150ఓడలు మలేసియా మీదుగా చైనా, ఇండోనేషియాలకు వెనెజులా చమురును సరఫరా చేశాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు పుట్టుకు వస్తాడన్నట్లు అమెరికా ఆంక్షలు విధిస్తున్నకొద్దీ ఇతర మార్గాలు అనేకం వచ్చాయి. ఈ ఏడాది 17లక్షల పీపాలు అదనంగా ఉత్పత్తి జరగవచ్చని భావిస్తున్నారు. ఇరాన్, వెనెజులా నుంచి చమురు చౌకగా లభించనుండటంతో పాటు సరఫరా హామీ ఉంటుంది. 1990లో రోజుకు 32లక్షల పీపాల చమురు వెలికి తీసిన వెనెజులా రిగ్గులు అమెరికన్ల దుర్మార్గం కారణంగా దాదాపు నిలిపివేసిన స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు ఇరాన్ తోడ్పాటుతో రోజుకు నాలుగున్నరనుంచి ఐదులక్షల పీపాల చమురు ఉత్పత్తికి పథకాలు వేశారు.
వెనెజులా ఇబ్బందుల గురించి ఎకసెక్కాలాడటం అపర మానవతావాదులకు ఒక వినోదం. అక్కడి సమస్యలేమిటి? వాటికి ఎవరు కారకులు అన్నది వారికి పట్టదు. అంగవైకల్యం మీద హాస్యాన్ని పండించి వండి వార్చుకు తినేందుకు అలవాటు పడ్డ చౌకబారు స్థాయికి ఎప్పుడో మనం దిగజారాం. ఒక రొట్టె ముక్క కోసం ఒళ్లప్పగించేందుకు సిద్ద పడుతున్న వెనెజులా పడతులని, సిగిరెట్ పీక కోసం దేవురించే వృద్దులున్నారని వర్ణించిన మహానుభావులను చూశాం. ఇక్కడా వక్రదృష్టే. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ పేరుతో 2019 నుంచి ఒక చిన్న విశ్లేషణ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది, కొన్ని పత్రికల్లో కూడా అచ్చయింది. పదవి కోసం పెన్షన్లు, రుణ మాఫీలూ, ఉచిత సర్వీసుల ఆఫర్ ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనెజులా చేస్తున్నారా, ఒళ్లు గగుర్పొడిచే ఈ చరిత్ర చదవండి అంటూ రాశారు. అది చరిత్రా కాదు, రాసిన వీరేంద్రనాథ్ చరిత్ర కారుడూ కాదు అంటూ అప్పుడే ఈ రచయిత స్పందించాడు. ఇన్నేండ్ల తరువాత కూడా అదే ప్రచారం అటూ ఇటూ మారి జరుగేతోంది.
అమెరికాకు వెనెజులా అంటే ఎందుకు పడదు? ఎక్కడన్నా గట్టు తగాదా ఉందా లేదే? సైద్దాంతికంగా, అక్కడ వామపక్ష ప్రభావం పెరగటాన్ని అది తట్టుకోలేకపోతోంది. ప్రపంచీకరణలో అమెరికా ఆధిపత్యంలోని అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థలోకి ప్రవేశించకుండా వెనెజులాను అడ్డుకోవటం ఒక విద్రోహ చర్య అని వార్త రాయలేని పత్రికా స్వేచ్ఛ మనది మరి., వెనెజులా బంగారు నిల్వలను తిరిగి తీసుకొనేందుకు నిరాకరించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ చర్య చట్టవిరుద్దం, లేదా దోచుకోవటం అని రాయటం కూడా కష్టమే అంటూ జర్నలిస్టు జాన్ పిల్గర్ చలోక్తి విసిరాడు. ఒళ్లు గగుర్పొడిచే పచ్చినిజాలు ఇవి. '2008లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి, ధరపెరగని రొట్టె ముక్క అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు' ఇది హ్యూగో ఛావెజ్ గురించి రాశారు.(అసలు ఆ ఏడాది అక్కడ ఎన్నికలే జరగలేదు)
ఎవరీ ఛావెజ్? 1977లో ఒక సైనికుడిగా ఒక వామపక్ష తీవ్రవాద సంస్ధను అణచివేసేందుకు వెళ్లిన ఆయన, వారెందుకు తీవ్రవాదులుగా మారారు, రాజ్యం వారినెందుకు అణచివేస్తున్నది అనే అంతరంగ మధనంతో వామపక్ష వాదిగా మారిన వ్యక్తి. 1989లో కార్లోస్ అండ్రెజ్ పెరోజ్ అనే పెద్ద మనిషి తాను ఎన్నికైతే అమెరికా వ్యతిరేక రాజకీయ వైఖరి తీసుకుంటానని, ఐఎంఎఫ్ విధానాలను వ్యతిరేకిస్తాననే వాగ్దానాలతో అధికారానికి వచ్చి అందుకు వ్యతిరేకంగా వ్యవహరించాడు. అతని విధానాలు నచ్చని మిలిటరీ అధికారిగా ఉన్న ఛావెజ్ 1992లో విఫల తిరుగుబాటు చేశాడు. అందుకుగాను ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1994లో అధికారానికి వచ్చిన కొత్త ప్రభుత్వం ఛావెజ్‌ను, ఆయనతో పాటు జైల్లో పెట్టిన ఇతర తిరుగుబాటుదార్లను విడుదల చేసింది. మిలిటరీలో తిరిగి చేరకూడదని ఆంక్షలు విధించింది. 1998 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో, వామపక్ష, ఉదారవాద, ప్రజాస్వామిక అభిప్రాయాలు కలిగిన వివిధ సంస్థలు, పార్టీలతో ఏర్పడిన వెనెజులా ఐక్యసోషలిస్టు పార్టీ తరఫున 1998 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. నూతన రాజ్యాంగం మేరకు 1999లో మరోసారి ఎన్నికలు జరిపి రెండోసారి అధికారానికి వచ్చారు. 2006 డిసెంబరులోనే జరిగాయి, మరుసటి ఏడాది జనవరిలో మూడోసారి అధికారంలోకి వచ్చారు. నాలుగోసారి 2012లో తిరిగి ఎన్నికయ్యాడు. అయితే ఆరోగ్యం విషమించి 2013 మార్చి ఐదున మరణించారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న నికొలస్ మదురో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. తరువాత ఎన్నికల్లో మదురో గెలుస్తున్నారు.
వెనెజులాలో ఉన్నది వామపక్ష ప్రభుత్వం. దాని ఆదాయం నూటికి 95శాతం చమురు ఎగుమతుల మీదే ఆధారపడి వుంది. అలాంటి చమురును అమ్ముకోనివ్వకుండా అమెరికా ఆంక్షలు పెడుతున్నది. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నది. వాటినుంచి గుణపాఠాలు తీసుకొని మెరుగైన విధానాల గురించి అక్కడ మధనం జరుగుతోంది. అక్కడి జనమే వాటిని నిర్ణయించుకుంటారు. సంక్షేమ పథకాలను వ్యతిరేకించటం ప్రపంచంలో కడుపు నిండిన వారికి ఒక ఫ్యాషన్. దాన్ని సూటిగా చెబితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ అందుకు వెనెజులాను సాకుగా చూపటమే అభ్యంతరం.
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288