Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేది:18.01.2022
తూప్రాన్
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుగారికి,
ఎమ్మెల్యే, గజ్వేల్ నియోజకవర్గం
ముఖ్యమంత్రి కార్యాలయం, తెలంగాణరాష్ట్రం, హైదరాబాద్.
విషయం: తూప్రాన్ మండల పరిధిలో కాళేశ్వరం కాలువ నిర్మాణంలో భాగంగా విలువైన వ్యవసాయ భూములను కోల్పోతున్న విషయం గురించి..
మేము అనగా కాలేశ్వరం కాలువలో భూములు కోల్పోతున్న రైతులం సంయుక్తంగా మీకు విన్నవించుకుంటున్న విషయం ఏమనగా... తూప్రాన్ మండల పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం కాలువ నిర్మాణంలో మా 131 ఎకరాలకు పైగా అత్యంత సారవంతమైన వ్యవసాయ భూమి మునిగిపోయే ప్రమాదం కనుచూపు మేరలో కనిపిస్తున్నది. మేము అనువంశికంగా/ లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి వ్యవసాయము చేస్తూ జీవనోపాధిని దశాబ్దాలుగా పొందుతున్నాము. వ్యవసాయం (Agriculture) ఒక వృత్తిగా కాకుండా జీవన ''సంస్కృతి'' (Culture)గా భావించి కుటుంబ పోషణ చేస్తున్నాం. ఈ వ్యవసాయ భూములపై ప్రత్యక్షంగా మా జీవితాలే కాకుండా వేలాది మంది వ్యవసాయ కూలీల ఉపాధి, వారి కుటుంబ పోషణ కూడా ఆధారపడి ఉందనే విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు.
వ్యవసాయపరంగా సారవంతమైన నల్లరేగడి నేలలు మావి.
వాణిజ్య పంటల పరంగా చూసినా మంచి దిగుబడులు ఇచ్చే నేలలు మావి. అలాగే...
వ్యాపారపరంగా చూసినా గుంటలలో, గజాలలో వేలాది రూపాయల మార్కెట్ విలువ ఉన్న భూములు మావి. అనేక బావులు, ఖరీదైన నీటి బోర్లు, అనేక ఫలవృక్షాలు ఉన్న చదునైన నల్లరేగడి వ్యవసాయ భూములు మావి.
అనేక చోట్ల మా భూముల గుండా రోడ్డు విస్తరణ కోసం కొంత స్థలాన్ని గతంలో ప్రభుత్వం చడీచప్పుడూ కాకుండా తీసుకున్న విషయం ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకు వస్తున్నాం. ఇప్పుడు ఏకంగా అక్షరాల నూటా ముప్ఫై ఎకరాలకు పైగా స్థలాన్ని ప్రభుత్వం కాలువ నిర్మాణం కోసం సేకరించే ప్రయత్నం చేయడం శోచనీయం. అమానవీయం (Inhumane) కూడా!
మీరు మాకు ఇటీవల జారీ చేయించిన/ చేసిన నోటీసులను ఆధారంగా చేసుకొని మా సారవంతమైన వ్యవసాయ భూములను కాలువ నిర్మాణం కోసం ఇవ్వకపోవడంపై మాకున్న అభ్యంతరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. గమనించగలరు.
1.రైతులుగా మా విలువైన వ్యవసాయ భూములను, వాటిపై మాకు సంక్రమించిన భూయాజమాన్య, వారసత్వ సంపదలపై హక్కులను వదులుకోవడానికి మేము మానసికంగా సిద్ధంగా లేకపోవడం ప్రధానమైనది.
2. దాదాపు అందరూ... వ్యవసాయ ఆధారిత, కుల వృత్తులపై ఆధారపడిన కుటుంబాలు కావడం వల్ల మా జీవనోపాధి, ఆదాయాలు, మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతున్నదనే దిగులు మమ్మల్ని వేధిస్తున్నది.
3. అతి తక్కువ ప్రభుత్వ ఖర్చుతో కాలువ నిర్మాణం చేయగలిగే వీలు మా వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉన్నదనే విషయం మీకు మరొక్కసారి తెలియజేస్తున్నాము. ఈ అవకాశం మరే గ్రామాల రైతులకు లేనే లేదనే చెప్పాలి. ఎందుకంటే - మా వ్యవసాయ భూముల పక్కనే పెద్దదైన, పొడవైన హల్దీవాగు ఖాళీగా ఉండడం మీరు గమనించాలని కోరుతున్నాం. అలాగే వాగుతో పాటుగా చెరువుల అనుసంధానం చేసే వీలున్నప్పుడు రైతుల జీవనోపాధిని మృగ్యం చేయడం సమంజసం కాదు.
4. గుంటల్లో, గజాల్లో అమ్ముడుపోతున్న భూమిని మాచేత రెండు సార్లు ఎన్నుకోబడిన సర్వ శక్తివంతమైన ప్రభుత్వం ''అత్యంత దయనీయమైన ధరలకు పేద వ్యవసాయదారుల వద్ద నుండి కోరుకోవడం లేదా తీసుకునే ప్రయత్నం చేయడం'' అమానవీయమే అవుతుందని విజ్ఞత కలిగిన వారెవరైనా చెబుతారు.
5.''కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామ''ని చెప్పిన ప్రభుత్వం 'కోటి రూపాయలకు పైగా ఎకరం' ఉన్న ''మా భూమిని నీట ముంచి'' వేరే వారికి నీళ్లు అందించడం ఏ రకమైన సహజ న్యాయమో? అనే ప్రశ్న మమ్మల్ని వేదిస్తున్నది. కేవలం తూప్రాన్ పరిధిలోనే 130ఎకరాలకుపైగా వ్యవసాయ భూమిని గుంజుకుంటున్నారు... ఇక.. రాష్ట్రమంతటా ఎంత సాగు భూమి గుంజుకుంటున్నారు. ఇలా భూములన్నీ మినహాయించుకుంటూ పోతే ''కోటి ఎకరాల సాగు'' రాష్ట్రం తెలంగాణ ఎలా అవుతుందో ఏలుతున్న వారే తెలియజేయాలి.
6. కాలేశ్వరం కాలువను తూప్రాన్ దగ్గర మీరు హల్దీవాగులో కల్పకపోతే 2 లేదా 3 బ్రిడ్జిలతో అయిపోయే పని 10 నుండి 12 బ్రిడ్జిలు కట్టవలసిన అగత్యం ఏర్పడుతుంది. అలాగే అనేకమైన రోడ్డు, రైలు మార్గాలకు అవాంతరాలు కల్పించ వలసి వస్తుంది. ఆ నష్టాన్ని మీరు లెక్కిస్తే రైతులకు చెల్లించదలచుకున్న పరిహారం కంటే 10 రెట్లు ఎక్కువ కాగలదు. వ్యవసాయిక కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగినందున 'మా భూమి'పై సహజమైన మక్కువ కారణంగా కేవలం ''కొన్ని'' అభ్యంతరాలను మాత్రమే మీ దృష్టికి తీసుకువచ్చాం.
''మా భూములన్నీ పోయాక మీరిచ్చే నీటితో మేము ఏమి చేసుకోవాలి?'' అనేది మా ప్రధానమైన ప్రశ్న.
అయితే... విస్తృతమైన, ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ''ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం''లో మేము సైతం కదలి రావాల్సిన అవసరాన్ని గుర్తించి - కొంత వ్యక్తిగత, కుటుంబ సంబంధమైన స్వార్థాలను కూడా విడిచి పెట్టాలని గుర్తించామని తెలియజేస్తున్నాం. అందుకు ప్రభుత్వానికి మా సహకారాన్ని అందించడానికి ఈ క్రింద పేర్కొన్న హేతుబద్ధమైన అంశాలను మానవీయ (Humane) ఈ కోణంలో ఆలోచించి తగు నిర్ణయాలు చేస్తారని ఆశిస్తున్నాం. అవి:
1. విలువైన వ్యవసాయ భూములను తీసుకోకుండా వీలైనన్ని ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను సావధానంగా పరిశీలించడం అవసరం.
2. భూసేకరణ అనివార్యమైన పరిస్థితిలో... తూప్రాన్ మండల పరిధిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలాలను గుర్తించి... భూములు కోల్పోయిన వ్యవసాయదారులకు ''భూమికి భూమి'' పద్ధతిన పట్టా చేసి ఇచ్చి వ్యవసాయదారుల జీవనోపాధిని కాపాడాలి.
3. చివరగా... వ్యవ'సాయమే' ఆధారంగా ఇప్పటి వరకు జీవనోపాధిని పొందుతున్న రైతులు శాశ్వతంగా వ్యవసాయ వృత్తికి దూరంగా జరిగి పోవాల్సిన లేదా వ్యవసాయ వృత్తినే కోల్పోతున్న అనివార్యత కారణంగా ''ఎకరానికి కోటి రూపాయలకు తక్కువ కాకుండా సహాయాన్ని'' అందించమని కోరుతున్నాం. ఈ మొత్తాన్ని రైతుకు నష్టపరిహారంగా భావించక ''వ్యవసాయ సంస్కృతికి దక్కవలసిన ప్రతిఫలం''గా చూడాలని వినమ్రంగా కోరుతున్నాం. కృతజ్ఞతలు.
- కె శ్రీనివాసాచారి, సెల్: 8096653459