Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు తాజా విడత ఎలక్టొరల్ బాండ్ల జారీకి, వాటిని నగదుగా మార్చుకోడానికి కేంద్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుమతించడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. 2018లో ఎలక్టొరల్ బాండ్ల పథకం నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ఇలా బాండ్లు జారీ చేయడం ఇది పందొమ్మిదో విడత. వచ్చే నెలలో కీలకమైన యూపీతో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఎన్నికల బాండ్ల జారీకి సంబంధించిన ప్రకటన ఇవ్వడమంటే పోటీలో ఉన్న వివిధ అభ్యర్థుల రాజకీయ నిధులకు సంబంధించి పారదర్శకతకు పాతరేయడమే. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ అంశంపై భారత సర్వోన్నత న్యాయస్థానం తగినంత దృష్టి పెట్టకపోవడంతో ఈ పథకం యథేచ్ఛగా సాగిపోతోంది. దీనిపై ఇంతవరకు పూర్తి స్థాయి విచారణ నిర్వహించలేదు. విచారణ పూర్తయ్యేవరకు దీనిపై మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఆ పని చేయకపోగా కోర్టు అప్పట్లో ఓ విచిత్రమైన వ్యాఖ్య చేసింది. ఎలక్టొరల్ బాండ్లు అనామకమైనవి ఏమీ కాదని, రాజకీయ నిధులు సమకూర్చే దాతల వివరాలపై ఆసక్తి ఉన్న ఓటర్లు దీనిని కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని, బాండ్ల కొనుగోలు, చెల్లింపు రెండూ బ్యాంకు ద్వారా జరుగుతాయని, ఆ బాండ్లు ఇచ్చే దాత ఎవరో తెలుసుకోవాలనుకుంటే కంపెనీల రిజిస్ట్రార్ వద్ద తెలుసుకోవచ్చని సెలవిచ్చింది. పార్టీలకు ఎటువంటి బాధ్యత లేదన్నట్లుగా చెప్పింది.
కంపెనీల బ్యాలెన్స్ షీట్లు పరిశీలించడం ఒక సామాన్య ఓటరుకు సాధ్యమయ్యే పనేనా? ఎలక్టొరల్ బాండ్ల రూపురేఖలను లోక్సభకు సమర్పించినప్పుడు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక మాట అన్నారు. దాత ఏ పార్టీకి జమ చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే రాజకీయ పార్టీ ఎన్నికల కమిషన్ వద్ద దాఖలు చేసే రిటర్న్స్ పరిశీలించుకోవచ్చన్నారు. అప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీకి ఏ దాత ఇచ్చారో తెలియదు. మొత్తానికి ఇదంతా ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన, రాజ్యాంగం హామీ ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛకే భంగకరం. వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయలు దాకా విలువగల ఎలక్టొరల్ బాండ్లను ప్రభుత్వం అనుమతించిన ఏకైక అధీకృత బ్యాంకు ఎస్బిఐ నిర్దిష్ట కాల వ్యవధిలో జారీ చేస్తుంది. వీటిని కొనుగోలు చేసిన కార్పొరేట్లు తమకు నచ్చిన పార్టీకి విరాళంగా ఇచ్చుకోవచ్చు. కొనుగోలుదారుడు వాటిని ఎవరికి ఇచ్చిందీ వెల్లడించాల్సిన అవసరం లేదు. బాండ్లు నగదుగా మార్చుకునే రాజకీయ పార్టీ తమకు ఆ బాండ్లను ఇచ్చిన దాతకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. అలాంటప్పుడు రాజకీయ నిధులు అందజేసిన దాతను ఓటరు తెలుసుకోవడం ఎలా సాధ్యం?
రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు తమ నికర లాభంలో 7.5శాతం కంటె మించి విరాళం ఇవ్వరాదని అంతకు ముందు ఉన్న నిబంధనకు ఎలక్టొరల్ బాండ్ల స్కీము పూర్తిగా తిలోదకాలిచ్చింది. రాజకీయ పార్టీకి విరాళాలు ఇవ్వడానికి ముందు ఆ కంపెనీ మూడు సంవత్సరాలుగా ఉనికిలో ఉండాలనేది నిబంధన. ఈ స్కీము అమలులో దీనిని కూడా తుంగలో తొక్కారు. దీంతో ఎలక్టొరల్ బాండ్ల స్కీమ్ ఒక పెద్ద స్కాముగా మారిపోయింది. ఇక్కడ రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. ఒకటి, రాజకీయ పార్టీలకు ఎవరి నుంచి ఎలా నిధులు సమకూరుతున్నాయో తెలుసుకునే ప్రాథమిక హక్కు ఓటర్లకు లేదని చెప్పడం. రెండు, ఎన్నికల్లో నిధులను సమకూర్చడంలో నల్లధనం పాత్రను ఇది మరింత పెంచుతుంది. రాజకీయ నిధుల మూలాల గురించి ఓటర్లకు తెలియజేయనక్కర్లేదని ప్రభుత్వమే వాదించడం వింతగా ఉంది. ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించ డమంటే అర్థం, ఓటరు తాను మద్దతు ఇచ్చే అభ్యర్థుల రాజకీయ నిధుల దాతల గురించి తెలుసుకునే హక్కు తప్పనిసరిగా ఉంటుంది. ఓటరకు గల ఈ హక్కును సమర్థిస్తూ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు అనేకం ఉన్నాయి. ఎన్నికలకు అపరిమితమైన కార్పొరేట్ నిధులు సమకూర్చడం వల్ల ప్రజాస్వామ్యానికి ఎదురయ్యే ప్రమాదం గురించి 1957కి మందు పలువురు న్యాయమూర్తులు స్పష్టంగా హెచ్చరించారు. రాజకీయ పార్టీలకు నిధులను అందించడమంటే ప్రభుత్వాలను వ్యాపార వర్గాలు ప్రభావితం చేసేందుకు అవకాశం ఇవ్వడమేనని కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ ముఖర్జీ ఓ కేసులో స్పష్టం చేశారు. బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగ్లా ఒక కేసులో రూలింగ్ ఇస్తూ, రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడానికి కంపెనీలకు అనుమతించే ఏ నిర్ణయం అయినా చివరికి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తుంది' అని చెప్పారు. ఎలక్టొరల్ బాండ్ల స్కీము తతంగాన్ని చూస్తే, కార్పొరేట్లు అందించే ఎన్నికల నిధుల గురించి తెలుసుకోవడం ఓటరుకు గగనంగా మారుతోంది. మన ప్రజాస్వామ్యానికి ఇంత కన్నా ప్రమాదం ఏముంటుంది?
('హిందూ' వ్యాసానికి స్వేచ్ఛానుసరణ)
- సుహత్ పార్థసారథి