Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కులం, మతం మనిషిని గొప్పవారిని చేయబోవు'. ఆధ్యాత్మికత, అంకిత భావం, కట్టుబాట్లు (క్రమశిక్షణ) వలన మనిషి గొప్పవాడు అవుతాడు.' - శ్రీ రామనుజాచార్య
సమతామూర్తి రామానుజాచార్య సహస్రాబ్ది (వెయ్యేండ్ల) సమారోహ వేడుకలు ఫిబ్రవరి 2 నుండి 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా తెలంగాణా రాష్ట్రం శంషాబాద్ మండలం ముచ్చింతల్ వద్ద జరుగుతున్నాయి. చినజీయర్‌స్వామి నేతృత్వంలో వారి ఆశ్రమంలో జరిగే ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాష్ట్రపతి రామనాథ్ కోవింత్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లతో సహా అతిరథ మహారథులందరూ క్యూకడుతున్నారు.
సుస్థిర పీఠంపై ప్రశాంతవదనంతో జగతికి ప్రణమిల్లుతూ కూర్చొనివున్న రామానుజ భారీ విగ్రహం (216 అడుగులు) పగటిపూటే కాదు, డిజిటల్ వెలుగుల్లో రాత్రిపూట కూడా బాగా ఆకర్షిస్తున్నది. తత్సంబంధమైన 120కిలోల బంగారు విగ్రహం రెండవ అంతస్తులో ప్రతిష్టిస్తున్నారు. ఈ సందర్భంగా 144 యాగశాలల్లో 1035 హౌమగుండాల్లో 5వేల రుత్విక్కులతో కలసి మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం కొన్ని లక్షల లీటర్ల శుద్ద ఆవు నెయ్యిని పలు రాష్ట్రాల నుండి తెప్పించి స్వాహా చేస్తున్నారు. 45 ఎకరాల విస్తీర్ణంలో వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రతిష్టాపన వేడుకలు జరుగుతున్నాయి.
ప్రధాన విగ్రహం 1800టన్నుల పంచలోహాలతో చైనాలో తయారైంది. పలు భాగాలుగా నిర్మితమైన విగ్రహాన్ని చైనా ఇంజనీరింగ్ నిపుణులే వచ్చి కూర్చడం విశేషం. విభిన్న పక్షులు, జంతువుల సోయగాలతో, దేవతామూర్తులు మహనీయుల విగ్రహాలతో ఇది ఆలయ సముదాయంగా శోభిల్లుతుందని చెపుతున్నారు. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ఈ వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
''శ్రీరామానుజుడి సమతా సూత్రం, మన రాజ్యాంగం చెప్పిన సమానత హక్కు ఒక్కటే. భారతీయతను, మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వెయ్యేండ్ల క్రింద వివక్షకు, అసమానతకు, అంటరాని తనానికి తావులేని సమాజం గురించి కలలు కనడమే కాకుండా సమత ఏ విధంగా సాధించాలో శ్రీరామాజనుడు ఆచరించి చూపారు. ఆ విధానాలు ఇప్పటికే అనుసరణీయమేనని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ రామానుజ మహాయజ్ఞ మౌలిక లక్ష్యం'' అని చినజీయార్స్వామి ఈ సందర్భంగా పదేపదే వక్కాణిస్తున్నారు.
ఇక్కడే కీలకమైన రెండు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొదటిది, సనాతన వర్ణాశ్రమ ధర్మం పునాదిగా కలిగిన మనుధర్మ శాస్త్రాన్ని నఖశిఖ పర్యంతం వ్యతిరేకించి బహిరంగంగా దగ్ధం చేసినవారు బాబాసాహెబ్ అంబేద్కర్. వివక్షా పూరితమైన, అత్యంత హేయమైన భారత సమాజంలోని ఈ అసమానతలు కూకటివేళ్ళతో సహా తొలగించాలంటే ఆ సనాతన మనుధర్మానికి వ్యతిరేకంగా బోధించు, సమీకరించు, పోరాడు అని ప్రజలకు పిలుపునిచ్చాడు. కులం పునాదులపై ఓ జాతిని నిర్మించలేవు ఓ నీతి (ధర్మం)ని నిర్మించలేవు అని నినదించాడు. జీవితపర్యంతం నిమ్నజాతుల ప్రజానీకం హక్కులకోసం రాజీలేని పోరు సల్పిన అసాధారణ మేధావి అంబేద్కర్.
ఆయన నేతృత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం భారత ప్రజలకు ఆచరణ యోగ్యమైనది. ఆచరణ సాధ్యమయ్యేది కూడా. అయితే స్వార్థపూరిత ఫ్యూడల్ పెట్టుబడి దారీ వ్యవస్థ పాలకుల వలన అది సక్రమంగా అమలు కావడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. తన జీవితకాలంలోనే ఆ చేదు అనుభవాలు గ్రహించి అంబేద్కర్ దుఃఖపడ్డాడు కూడా.
ఈ నేపథ్యంలో హైందవ సనాతన ధర్మం, భారత రాజ్యాంగ భావన ఒక్కటే ఎలా అవుతుంది? పైగా చిన జీయర్‌స్వామి వర్ణవ్యవస్థ ఉండాలని, ప్రజలు మాంసాహారం భుజించరాదని కోరుకుంటున్నాడు. అవే ప్రవచనాలు పరులను కించపరిచేలా వినిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఇవి చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఆధునిక కాలంలో ఇది సాధ్యమా..? సమతా వైభవం కలగాలి అంటూనే, ఆచరణలో అంతరాలు ఉండాలని కోరుకోవడం, ఇతరుల హక్కులను గౌరవించకపోవడం ఎలా సమానత్వమవుతుంది?
ఇకపోతే విగ్రహం ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆవిష్కృతమవుతున్నది. ఒక వైపు జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తూ, మరోవైపు జాతిపితను హత్య చేసిన గాడ్సేను కూడా పూజించే మన ప్రధాని మోడీ నైతికత (ధర్మం) మన భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచం అంతటా ప్రశ్నార్థకమవుతున్నది. (ఇది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.)
శ్రీరామానుజుడు పదకొండో శతాబ్దినాటి శ్రీవైష్ణవాచార్యుడు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు. 1017లో తమిళనాడు శ్రీపెరంబదూరులో జన్మించిన ఆయన 120సంవత్సరాలు జీవించారని ప్రతీతి. చర్యకు ప్రతిచర్య ఉండటం సహజం. ఆదిశంకరాచార్యుల అద్వైత దర్శనానికి ప్రతిచర్యగా ఏర్పడినది రామానుజని విశిష్టాద్వైతం.
ఆదిశంకరుడు (కీ.శ.ఎనిమిదివ శతాబ్దం) ఈ జగత్తు మిథ్య అన్నాడు. కాదు ఈ జగత్తు యధార్థం. సృష్టికారకుడైన ఈశ్వరుడు ఎంత యధార్థమో జగత్తూ అంతే యధార్థము అని రామానుజుడు చెప్పాడు. కనుక రామానుజ దర్శనంలో సైతం వైరుధ్యం ఉంది. కండ్లకు కన్పించి అనుభవంలోకి వస్తున్న పదార్థం ఎంత సత్యమో సృష్టికర్త దేవుడూ అంతే సత్యం అన్నాడు. ప్రకృతిని - ఈశ్వరుడ్ని సమాంతరంగా నిలిపాడు.
అంతకు ముందు వేయి సంవత్సరాల మునుపే బుద్దుడు ఈశ్వరవాద సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేశాడు. ఒకవేళ ఈశ్వరుడు వేరుగా ఉండి ఈ సర్వసృష్టి చేశాడా..? అలాయితే వేటిని సాధనాలుగా ముడిపదార్థాలుగా చేసుకుని (కుమ్మరికి సారె మట్టిలాగ) ఈ సృష్టిచేశాడు? లేదా అతడే సృష్టిలో అంతర్భాగమైతే సర్వశక్తిమంతుడు ఎలా అవుతాడు..? అన్న తర్కానికి ఆనాటి జ్ఞానులు బదులివ్వలేకపోయారు. అందువలన భావవాదాన్ని భౌతికవాదాన్ని ముడిపెట్టడం విఫలయత్నమే అవుతుంది. పరమాత్ముని ముక్తి కోసం పరితపించే ఎంతటి నిష్కామ స్వాములైనా ఈ కరోనా కాలంలో ముక్కుకు మాస్క్ ధరించడం, వ్యాక్సిన్ వేయించుకోవడం చూస్తూనే ఉన్నాం. దానికి కూడా చినజీయర్స్వామే పెద్ద ఉదాహరణ.
ఇక రెండవది, యజ్ఞాలు, హౌమాలు. దేవతల అనుగ్రహం పొందేందుకు హైందవ మతంలో యజ్ఞయాగాదులు చేయడం అనాదిగా వస్తున్నది. వేదాలు ఇవే బోధిస్తున్నాయి. మంత్రోక్తమైన కర్మకాండ ఆర్య సంస్కృతిలో భాగం అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 'హౌమం, సోమం, భోగం' లక్ష్యాలు కలిగిన ఈ 'యజ్ఞ సంస్కృతిలో' దేవునితో బేరమాడే క్విట్ 'ప్రోక్రో' వ్యాపార పద్ధతి ఉన్నదనే విమర్శలేకపోలేదు. దేవతలను ప్రసన్నం చేసుకునేందుకే ఈ యజ్ఞయాగాల్లో జంతు బలులు, హవిస్సులు సమర్పించడం, వాటినే పౌరోహిత బ్రాహ్మణులు దేవునిపేరిట కైంకర్యం చేయడం నాటినుండి నేటికీ జరుగుతున్నదే. ఈ దిగజారుడు పద్ధతుల్ని ఆనాడే ద్వేషించి, స్వచ్ఛమైన ఆధ్యాత్మిక చింతన కోసం శ్రవణక సంస్కృతి ఆవిర్భవించింది. సేవ పరిత్యాగం శ్రవణక లక్ష్యం. వైదికులకు పూర్తివ్యతిరేకమైన ఈ శ్రవణక సంస్కృతి నుండే బౌద్ధం - జైనం ఉద్భవించాయి.
మరి కాలం చెల్లిన ఈ అశాస్త్రీయ యజ్ఞయాగాలు హౌమాల వలన సమాజంలో సమానత్వం ఎలా వస్తుంది? సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి.
'స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం' పెంచి విప్లవకాలంలో దాదాపు 200ఏండ్ల క్రితం ప్రపంచమంతటా మార్మోగిన నినాదాలు. మార్క్స్, ఏంగెల్స్‌ల కమ్యూనిస్టు ప్రణాళిక రచనకు కారణభూతమైనవి. సమసమాజ (సోషలిస్టు) సామ్యవాద వ్యవస్థ నిర్మాణానికి శాస్త్రీయ సిద్ధాంతంగా పరిఢవిల్లుతున్నవి. ఈ సిద్ధాంతానికి మానవుడే కేంద్రం. దేవుడు కాడు.
ఆ సిద్ధాంతానికి, తద్వారా లెనిన్ సారధ్యంలో ఏర్పడిన సోషలిస్టు రష్యా ప్రభావానికి లోనైన మన తొలి ప్రధాని జవహర్లాల్ ఈ విధంగా అంటాడు... 'మతం మూఢాచారాలతోనూ, మూఢ విశ్వాసాలతోనూ, దగ్గర సంబంధం కలదిగా కనిపిస్తుంది. శాస్త్ర సమ్మతంకాని జీవన దృష్టి మతం వెనుక ఉన్నది. గుడ్డి నమ్మకం అతీతశక్తిపై ఆధారపడటం, మాయావాదం మతసారాంశం' అని మతచాందసాన్ని కుండబద్దలు కొట్టాడు. మరోరూపంలో బాపూజీ చెప్పిన మాటలు ఈ సందర్భంగా స్ఫురణకు తెచ్చుకోవడం అవశ్యం. 'మతం దీన జనోద్దరణ కన్నా ముఖ్యమైనది కాదు. ఆధ్యాత్మిక చింతన బాహ్యకర్మకాండలో ఉండదు.' వీటికి వేరే వ్యాఖ్యానాలు ఎందుకు? అందుకని సనాతన ధర్మాచరణ - ఆధునిక శాస్త్ర క్రియాశీలత పొంతనలేని పరస్పర విరుద్దాంశాలని గుర్తుంచుకోవాలి.
సెల్: 9959745723
కె. శాంతారావు