Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కంపెని (హెచ్పిసిఎల్) కర్నాటకలోని హస్సన్ నుండి హైదరాబాద్లోని చర్లపల్లి వరకు గ్యాస్ పైప్ లైన్ నిర్మిస్తున్నది. వనపర్తి జిల్లా, వనపర్తి మున్సిపాలిటీకి దగర రాజపేట శివారుల్లో టీ.ఆర్.యెస్ కొత్త ఆఫీసుకు కూతవేటు దూరంలో గ్యాస్ పైప్ లైన్ తీస్తున్నారు. గ్యాస్ పైప్ లైన్ నిర్మిణంలో భాగంగా హెచ్.పి.సి.ఎల్ దౌర్జన్య చర్యలు గిరిజనులలో శోకాన్ని మిలిల్చాయి. వారి మంకుపట్టు వల్ల పేదలు కూలి నాలి చేసి ఆడబిడ్డల పెళ్లిళ్లకని, ఇండ్లు కట్టుకుందామని కొనుక్కున్న ప్లాట్లు స్మశానానికి కూడా పనికిరాని భూములుగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి, శాటిలైట్ సర్వే సాకు చూపి, అయినవారి భూములు తాకకుండా, గిరిజన భూముల్లో, పేద వారి ఫ్లాట్ల గుండా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, లీగల్ ప్రొసీజర్ పాటించకుండా అడిగేవారులేరని అక్రమాలకు తెరతీసింది హెచ్పిసిఎల్ కంపెని.
ప్రజలను కాపాడవలసిన ప్రభుత్వ యంత్రాంగం కంపెనికి వత్తాసు పాడుతుంది. డిసెంబర్ 23, 2021 నాడు తమ పంట పొలాల్లో ఇప్పటికే హైటెంషన్ విద్యుత్ లైన్ పోయి నష్టపోయాం, మళ్ళీ ఇప్పుడు గ్యాస్ పైప్ లైన్ వేయవద్దని గిరిజనులు భూముల్లో కూర్చుంటే హెచ్పిసిఎల్ యాజమాన్యం ప్రభుత్వ అండదండలతో పోలీసులను మొహరించి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించి దౌర్జన్యంగా కోతకు రాని పంటను జె.సి.పి.లతో తొలగించే ప్రయత్నం చేసింది. స్థానిక ఎమ్మెల్యే వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నా పంటలకు రక్షణ కరువైంది. కూతవేటు దూరంలో అధికార పార్టీ ఆఫీస్ ఉన్నా పేదల ప్లాట్లకు భద్రత కరువైంది. ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధే కంపెనీకి వత్తాసు పాడుతుంటే, కాపాడవలసిన కలెక్టర్ కన్నెర్ర చేస్తుంటే ఆ గిరిజనుల భూములకు, ఆ పేద వారి ప్లాట్లకు దిక్కెవరు? ప్రజాప్రయోజనం అనే పదాన్ని ఉపయోగించి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కేవలం గిరిజనుల, వెనకబడ్డ వర్గాల భూముల గుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదల ప్లాట్ల గుండానే వెళ్లాలని భీష్మించుకోవడంలో దాగి ఉన్న రహస్యం ఏమిటి?
ఆ గిరిజనుల పట్టా భూములలో ఇప్పటికే యాబై ఫీట్ల వెడల్పుతో హై టెంషన్ విద్యుత్ లైన్ వెయ్యబడింది. ఆ లైన్ కిందనుంచి గ్యాస్ పైప్ లైన్ వెళ్ళుటకు రైతులందరూ ఒప్పుకున్నా ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు?
ప్రస్తుత ప్రతిపాదిత గ్యాస్ పైప్ లైన్ పక్కనే 60 ఫీట్ల వెడల్పుతో నిరుపయోగంగా పాత కాలువ (వాగు) ఉంది. అయినప్పటికీ దాని గుండా గ్యాస్ పైప్ లైన్ వెళ్ళుటకు సంకోచం ఎందుకు? రాజనగరం వరకు 40 ఫీట్ల రోడ్డు ఉన్నా దానిపై నుంచి గ్యాస్ పైప్ లైన్ ఎవరి ప్రయోజనం కోసం దారి మళ్లింది? చివరికి ప్లాట్ల మధ్యలో ఉన్న రోడ్డు, బైపాస్ కానున్న ప్రస్తుత 33 ఫీట్ల వై.టి.సి. బిల్డింగ్ రోడ్డు గుండా పైప్ లైన్ వెళ్ళుటకు అవకాశం ఉన్నా ఎందుకు ప్రయత్నించడం లేదు? అయిన వారి భూములు అడ్డు వచ్చినప్పుడు మారుతున్న శాటిలైట్ సర్వే గిరిజనులు, వెనుకబడిన తరగతుల భూముల గుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ పేదల ఫ్లాట్ల గుండా పోకుండా ఎందుకు మారడం లేదు? ఇండ్ల కోసం కొనుక్కున్న, ప్రభుత్వం ద్వారా నాలా పర్మిషన్ పొందిన ప్లాట్ల గుండా గ్యాస్ పైప్ లైన్ వేసేందుకు హెచ్పిసిఎల్ కంపెనీకి అధికారం ఉందా?
మూడు సంవత్సరాలుగా గ్యాస్ పైప్ కోసం సర్వే జరుగుతున్నప్పటికీ ఆయా సర్వే నెంబర్లపై క్రయ విక్రయాలకు ఎందుకు అవకాశం ఇచ్చినట్లు? క్రయ విక్రయాలను ధృవీకరిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వ శాఖ కాదా? ఆయా సర్వే నెంబర్లను బ్లాక్లో ఉంచాల్సిన బాధ్యత రెవెన్యూశాఖకు లేదా?
రిజిస్ట్రేషన్ శాఖ వారు అప్పుడే క్రయవిక్రయాలు నిలిపివేసి ఉంటే, రెవెన్యూ శాఖ వారు అప్పుడే ఆయా సర్వే నెంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టి ఉంటే కొంతమంది బాధితులైనా ఆ ప్లాట్లను కొనేవారు కాదుకదా. నిర్లక్ష్యంగా వ్యవహరించింది ప్రభుత్వ శాఖలు, హెచ్పిసిఎల్ కంపెనీ ఫలితాన్ని అనుభవించాల్సింది మాత్రం పేద ప్రజలా?
వెంటనే హెచ్పిసిఎల్ గ్యాస్ పైపు లైన్ అలైన్మెంట్ మార్చాలి. హెచ్పిసిఎల్ వారు పేర్కొంటున్న సర్వే నంబర్స్ వేరు, క్షేత్ర స్థాయిలో కాలువ తీస్తున్న సర్వే నంబర్స్ వేరు. దౌర్జన్యంగా లేని సర్వే నంబర్స్ గుండా తీస్తున్న కాలువలను వెంటనే నిలిపివేయాలి. ప్రత్యామ్నాయ మార్గాలు న్నప్పటికీ అలైన్మెంట్ ఎందుకు మార్చడం లేదో సమాధానం చెప్పాలి. శాటిలైట్ సర్వే మారదని చెపుతున్నవారు గ్యాస్ పైప్ లైన్ అన్ని వంకలు ఎందుకు తిరుగుతున్నాదో సమాధానం చెప్పాలి. గ్యాస్ పైప్ లైన్ ప్లాట్ల గుండానే తీసుకెళ్లదలిస్తే ప్లాట్లు కోల్పోతున్న పేదలకు మార్కెట్లో అదే విలువ గల వేరే ప్రాంతంలో ప్లాట్లు కేటాయించాలి.
స్థానిక ప్రజలచేత ఎన్నుకోబడి ప్రభుత్వంలో భాగస్వామి అయిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రజలకు న్యాయం చేయాలి. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు పొందుతున్న కలెక్టర్ కంపెనీ తరఫున వకాలత్ పుచ్చుకొని మాట్లాడడం మాని ప్రజల పక్షాన నిలబడాలి. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.
- ఎం.డి. జబ్బార్, సెల్: 9000623991