Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ల ప్రయోజనాలే పరమావధిగా ఉంది. ఆమె బడ్జెట్ ప్రవేశపెడుతూ ఇండియా ఏ75 నుంచి ఇండియా ఏ100 కోసం బ్లూప్రింట్ ఏర్పరిచామంటూ గొప్పగా చెప్పుకొచ్చారు. కేటాయింపుల్లో మాత్రం నిరాశనే మిగిల్చారు. కీలకమైన విద్యావైద్య రంగాలను పూర్తిగా విస్మరించారు. వ్యవసాయరంగంపై నిర్లక్ష్యాన్ని కొనసాగించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మూలధన వ్యయాలను రూ.7.5 లక్షల కోట్లుగా నిర్ణయించారు. వర్తమాన ఆర్థిక సంవత్సరపు వ్యయాలు రూ.5.54 లక్షల కోట్లతో పోల్చితే ఇది 35.4శాతం అధికం. జీడీపీలో 2.9శాతంతో సమానం. రాష్ట్రాలకు అందించే మూలధన సహాయాన్ని కూడా కలిపితే మొత్తం వాస్తవిక వ్యయం రూ.10.68 లక్షల కోట్లవుతుంది. మొత్తం రూ.39 లక్షల కోట్ల బడ్జెట్లో రూ.17 లక్షల కోట్లు లోటు చూపించారు. వీటిని సమీకరించడానికి అయితే పన్నుల మోత మోగించాలీ, లేదా ప్రభుత్వ రంగాన్ని అయిన కాడికి అమ్మేయాలనే కుట్ర తప్ప ఇది మరొకటి కాదు.
రెండేండ్లుగా కోవిడ్ కారణంగా నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) కింద పని కోసం క్రితం ఏడాది రూ.73,000 కోట్లు ఖర్చు పెట్టాలని కేటాయింపులు చేశారు. కానీ డిమాండ్ పెరగడంతో రూ.98 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అయిప్పటికీ, ఈసారీ ఈ పథకానికి గతేడాది మాదిరిగానే రూ.73వేల కోట్లే కేటాయించారు.
ఈ బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1,38,203.63 కోట్లు కేటాయించారు. గతేడాది ఈ రంగానికి ఖర్చు పెట్టిన మొత్తమే రూ.1,55,042.27 కోట్లుగా ఉంది. కాగా, ఈ ఏడాది కేటాయింపులే తగ్గడం శోచనీయం. ఇప్పటికే కరోనా కారణంగా దేశంలోని ఆరోగ్య సంరక్షణా సేవల రంగం తీవ్రంగా ప్రభావితమైంది. గత సంవత్సరం కేటాయించిన దానికన్నా కేంద్రం ఎక్కువ మొత్తాలను ఈ రంగంపై ఖర్చు పెట్టాల్సి ఉన్నా కేవలం రూ.86,200.65 కోట్లు కేటాయించారు. నారీశక్తి పేరుతో 2లక్షల అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తామని చెప్పినప్పటికీ, కేటాయింపుల కొచ్చేసరికి రూ.20,000 కోట్లకు పరిమితం చేశారు.
ప్రభుత్వ పంపిణీ వ్యవస్థతో కూడిన ఆహార సబ్సిడీల రంగానికి బడ్జెట్లో కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. గతేడాది ఆహార సబ్సిడీలపై ప్రభుత్వం రూ 2,99,354.6 కోట్లు ఖర్చు చేయగా, దానిని భారీగా తగ్గించి రూ. 2,07,291 కోట్లు కేటాయింపులు చేశారు.
ఈ ఏడాది మధ్యాహ్న భోజన పథకం లేదా పిఎం పోషణ్ పథకానికి రూ.10,234 కోట్ల కేటాయింపులు జరిగాయి. గతేడాది ప్రణాళికా వ్యయం కన్నా ఇది తక్కువే. పిల్లలకు మరింత మెరుగైన రీతిలో పోషకాహారం అందించడానికి తోడ్పడే ఈ పథకానికి తక్కువ కేటాయింపులు చేశారు. పిఎం కిసాన్‌కు కేటాయింపులు దాదాపు గతేడాది మాదిరిగానే ఈ సారీ ఉన్నాయి. సుదీర్ఘకాలం జరిగిన రైతు ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతాంగంపై, వ్యవసాయరంగంపై ప్రత్యేక శ్రద్ధపెడతారని ఆశించినా, ఎటువంటి నిర్దిష్ట చర్యలూ లేవు.
ఎరువులు, ఆహార, పెట్రో సబ్సిడీలు మూడింటికీ భారీ కోత పెట్టారు. ఎల్.పీ.జి సబ్సిడీలో గత ఏడాది 60శాతం కోత విధిస్తే, ఈ ఏడాది కూడా 60శాతం కోత విధించారు. మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీలు 39శాతం తగ్గి రూ.4,33,108 కోట్లకు పరిమితమవుతాయని చెబుతూనే కొత్త ఆర్థిక సంవత్సరంలో వాటికి మరో 27శాతం కుదించి నికరంగా రూ.3,17,866 కోట్లకే పరిమితం చేశారు.
సామాన్య, మధ్య తరగతి ప్రజానీకానికి యథాప్రకారం బడ్జెట్లో మొండి చేయి చూపించారు. ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచారు. దేశంలో 100మంది కుబేరుల చేతుల్లో 56లక్షల కోట్ల సంపద కేంద్రీకృతం అయ్యింది. వారిపై కేవలం 2శాతం సంపద పన్ను విధించడం ద్వారా ప్రభుత్వానికి రూ.11 లక్షల కోట్లు అదనంగా సమకూరుతాయని, వాటిని దేశంలో పడిపోయిన గిరాకీ పునరుద్ధరణ కోసం వాడాలని అనేకమంది ఆర్థిక వేత్తలు ప్రభుత్వానికి హితవు పలికారు. కానీ ప్రభుత్వం ఆవేమీ పట్టించుకోలేదు. కుబేరులపై ఎలాంటి అదనపు పన్ను వేయలేదు. ప్రజల కొనుగోలు శక్తి పెంచే చర్యలు ఈ బడ్జెట్లో ఏమీ లేవు.
సామాన్య మధ్య తరగతి పై ధరా భారం కొనసాగుతున్నా, ద్రవ్యోల్బణం నివారణకు ఎలాంటి నివారణా చర్యలు లేవు. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే పరిస్థితి ఉన్నా, దాని నుంచి సామాన్యులకు ఊరట నిచ్చే ఎలాంటి చర్యను బడ్జెట్లో ప్రతిపాదించలేదు. ధరల స్టీరీకరణ నిధి ప్రస్తావనే లేదు. అసంఘటిత రంగ కార్మికుల రక్షణకు, కోట్లాది మంది నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు నోటి మాటలు తప్ప, కేటాయింపులు లేవు. ఐదేండ్లలో 60 లక్షల ఉద్యోగాలు సృష్టించామని గొప్పగా చెప్పుకున్నప్పటికీ, నానాటికీ యువతలో పెరుగుతున్న నిరుద్యోగ శాతం ఆ వాదనలో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది.
ఈ బడ్జెట్లో రాష్ట్రాలకు మొండి చేయి చూపించారు. ఒకపక్క జనవరిలో రూ.1,41,000 కోట్లు జీఎస్టీ వసూళ్ళు పెరిగాయని ఆర్భాటంగా ప్రకటిస్తూ, రాష్ట్రాలకు మాత్రం చట్టబద్ధంగా రావలసిన నిధులను కేటాయించడం లేదు. విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తేనే, అదనంగా అప్పులు చేసుకోవడానికి అనుమతిస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం దేనికి సంకేతం?
ఎయిర్ ఇండియాను, నీలాంచల్ ఇస్పాట్ కంపెనీలను టాటా గ్రూప్‌లకు ధారాదత్తం చేశామని ఆనందంగా ప్రకటించిన ప్రభుత్వం, ప్రభుత్వ బీమా రంగంపై తన ముప్పేట దాడిని ఈ బడ్జెట్లో కూడా కొనసాగించింది. అతిత్వరలో ఎల్.ఐ.సి.లో ఐపీవో తీసుకురానున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. దేశానికి ఏటా రూ 4లక్షల కోట్ల మేరకు నిధులు అందించే ప్రభుత్వ బీమా పరిశ్రమకు బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం ఉపయోగకరంగా లేవు. ఎల్.ఐ.సి సంస్థకు, పాలసీ దారులకు భారంగా మారిన బీమా ప్రీమియం పైన అన్యాయంగా విధిస్తున్న 18శాతం జీఎస్టీని ఏమాత్రం తగ్గించలేదు. దేశ ప్రయోజనాలకు, ప్రభుత్వ బీమా రంగ ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగపడని బడ్జెట్ ఇది.
1991లో దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రారంభమైన సంస్కరణలు ఇవాళ ఒక కీలక మలుపు తీసుకుంటున్నాయి. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రూ.9,961 కోట్ల మేరకు ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. కేవలం మైనారిటీ వాటాలనే ఉపసంహరించడాన్ని పీవీ అనుమతించారు. వాజపేయి హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ ఒక వెల్లువలా సాగింది. పెట్టుబడుల ఉపసంహరణకు అరుణ్ శౌరీ నేతృత్వంలో ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసి, విదేశీ సంచార్ నిగమ్, మారుతి సుజుకి, ఓఎన్జీసీ, బాల్కో, హిందుస్తాన్ జింక్ మొదలైన కంపెనీలలో భారీ ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణకు ఆయన ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వ రంగంలోని హౌటళ్లను పూర్తిగా అమ్మి వేశారు. వాజపేయి హయాంలో రూ.33,655 కోట్ల మేరకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. వామపక్షాలు అడ్డుకోవడం వల్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం వేగవంతం కాలేదు.
ప్రభుత్వ రంగ సంస్థలు పుట్టిందే చావడానికన్నట్లు, నరేంద్ర మోడీ ప్రభుత్వం వాటి పీక నిములే చర్యలు తీసుకుంటోంది. మోడీ తొలి ప్రభుత్వ కాలంలోనే రూ.2లక్షల కోట్లకుపైగా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రితం ఏడాది బడ్జెట్లో మోడీ ప్రభుత్వం జాతీయ హైవే అథారిటీ, రైల్వే, చమురు, సహజవాయు సంస్థల ఆస్తులను అమ్మి రు.1.75లక్షల కోట్లను సేకరిస్తామని ప్రకటించినా, చివరికి రూ.78,000 కోట్లు సమీకరించగలిగారు. అణు ఇంధనం, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఖనిజవనరులు, బ్యాంకింగ్, మైనింగ్, ఆర్థిక సర్వీసుల్లో ప్రభుత్వం నామమాత్రంగా కొనసాగనుంది. ఈ ఏడాది కూడా రూ.65,000 కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏతా, వాతా బడ్జెట్లో ఆసాంతం డిజిటలైజేషన్, ఫైనాన్షియలైజేషన్, కార్పొరైటైజేషన్ అనే ప్రధాన మంత్రి మాటలే తప్ప మరేవీ లేవు.
- పి. సతీష్
సెల్:9441797900