Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వట్టికోట ఆళ్వారుస్వామి... అతడొక ధిక్కారస్వరం... కమ్యూనిస్టు నేత, ప్రచురణకర్త, పాత్రికేయుడు, ప్రజాసాహిత్యానికి ప్రాణం పోసిన మేధావి. 'ప్రజలమనిషి' నవల ద్వారా ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసిన రచయిత. కమ్యూనిస్టుగానే కాదు, గ్రంథాలయోద్యమకారుడిగానూ విశిష్టమైన పాత్ర పోషించారు. ఒక సందర్భంలో ''అసలు ఆళ్వార్లు పన్నెండు మందే, పదమూడో ఆళ్వారు మా వట్టికోట ఆళ్వారు స్వామి'' అని మహాకవి దాశరథి కీర్తించిన స్వాతంత్య్ర సమరయోధుడతడు. నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండలం (నకిరేకల్ సమీపంలోని) మాధవరం గ్రామంలో 1915 నవంబర్ ఒకటిన, ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం లో వట్టికోట ఆళ్వారుస్వామి జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా, పరాయి ఇండ్లలో వంటలు చేసిపెట్టి, పనులు చేసి బతికాడు. అందువల్ల ప్రాథమిక దశలో కూడా విద్యాభ్యాసానికి ఆయన నోచుకోలేదు. నిజాం నియంత పాలనను, గ్రామాల్లో భూస్వాముల ఆగడాలను చూస్తూ పెరిగాడు. పదమూడు, పద్నాలుగేండ్ల వయసులో సూర్యాపేటలో గ్రంథాలయంతో ఆయనకు పరిచయం మొదలైంది. ఈ గ్రంథాలయంలోనే అనేక పుస్తకాలు చదువుకున్నాడు. సొంతంగా తెలుగు మాత్రమే గాక ఇంగ్లీషు కూడా నేర్చుకున్నాడు. ఒకవైపు ఇండ్లలో వంటపనులు, విజయవాడలో హౌటల్ సర్వర్ వృత్తి, హైదరాబాద్‌లో రీడర్ పని వంటి అనేక జీవన ప్రయాణాలు చేస్తూనే కమ్యూనిస్టుగా పరిణితి చెందాడు. చివరికి, 1936-37 ప్రాంతంలో హైదరాబాద్ చేరి గోల్కొండ పత్రికలో ప్రూఫ్‌రీడర్ ఉద్యోగంలో చేరాడు. ఏ ఉద్యోగమూ ఆయనకు సంతృప్తినివ్వలేదు. బాల్యం నుండి ఆయన చూసిన జీవితం, చదివిన సాహిత్యం అతడిని పోరాట మార్గం పట్టించాయి. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయినా ఆయన వెరవలేదు. జైలు జీవితం నుంచి బయటికొచ్చాక కూడా అనేక ఉద్యమాల్లో పనిచేశారు. స్టేట్ కాంగ్రెస్, ఆర్యస మాజం మొదలు ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ, అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం వంటి సామాజిక, రాజకీయ, సాహిత్య సంస్థలెన్నింటిలోనో ఆయన కార్యకర్తగా, నాయకుడిగా పనిచేశాడు. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, గుమస్తాల సంఘం, రిక్షా కార్మికుల సంఘం, రైల్వే ఉద్యోగుల ఆందోళన వంటి కార్మికోద్యమ సంస్థలకు ముందుండి నాయకత్వం వహించాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ తర్వాత రచనా వ్యాసంగం పైనే దృష్టిపెట్టినా 1959లో కేరళలో నంబూద్రిపాద్ మంత్రివర్గాన్ని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయగానే, అందుకు నిరసనగా మళ్లీ కమ్యూనిస్టుగా క్రియాశీలకుడయ్యాడు. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడటానికి ముందటి తెలంగాణ గ్రామీణ ప్రజల జీవన పోరాటాన్ని చిత్రస్తూ ఆయన రాసిన 'ప్రజల మనిషి' నవల తెలుగు సాహిత్యంలో ప్రతిష్టాత్మకమైనది. ఆళ్వారుస్వామి మొదట్లో రచించిన కథల కన్నా 'జైలు లోపల' ఉండి రాసిన కథలు భాష, శైలి, కథనంలో ముఖ్య మయినవి.. ఆయన రచనలో చేసిన సాధన, కథన శిల్పంలోని ప్రస్థానం తెలుగు సాహిత్యానికి గౌరవాన్ని తెచ్చి పెట్టాయి. తెలంగాణ మాండలికంలో సహజ సుందరమైన శైలిలో వాస్తవిక జీవితాలకు కథారూపమిచ్చిన సజీవ శిల్పాలుగా వట్టికోట ఆళ్వారుస్వామి రచనలు చరిత్రలో నిలిచిపోతాయి. కథకునిగా, నవలాకారునిగా, ప్రజా ఉద్యమకారుకునిగా ఆళ్వారుస్వామి జీవితకాలమంతా చేసిన కృషి అజరామరం, ఆదర్శప్రాయం. తెలంగాణ సాయుధ పోరాటకాలంలో ఆరు సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించిన రచయిత ఆళ్వారుస్వామి. అందువల్లనే ఒకవైపు పోరాట యోధుడిగా మరోవైపు ప్రజా రచయితగా ఆయన జీవితం ఈనాటి సాహిత్యకారులకు స్ఫూర్తిదాయకం. నమ్మిన విలువల కోసం జీవిత కాలం నిలిచిన ఆ మహనీయుడు 1961 ఫిబ్రవరి 5న మరణించాడు. ఆ విలువలను కొనసాగించడమే మనం ఆయనకు ఇవ్వగలిగిన నిజమైన నివాళి.
(నేడు వర్థంతి సందర్భంగా)
- కె. సతీష్‌రెడ్డి
సెల్:9848445134.