Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదర పోషణార్ధం బహుకత వేషాలు అన్నట్లుగా అధికారం కోసం పార్టీలు, నేతలు ఎన్ని మాటలు చెబుతున్నారో కదా! అవినీతి, అక్రమాలను అంతం చేసేందుకు కృష్ణుడే నరేంద్ర మోడీ అవతారంలో జన్మించారని ఉత్తర ప్రదేశ్ బీజేపీ మంత్రి ఒకరు చెప్పారు. తనకు కృష్ణుడు ప్రతిరోజూ కలలోకి వచ్చి ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ పోరు పెడుతున్నట్లు సమాజ్‌వాది నేత అఖిలేష్ యాదవ్ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఆవు పేడ కొనుగోలు చేస్తామని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ రైతులకు వాగ్దానం చేసింది. ఆవు రాజకీయంలో ఇదో కొత్త కోణం. తమ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్‌ఘడ్‌లో ఇప్పటికే ఈ పథకాన్ని అమలు జరుపుతున్నామని, తమను ఎన్నుకుంటే ఉత్తర ప్రదేశ్‌లో కూడా అమలు చేస్తామని చెప్పింది. ఎన్నికలు భలే వినోదాన్ని కలిగిస్తాయి కదా!
కాంగ్రెస్ అవినీతిని అంతమొందిం చేందుకు, ఆ పార్టీ నాశనం చేసిన సంస్కృతి పరిరక్షణకు కృష్ణుడు నరేంద్ర మోడీ అవతారమెత్తి జన్మించినట్టు ఉత్తరప్రదేశ్ వ్యవసాయ మంత్రి కమల్ పటేల్ చెప్పారు. భారత్‌కు ముప్పు తలెత్తినపుడల్లా భగవంతుడు ఏదో ఒక అవతారమెత్తుతున్నాడని, ఇప్పుడు మోడీ రూపంలో ఉన్నాడని చెప్పారు. మధుర నియోజకవర్గం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను పోటీకి నిలపాలని ఎందుకంటే కృష్ణుడు కలలోకి వచ్చి మధుర నుంచి పోటీ చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి విజయం సాధిస్తారని చెప్పారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు హరనాథ్ సింగ్ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాశారు. అయితే కృష్ణుడి జన్మస్ధలంగా చెప్పుకొనే మధుర, రాముడి జన్మకేంద్రంగా చెప్పే అయోధ్యను కాదని గోరఖ్‌పూర్ నుంచి యోగి పోటీ చేస్తున్నారు. మరి కృష్ణుడు, రాముడికి కోపం వస్తుందా రాదా అన్నది చూడాల్సి ఉంది! హరనాథ్ సింగ్ లేఖ వార్తలను చూసిన తరువాత సమాజ్‌వాది నేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ కృష్ణుడు తనకు ప్రతి రోజూ కలలోకి వస్తూ సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తనకు చెబుతున్నారని ప్రకటించారు.
గోబర్ ధన్ న్యాయ యోజన పథకం కింద కిలో రూ.1.50 వంతున ఆవు పేడ కొని సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు అందచేస్తామని గతేడాది జులైలో చత్తీస్ఘడ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆచరణ సాధ్యం కాదని ప్రతిపక్ష బీజేపీ అప్పుడు విమర్శించింది. అదే పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తమ ప్రభుత్వం ఆవుపేడను సేకరించి ఎరువులు, ఇతర ఉత్పత్తుల తయారీ తలపెట్టినట్లు గతేడాది నవంబరులో ప్రకటించారు. అంతేకాదు. పశువులకు సుస్తీ చేసినపుడు 109 నంబరుకు ఫోన్ చేస్తే వైద్యులు ఇంటికి వచ్చి చికిత్స చేస్తారని కూడా ప్రకటించారు. పశువుల పేడతో ఎరువును రైతులు తయారు చేసుకోవటం కొత్తేమీ కాదు. ఆవు పేరు జోడించటమే గమనించాల్సిన అంశం. ఆవు, ఎద్దు, దున్న, గేదె-బర్రెలకు పెట్టే మేత అంతా ఒకటే, అవి వేసే పేడ కూడా సేమ్ టు సేమ్. పాలివ్వటం ఆగిపోయిన ఆవులను రైతులు వదలివేస్తున్నారని, అవి వేసే పేడను ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకోవాలని చత్తీస్ఘడ్ సీఎం భూపేష్ భాగెల్ చెప్పారు. వాటికి పెట్టే మేత, నిర్వహణ ఖర్చుకు తగ్గ ఆదాయం పేడ అమ్మకం ద్వారా వస్తుందా అన్నదే సమస్య. రాష్ట్రంలో రైతులెవరూ పేడ అమ్మరని బీజేపీ మాజీ మంత్రి అజయ చక్రధర్ అన్నారు. డిసెంబరు నాటికి రెండు లక్షల మంది రైతుల నుంచి 59లక్షల క్వింటాళ్ల (రూ.114 కోట్ల ) ఆవు పేడను కొనుగోలు చేసినట్లు, పది లక్షల క్వింటాళ్ల వర్మీ కంపోస్టు తయారు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
గతంలో అధికారంలో ఉన్న సమాజవాది నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ కుటుంబ పాలన కేంద్రాలుగా మారినట్లు బీజేపీ ధ్వజమెత్తింది. ఇప్పుడు అలాంటి ఆరోపణలు-విమర్శలకు గురైన కుటుంబ సభ్యులను బీజేపీ చేరదీసింది. ములాయం సింగ్ కోడలైన అపర్ణా యాదవ్, బావమరిది, మాజీ ఎంఎల్ఏ ప్రమోద్ గుప్తాను పార్టీలో చేర్చుకుంది. దీంతో తనకు కుటుంబ భారాన్ని బీజేపీ తగ్గించిందని అఖిలేష్ యాదవ్ చమత్కరించారు. అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన కొద్ది రోజుల తరువాత శుక్రవారం నాడు ములాయం సింగ్ యాదవ్‌ను కలసి ఆశీస్సులు అందుకున్నట్లు తెలుపుతూ కలసినప్పటి ఫొటో అంటూ ఒక చిత్రాన్ని ట్విటర్ ద్వారా విడుదల చేశారు. ములాయం సింగ్ కోడళ్లు ఇద్దరూ ఠాకూర్ సామాజిక తరగతికి చెందిన వారు తప్ప యాదవులు కాదు. అందువలన అపర్ణ బీజేపీలో చేరినంత మాత్రాన ఆ పార్టీకి కలిగే లాభమూ సమాజ్‌వాదికి వచ్చే నష్టమూ ఏమీ ఉండదని చెబుతున్నారు. ములాయం రాజకీయ వారసుడిగా తన కుమారుడిని ప్రకటించాలని రెండో భార్య సాధన చేసిన ఒత్తిడి ఫలించలేదు. ములాయం సోదరుడు శివపాల్ తిరుగుబాటు చేసి వేరే పార్టీని పెట్టినా ఫలితం లేకపోవటంతో ఇప్పుడు అఖిలేష్‌తో రాజీకి వచ్చినట్లు వార్తలు.
కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు మరొకరి ముఖం ఎక్కడైనా కనిపిస్తోందా? ప్రతి చోటా మీకు నా ముఖమే కనిపిస్తోందని ప్రియాంక గాంధీ స్పందించారు. తన సోదరుడు రాహుల్ గాంధీతో కలసి యువజన ప్రణాళికను విడుదల చేసిన సందర్భంగా విలేకర్లతో ఆమె మాట్లాడారు. తాను పోటీ చేసేది లేనిదీ ఇంకా నిర్ణయించలేదన్నారు మరి!
- ఎం.కోటేశ్వరరావు
సెల్: 8331013288