Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ జనతా పార్టీనీ, మోడీ ప్రభుత్వాన్నీ నిత్యం ఒక సమస్య వేధిస్తుంది. భారత స్వాతంత్య్రోద్యమ పోరాటంలో వారికి ఏ పాత్రా లేదు. బ్రిటిష్ వారికి దాసోహం అన్న వారే తప్ప, వ్యతిరేకంగా పోరాడిన నాయకులెవరూ వారికి లేరు. అందుకే వారు, ఇతర పార్టీలకు చెందిన ఏ స్థాయిలోని నాయకులనైనా తమ ప్రయోజనాల కోసం స్వంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఐక్యతా విగ్రహం పేరుతో సర్దార్ వల్లభారు పటేల్ కోసం, తరువాత 125వ జయంతి సందర్భంగా డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోసం ప్రయత్నించారు. ఇప్పుడేమో అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంతైంది. ఎందుకంటే గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్రబోస్, మౌలానా ఆజాద్, బాద్షాఖాన్ లాంటి సేవలందించిన భారత జాతీయ కాంగ్రెస్ నాయకులకు సరితూగే నాయకులెవరూ బీజేపీ, ఆరెస్సెస్‌లకు లేరు. అందుకే ఈ కుతంత్రాలు.
బీజేపీ, ఆరెస్సెస్‌లు వ్యూహాత్మకంగా కొందరు సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ నాయకులను పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. సామ్రాజ్యవాద వ్యతిరేకత, ప్రజాస్వామ్య, లౌకిక విలువల కోసం నిలబడినందుకు వారి పట్ల గౌరవం, ప్రేమతో చేసే పొగడ్తలు కాదు అవి. కేవలం సంకుచిత రాజకీయ లక్ష్యాల కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ, ప్రధానమంత్రి మోడీలు తమను తాము నేతాజీకి నిజమైన అభిమానులుగా ప్రచారం చేసుకుంటున్నారు. తామే నేతాజీకి నిజమైన వారసులుగా భ్రమింప చేసేందుకు అవస్థలు పడుతున్నారు. ఇందులో భాగంగానే నేతాజీ 125వ జయంతి సందర్భంగా కొన్ని కార్యక్రమాల నిర్వహణకు ఒక కమిటీని నియమిస్తామని ప్రధానమంత్రి జనవరి 23, 2021న ఒక ప్రకటన చేశారు. (ఆ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు.) బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో నేతాజీ వారసత్వం నుండి ప్రయోజనం పొందడానికి ఆయన బంధువును బీజేపీలో చేర్చుకొన్నారు. కానీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందడంతో జయంతి వేడుకలు, కమిటీ అన్నీ బుట్ట దాఖలు అయ్యాయి.
ఇప్పుడేమో నేతాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జీవితాంతం హిందూత్వకు వ్యతిరేకంగా నిలబడిన వాస్తవాన్ని చెరిపి వేస్తున్నారు. ఇతర జాతీయోద్యమ నాయకులను నేతాజీతో పోలుస్తూ వారిని అపకీర్తిపాలు చేస్తున్నారు. భారత స్వాతంత్య్ర పోరాటానికి నేతాజీ అందించిన సేవలను నెహ్రూ చాలా హీనంగా చూశాడని, నెహ్రూపై దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి నేతాజీ గాంధీజీతో విభేదించినప్పటికీ, ఏనాడూ గాంధీ, నెహ్రూ, కాంగ్రెస్ పార్టీలను అపకీర్తిపాలు చేయకపోగా, ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ)కి చెందిన పటాలాలకు, గాంధీ, నెహ్రూ, ఆజాద్, రాణీ లక్ష్మీబాయి అనే పేర్లు పెట్టారు. కాంగ్రెస్ పార్టీని వీడినప్పటికీ, నేతాజీ ఆ జాతీయోద్యమ నాయకత్వంపై ఉన్న గౌరవంతో వారి పేర్లు పెట్టారు. ఏ ఒక్క పటాలానికి సావర్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, లేక ఇతర ఆరెస్సెస్ సిద్ధాంతకర్తల పేర్లు పెట్టలేదు. పెట్టడానికి వారికి ఆ స్థాయి ఉండొద్దూ..!
నేతాజీ కాంగ్రెస్ పార్టీలోని వామపక్ష భావజాల వర్గానికి చెందిన వ్యక్తిగానే గుర్తింపు పొందాడు. ఆయన బోల్షెవిక్ విప్లవాన్ని చాలా ఉన్నతమైనదిగా భావించి, భారతదేశ భవిష్యత్తు కూడా అలాంటి విప్లవంతో ముడిపడి ఉంటుందని భావించాడు. ''కార్ల్ మార్క్స్, లెనిన్‌ల రచనలు, కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ భారత జాతీయోద్యమ పోరాటానికి పూర్తి మద్దతు ఇవ్వడం, దాని ప్రాపంచిక దృష్టిలో ఒక అంతర్భాగంగా గుర్తించడంతో నేను చాలా సంతృప్తి చెందానని'' నేతాజీ తన రచన ''ద ఇండియన్ స్ట్రగుల్''లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఆరెస్సెస్, బీజేపీలు, భారత రాజ్యాంగంలోని పీఠికలో పొందుపరిచిన 'సోషలిజం' అనే పదాన్నే భరించలేక బహిరంగంగా విమర్శిస్తున్నాయి. ఆ లెక్కన నేతాజీ కూడా సోషలిస్టు విధానాలను సమర్థించాడు కాబట్టి, నేతాజీని కూడా వారు విమర్శించాలి. కానీ వారు అలాంటి సాహసానికి పూనుకోరు. దానికి బదులుగా, భారతదేశ ప్రజల దృష్టిలో తప్పుడు ఆలోచనలను కలిగించేందుకు... నేతాజీని గాంధీ, నెహ్రూలను వ్యతిరేకించే వ్యక్తిగా, తమకు అనుకూలమైన నేతగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
ముస్లింలు సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని, వారికి 60శాతం సీట్లు కేటాయించిన దేశబంధు చిత్తరంజన్‌దాస్ నుండి రాజకీయ పాఠాలు నేర్చుకున్న నేతాజీ ఒక లౌకిక జాతీయవాది. ''భారతదేశం ఒక గొప్ప దేశంగా అవతరించే విధంగా మనం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక సమాజ పునాదులపై నిర్మించాలి. పుట్టుక, కులం, జాతి ఆధారంగా ప్రాధాన్యతలు ఉండకూడదు. కులం, జాతి, మతాలతో నిమిత్తం లేకుండా అందరికీ సమానావకాశాలు కల్పించాలి'' అని ఆయన అన్నారు. ''మత మూఢత్వం సాంస్కృతిక అభివృద్ధికి ఆటంకం, దానికి లౌకిక, శాస్త్రీయ విద్యే పరిష్కారమని'' ఆయన భావించాడు.
నేటి రాజకీయ నాయకులు, తాము హిందూ మత సంరక్షకులమని రుజువు చేసుకునేందుకు దేవాలయాలు సందర్శించే పనిలో మునిగి పోతున్నారు. కానీ నేతాజీ రాజకీయాలకు, మతానికి మధ్య ఒక ఖచ్చితమైన రేఖ ఉండాలని భావించాడు. ఈ సందర్భంగా, నేతాజీ సహచర దేశభక్తుడైన అబిద్ హాసన్, నేతాజీ అయిష్టంగా ఒక చెట్టియార్ దేవాలయంలోకి ప్రవేశించిన సందర్భాన్ని గుర్తు చేశారు. దేవాలయంలో నేతాజీతో పాటు ఆయన వెంట ఉన్న వారికి గంధం బొట్టు పెడతారు. బయటికి వచ్చిన వెంటనే అందరూ వాటిని తుడిచి వేస్తారు. అన్ని కుల, మతాలకు చెందిన వారికి ప్రవేశం ఉండే ఒక జాతీయ సమావేశానికి ఆలయ అధికారులు అంగీకరించారనే ఉద్దేశ్యంతోనే ఆలయంలోకి వెళ్ళాలని నేతాజీ నిర్ణయిం చినటు చెప్పారు.
భారత స్వాతంత్య్రోద్యమ పోరాట కాలంలో నేతాజీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని నెహ్రూను కోరిన మీదట 1937లో ప్లానింగ్ కమిటీని రూపొందించారు. స్వాతంత్య్ర భారతదేశంలో అదే ప్లానింగ్ కమిషన్‌గా మారింది. మోడీ ప్రధానిగా ఎన్నికైన తరువాత జరిగిన మొదటి రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి దాని స్థానంలో నిటి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యం అంటే సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం అని అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్‌లో నొక్కి వక్కాణించాడు. నేతాజీ, నెహ్రూ, అంబేద్కర్లు కమ్యూనిస్టులు కానప్పటికీ తాము సోవియట్ యూనియన్‌లోని సోషలిస్టు సమాజం నుంచి ప్రేరణ పొందామని వారే స్పష్టం చేశారు. భారతదేశంలో పారిశ్రామిక, వ్యవసాయ పునరుజ్జీవనానికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాల పునః పంపిణీకి ప్రభుత్వ రంగం, ప్రణాళికలు చాలా అవసరమని సుభాష్ చంద్రబోస్ భావించాడు.
కానీ, సోషలిజం వలె లౌకికవాదం కూడా ఆరెస్సెస్, బీజేపీలకు మింగుడు పడదు. మరి నేతాజీ వాటిని గాఢంగా విశ్వసించే సమర్థకుడు. లౌకిక తత్వం పట్ల ఉన్న విశ్వాసానికిగాను నేతాజీని బహిరంగంగా విమర్శించే ధైర్యాన్ని ఆరెస్సెస్, బీజేపీలు ప్రదర్శిస్తాయా? తన 'ద ఇండియన్ స్ట్రగుల్' రచనలో, హిందూ మహాసభ, ముస్లిం లీగ్‌లు రెండూ ఒకే రాజకీయ పునాదిపై ఆధారపడిన సంస్థలుగా నేతాజీ పేర్కొన్నారు. జిన్నా, ముస్లింలకు ప్రత్యేకంగా దేశం ఏర్పాటు చేయాలనే తన కలను నిజం చేయడం గురించే ఆలోచించాడు తప్ప, భారతదేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేసే విషయం గురించి ఆలోచించలేదు. సావర్కర్ అంతర్జాతీయ పరిస్థితిని గురించి పట్టించుకోకుండా, మెజారిటీ హిందువులను బ్రిటిష్ సైన్యంలోకి ఎలా పంపించాలనే విషయం గురించే ఆలోచించాడు. బ్రిటిష్ వారిని మన దేశం నుంచి బయటకు పంపేందుకు సింగపూర్‌లో ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) నాయకత్వ బాధ్యతలలో నేతాజీ సైన్యాన్ని సమకూర్చుకునే పనిలో ఉంటే, సావర్కర్, ఆరెస్సెస్‌లు బ్రిటిష్ వారితో చేతులు కలిపారు. హిందూ మహాసభ అధ్యక్షునిగా సావర్కర్, దేశంలోని హిందువులంతా లక్షలాదిగా సంఘటిత హిందూ హృదయాలతో బ్రిటిష్ సైన్యంలో, నావికా దళంలో, వైమానిక దళంలో చేరాలని పిలుపునిచ్చాడు. కేవలం ఒక్క సంవత్సర కాలంలోనే హిందూ మహాసభ కృషి ఫలితంగా లక్షమంది హిందువులు బ్రిటిష్ సాయుధ సైన్యంలో చేరారు.
ఢిల్లీలో ఒకప్పుడు ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన జార్జ్ (ఐదవ) విగ్రహం స్థానంలో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇటీవల ప్రధాని ఒక ప్రకటన చేశారు. కానీ ఆ విగ్రహం ప్రధానమంత్రి, బీజేపీల దేశభక్తిని ధృవీకరించదు. భారతదేశ ఐక్యతకు, దేశ ప్రగతికి లౌకికతత్వం అవసరమని నేతాజీ చెప్పిన వాస్తవాన్ని దాచిపెట్టేందుకు ఆయన విగ్రహం బీజేపీ, మోడీలకు ఏ మాత్రం సహాయపడదు. దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణ త్యాగాలకు సిద్ధపడిన అనేక మంది ఐఎన్ఏ అధికారులు ముస్లింలనే నిజాన్ని కూడా ఆ విగ్రహం దాచిపెట్టదు. ఇండియన్ నేషనల్ ఆర్మీ టోపీ ధరించగానే మోడీ ఐఎన్ఏ సైనికునిగా మారిపోలేడు. నేతాజీ విగ్రహ ప్రతిష్టాపన, బీజేపీని జాతీయోద్యమానికి వారసురాలిగా మార్చలేదు. వీరు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయవచ్చు, కానీ ఆ విగ్రహ పాద పీఠంపై ఐఎన్ఏ నినాదమైన ''విశ్వాసం, ఐక్యత, త్యాగాలను'' మాత్రం లిఖించలేరు.
- బోడపట్ల రవీందర్
సెల్:9848412451