Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దునలేస్తే అధ్వాత్మిక ప్రవచనాలు చెప్పే ప్రవచన కర్త, మాజీ ఉపాధ్యాయులు గరికపాటి నరసింహరావుగారు... అప్పుడప్పుడు సమాజానికి అన్యాయం చేస్తున్న దుష్టశక్తులపై తన కొరడాను ఝలిపిస్తుంటాడు. 'గంగిగోవుపాలు గరిటెడైనను చాలు... కడివెడైననేమీ ఖరముపాలు' అన్నట్టు తన పదునైన మాటలతో దుష్టులు, దుర్మార్గులను చీల్చిచెండాడుతాడు. తాజాగా 'పుష్ప' సినిమా సమాజంపై చూపిస్తున్న ప్రతికూల ప్రభావంపై తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు. పవర్ఫుల్ డైలాగులు వదిలి సినీరంగాన్ని అబ్బురపరిచారు. ఆ చిత్రంలో ఎర్రచందనం స్మగ్లర్ను హీరోగా ఎలా చూపిస్తారో దర్శకుడు, హీరో తనకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ఏది సంచలనం చేయాలో, అది చేయకుండా దుర్మార్గుల హీరోయిజాన్ని చూపించి సమాజాన్ని చెడగొడుతున్నారంటూ ఏకిపారేసారు. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా! ఇదెక్కడి హితం. ఇంకా రెండు, మూడు భాగాలు తీసి సమాజాన్ని చెడగొడతారా? అంటూ చెంపచెల్లుమనిపించారు. మంచి ఆలోచనలతోనే జ్ఞానం సిద్ధిస్తుంది. కానీ తీర్థయాత్రలు చేస్తేనో, నదుల్లో మునిగితేనో జ్ఞానం రాదు. నదుల్లో నూనె, నెయ్యి, తేనే, ఆకులు, పువ్వుల వంటి దరిద్రాన్ని కలిపి కలుషితం చేస్తున్నారంటూ తన బాణాన్ని భక్తులపై ఎక్కుపెట్టారు. నదులు పాడైపోతున్నాయంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ''ఆ ద్రవ్యాలు అమ్మేవాళ్లు బాగుపడుతున్నారు తప్ప ఏమీ లేదు. తలస్నానం చేసి, శుభ్రంగా తయారై.. వందల ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాత ఇంటికెళ్లి పేకాడితే ఏంటీ లాభం..? మందు తాగి సంసారాన్ని ఆగం చేసుకుంటే ఎవరికి నష్టం'' అంటూ భక్తాగ్రేసరులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మిమ్ములను కమ్యూనిస్టు అంటున్నారంటూ ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకూ ఆయన దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. సమాజ బాగు కోరేవాడు కమ్యూనిస్టు అయితే తప్పేంటి? అంటూ సుత్తి లేకుండా సూటిగా చెప్పడంతో ఆ యాంకర్ కండ్లు తేలేశాడు.
- గుడిగ రఘు