Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య కేంద్ర బడ్జెట్ సందర్భంగా గులాబీ దళపతి... తెలుగు భాషకు, దాని పద సంపదకు సరికొత్త భాష్యం చెప్పారు. బడ్జెట్, అందులోని కేటాయింపులను తనదైన శైలిలో తూర్పారబట్టారు. అంకెలు, సంఖ్యలు, గణాంకాలతో సహా వివరిస్తూ బీజేపీ విధానాలను నిశితంగా విమర్శించారు. ఈ క్రమంలో దరిద్రులు, దమాక్ లేనోళ్లు, మెంటల్ గాళ్లు, కుక్క గాళ్లు, నక్కగాళ్లు... ఇలా 'అద్భుత పదాలతో...' కదం తొక్కారు. మన దళపతి దెబ్బకు ఆయన వార్తను కవర్ చేస్తున్న జర్నలిస్టులు అవాక్కవగా... టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. అలా ఆ జాతిరత్నం, ఆణిముత్యాలను అలకోవగా వదులుతూ మరో కొత్త 'అజెండా...'ను సెట్ చేశారు. బడ్జెట్‌పై మాట్లాడే క్రమంలో దాంతో ఎలాంటి సంబంధమూలేని రాజ్యాంగం గురించి ప్రస్తావించి... ఔరా, అసాధ్యుడా... అనిపించుకున్నారు. 'ప్రస్తుత రాజ్యాంగాన్ని అమలు చేయటంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయి. అందువల్ల దాన్ని కచ్చితంగా మార్చాల్సిందే...' అంటూ దివ్య ప్రవచనాన్ని ప్రబోధించారు. ఓ సినిమాలో హాస్య నటుడు బ్రహ్మానందం... 'నువ్వెత్తుకున్న రాగమేంటి..? వేస్తున్న తాళమేంటి...? అన్నట్టు, బడ్జెట్‌పై మాట్లాడేటప్పుడు ఈ పెద్ద మనిషికి రాజ్యాంగం ప్రస్తావన ఎందుకొచ్చిందబ్బా..? అని సగటు పౌరుడు తల గోక్కుంటున్నాడు. ఇంతకీ టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టు... 'కారు సారు, సీరియస్‌గా మాట్లాడే క్రమంలో ఫ్లోలో అలా అనేశారా..? లేక రాజ్యాంగాన్ని మార్చేందుకు వాజ్‌పారు హయాం నుంచి పావులు కదుపుతున్న కమలనాథుల బాధ్యతను భుజానికెత్తుకున్నారా...?' లేకపోతే 'కేంద్ర బడ్జెట్లోని లోపాలు, లొసుగులపై ఎవరూ మాట్లాడకుండా ఉండేందుకు, బడ్జెట్‌పై చర్చను పక్కదోవ పట్టించేందుకే అలా ఉపన్యాసం దంచికొట్టారా...? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇంకో విషయం.. రాజ్యాంగాన్ని అమలు చేయటంలో విఫలమైతే కాంగ్రెస్, బీజేపీని అధికారం నుంచి మార్చాలి తప్పితే, అసలు రాజ్యాంగాన్నే మార్చాలని కోరటమేంటనే డౌటనుమానం మీకు రావచ్చు. కానీ మీ అనుమానాన్ని అలా లోపలే దాచుకోండి. ఎందుకంటే మేధావులందరూ దీనికి సమాధానం వెతికే పనిలోనే ఉన్నారు.
-బి.వి.యన్.పద్మరాజు