Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముచ్చింతల్ వెళ్ళే బస్సు వచ్చింది. ఒక గురువు, ఆయన శిష్యుడు ఆ బస్సులో ఎక్కారు. శిష్యుడు కొత్తగా ఆ గురువు దగ్గర చేరాడు. అతడికి అనేక అనుమానాలు వస్తున్నాయి! వాటిని తీర్చుకునేందుకు గురువును అనేక ప్రశ్నలు అడగాలని తాపత్రయ పడుతున్నాడు. గురువు కూడా తన వీలును బట్టి వాటిని తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరూ సమతా మూర్తి దర్శనానికి బయలుదేరారు.
''స్వామీ! ముచ్చింతల్‌కు మన ప్రధాని మోడీ కూడా వస్తున్నారా?'' అడిగాడు శిష్యుడు
''అవును నాయానా!'' బదులిచ్చాడు గురువు.
''స్వామీ! రామానుజుల వారిని సమతామూర్తి అని ఎందుకు పిలుస్తున్నారు?'' శిష్యుడి ప్రశ్న.
''మనుషులంతా సమానంగా చూడవలసిన వారు! భగవంతుడి ముందు తేడాలేమీ లేవు! అని రామానుజులవారు ప్రవచించారు. అందుకే ఆయనను సమతా మూర్తి అని సంభోదిస్తున్నారు!'' గురువు జవాబు.
''సమత, సమానం అంటే ఏమిటి స్వామీ?'' శిష్యుడి ప్రశ్న.
శిష్యుడి వంక గర్వంగా చూశాడు గురువు.
''నాకు తగిన శిష్యుడివి అనిపించుకుంటున్నావు నాయనా! మంచి ప్రశ్న వేశావు! విను చెబుతాను! పేదా, గొప్పా, స్త్రీ, పురుషులు, కుల మత బేధం లేకుండా దేవుడి ముందు అందరూ సమానమే. ఎవరి పట్ల దేవుడికి వివక్ష లేదు! ఈ సిద్ధాంతమే సమతా సిద్ధాంతం! ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడి ముందు అందరూ సమానమే!'' అన్నాడు గురువు.
శిష్యుడికి గురువు సమాధానం సంతృప్తి ఇవ్వలేదు. పైగా ఈ సిద్ధాంతం ఎక్కడో విన్నట్లనిపించింది. ఆ మాట చెపితే ఇంకో గురువు వద్ద శిష్యరికం చేసి, నా వద్దకు వచ్చావా, అని ఈ గురువు ఆగ్రహించుతాడేమోనని భయం! అయినా ఉండబట్టలేక అడిగేశాడు.
''నీవు అడిగింది నిజమే! రామానుజుడు అంతా దేవుని ముందు సమానమేనని చెప్పటంతో సరిపెట్టుకోలేదు. తాను నేర్చుకున్న అష్టాక్షరీ మంత్రాన్ని, దాని విశిష్టతను అందరికీ, గుడి గోపురం ఎక్కి మరీ చెప్పాడు. దానివల్ల తనకు నరక ప్రాప్తి అని తెలిసినా, తన మాటలు విన్నవాళ్ళంతా దేవుడిని చేరుకుంటారని, ఆ విధంగా చేశాడు. అందుకే ఆయన సమతామూర్తి అయ్యాడు!'' అన్నాడు గురువు.
శిష్యుడికి అనుమానాలు వస్తూనే ఉన్నాయి.
''స్వామీ! అట్లా గోపురం దగ్గర విన్నవాళ్ళలో దళితులు, బహుజనులు కూడా ఉన్నారా?'' అడిగాడు.
''అనుమానం ఎందుకు? ఊరన్నాక అందరూ ఉంటారు కదా! పైగా దళితుల పట్ల రామానుజులు ప్రత్యేక అభిమానం చూపారు. వారిని స్పర్శించకుండా ఆలయంలోకి వెళ్ళేవారు కాదు!'' అన్నాడు గురువు.
''స్వామీ! మరి జీయర్లలో ఎవరైనా దళితులు కాని, బ్రాహ్మణేతరులు గాని ఉన్నారా? గురు పరంపరలో వారికి స్థానం ఉండిందా?'' ప్రశ్నించాడు శిష్యుడు.
''ఇదేమి ప్రశ్న? అలాంటి వారికి అవకాశం లభించలేదు!'' అన్నాడు గురువు ఆగ్రహంగా.
గురువుకి కోపం వచ్చిందని శిష్యుడికి అర్థం అయ్యింది!
''స్వామీ! ఏ గుడి దగ్గర చూసినా, ఎక్కువ డబ్బులు పెట్టిన వారికి శీఘ్రదర్శనం లభిస్తుంది. డబ్బులేని వారికి ధర్మదర్శనం ఎన్నో గంటల తర్వాత లభిస్తుంది! పేదా గొప్పా తేడా దేవుడి ముందు లేదంటిరి కదా స్వామీ!'' శిష్యుడు తన అనుమానం బయటపెట్టాడు.
''ఏమిటిది శిష్యా! పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు. ఎంట్రన్స్ టెస్టు పెట్టకుండా రికమండేషన్ మీద నీకు శిష్యరికం ఇవ్వటం నాదే బుద్ధి తక్కువ!'' అన్నాడు గురువు కోపంగా.
''శాంతించండి స్వామీ! తెలియక అడుగుతున్నాను! సన్యాసం అంటే ఏమిటి స్వామి?'' మళ్ళీ అడిగాడు.
''సన్యాసం అంటే అన్నింటినీ త్యజించటం! దానికి గుర్తుగానే కాషాయం ధరిస్తారు!'' అన్నాడు గురువు శాంతం తెచ్చుకుని.
''మరి సన్యాసులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయితే ఏమి త్యజించినట్టు స్వామీ?'' శిష్యుడి ప్రశ్న.
గురువుకు మళ్ళీ కోపం వచ్చింది! కంట్రోలు చేసుకున్నాడు. లేకపోతే కోపాన్ని త్యజించలేదని శిష్యుడు మొహం మీదే అనేటట్లున్నాడు.
''మంత్రులు, ముఖ్యమంత్రులు కావటం అంటే ప్రజల పట్ల తన బాధ్యత నెరవేర్చటం నాయనా!'' అన్నాడు గురువు. ''అలాంటప్పుడు సన్యాసాన్నే పరిత్యజించవచ్చు కదా! అలా చేయకుండా పరిపాలన చేయటమంటే సన్యాసం పేరు చెప్పి ప్రజలను మోసగించటమే కదా స్వామీ!'' అన్నాడు శిష్యుడు.
గురువు తన కమండలంలోని నీళ్ళు తీసుకుని తనపైన, శిష్యుడిపైనా చల్లాడు. అయినా శిష్యుడు శాంతించడం లేదు. మరో ప్రశ్న సంధించాడు.
''స్వామీ! రామానుజుల వారు సన్యాసం స్వీకరించారు కదా! మరి ఆయనకు బంగారు విగ్రహం కట్టించటం అపచారం కదా! రామానుజల మార్గాన్ని తప్పినట్టు కాదా?'' శిష్యుడి ప్రశ్న.
''ఆ బంగారు విగ్రహానికి నీ ఇంట్లోంచి ఏమైనా బంగారం తెచ్చిపెట్టావా? అని అడుగుదామని అనుకున్నాడు. కాని తాను గురువునని గుర్తుకువచ్చి ఆగిపోయాడు.
కాని శిష్యుడు మాత్రం తన ధర్మాన్ని నెరవేర్చుతూనే ఉన్నాడు.
''రామానుజల వారు కుల మతాల తేడా లేకుండా అందరికీ దైవ మార్గాన్ని అందించాలనుకున్నారు కదా!
మరి ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుని పోతామనీ, సమత మనతోనే మొదలు కావాలనీ చెబుతున్న స్వామి వారు కులాలు ఉండాల్సిందేనని ప్రకటించారు. ఇందులో ఉన్నతిరకాసు ఏమిటో నాకు అర్థం కావటం లేదు! కాస్త బోధపర్చండి గురుదేవా!'' అని వేడుకున్నాడు శిష్యుడు.
అంతే! గురువుగారు ఒక్క ఉదుటన లేచి నడుస్తున్న బస్సులో నుండి కిందికి దూకేశాడు!
- ఉషాకిరణ్