Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిబ్రవరి 2 నుండి 14 వరకు జరుగుతున్న శ్రీమద్రామానుజుల సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చినజీయర్ స్వామి ప్రెస్మీట్లో రామానుజుల తత్వాన్ని చాలా బాగా వివరించారు. ఆయన 'ఆత్మ సత్యం, జగన్మిధ్య' అంటే ఆత్మ ఒకటే సత్యం, జగత్తంతా మాయ' అనే అద్వైత సిద్ధాంతాన్ని తిరస్కరించాడనీ, సర్వప్రాణి సేవయే మాధవ సేవయని ప్రచారం చేశాడనీ, సర్వమాన సమానత్వాన్ని ప్రభోదించాడనీ చినజీయర్‌స్వామి చెప్పారు. కానీ, అదే ప్రెస్మీట్లో ఆయన అనేక అశాస్త్రీయ విషయాలు చెప్పారు. చరిత్రను తీవ్రంగా వక్రీకరించారు. పాలకుల విధానాలలోని లోపాలను పొగిడారు. వాటిని వివరంగా తెలుసుకుందా...
చిన్నజీయర్‌స్వామి, రామానుజ విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగే హౌమాలలో ఒకటిన్నర లక్షల కిలోల ఆవునెయ్యి అగ్నిలో ఆహుతి చెయ్యబడుతుందని సెలవిచ్చారు. అంతే కాదు, అంత నెయ్యి పేదల కడుపు నింపడానికి ఉపయోగపడకుండా, నిప్పుల్లో పోయడం దానిని వృథా చేయడం కాదా అనే విమర్శనూ ప్రస్తావించారు. దానికి సమాధానంగా ఆ హౌమాల వలన పర్యావరణం బాగుపడుతుందనీ, దాని వలన కోట్లాది మంది ప్రజల జీవనం బాగుపడుతుందనీ తెలిపారు. నిప్పులో నెయ్యిపోస్తే ఏమవుతుంది? అది బాగా మండక, పొగ ఎక్కువ వస్తే కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు వెలువడుతుంది. బాగా మండితే కార్బన్ డయాక్సైడ్ అనే మరో విషవాయువు వెలువడుతుంది. ఒకే ప్రదేశంలో 12రోజుల పాటు లక్షన్నర కిలోల నేతిని నిప్పులో మండిస్తే, ఎన్ని టన్నుల విషవాయువులు వెలువడుతాయో శాస్త్రజ్ఞులకు తెలుసు. ఆ వాయువులు ఆ ప్రాంతంలోని పర్యావరణాన్ని ఎంతగా ధ్వంసం చేస్తాయో కూడా శాస్త్రజ్ఞులకు తెలుసు. కానీ, భారతదేశంలో మత నాయకులే అనేక అశాస్త్రీయ విషయాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం జరుగుతోంది. మత నాయకులు, ఆడనెమలి మగ నెమలితో సంపర్కం లేకుండా సంతానాన్ని కంటుందని జీవశాస్త్ర ప్రొఫెసర్లలాగా మాట్లాడతారు. భరద్వాజముని విమానాలను తయారుచేశాడని ఏరోనాటికల్ ఇంజనీర్లలాగా మాట్లాడతారు. డార్విన్ పరిణామం తప్పని జీవపరిణామ శాస్త్రవేత్తల్లాగా మాట్లాడతారు. అయోధ్యలో 9లక్షల సంవత్సరాల క్రితం అత్యున్నత నాగరికత గల జనులు జీవించారని పురావస్తుశాస్త్రవేత్తల్లాగా మాట్లాడతారు. ఇవన్నీ శాస్త్ర విరుద్ధ విషయాలని, వాటికి సంబంధించిన ఏ శాస్త్రవేత్తనడిగినా చెబుతాడు. అలా మతనాయకులు చెప్పే అశాస్త్రీయ విషయాలలో చిన్నజీయర్ స్వామి చెప్పే నేతి ఆహుతి ద్వారా పర్యావరణ శుద్ధి అనే అంశం ఒకటి.
ఇక చరిత్ర వక్రీకరణ తీసుకుందాం. 16వ శతాబ్ది నుండి మొగలాయీలు, ఫ్రెంచివారు, బ్రిటిషువారి పరిపాలనలో భారతదేశంలో రామానుజుల వారి కాలం కంటే ముందు కాలం పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. ఇది చరిత్రను వక్రీకరించడమే. ఎందుకంటే, పైన పేర్కొన్న వారి పాలనా కాలాలలో, పాలకులెవరూ ప్రజల ఆచార వ్యవహారాలలో జోక్యం చేసుకొనలేదు. ఉదాహరణకు బాబరు తన చివరి దశలో హుమాయూన్కు ఒక లేఖ రాశాడు. దానిలో ఆయన ''నీవు ఏ మత అనుయాయుడి ప్రార్థనా ప్రదేశాన్నీ అపవిత్రం చేయవద్దు. గోవధను నిలిపివేయి. గో మాంసం తినకు'' అని కోరాడు. ఈ ఉత్తరం నంబరు జమాది ఉల్ అవాల్ / 930. ఇది ప్రస్తుతం భోపాల్‌లోని నవాబు గ్రంథాలయంలో ఉంది.
ఇక బ్రిటిష్‌వారు కూడా రాజా రాంమోహనరారు వంటి సంఘ సంస్కర్తలు కోరేవరకు 'సతి' వంటి భయంకర దురాచారాన్ని సైతం రూపుమాపడానికి ప్రయత్నించలేదు. అలా సాగింది వాళ్ళపాలన.
ఇక రామానుజుల నాటికి ముందున్న సామాజిక పరిస్థితులను పునరుద్ధరించిందెవరు? మహారాష్ట్రలోని పీష్వాలు. వారి పాలనలో దళితులు ఎంతటి అమానుష అంటరానితనానికి గురయ్యారో చరిత్ర గ్రంథాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. అందువల్లనే దళితులు తమ కసిని భీమా కొరెగావ్ దగ్గర 1818 జనవరి 1న జరిపిన ఆంగ్లో - మరాఠా యుద్ధంలో చూపించారనీ, దానిలో రెండవ బాజీరావు యొక్క 28,000 మంది సైనికుల్ని కేవలం 834 మంది మాత్రమే ఉన్న మహర్లు అనబడే దళితులతో కూడిన బ్రిటిష్ సైన్యం ఓడించిందని చరిత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి.
వాస్తవమిది కాగా, మొగలాయీలు, బ్రిటిష్ వాళ్ళ పాలనలోనే సామాజిక పరిస్థితులు దిగజారినాయని ప్రకటించడం చరిత్రను వక్రీకరించడం కాదా?
ఇక చినజీయర్‌స్వామి పొగిడిన ప్రస్తుత పాలకుల విధానాలను పరిశీలిద్దాం. ఆయన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని తెగ పొగిడారు. ''మన అదృష్టవశాత్తు, మానవుని వికాసానికి మూల భూతమైన ఆలోచనలను దాంట్లో ప్రవేశపెడుతున్నారు'' అని ఆయన అన్నారు. ఆ విద్యావిధానంలోని ఒకటి రెండు అంశాలు పరిశీలిద్దాం.
ఆ విద్యా విధానం, తన లక్ష్యాలలో ఒకటిగా 'భారతీయత' అనేది ఒక గర్వించదగ్గ వారసత్వం'గా ప్రకటించింది. ఏది మనం గర్వించదగ్గ వారసత్వం? మనువు కాలం నుండి నేటివరకు కొనసాగుతున్న మన నిచ్చెన మెట్ల కులవ్యవస్థా? అంటరాని తనమా? 'నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి' అంటే ''స్త్రీ స్వతంత్రంగా జీవించడానికి అర్హురాలు కాదు'' అనే భావజాలమా? ఈ కుల వ్యవస్థ ఈకాలంలో కూడా మరింత ముదిరి అగ్రకులం అని చెప్పబడే కులపు అమ్మాయి, ఒక బి.సి. కులస్థుడిని లేక దళితుడిని వివాహమాడితే ఆ అమ్మాయి తండ్రి, అతనిని చంపేవరకు నిద్రపోని ప్రమాదకర పరిస్థితికి చేరుకున్నది. ఇదేనా మనం గర్వించదగ్గ భారతీయ వారసత్వం?
ఈ విద్యా విధాన పత్రం సంస్కృతీ రక్షణ గురించి విపులంగా చర్చించింది. ఈనాడు పాలకవర్గానికి చెందిన, 'సంస్కృతీ పరిరక్షకులు'గా తమను తాము ప్రకటించుకున్న సంఫ్ుపరివారాలు ఏం చేస్తున్నాయి? 'ఐటం సాంగ్'లుగా మీడియాచే ముద్దుగా పిలువబడుతున్న అర్థనగ నృత్యాల దృశ్యాలను గాని, లిప్‌లాక్ కిస్ల దృశ్యాలను గాని అడ్డుకోవడం లేదు. 'వాటర్' సినిమాను 'రామ్ కె నామ్ పే' వంటి డాక్యుమెంటరీ ప్రదర్శనలను అడ్డుకుంటున్నాయి. ఇదేనా మన సంస్కృతీ పరిరక్షణ అంటే?
మరో విషయం. ప్రాచీన భారతదేశం జ్ఞానం ఆధునిక భారతదేశానికి ఎలా ఉపయోగపడిందో నూతన విద్యా విధాన పత్రం వివరించింది. విచిత్రమేమిటంటే, దానిలో బుద్ధుడు, మహావీరుల ప్రస్తావనే లేదు. అంటే దేశ దేశాలలో ఇవాళ ప్రచారంలో ఉన్న బుద్ధుని బోధనలు, ఈనాటి భారతీయ విద్యార్థులకు అవసరం లేదని ఈ విధాన నిర్ణేతలు భావిస్తున్నారా? వర్థమాన మహావీరుని తార్కిక జ్ఞానం భావి భారతపౌరులు తెలుసుకోనవసరం లేదని వారి అభిప్రాయమా? అంతకంటె బాధాకరమైన విషయం ఏమిటంటే, కుల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన జ్యోతిరావు ఫూలే, సాహూమహరాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణగురు, అంబేద్కర్ల ప్రస్తావన కూడా ఆ విద్యా విధాన పత్రంలో లేదు. పై మహనీయుల పేర్లు కూడా తెలియని విద్యార్థులు, కాలం చెల్లిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను ఏ విధంగా వ్యతిరేకించగలరు? భగవద్గీతను వారికి బోధించే ప్రణాళిక నూతన విద్యా విధానంలో ఉంది. అది చదివి, దానిలోని 'చాతుర్వర్ణ్యం వయా స్పష్టం' అని, అంటే 'చతుర్వర్ణాలనూ నేనే సృష్టించాను' అనే గీతావాక్యాన్ని వంట బట్టించుకొని, కుల వ్యవస్థను భగవంతుడే సృష్టించాడు కాబట్టి... మనం దానిని వ్యతిరేకించరాదు అనే మూఢ నమ్మకంలో పడిపోరా? ఇన్ని వందల ఏండ్లుగా భారత సమాజాన్ని చీల్చిన కుల వ్యవస్థ ఇక ముందు కూడా కొనసాగితే, దేశంలో నిరంతరం సామాజిక విభజన జరిగి, దేశం మరింత బలహీనపడిపోదా? దీనికి పునాది విద్యావిధానంలోనే పడటం ఎంత ప్రమాదకరం?
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నూతన విద్యావిధానం మనదేశాన్ని ఒక జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతుందని సాక్షాత్తూ ప్రధానమంత్రే ప్రకటించారు. గత ఎనిమిదేండ్లలో మన విధాన నిర్ణేతలు ప్రచారం చేస్తున్న 'జ్ఞానాన్ని' గూర్చి ఒక్కసారి పర్యావలోకనం చేసుకుందాం. సాక్షాత్తు ప్రధానమంత్రే, వినాయకుడి కథ మన ప్రాచీనకాలంలో ఉన్న ప్లాస్టిక్ సర్జరీ 'జ్ఞానానికి' ఉదాహరణగా పేర్కొన్నారు. డార్విన్ చెప్పింది తప్పు అనే 'జ్ఞానబోధ'ను మరో మంత్రి చేశారు. ఈ కోవకే చెందిన ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ''కౌరవుల జననం నాటికే మన భారతదేశంలో టెస్ట్‌ట్యూబ్ బేబీలను పుట్టించే 'జ్ఞానం' మనకు ఉందని'' సైన్సు మహాసభల్లో ప్రకటిస్తాడు. మనకు మహా భారతకాలం నాటికే టీవీల విజ్ఞాన ముందని మరొక పెద్దాయన సెలవిస్తాడు. ఇదేనా మన భావి భారత పౌరులకు మనమందించబోయే 'జ్ఞానం?' ఇలాంటి విద్యా విధానమేనా మన దేశాన్ని ఒక 'జ్ఞాన కేంద్రం'గా తీర్చిదిద్దేది? ఇలాంటి జ్ఞానంతో మనం విశ్వగురువులమవుతామా? విశ్వంలో నవ్వులపాలవుతామా?
ఇలాంటి విద్యావిధానాన్ని గూర్చి చినజీయర్‌స్వామి మాట్లాడుతూ... ''మానవుని వికాసానికి మూలభూతమైన ఆలోచనలను దాంట్లో ప్రవేశపెడుతున్నారు'' అని తెలిపారు. ఆ విద్యావిధానం కారణంగా మానవుని వికాసం జరుగుతుందో, వేల సంవత్సరాల క్రిందటి ఆదిమ కాలపు అజ్ఞానం కలుగుతుందో దేశభక్తులైన ప్రజలు ఆలోచించాలి. అశాస్త్రీయ ఆలోచనలను, అజ్ఞాన భావాలను ఏవైపు నుండి వచ్చినా తిరస్కరించాలి. రుగ్వేదం (1-89-1)లో ప్రవచించినట్లు ''ఆనోభద్రాః క్రతవోయంతు విశ్వతః'' అంటే ''ఉత్తమమైన భావాలను విశ్వంలో అన్ని వైపుల నుండి రానిమ్ము'' అనే భావనతో ముందుకు సాగాలి.
- కె.ఎల్.కాంతారావు